కాఫీ గ్లాసుతో భర్త దగ్గరకు వెళ్లిన సుభద్ర అయన ఫోన్లో మాట్లాడుతుండటంతో కాసేపు ఎదురు చూసింది .
"అలాగేనండీ! అబ్బాయికి ఇంకా పెళ్లి సంబంధాలు చూడటం లేదు. ఒకవేళ మొదలు పెడితే ముందుగా మీకే కబురు చేస్తాను " చెప్పడం ముగించి, కాఫీ గ్లాసు అందుకున్నాడు అర్జున రావు.
"ఎవరండీ?" ప్రశ్నించింది సుభద్ర.
"వైజాగ్ నుంచి మన సత్యనారాయణ గారు ఫోన్ చేసారు. వాళ్ళ అమ్మాయికి సంబంధాలు చూస్తున్నారట. మనం సరే అంటే వాళ్ళు వచ్చి మాట్లాడతారట. ఇంకా చాలా మంది అడుగుతున్నారు. కానీ మన ఉదయ్ 'అప్పుడే పెళ్లి గురించి ఆలోచించకండి. ' అని కరాఖండిగా చెప్పేసాడు. వచ్చే నెలతో ఇరవై తొమ్మిది ఏళ్ళు నిండుతాయి. "అన్నాడు అర్జున రావు .
"నేనూ అదే ఆలోచిస్తున్నానండీ! ఒక వేళ మన ఉదయ్ అక్కడ ఎవర్నైనా ప్రేమించి,మనతో చెప్పడానికి సంకోచిస్తున్నాడేమో. "సందేహంగా అంది సుభద్ర.
నీతో ఇదే మాట మొన్న నేనంటే 'వాడు చాలా మంచివాడు, మనకు చెప్పకుండా అలాంటి పని చెయ్యడు ' అన్నావుగా? మంచివాళ్ళు ప్రేమించకూడదని ఎక్కడా లేదు. పైగా అమెరికాలో ఉన్నాడు. నాకూ ఎదో అనుమానంగా ఉంది. " చెప్పాడు అర్జున రావు.
"ఒకసారి వాడికి ఫోన్ చేసి అలాంటిదేమైనా ఉందేమో కనుక్కోండి" అని సుభద్ర చెప్పడంతో అమెరికాలో టైం ఎంత అయి ఉంటుందో చూసుకొని, కొడుకు ఉదయ్ కు కాల్ చేసాడు అర్జున రావు.
కుశల ప్రశ్నలు అయ్యాక పెళ్లి విషయం ప్రస్తావించాడు
"అప్పుడే ఎందుకు నాన్నా!" ఎప్పటిలాగే వాయిదా వెయ్యబోయాడు ఉదయ్.
"ఆలా కాదు ఉదయ్! ఎన్ని రోజులని ఇలా వాయిదా వేస్తావు? ఒక విషయం భయపడకుండా చెప్పు.నువ్వు ఎవరినయినా ప్రేమించావా? అలాంటిదేమయినా ఉంటే ఇప్పుడే చెప్పు. నీకు చాలా సంబంధాలు వస్తున్నాయి. వాళ్ళను అనవసరంగా తిప్పుకోవడం ఎందుకు? సంబంధం కుదిరి పోయిందని మొదట్లోనే చెప్పేస్తాము. నీ మనసులో ఉన్న అమ్మాయితోనే పెళ్లి చేస్తాము."అన్నాడు అర్జున రావు.
అటు వైపు నుంచి కాస్సేపు నిశ్శబ్దం.
ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు ఇద్దరూ.
"మనం అనుకున్నంతా అయింది. ఉదయ్ ఎవరో అమ్మాయిని ప్రేమించినట్లు ఉన్నాడు. కొంపదీసి ఏ అమెరికా అమ్మాయో కాదుకదా!” భర్త చెవిలో చిన్నగా అంది సుభద్ర.
"మా ఆఫీస్ కొలీగ్ ఒకమ్మాయిని ఇష్టపడుతున్నాను. తెలుగమ్మాయే." చెప్పాడు ఉదయ్.
"అలాగయితే ఆ అమ్మాయి ఫోటో,వివరాలు పంపించు. వాళ్ళ పేరెంట్స్ వివరాలు కూడా చెప్పు. వీలయితే ఒకసారి వాళ్ళని కలవమని చెప్పు. లేదా మేమైనా కలుస్తాము. చిన్నప్పటి నుంచి నువ్వు అడిగిందేదీ కాదన లేదు.పెళ్లి విషయంలో అభ్యంతరం చెబుతామా?" అన్నాడు అర్జున రావు.
"అప్పుడే వద్దులే నాన్నా! వచ్చే నెల నేను ఇండియా వస్తున్నాను కదా. ఆ అమ్మాయి కూడా అప్పుడు నాతో వస్తుంది. మీకు పరిచయం చేస్తాను. మీకు నచ్చితే తరువాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం. అన్నట్లు చెప్పడం మరిచాను. మా క్లాస్ మేట్ సురేష్ తెలుసుకదా. అప్పట్లో నెల్లూరులోనే ఉండే వాళ్ళు. తరువాత వైజాగ్ వెళ్లిపోయారు." అడిగాడు ఉదయ్.
"అవును. గుర్తుకు వచ్చింది. ఆ అబ్బాయి అప్పుడప్పుడూ మన ఇంటికి వచ్చేవాడు" చెప్పాడు అర్జున రావు.
"ఆ అబ్బాయికి ఒక చెల్లెలు ఉంది. తన పేరు ప్రవల్లిక. తనూ అమెరికా రాబోతోంది. చిన్నప్పటి స్టడీ సరిఫికేట్లు కావాలట. అందుకని రేపు ఉదయాన్నే మన ఊరికి వస్తోంది. ఒక్కతే వస్తోంది కదా.హోటల్ లో దిగడం లేదు. మీరు ఒప్పుకుంటే మన ఇంటికి వచ్చి, కాస్త రిఫ్రెష్ అవుతుంది. అవసరమైతే ఒక రోజు మన ఇంట్లో ఉంటుంది" అన్నాడు ఉదయ్.
"దానికేం భాగ్యం! నేను పొద్దున్నే స్టేషన్ కి వెళ్లి రిసీవ్ చేసుకుంటాను."
"అవసరం లేదు నాన్నా! మన ఇంటి అడ్రస్ ఇచ్చి లొకేషన్ షేర్ చేశాను. నేరుగా మన ఇంటికే వచ్చేస్తుంది." అన్నాడు ఉదయ్.
మరుసటి రోజు ఉదయం ఎప్పటిలాగే వాకిట్లో మొక్కలకు నీళ్లు పడుతున్నారు అర్జునరావు,సుభద్రలు. ఇంతలో బయట క్యాబ్ ఆగడంతో గేటు వైపు చూసారు ఇద్దరూ. గేటు తీసుకుని లోపలి వచ్చింది ప్రవల్లిక.
గుండ్రటి ముఖం,వెడల్పాటి కళ్ళు, అందమైన ముఖంతో చూడగానే ఆకట్టుకునేలా ఉంది.
అంత ప్రయాణం చేసి వచ్చినా తన ముఖంలో అలసట కనిపించడం లేదు. చెదరని చిరునవ్వుతో అప్పుడే విరిసిన మందారంలా కనిపిస్తోంది.
"ఒక్కదానివే వస్తున్నావుకదా. అందుకే స్టేషన్ కు వద్దామనుకున్నాను. కానీ నువ్వే వద్దన్నావట?" అంటూ పైకి లేచి భార్య వంక తిరిగి "మోటార్ అఫ్ చెయ్యి. నీళ్లు మళ్ళీ పట్టుకుందాం." అన్నాడు. మోటార్ అఫ్ చెయ్య బోయింది సుభద్ర.
"ఆపకండి.మొక్కలకు నీళ్లు పట్టడం నా హాబీ. నేను పడతాను" అంటూ సమాధానం కోసం ఎదురు చూడకుండా అర్జున రావు చేతిలోని నీళ్ల పైపును తాను అందుకుంది ప్రవల్లిక.
"అదేమిటమ్మా ! అంతదూరం ప్రయాణం చేసి వచ్చావు. కాసేపు రెస్ట్ తీసుకో. ఈలోగా నేను టిఫిన్ రెడీ చేస్తాను." అంది సుభద్ర
"ఏం పరవాలేదు. రాత్రి ట్రైన్లో బాగానే నిద్రపోయాను. కాసేపు సరదాగా మొక్కలకు నీళ్లు పడతాను. అన్నట్లు ఈ రోజు టిఫిన్ నేనే చేస్తాను" అంది ప్రవల్లిక.
"సరే! కాసేపు సరదాగా నీళ్లు పట్టు. టిఫిన్ మాత్రం ఈ ఆంటీ డ్యూటీ. ఏమంటావు?"అంది సుభద్ర ప్రవల్లిక వంక చూస్తూ.
"ఆంటీనా? ఆంటీ,అంకుల్ లాంటి పదాలు వాడను నేను" అంది ప్రవల్లిక.
'మరి పేర్లు పెట్టి పిలుస్తుందా యేమిటి?' మనసులోనే నొచ్చుకుంది సుభద్ర.
"మా మేనత్త అచ్చు మీలాగే ఉంటుంది. అందుకే మిమ్మల్ని అత్తయ్య, మామయ్య అని పిలుస్తాను, మీకేమీ అభ్యంతరం లేకపోతే." ఇద్దరివంకా చూస్తూ అంది ప్రవల్లిక.
"దానికేం భాగ్యం? అలాగే పిలువు." అంది సుభద్ర ప్రవల్లిక వంక ఆప్యాయంగా చూస్తూ .
"మీరేం చెప్పలేదు మామయ్యా."అర్జున రావు తో అంది ప్రవల్లిక.
' మా అబ్బాయి వేరే అమ్మాయితో ప్రేమలో పడక ముందే నువ్వు పరిచయం అయివుంటే నిజంగానే మామయ్యను అయి వుంటాను’ అని మనసులో అనుకొని, "లక్షణంగా 'మామయ్యా' అనే పిలువు.నాకూ నిన్ను చూస్తే మా మేనకోడలు గుర్తుకు వస్తోంది" అన్నాడు అర్జున రావు.
పది నిముషాల్లో మొక్కలకు నీళ్లు పట్టడం ముగించింది ప్రవల్లిక.
తరువాత ముగ్గురూ ఇంట్లోకి నడిచారు.
సరిగ్గా పది నిముషాల్లో స్నానం ముగించి,డ్రెస్ మార్చుకుని వంటిట్లోకి వచ్చింది ప్రవల్లిక.
తనకు ఇష్టమైన టిఫిన్ ఏమిటో అడిగి చేద్దామని ఎదురు చూస్తోంది సుభద్ర.
"పెసరట్టు చేద్దామనుకున్నాను.నీకు ఇష్టం లేకపోతే వేరే చేసుకుందాము "అంది సుభద్ర.
"అలాగే. మరి అందులోకి ఉప్మా కూడా ఉంటే, చాలా బాగుంటుందంటుంది మా మేనత్త. మా మామయ్యకైతే ఇక ఎంత ఇష్టమో చెప్పలేను. "అంది ప్రవల్లిక .
"ఈ అత్తా మామలకు కూడా ఆ కాంబినేషన్ ఇష్టమే. ఓపిక లేక చేసుకోవడం లేదు. కానీ ఈ రోజు నీకోసం చేస్తాను "చెప్పింది సుభద్ర.
“అదేం కుదరదు. ముందే చెప్పానుగా! ఈ రోజు టిఫిన్ సెక్షన్ నాది. మధ్యాహ్నం నేను సర్టిఫికేట్ల కోసం బయటకు వెళ్ళాలి కాబట్టి భోజనం మీరు తయారు చెయ్యవచ్చు.
చెబుతూనే పని ప్రారంభించింది ప్రవల్లిక .ఏ వస్తువు ఎక్కడ వుందో అడిగి తెలుసుకుంటూ అరగంట లోనే టిఫిన్ రెడీ చేసి, తనే స్వయంగా కొసరి కొసరి వడ్డించింది.
ఆ అమ్మాయి చూపిస్తున్న అభిమానానికి కళ్ళలో నీళ్లు తిరిగాయి అర్జున రావు దంపతులకు.
ప్రవల్లికకు ఇష్టమయిన కూరలేమిటో కనుక్కుని మార్కెట్టుకు బయలుదేరాడు అర్జున రావు.
అర్జునరావు బయటికి వెళ్ళాక సుభద్ర ప్రవల్లిక లిద్దరూ బయట మొక్కల మధ్యలో కుర్చీలు వేసుకుని కూర్చున్నారు. ఇంతకీ నీకు మా అబ్బాయి ఉదయ్ తో పరిచయం వుందా? ప్రశ్నించింది సుభద్ర.
"కొద్దిపాటి పరిచయమే అత్తయ్యా. మేము ఇక్కడ ఉండేటప్పుడు మా అన్నయ్య కోసం అప్పుడప్పుడూ వచ్చేవాడు. చాలా హ్యాండ్ సమ్ గా ఉన్నాడని అనుకునేదాన్ని. కానీ తను నన్నసలు పట్టించుకునే వాడే కాదు "చెప్పింది ప్రవల్లిక.
"వాడంతే! ఎంతసేపూ వాడి చదువూ, స్నేహితులూ తప్ప అమ్మాయిల వంక చూసేవాడే కాదు "అంది సుభద్ర. అంతలో నిన్న ఫోన్లో ఉదయ్ చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి "ఇప్పుడు అమెరికాలో వున్నాడు కదా !ఏమైనా మారి ఉంటాడేమో!" అంది.
నిజమే అత్తయ్య! కొంతమందైతే ఏకంగా పెళ్లి చేసుకుని తర్వాత ఎప్పుడో అమ్మాయిని పరిచయం చేస్తున్నారు "అంది ప్రవల్లిక.
గుండెలో రైళ్లు పరుగెత్తుతున్నట్లు అనిపించింది సుభద్రకు .'అయితే ఉదయ్ కూడా ఎవర్నో పెళ్లి చేసుకొని ఉంటాడా? తమతో డైరెక్టుగా చెప్పలేక ఫ్రెండ్ చెల్లెలు ద్వారా చెప్పించాడా?ఈ అమ్మాయి అందుకే వచ్చిందా?’
ఆమె ఆలోచనలు ఓ కొలిక్కిరాకముందే బయట ఆటో ఆగింది. అందులోంచి ఓ వ్యక్తి అర్జున రావును జాగ్రత్తగా ఆటోలోనుంచి దింపుతుండడం గమనించి వేగంగా బయటకు వెళ్ళింది ప్రవల్లిక.
‘అదేమిటి? స్కూటీ ఏమైంది? ‘అనుకుంటూ తనూ గేటు వద్దకు వెళ్ళింది సుభద్ర.
అర్జునరావు కాలికి గాయం అయింది. కొద్దిగా రక్తం వస్తోంది. మోచేయి కూడా బాగా గీరుకుపోయింది .
“ప్రక్క వీధిలో ఎవరో కుర్రాళ్లు తాగి, వేగంగా డ్రైవ్ చేస్తూ ఈయన స్కూటీని గుద్దారు. ఈయన క్రింద పడిపోయారు. వాళ్ళు ఆగకుండా వెళ్లిపోయారు. నేను ఆ దారిలో వాకింగ్ కు వెళుతూ ఈయనను చూశాను. అర్జునరావు గారు నాకు బాగా తెలుసు. హాస్పిటల్ కు తీసుకు వెళ్తానంటే వద్దన్నారు. స్కూటీని పక్కనే ఉన్న మెకానిక్ షెడ్ లో రిపేరుకు యిచ్చి ఆటోలో తీసుకొని వచ్చాను” చెప్పాడు అర్జునరావును తీసుకుని వచ్చిన వ్యక్తి.
. అతనికి కృతజ్ఞతలు చెప్పి, అర్జునరావును లోపలికి నడిపించారు సుభద్ర, ప్రవల్లికలు. లాన్ లో ఉన్న కుర్చీలో ఆయనను కూర్చోబెట్టి గబగబా ఇంట్లోకి వెళ్లింది ప్రవ ల్లిక. తన బ్యాగ్ లో నుంచి ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసుకొని వచ్చింది . డెట్టాల్ తో గాయాన్ని శుభ్రంగా తుడిచి ,గాజు గుడ్డతో కట్టు కట్టింది. చేతికి అయిన గాయాన్ని కూడా శుభ్రం చేసి,” పదండి హాస్పిటల్ కు వెళ్దాం"అంది అర్జున్ రావు తో. " ఎందుకమ్మా! చిన్న గాయమే కదా." అన్నాడు అర్జున రావు.
" నిర్లక్ష్యం చేయొద్దు మామయ్య! సెప్టిక్ అవుతుంది. మీ ఫ్యామిలీ డాక్టర్ దగ్గరకు వెళ్ళి ఇంజెక్షన్ చేయించుకుంటే మంచిది. మిమ్మల్ని నేను తీసుకు వెళతాను" అంది ప్రవల్లిక.
"అయ్యో ! ఎందుకమ్మా. నువ్వు సర్టిఫికెట్స్ పని మీద వెళ్ళాలి కదా. వాస్తవానికి నేనే నీకు తోడుగా వద్దామనుకున్నాను . ఇంతలో ఇలా అయింది "అన్నాడు అర్జున రావు.
" మీరేం మాట్లాడకండి. అవన్నీ రేపు చూసుకోవచ్చు. అత్తయ్యా! మీరు ఇంట్లో ఉండండి. తొందరగానే వచ్చేస్తాము. ఈ లోగా వంట ప్రారంభించవద్దు. నేను వచ్చాక ఇద్దరం కలిసి చేద్దాం."అని చెప్పి అర్జునరావును హాస్పిటల్ కి తీసుకోని వెళ్ళింది.
డాక్టర్ ప్రసాద్ కు అర్జునరావు బాగా పరిచయస్తుడు కావడంతో, కాలుకి కట్టుతో వస్తున్న అర్జున్ రావును చూసి "ఏమైంది అర్జున్ రావు గారు !"అని ఆందోళనగా అడిగాడు డాక్టర్.
"మామయ్యకు చిన్న ఏక్సిడెంట్ అయింది. ఫస్ట్ ఏయిడ్ చేసి తీసికొని వచ్చాను "చెప్పింది ప్రవల్లిక. ఒకసారి ప్రవల్లికను పరికించి చూసి , అర్జున్ రావు గారి వంక తిరిగి "మొత్తానికి మెడికోని కోడలిగా చేసుకున్నావన్నమాట ! అమ్మాయీ చాలా చక్కగా, చలాకీగా ఉంది. అన్నట్లు అబ్బాయి పెళ్లి ఎప్పుడు జరిగింది? పెళ్ళికి నన్ను పిలవలేదే?" అని అడిగాడు డాక్టర్ ప్రసాద్.
సిగ్గుతో కూడిన ఇబ్బంది పడింది ప్రవల్లిక.
అర్జున్ రావు కూడా ఇబ్బందిగా ఫీల్ అయ్యాడు.
'పాపం! ఆ అమ్మాయి ఏమనుకొని ఉంటుందో’ అనుకున్నాడు. అంతలో తమాయించుకొని'”మా అబ్బాయికి ఇంకా పెళ్లి కాలేదు. మిమ్మల్ని పిలవకుండా పెళ్లి ఎలా చేస్తాను? ఈ అమ్మాయి మా మేనకోడలు” అన్నాడు.
"అలాగా! ఏమీ అనుకోకమ్మా! ఏదో తొందరలో అలా అనేసాను. సమయానికి ఫస్ట్ ఎయిడ్ చేసి, హాస్పిటల్ కి తీసుకొని వచ్చావు. చాలా థాంక్స్ అమ్మాయీ "అంటూ అభినందించాడు డాక్టర్ ప్రసాద్. తరువాత అర్జునరావు గాయాన్ని పరిశీలించి ఒక ఇంజక్షన్ చేసాడు .
డాక్టర్ కు కృతజ్ఞతలు చెప్పి ,అర్జున్ రావు ను తీసుకొని బయటకు వచ్చింది ప్రవల్లిక.
ఇక్కడ ఇంట్లో ఉన్న సుభద్రకు ఏమీ తోచడం లేదు. వంట కూడా తాను వచ్చే వరకు చేయొద్దు అని చెప్పి వెళ్ళింది ప్రవల్లిక. 'అయినా ఆ అమ్మాయి ఎంత కలుపుగోలు మనిషి! ఈ రోజుల్లో కూడా ఇలాంటి అమ్మాయిలు ఉంటారా!?’తలుచుకునే కొద్దీ ఆశ్చర్యం కలుగుతోంది సుభద్రకు.
'కాసేపట్లోనే ఎంతలా దగ్గరయిందో 'అనుకుంది.
ఇంతలో ఫోన్ మోగడంతో ఎవరా అని చూసింది.
అమెరికా నుంచి ఉదయ్ చేశాడు.
అర్జునరావుకు చిన్న గాయం అయిన సంగతి చెప్పింది సుభద్ర.
"మరైతే ఈ పాటికి నువ్వు గాభరా పడిపోయి ఉండాలి కదా! ఆ కంగారేమీ నీలో కనబడటంలేదే?" అన్నాడు ఉదయ్ ఆశ్యర్యంగా.
"నిజమే! మామూలుగా అయితే ఈపాటికి నాకు బీపీ పెరిగిపోయి, మీ నాన్నగారే నన్ను హాస్పిటల్ కి తీసుకు పోయే పరిస్థితి వచ్చేది. సమయానికి ఆ అమ్మాయి ఉండడంతో నాకు ఏదో నిశ్చింతగా అనిపించింది. ఒరేయ్! నువ్వు ఏమైనా అనుకో! ఈ అమ్మాయి కోడలు అయితే ఆ అత్తకు అంతకంటే అదృష్టం లేదని నాకనిపిస్తోంది "చెప్పింది సుభద్ర.
మరి అయితే ఇక్కడ ఈ అమెరికా అమ్మాయిని వదిలేసి, ఆ అమ్మాయినే పెళ్లి చేసుకోమంటావా ఏమిటి?" అన్నాడు ఉదయ్.
" అంతా దుర్మార్గురాలిగా కనిపిస్తున్నానట్రా? కానీ కొద్ది సేపట్లోనే ఎంతో దగ్గరైపోయింది ఈ అమ్మాయి" అంది సుభద్ర .
"అయితే ఒక్క విషయం చెబుతాను విను. వాస్తవానికి నేను ఇక్కడ ఏ అమ్మాయిని ప్రేమించలేదు . మీరు పెళ్ళికి తొందర పెడుతున్నారని అలా చెప్పాను. మరో సంవత్సరంలో నాన్నగారు రిటైర్ అవుతున్నారు. తరువాత మీరు అమెరికా రావడమో, నేను ఇండియాకి రావడమో జరుగుతుంది .మనం కలిసి ఉండాలి .అందుకు తగ్గ కోడలు వచ్చేవరకు ఆగుదాం అనుకున్నాను." నిన్న ప్రవల్లిక వాళ్ళ అన్నయ్య ఫోన్ చేసి తన చెల్లెలికి పెళ్లి సంబంధాలు చూస్తున్నామనీ, నాకు ఏమైనా ఆసక్తి ఉంటే చెప్పమనీ అన్నాడు .ఆ అమ్మాయి అభిప్రాయం కూడా కనుక్కున్నాడట.
తనుకూడా సుముఖంగా ఉన్నట్లు చెప్పిందట. పైగా నాకంటే నువ్వు బాగా నచ్చావట. నిన్ను చూడగానే 'అత్తయ్య' అనే ఫీలింగ్ కలిగిందట"చెప్పాడు ఉదయ్.
ఆనందంతో కళ్ళు చెమర్చాయి సుభద్రకి." సరే ఉదయ్ !నాన్నగారు వచ్చాక ఫోన్ చేస్తాను. నాకు చాలా సంతోషంగా వుంది" అని ఫోన్ పెట్టేసింది సుభద్ర.
కాసేపటికి అర్జునరావు, ప్రవల్లిక వచ్చారు.
" అత్తయ్యా! మీరేం కంగారు పడనవసరం లేదు. డాక్టర్ ఇంజక్షన్ చేశారు. తగ్గిపోతుందట. ఇక రండి. వంట ప్రారంభిద్దాం.” రాగానే చెప్పింది ప్రవల్లిక.
"అక్కడ డాక్టరు తొందరపడి ఈ అమ్మాయిని మన కోడలు అని సంబోదించాడు. ఏమనుకుందో ఏమో!" అన్నాడు అర్జున్ రావు.
"ఏమనుకుంటుంది? సంతోషంతో ఎగిరి గంతేయలనుకుని వుంటుంది ."నవ్వుతూ అంది సుభద్ర. సిగ్గుతో తలదించుకుంది ప్రవల్లిక.
అర్థంకాక అయోమయంగా చూశాడు అర్జునరావు.
ఇంతలో అతని ఫోన్ మ్రోగింది.అన్నోన్ నంబర్.
" హలొ!ఎవరూ? నాగరాజుగారా?
"ఓ!ప్రవల్లిక వాళ్ళ నాన్నగారా? ఏమిటీ?ఆమ్మాయి మాకు నచ్చిందా అని అడుగుతున్నారా?" అని ఇంకా ఎదో మాట్లాడబోతున్న భర్త దగ్గరనుంచి ఫోన్ లాక్కుంది సుభద్ర.
"అన్నయ్యగారూ! నేను ఉదయ్ వాళ్ళ అమ్మను మాట్లాడుతున్నాను..మాకేమో బాగా కలిసిపోయే ఆమ్మాయి కావాలి. మీ అమ్మాయేమో తన లోకంలో తను ఉండిపోతుంది.అదొక్కటే ప్రాబ్లమ్" అంది ప్రవల్లికను ఉడికిస్తూ.
"అయ్యో! కొత్త కదమ్మా! అందుకని సిగ్గుపడి ఉంటుంది. కాస్త అలవాటయితే సర్దుకుంటుంది." సర్ది చెప్పబోయాడు నాగరాజు
అంతలో అటువైపు భర్త దగ్గర నుంచి ఫోన్ లాక్కుంది అయన భార్య భాగీరధి.
"వదిన గారూ! మీరు జోక్ చేస్తున్నారని తెలుసు నాకు" అంది.
"ఎలా చెప్పగలరు?" అడిగింది సుభద్ర.
"అమ్మాయికి నా పోలికే. తొందరగా కలిసి పోతుంది."నవ్వుతు చెప్పింది భాగీరథి.
అర్జున రావు ఫోన్ అందుకున్నాడు
"మీ ఆమ్మాయి మాకు పూర్తిగా నచ్చింది.ముహూర్తాలకు ఏర్పాట్లు చేసుకుందాము" అని చెప్పాడు.
అర్జున రావు,సుభద్రలకు నమస్కరించింది ప్రవల్లిక .
మనస్ఫూర్తిగా ఆమెను ఆశీర్వదించారు అర్జునరావు దంపతులు.