‘ఒరేయ్… బాలు’ ఇస్కూల్కి టైం అయితాంది లేరా! బేగా పోకపోతే పంతులు… యండలో నిలబెడతాడని తల్లి… గోవిందమ్మ చిర్రుబుర్రులాడుతోంది.
బాలు మాత్రం ఉలుకు పలుకు లేకుండా… పడుకుంటాండాడు. ఒకటికి… నాలుగు సార్లు గోవిందమ్మ పిలిసినా లెయ్యడం లేదని… బాలు పండుకున్న మంచం దగ్గరికొచ్చి కప్పుకున్న దుపట్ని లాగేసింది.
“ఏరా…? అప్పట్నుంచి మొత్తుకుంటున్నా ఇనపడ్డం లేదా….! లెయ్... రేత్రి తొందరగా పడుకోమంటే… మాట ఇనవు అని తన పాటికి తాను వదురుకుంటోంది.”
బాలు ముక్కుతూ… మూలుగుతూ… నెమ్మదిగా కళ్ళు తెరిసి అమ్మ కడుపు నొప్పిచ్చాందని… తన రెండు సేతులను కడుపుపై పెట్టుకొని ఒత్తుకుంటున్నాడు.
నానాకి గడ్డి తినద్దంటే యింటావ! యాడ నొప్పిచ్చాంది? పై కడుపా, కింది కడుపా? అంటూ ఒళ్లోకి తీసుకొని బాలు కడుపుపై చేయి తిప్పుతూ… సరేలే… అజీర్తి సేసినట్టు ఉంది… నేను వమోటార్ తెచ్చా… నువ్వు పడుకో అని సెప్పి ఇంట్లోకి ఎల్లింది.
అలా ప్రతిరోజూ కడుపు నొప్పి, కాలు నొప్పి అంటూ… ఏదో ఒక కారణం సెప్పి… నాలుగు దినాలు నుండి ఇస్కూల్ కి పంగనామం పెడుతాండాడు బాలు.
గోవిందమ్మకు అనుమానం వచ్చి “ఏందిరా…? నాలుగు రోజులు నుండి ఏదో ఒక నొప్పి అంటూ… ఇస్కూల్ కి పోకుండా ఎగ్గొడ్తాండావని కోపగించుకొని… వీపు విమానం మోత మోగించింది.
అది గమనించిన… బాలు తండ్రి నాగప్ప… “ఏందే? పిల్లగాన్ని సంపుతావా… ఏంది? ఇస్కూల్ కి పోకపోతే నష్టం రాదులే. సిన్నపిల్లోడు ఇస్కూల్ కి పోయి ఉద్ధరించేది ఏముంది? అంటూ బాలును ఎత్తుకొని ఏమైంది? పండుగా అని లాలించాడు.
బాలు మాత్రం గోంగెలు పెట్టి ఏడుస్తూ… “నాకు… ఏ నొప్పి లేదు… అయినాగాని… నేను ఇస్కూల్ కి పోనుగాక పోను అని మారం సేసాడు.”
గోవిందమ్మ… నాకు తెలుసురా… నీకు… మీ నాయన బుద్దే వచ్చింది. దొంగనాటకాలు ఆడుతాండావు ఇస్కూల్ కి పోకపోతే నువ్వు… మాలాగే అడుక్కుతింటావని తిట్తానే ఉంది.
ఏందే? మూడో క్లాసు పిల్లగాన్ని పట్టుకొని అంతేసి మాటలు మాట్లాడుతాండావు. పిల్లగాని ముందరా అట్టా మాట్లాడద్దని నీకెన్ని సార్లు సెప్పినా… యినవెందుకు? ఇంట్లో ఉంటే గోవిందమ్మ గొడవ పెద్దది చేచ్చుందని బాలుని తీసుకొని బజారుకి ఎల్లిపోయాడు నాగప్ప.
బాలుకి ఇష్టమైన పుల్లఐసు కొనిపించి…ఎందుకు నాయన..? ఇస్కూల్ కి పోను అంటాండవు. ఇస్కూల్ కి పోకపోతే ఎట్టా సెప్పు? నువ్వు ఇస్కూల్ కి పొయ్యి కలెక్టర్ గావాలా గదా! అని బుజ్జగించాడు.
బాలు మాత్రం… లేదు నాయనా… నేను ఆ ఇస్కూల్ కి కాకుండా… వేరే ఇస్కూల్ కి పోతాను. ఆ ఇస్కూల్ కి మాత్రం పోను… నాయనా… అక్కడున్న పంతులు నన్ను ఏడ పడితే ఆడ పిసికి పిసికి గిచ్చుతాండాడని సెప్పాడు.
ఇషయం అర్థం సేసుకున్న నాగప్ప వెంటనే ఇస్కూల్ కి పోయి… పెద్ద పంతులుకి… బాలు బాధ గురించి సెప్తూ సారూ.., అమ్మనాయనల కన్న గొప్పోల్లు పంతుళ్ళు అంటారు గదా…! ఇట్టాంటి వాళ్ళను మీ ఇస్కూల్ లో పెట్టుకుంటే ఎట్టా…? మా బాలునే గాగుండా ఇంకెంత మందిని ఇలా హింస పెడుతాండాడో ఏమో! వాడ్ని పట్టుకొని పోలిసోల్లకు అప్పగించండని వాపోయాడు.
పెద్దసారు బాలుని దగ్గరికి తీసుకొని… ఎవరు అలా సేసారు? నాకు సెప్పు నిన్నే అట్టా సేసినాడా ఇంకా ఎవరినైనా అట్టే సేసినాడా అని అడిగాడు.
మాకొచ్చే పంతులే అట్టా చేచ్చాన్నాడు సారూ! రోజుకొకరిని మరుగుదొడ్డిలోకి తీసికెళ్ళి ఏదేందో సేయమంటన్నాడు. గట్టిగా తొడలపై గిచ్చుతాండాడని… తన తొడలపై మచ్చలను సూయించాడు.
వెంటనే పెద్ద సారు… మూడవ తరగతి పంతులును పిలిపించి ఇసయం అడిగాడు.
లేదు సారు… నేనెందుకు? పిల్లోల్లతో అట్టా సేస్తాను… ఈనికి పొట్ట కొచ్చే అక్షరం రాదు… బడికి రాకూడదని యేషాలు ఏస్తాన్నాడని బొంక్కినాడు.
సాలు… సాలులే… నువ్వు సేసిన గబ్బు పనికి సమర్ధించుకోవడమే గాకుండా… పిల్లోల్లోను తప్పు పడతాండవా! బాలు ఒకడే కాదు… పిల్లోలందరూ అట్టే సెప్పినారు. నేను అందరినీ అడిగానని గద్దించి వెంటనే పోలిసోల్లకు ఫోన్ సేసి ఇషయం సెప్పేసాడు.
పోలిసోలొచ్చి పంతులును తీసుకెళ్ళిపోయారు. భయపడకుండా ఇసయం సెప్పిన బాలును మెచ్చుకుంటూ ఇగో బాలు… ఏమి జరిగిన… నాకే వొచ్చి సెప్పాలి… సరేనా అన్నాడు.
సరే సారూ అని… బాలు… తల అటూ ఇటూ ఊప్యాడు. పక్కనే ఉన్న నాగప్ప సరే సారు… ఇంకా నేను వెళ్తాను పిల్లోడిని రేపట్నించి ఇస్కూల్ కి పంపుతాలేండని అక్కడి నుండి ఎళ్ళిపోయాడు.
తల్లితండ్రులు పిల్లల ముందు గొడవపడరాదు. అలా చేయడంవల్ల… పిల్లలు మనతో ఏది చెప్పుకోలేక ఇబ్బందిపడతారు కావున వారి సమక్షంలో ఎటువంటి గొడవలు పెట్టుకోకుండా… ఉండటమే కాకుండా వారితో స్నేహితులులాగా అన్ని విషయాలు అడిగి తెలుసుకుంటూ ఉండాలి. చిన్నపిల్లలకి బ్యాడ్ టచ్,గుడ్ టచ్ గురించి తెలియజేయాల్సిన బాధ్యత అటు తల్లితండ్రులకు, ఇటు ఉపాధ్యాయులకు కూడా ఉంది.