తార్మార్ తక్కడమార్ - వి.వి.వి.కామేశ్వరి (v³k)

tarmar takkadmar

"తార్ మార్ తక్కడమార్ "

"అరే ! ఏం చేస్తున్నారర్రా లోపల"బయట నుండీ పెద్ద పెట్టున కేకలు వినిపించి బయటికొచ్చింది సౌమ్య .
"ఒక్కసారి ఇలా రామ్మా పద్మ , అనూషా, భూలక్ష్మి అదే అదే ..."
"సరేలే అత్తయ్యా సౌమ్య "అని గుర్తు చేసింది సౌమ్య .
"అదేలే సౌమ్య ,దిక్కుమాలిన గాలి ఇప్పుడే తగలడింది . చూడు ఏం చేస్తున్నాడో నీ కొడుకు విరాజ్ , ఒడియాల్లో నీళ్ళు గుమ్మరిస్తున్నాడు భడవాఖానా అల్లరి వెధవ అయ్యాడు" అంది కామాక్షి .
"అబ్బా ! అమ్మా ఒక్కరోజైనా ఎవరి పేరుతో సరిగ్గా వాళ్ళనే పిలుస్తావేమో అనుకుంటాను . వాడు విభాస్ అమ్మా ! " అన్నాడు కొడుకు రవి.
"చాల్లే భడాయి , నువ్వేమో పేర్లు రైమింగో , రోమింగో ఏదో పెట్టి ఏడిశావ్ నా ప్రాణానికి తగలాటంలా " అంది ముసిముసి నవ్వులతో .
పక్క నుంచీ సన్నగా నవ్వుతూ , "ఇంకా నయం , నన్నైతే పద్మక్కా, అనూషా , చివరాకరికి పనిమనిషి భూలక్ష్మి పేర్లు అన్నీ పిలుస్తారు అత్తయ్య నా పేరొక్కటి తప్ప " అంది సౌమ్య.
"అయినా అక్కడ విభాస్ నీళ్ళు పోసేది మిరపకాయల్లో , ఒడియాల్లో కాదు" అంటూ పరుగెత్తింది సౌమ్య పిల్లాడి దగ్గరకు చెంబు లాక్కోటానికి.
"చాల్లే సంబడం, ఏడ్చి మొత్తుకున్నట్లుంది నేనూ నా మతిమరుపూ ,మీ గోలతో ఆ విషయమే మరిచిపోయాను. ముందు వాడి చేతులు కడుగు . అదే సోమలేజరో ఏదో ఉందిగా గుర్తొచ్చి చావటంలా"అంది మనవడి వంక చూస్తూ కామాక్షి .
"శానిటైజర్ అమ్మా , సరే గానీ నువ్వు ముందు అర్థరాత్రి దాకా కవితలు గ్రూపులు అంటూ నిద్ర లేకుండా ఆరోగ్యం పాడుచేసుకుంటున్నావు. చూడు! ఎలా తయారవుతున్నావో ? నీ ఈడు వాళ్ళందరూ ఎలా ఉన్నారు ? నువ్వెలా వున్నావు? అందుకే నీకు ఇంత మతిమరుపు . అదే నీకిష్టమైన పూజలు, కవితలు మాత్రం బాగా గుర్తుంటాయి" అన్నాడు కొడుకు రవి.
"అవును రవీ, అలా చెప్పు మీ అమ్మకి , టైం కి తినదు , నిద్రపోదు. లాక్డౌన్ లో కవితలు రాయటం ఆపెయ్యమను . నేను చెబితే అలుగుతుంది మళ్ళీ " అక్కడికి ఎప్పుడొచ్చారో శంకరం గారు.
"సర్లే , అందరూ ఏకమయ్యి నా మీద పడ్డారు " బుంగమూతి పెట్టి చేతిలో మామిడిపండు జ్యూస్ గ్లాసులతో వచ్చిన కామాక్షి.
"ఇదుగోండి తీసుకోండి అంటూ కొడుకుని , ఇదుగో నాన్నా తాగరా అంటూ భర్త వంకా చూస్తూ అందిస్తున్న అత్తయ్యని చూసి , అత్తయ్యా! మీ అబ్బాయిని మావయ్య , మావయ్యని మీ అబ్బాయి అంటున్నారు "అని నవ్వింది కోడలు సౌమ్య.
"సరేలే , తార్ మార్ తక్కడ మార్ మార్చుకోండి పేర్లు మీరే నా ప్రియ బంధువులారా !" అంటుంటే అందరూ నవ్వేసుకున్నారు హాయిగా .

మరిన్ని కథలు

Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaalani kaagitam
కాలని కాగితం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు