ప్రతి శనివారం మా ఇంటి దగ్గర ఉన్న వేణుగోపాలస్వామి ఆలయానికి వెళ్లడం అలవాటు నాకు.
గుడి ముందు ఉన్న ఓ ఎనభై ఏళ్ళ ముసలావిడ దగ్గర టెంకాయ కొనడం కూడా అలవాటే. నన్ను చూడగానే "నమస్తే మేడం! రండి."అంటూ టెంకాయను అందించేది.
గత రెండు సంవత్సరాలుగా ఇదే జరుగుతున్నా ఏరోజూ ఆమె గురించి నేనుకానీ, నా గురించి ఆమె కానీ వ్యక్తిగత వివరాలు అడిగి తెలుసుకోలేదు.
ఎప్పటిలాగే ఆ శనివారంకూడా గుడికి వెళ్లిన నాకు ఆమె కనపడలేదు.
పక్క అంగట్లో టెంకాయ తీసుకోవడానికి మనస్కరించ లేదు.ఆ రోజు దేవుడికి టెంకాయ సమర్పించలేదు.
మరుసటి వారం కూడా ఆమె కనిపించలేదు.
'ఎమయిందో, ఈ పెద్దావిడకి? ' అనుకుంటూ ఈసారి పక్క అంగట్లో టెంకాయ తీసుకోని గుడిలోకి వెళ్ళాను.
మూడవ వారం కూడా ఆమె అక్కడ లేకపోవడంతో నాకు ఎదో అనుమానం కలిగి పక్క అంగడి వాళ్ళను ఆమె గురించి అడిగాను.
"ఆవిడ మనవరాలికి డెలివరీ అయిందట. ఈమె దగ్గరుండి చూసుకొంటోంది."చెప్పారు వాళ్ళు.
"ఆమె ఇల్లెక్కడో తెలుసా?" అప్రయత్నంగా అడిగాను.
"గాంధీ వీధిలో ఉంటుంది.టెంకాయల రమణమ్మ అంటే ఎవరైనా చెబుతారు." అని చెప్పారు పక్క అంగడి వాళ్ళు.
మరుసటి రోజు ఆఫీసుకు సెలవు కావడంతో కారు తీసికొని గాంధీ వీధికి వెళ్ళాను.
వీధి మొదట్లో ఉన్న బడ్డీ కొట్టు దగ్గర ఆమె గురించి అడిగాను. ఆమె ఇంటి గుర్తులు చెప్పారు.
నేరుగా ఆమె ఇంటి వద్దకు కారు పోనిచ్చాను.
చిన్న పెంకుటిల్లు ఆమెది. వీధి బయటే అరుగు మీద కూర్చుని ముని మనవరాలిని ఆడించుకొంటోంది.
నన్ను చూడగానే ఆశ్చర్యంతో పైకి లేచి నిలబడింది.
"నమస్తే మేడం! రండి." అంటూ ఇంట్లోకి ఆహ్వానించింది టెంకాయల రమణమ్మ. ఇంట్లో ఒక మూల నులక మంచం మీద ఆమె మనవరాలు కాబోలు,పడుకొని వుంది.
నన్ను చూసి ఆ అమ్మాయీ లేచి నిలబడింది.
'ఇదేనమ్మా నా మనవరాలు సువర్ణ. మనవడి భార్య అన్నమాట" అని పరిచయం చేసింది.
ఆ అమ్మాయి నాకు నమస్కారం చేసింది.
నా గురించి రమణమ్మకు తెలీదు కాబట్టి నేనే సువర్ణకు పరిచయం చేసుకున్నాను.
"నేను ఇక్కడ కాలేజీ ప్రిన్సిపాల్ గా పనిచేస్తున్నాను. రమణమ్మ నాకు చాలాకాలంగా తెలుసు."
మరోసారి నమస్కారం చేసింది సువర్ణ.
ఇంతలో బయటనుంచి రమణమ్మ మనవడు భద్రం వచ్చాడు.
నా గురించి చెప్పింది రమణమ్మ.
వినయంగా నమస్కారం చేసాడు అతడు.
"నా పేరు భద్రం. నేను పక్కనున్న ఫ్యాక్టరీలో రోజు కూలీగా పని చేస్తున్నాను. చిన్నప్పుడే మా అమ్మా నాన్నా పోయారు. అప్పటినుంచి నాయనమ్మే పెంచింది నన్ను" చెప్పాడతను.
తరువాత సువర్ణ వంక తిరిగి "మీ అమ్మా వాళ్ళు ఎప్పుడొస్తారట?" అని అడిగాడు.
నేను అక్కడ ఉండటంతో జవాబు చెప్పడానికి సంకోచించింది సువర్ణ.
అది చూసి రమణమ్మ " ఏమి లేదురా! మూడో సారి కూడా అమ్మాయి పుట్టిందికదా! ఇక్కడికి వస్తే మనమేమైనా అంటామేమోనని భయపడుతున్నారు వాళ్ళు" చెప్పింది రమణమ్మ.
"మనకలాంటి తేడా లేదని వాళ్ళకి తెలుసుకదా. రెండో అమ్మాయి పుట్టినప్పుడు ఇక పిల్లలు చాలనుకుంటే వాళ్లే అబ్బాయికోసం మరో కాన్పు ప్రయత్నం చేద్దామన్నారు. నాకు ఎవరైనా ఒకటేనని వాళ్లకు అప్పుడే చెప్పాను "అన్నాడు భద్రం.
అంతటితో ఆగకుండా వెంటనే తన అత్తా మామలకు ఫోన్ చేసాడు.
వాళ్ళు ఫోన్ తీసాక "ఇదిగో మామా! నా గురించి నీకు తెలీదా? ఆడపిల్లయితే ఏంటి ,అబ్బాయి అయితే ఏంటి? నాకూ, మా నాయనమ్మకు అలాంటి తేడా లేదు. అయినా ఎవరూ అమ్మాయిలను కనకపొతే అబ్బాయిలకు భార్యలెలా దొరుకుతారు? మనసులో ఏమీ పెట్టుకోక, తొందరగా వచ్చి మీ మనమరాలిని ఎత్తుకోండి." అన్నాడు భద్రం.
అప్రయత్నంగా చప్పట్లు కొట్టాను నేను.
సిగ్గుపడ్డాడు భద్రం.
భద్రాన్నీ,రమణమ్మను అబినందించాను.
నేను తీసుకు వచ్చిన పండ్లను సువర్ణకు అందించి, పాపను ఎత్తుకుని ముద్దాడి, బయటకు వచ్చాను.
రమణమ్మ,భద్రం చూపించిన సంస్కారం చాలా గొప్పగా అనిపించింది.
ఇంటికి వచ్చిన కాసేపటికి నా ఫోన్ మ్రోగింది.
బెంగుళూరు నుంచి నా కూతురు లాస్య ఫోన్ చేసింది.
నా కూతురు, అల్లుడు అక్కడ సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు.
నా వియ్యంకులు ఇద్దరూ రిటైర్డ్ గవర్నమెంట్ ఆఫీసర్లు.
"ఏమైందమ్మా? ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందా?" ఆతృతగా అడిగాను నేను.
కాసేపు నిశ్శబ్దం.
అటువైపు నుంచి లాస్య సన్నగా ఎక్కిళ్ళు పెడుతున్నట్లు అనిపిస్తోంది.
"లాస్యా!ఏదైనా సమస్య ఉందా? చెప్పమ్మా." ఆందోళనగా అన్నాను నేను.
కాస్సేపటికి గొంతు పెగుల్చుకుని చెప్పింది లాస్య.
ప్రెగ్నెన్సీ టెస్ట్ తో పాటు పుట్టేది అబ్బాయా,అమ్మాయా అనికూడా టెస్ట్ చేయించారు మా అత్తా
మామలు.నేను వద్దన్నా వినలేదు.ఈసారి కూడా అమ్మయేనని తేలడంతో...."చెప్పలేక ఆగింది లాస్య. తరువాత గొంతు పెగుల్చుకుని "అబార్షన్ చేయించుకోమంటున్నారు. ఈయన కూడా ఏమీ మాట్లాడలేదు.తన పేరెంట్స్ చెప్పినట్లే వినమన్నారు " అని చెప్పింది.
నిస్చేస్టురాలినయ్యాను నేను.
చదువుకోని రమణమ్మ,టెన్త్ వరకే చదివిన భద్రం చూపించిన విజ్ఞత, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసిన నా వియ్యంకులు,సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అయిన నా అల్లుడూ చూపలేకపోయారు.
ఎనభై ఏళ్ళ వయసులో టెంకాయలు అమ్ముకుని జీవించే రమణమ్మ, మూడో ముని మనవరాలిని పెంచుకునేందుకు సిద్ద పడుతోంది. దినసరి కూలితోబ్రతికే భద్రం, కూతురు పుట్టిందని బాధ పడలేదు. కానీ కోటీశ్వరులయిన వియ్యంకులు, అల్లుడూ ఆడపిల్ల వద్దనుకుంటున్నారు.
సంస్కారానికీ,చదివిన చదువులకీ సంబంధం లేదు.
మంచి మనసులకి బీదా గొప్పా తేడా లేదు.
"లాస్యా! ఎట్టి పరిస్థితులలో అబార్షన్ కు ఒప్పుకోవద్దు. నేను అక్కడకు వచ్చి మాట్లాడతాను. అమ్మాయి పుట్టడం నేరంలా ఆలోచించే వారితో సర్దుకుపోవాల్సిన అవసరం లేదు. ఈ విషయంలో పోరాడుదాం." దృఢ నిశ్చయంతో చెప్పాను నేను.