మారిన వీరన్న (బాలల కథ) - డి వి డి ప్రసాద్

changed veeranna

రామాపురమనే గ్రామంలో రామన్న, వీరన్న ఇరుగుపొరుగునే ఉండేవారు. అయితే, ఇద్దరి స్వభావాలు పూర్తిగా విరుద్ధమైనవి. రామన్న వృత్తిరీత్యా వ్యవసాయదారుడు, మంచివాడు, ఆ ఊళ్ళో అందరికీ సహయపడేతత్వం గలవాడు. అందుకే ఆ ఊళ్ళో గౌరవంగా బతుకుతున్నాడు. అయితే వీరన్న అందుకు పూర్తిగా విరుద్ధం. వీరన్న వృత్తిరీత్యా వ్యాపారస్థుడు. పట్నంలో వస్తువులు టోకున కొని ఆ ఊళ్ళో అమ్ముతుంటాడు. అయితే ధనార్జనే లక్ష్యంగా ఉన్నవాడు కావటాన వస్తువులు హెచ్చు ధరలకి అమ్ముతుండడమేకాక, కల్తీ చేసి కూడా అమ్మేవాడు. ఎవరినీ కష్టసమయాల్లో ఆదుకొనే మనస్తత్వం లేనివాడు. ఆ ఊరివాళ్ళు మరోగతి లేక అతని వద్దనే తమ వెచ్చాలు కొనుక్కోవలసి వచ్చేది. మామూలు వ్యాపారంతో పాటు వడ్డీ వ్యాపారం కూడా చేసేవాడు వీరన్న. డబ్బులు అవసరం పడిన వాళ్ళకి హెచ్చువడ్డీకి అప్పిస్తూ ముక్కుపిండి మరీ వసూలు చేసేవాడు. మరో మార్గంలేక వీరన్న వద్ద అప్పు తీసుకునేవారేకాని, వీరన్న అంటే ఆ ఊరిలో వాళ్ళకి ఎవరికీ కూడా మంచి అభిప్రాయం లేదు. ఎవరేమనుకున్నా ధనార్జనే లక్ష్యంగా పెట్టుకొని ఆ విధంగానే వ్యవహరించేవాడు వీరన్న.

ఊరిలో ఏ కార్యక్రమం చేసినా రామయ్యనే సలహా అడగేవారు ఊరివాళ్ళు. ఊళ్ళో శ్రీరామనవమి ఉత్సవాలు జరపాలన్నా, బడి మరమత్తులు చెయ్యాలన్నా, వైద్య శిబిరం ఏర్పాటు చెయ్యలన్నా, అన్నింటికీ రామన్నే ముందుండేవాడు. ఇలాంటి విషయాల్లో వీరన్నని అసలు పట్టించుకునేవారు కాదు ఊరివాళ్ళు. అయితే రానురాను ఊరివాళ్ళు రామన్నని మంచివాడిగా గౌరవిస్తూ, తనని చెడ్డవాడిగా చూడడం వీరన్నని బాధించసాగింది. వీరన్నకి కూడా రామన్నలాగే తనుకూడా ఆ ఊరివాళ్ళచేత మంచివాడని అనిపించుకోవాలని కోరిక కలిగింది. తనమీద పడ్డ చెడ్డముద్ర తొలగించుకోవాలని, తనని కూడా అందరూ గౌరవించేలా చేసుకోవాలని అనుకున్నాడు. ఒకరోజు రామన్నని కలిసి తన మనసులో మాట బయట పెట్టాడు వీరన్న.

వీరన్న మాటలు విన్న రామన్న ఇలా అన్నాడు, "వీరన్నా! నువ్వు అందరిచేతా మంచివాడివని అనిపించుకోవాలంటే ముందు మంచిపనులు మొదలెట్టాలి. ప్రతిఫలం ఆశించకుండా ఆపదలో ఉన్నవాళ్ళని ఆదుకోవాలి. అమ్మే సరుకులకి న్యాయమైన ధరలే తీసుకోవాలి. ఇచ్చే అప్పులకి హెచ్చువడ్డీ తీసుకోకుండా న్యాయమైన వడ్డీ మాత్రమే తీసుకోవాలి. ఊళ్ళో జరిగే అన్ని కార్యక్రమాల్లో మనస్ఫూర్తిగా పాల్గొనాలి. ఇలా చేస్తే నిన్ను కూడా అందరూ మంచివాడని అంటారు, తగిన గౌరవమర్యాదలు చూపిస్తారు."

ఆ తర్వాత నిజంగానే వీరన్నస్వభావంలో మార్పు వచ్చింది.

తోటివారికి సహాయపడసాగాడు. ధర్మవడ్డీకే అప్పులివ్వసాగాడు. సరుకులు కల్తీ చేయకుండా సరైన ధరలకే అమ్మేవాడు. అయితే వీరన్నని ఇంకా ఎవ్వరూ పూర్తిగా విశ్వసించలేదు, పైగా అనుమానించసాగారు.

వీరన్నవద్ద అప్పుతీసుకున్న ధర్మయ్య తన భార్యతో, "వీరన్న ధర్మవడ్డీకే అప్పు ఇస్తున్నాడంటే ఇంకా నమ్మబుద్ధి కావడంలేదు. కచ్చితంగా ఏదో ఎత్తువేయడానికిలా ఉంది. మన పొలంమీద కన్నువేసి కాజెయ్యాలని చూస్తున్నాడో ఏమో?" అనుమానపడుతూ అన్నాడు.

అలానే అతనివద్ద సహాయం పొందినవారికికూడా వీరన్న చర్యమీద అనుమానం కలిగింది, తనకేమీ లాభం లేకపోతే వీరన్న ఎవరికైనా సహాయం చెయ్యడుకదా అని. అలానే వీరన్న వద్ద సరుకులు కొన్నవాళ్ళుకూడా పైకి తెలియకుండా కల్తీ చేసే విద్య ఏదో కొత్తగా నేర్చుకున్నాడేమో అనుకోసాగారు.

అయితే ఈ వార్తలన్నీవీరన్నచెవున పడుతూనే ఉన్నాయి. దానికి వీరన్న బాధపడి రామన్నని కలిసాడు.

"రామన్నా!...నువ్వు చెప్పినట్లే మంచివాడిగా మారడానికి నా ప్రయత్నం మొదలుపెట్టాను. కానీ మన ఊరివాళ్ళెవరికీ నా మీద నమ్మకం కలగలేదింకా. నేను ప్రతీదీ ఏదో లాభాపేక్షతోనే చేస్తున్నానని అనుకుంటున్నారు. నేను మారానని, మంచివాడ్ని అయ్యానని వాళ్ళెప్పుడు తెలుసుకుంటారో?" నిరాశగా అన్నాడు వీరన్న.

అందుకు రామన్న చిన్నగా నవ్వి, "ఇన్నాళ్ళూ నువ్వు చేసిన పనులవల్ల నువ్వు మారినా ఊరివాళ్ళకి నీమీదింకా నమ్మకం పూర్తిగా కలగలేదు. చేసిన మంచిపనులకి వెంటనే ప్రతిఫలం వెతుక్కోకుండా, నిరాశ పడకుండా మంచిపనులమీదే దృష్టిపెట్టు. కొన్నాళ్ళకి నీగురించి అందరికి బాగా తెలిసి క్రమంగా నీకు మంచిపేరు తప్పకుండా వస్తుంది." అన్నాడు.

ఆ విధంగానే చేసి కొన్నాళ్ళ తర్వాత వీరన్నకూడా రామన్నలాగే మంచివాడనిపించుకొని అందరిచేతా గౌరవ మన్ననలు పొందాడు.

-డి వి డి ప్రసాద్

మరిన్ని కథలు

Panipilla
పనిపిల్ల (క్రైమ్ కథ)
- చెన్నూరి సుదర్శన్
Bhavaateetam
భావాతీతం
- DODDIPATLA KALYAN KISHORE
Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న