అవంతి పురం రాజ్యపు మహారాజు పురుషోత్తముడు కొలువుతీరాడు.రాజ్యంలో నెలకొన్న సమస్యలను మంత్రి ద్వారా తెలుసుకొని వాటిని పరిష్కరించే దిశగా నిర్ణయాలను తీసుకొని వుత్తర్వులు జారీ చేసి సభను ముగించాడు. సభ ముగియటంతో అందరూ వెళ్ళిపోతుండగా వాళ్ళను వెంబడించాడు మంత్రివర్యులు. అది గమనించిన మహారాజు”మంత్రివర్యా!ఆగండి.మీతో. మీతో మాట్లాడాలి" అన్నాడు. "సెలవివ్వండి మహారాజా!"అంటూ రాజుగారికి దాపుగా వెళ్ళాడు మంత్రివర్యులు. "మా పరిపాలనలో దేశం సుఖశాంతులతో సుభీక్షంగా వుందని భావించాము. అయితే ప్రజల్లో కాస్త అసంతృప్తి వుందని,వాళ్ళకు ఎంతచేసినా ఇంకా ఇంకా చేయాలని అంతులేని ఆశలతో అర్రులు చాస్తున్నారని తెలియ వస్తున్నది.అలాంటి మాటలు వినటం మాకు బాధనిపిస్తున్నది.అది నిజమో లేక అబధ్ధమో తెలుసుకోవాలని నా మనసు ఆరాట పడుతున్నది" అన్నాడు మహారాజు. వెంటనే మంత్రివర్యులు "అది అబధ్ధమై వుంటుంది మహారాజా!తమరి పరిపాలనలో అలాంటి ప్రజాభిప్రాయాలను ఇంతవరకూ నేను వినలేదు.అదే నిజమైతే తమరు బాధపడతారని కూడా నాకు తెలుసు. మీరంటున్నట్టు అసంతృప్తులు,మితిమీరిన ఆశబోతులు వున్నారంటే అది బాధాకరమే!నిజానికి ప్రజలు వాళ్ళ కుల వృత్తుల ద్వారా వచ్చే ఆదాయంతో, ప్రతినెలకు సరిపడా తమరు ఇస్తున్న ధాన్యం,వుప్పపప్పుదినుసులతో హాయిగా చేసుకు తింటూ తృప్తిగా జీవనాన్ని సాగిస్తున్నారన్నది నా నమ్మకం. ఏదేమైనా అది నిర్థారించే నిమిత్తం తమరు అనుమతిస్తే రేపే రాజ్యంలోని నలుమూలలు తిరిగి ప్రజలను సంప్రదించి వాళ్ళ అభిప్రాయాలను తెలుసుకునే నిమిత్తం కొందరిని తమరి ముందుకు తీసుకు వస్తాను!” అన్నాడు మంత్రివర్యులు. "అలాగే మంత్రివర్యా!చాలా మంది అవసరం లేదు.మచ్చుకు ఒక్కరితో ఋజువు చేసి నన్ను తృప్తి పెట్టండి చాలు" అంటూ అంతఃపురానికి వెళ్ళిపోయాడు మహా రాజు. మరుసటి రోజు మంత్రివర్యులు సేనాధిపతితో రాజ్యం నలుమూలలకు పయనించి ప్రజలతో మమేకమై పలకరింపులు జరిపాడు.దాదాపు ప్రజలందరూ అవంతి పురం మహారాజు పరిపాలనలో ఎలాంటి కష్టాలకు లోనౌక సుఖసంతోషాలతో సుభీక్షంగా వున్నట్టు,అదే వారి ఏకాభిప్రాయమని తెలపటంతో సంతోషించాడు. అయినా మహారాజు కనీసం ఒక్క ఋజువుతో తన్ను సంతృప్తి పరచాలని కోరాడు కనుక అందుకు ఒక పౌరుడను ఎన్నుకొని రాజుగారి కొలువునకు తీసుకువెళ్ళాలనుకొన్నాడు. అంతలో ఓ దొంగ బజారులో వున్న బంగారు కొట్లో కొంత ధనమును దొంగిలించుకొని పారిపోతుండగా జనం వాడి వెంటపడి తరుముకొస్తున్నది గమనించాడు.వెంటనే సేనాధిపతి సహాయంతో దొంగను పట్టుకొని వాడు దొంగిలించిన డబ్బును తీసి కొట్టు యజమానికి అప్పచెప్పాడు. మరుక్షణం అందరూ అక్కడినుంచి వెళ్ళి పోయారు. అప్పుడు మంత్రివర్యులు దొంగను చూసి"డబ్బును దొంగిలించి పారిపోయే కష్టం నీకేమొచ్చింది? ఇంట్లో తిండిగింజలు,పప్పుదినుసులు నిండుకున్నాయా లేక కాపురాన్ని నెట్టుకురావటం కష్టంగా వుందా చెప్పు?" అని అడిగాడు. "లేదయ్యా!. అదృష్టంకొద్ది మా రాజుగారి పరిపాలనలో మేము ఏ కొరత లేకుండా బ్రతుకుతున్నాము.అయినా నేను దొంగను.అది ఒక పట్టాన మానుకోలేకపోతున్నాను.అందుకే చిన్నా చితక దొంగతనాలు చేస్తున్నాను. నన్ను క్షమించి వదిలేయండయ్యా!" బ్రతిమాలాడు దొంగ. 'భేష్ !వీడి ద్వారా రాజుగారి సందేహాన్ని సులువుగా తీర్చి పెట్టగలను'అని మనసులో అనుకొని " సరే!నీకు ఒక్కసారే వెయ్యవరహాలు ఇప్పిస్తాను.దొంగిలించటం మానుకొని నేనిచ్చే డబ్బుతో సంతోషంగా భార్యా పిల్లలతో బ్రతకు.అందుకు ప్రతి ఫలంగా నువ్వు నాకో పని చేసి పెట్టాలి"అన్నాడు మంత్రివర్యులు. కొన్ని క్షణాలైన తరువాత"చెప్పండయ్యా!నేనేం చెయ్యాలి” అడిగాడు మంత్రివర్యుల షరతులకు ఒప్పుకొన్నట్టు. "నువ్వు రేపు రాజుగారి కొలువుకు రావాలి.అయనగారు నీకు రకరకాలు నగలు,బొలెడు డబ్బును చూపి వాటిలో నీకు కావలసినంత డబ్బు, నగలను తీసుకోమని అంటాడు. అప్పుడు నువ్వు వాటిమీద ఎలాంటి ఆశలేదని,రాజుగారి పరిపాలనలో ఏ కొరత లేకుండా లక్షణంగా బ్రతుకుతున్నట్టు చెప్పిఆయన్నుసంతృప్తి పరచాలి .ఏం?” అన్నాడు మంత్రి వర్యులు. 'నిత్యం దొంగతనాలతో భయపడుతూ బ్రతకటంకన్నా ఒక్కసారే వెయ్య వరహాలు తీసుకొని మెల్లగా దొంగతనం మానటానికి ప్రయత్నిస్తాను' అనిమనసులో అనుకొన్న దొంగ వెంటనే "అలాగేనయ్యా!మీరు చెప్పినట్టే రాజుగారి కొలువులో చెపుతాను.నాకు వెయ్య వరహాలివ్వాలి.వస్తాను"అంటూ అక్కడినుంచి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు మహారాజు కొలువు తీరాడు. ఇతను మన దేశపౌరుడని చెప్పి దొంగను ప్రవేశ పెట్టాడు మంత్రివర్యులు. క్షణాలమీద రాజుగారి ఆనతిపై బోలెడు డబ్బు,నగలు వున్నపళ్ళేలతో ఇద్దరు స్త్రీలు ప్రవేశించి దొంగ దాపుకు వెళ్ళి నిలబడ్డారు. మహారాజువారు గంభీర స్వరంతో "నా దేశ పౌరుడా!నీకు దాపులో డబ్బు, నగలతో మా అంతఃపుర స్త్రీలు నిలబడి వున్న్నారు.వాటిమీద నీకు ఏ మాత్రం మోజు,ఆశలుంటే నీకు కావలసినంత డబ్బు ,నగలను తీసుకొని వెళ్ళవచ్చు"అని కొలువులో వున్న అందరిని కలియజూసి సగర్వంగానవ్వుతూ దృష్ఠిని దొంగ పైకి సారించాడు. మంత్రి వర్యులు దొంగ ఏం చెపుతాడోనని ఆదుర్దాతో చూస్తున్నాడు. కొన్ని క్షణాలు తరువాత” మహారాజా!తమరి పరిపాలనలో దేశ ప్రజలు ఎలాంటి కొరతలు లేకుండా సుఖ జీవనాన్ని సాగిస్తున్నారు.నేనూ అంతే! భార్య పిల్లలతో హాయిగా కాలాన్ని గడుపుతున్నాను. ఇలా హాయిగా బ్రతుకుతున్న మాకు ఇక ఆశలంటూ ఏముంటాయో చెప్పండి?నాకు ఈ డబ్బు,నగల మీద అస్సలు ఆశలంటూ లేవని తెలుపుకొంటూ తమరి పరిపాలన ఇలాగే సాగాలని భగవంతుణ్ణి వేడుకొంటాను" అంటూ ముగించాడు దొంగ. అంతే!మహారాజుకు చెప్పలేనంత సంతోషం కలిగింది.తన పరిపాలనలో ప్రజలు కోరికలకు,ఆశలకు అతీతంగా వుంటూ వున్నదానితో తృప్తి పడుతున్నారన్న మాట దొంగ నోట వినటంతో సంతృప్తి చెందాడు. వెంటనే సింహాసనాన్ని వదలి క్రిందకు దిగి దొంగ వద్దకొచ్చి అతని భుజం తట్టి "నీ మాటలు మాకు సంతోషంతో కూడికొన్న తృప్తినిచ్చాయి.ధన్యవాదాలు"అని కరచాలనం చేసి సభ ముగిసిందని ప్రకటించి అంతః పురానికి వెళ్ళిపోయాడు. మంత్రివర్యులు దొంగ దగ్గరకొచ్చి"భేష్ !నేను చెప్పినట్టే నడుచుకొని మా రాజుగారిని సంతృప్తి పరచావు. ఇవిగో!నీకు నేను ఇస్తానన్న వెయ్యి వరహాలు"అంటూ వరహాలున్న మూటను చేతికివ్వబోయాడు, "అయ్యా!నిజానికి ఈ వరహాల కోసమే మీరు చెప్పమన్నట్టు నేను రాజుగారితో చెప్పాను. అది నమ్మిన మహారాజుగారే స్వయాన నా వద్దకొచ్చి కరచాలనం చేసి, ధన్యవాదాలు చెప్పి సంతోషంతో వెళ్ళిపోయారు. నామీద రాజుగారికి కలిగిన నమ్మకం,ఆయనతో నాకు కలిగిన కరచాలన బంధం నాకు గొప్పగా తోచింది.ఈ కొలువులోనాకు కలిగిన అనుభవమే నాలో మార్పును తెచ్చింది.ఇకపై నేను అస్సలు దొంగతనం చేయను. కష్టపడి శ్రమించి సంపాదిచుకొని, ఇంకా రాజుగారు మాకు ఇస్తున్న ఉచితాలతో నా కుటుంబాన్ని కాపాడు కొంటాను. వస్తానయ్యా"అంటూ రెండు చేతులెత్తి నమస్కరించాడు దొంగ... ఆ దేశ పౌరుడిగా! ©©©©© ©©©©© ©©©©© ©©©©© అయ్యా!ఈ "దొంగ" బాలల కథ నాస్వంత రచన.దేనికీ అనువాదంకాని,అనుసరణ కాని కాదని తెలుపుకొంటున్నాను. -బొందల నాగేశ్వరరావు,చెన్నై. (9500020101) # 31,వాసుకి నగరు,మొదటి వీధి,కొడుంగైయూరు,చెన్నై,600118.