చెవిలో జోరీగ - మల్లవరపు సీతారాం కుమార్

bee in the ear

తన తండ్రిని ఇ ఎన్ టి స్పెషలిస్ట్ దగ్గరకు తీసుకుని వచ్చాడు శ్రీకాంత్. డాక్టర్ గారిని విష్ చేసి "ఈయన మా నాన్నగారు శ్రీనివాసరావు గారు. " పరిచయం చేసాడు.

"కూర్చోండి. ఏమిటి ప్రాబ్లెమ్?" అడిగాడు డాక్టర్ ప్రసాద్.

"మా నాన్నగారికి చిన్నప్పటి నించి చెవిలో ఏవో వింత శబ్దాలు వినిపిస్తున్నాయి.

కారణమేమిటో తెలియడం లేదు.ఎప్పటినుంచో డాక్టర్ ను కలుద్దామని చెబుతున్నా అయన ఒప్పుకోవడం లేదు. తనకు పెద్ద ఇబ్బంది లేదనీ, ట్రీట్మెంట్ అవసరం లేదనీ చెబుతూ వచ్చారు. ఇటీవల చెవిలో కాస్త నొప్పి ఉందని చెప్పడంతో తీసుకుని వచ్చాను." చెప్పాడు శ్రీకాంత్.

ఓటోస్కోప్ తో శ్రీనివాసరావు గారి చెవిని పరిశించాడు డాక్టర్ ప్రసాద్.తరువాత శ్రీకాంత్ వైపు తిరిగి, "చెవిలో ఇన్ఫెక్షన్ ఉంది.ముందుగా దానికి ట్రీట్మెంట్ ఇస్తాను.మీ నాన్నగారికి టిన్నిటస్ అనే ప్రాబ్లెమ్ ఉండవచ్చు.దానివల్ల చెవిలో విజిల్ శబ్దాలు,పాము బుస కొట్టే శబ్దాలు,మరికొన్ని వింత శబ్దాలు వినిపిస్తాయి.ఇన్ఫెక్షన్ తగ్గాక దానికి సంబందించిన ట్రీట్మెంట్ ఇస్తాను "అంటూ కొన్ని మందులు వ్రాసి ఇచ్చాడు.

డాక్టర్ కు కృతజ్ఞతలు చెప్పి తండ్రిని తీసికొని బయటకు నడిచాడు శ్రీకాంత్.

ఆరోజు సాయంత్రం వరకు బిజీగా ఉన్నాడు డాక్టర్ ప్రసాద్.

ఆరుగంటలకు అటెండర్ వచ్చి "సార్! ఉదయం వచ్చిన పేషెంట్ ఒకాయన మిమ్మల్ని కలవాలని వచ్చాడు.రెండు గంటల నుంచి వెయిట్ చేస్తున్నాడు." అన్నాడు.

"అవునా! మరైతే నాకు ఎందుకు చెప్పలేదు?చూసి పంపేవాడిని కదా?" అన్నాడు ప్రసాద్.

"అదే మాట ఆయనకు చెప్పాను సర్. ఒప్పుకోలేదు. మీతో వివరంగా మాట్లాడాలనీ, అందరు పేషెంట్లు వెళ్ళాక కలుస్తాననీ చెప్పాడు. "అన్నాడు అటెండర్.

"కూడా ఎవరైనా వచ్చారా?" అడిగాడు ప్రసాద్.

"లేరు సర్.ఒక్కడే వచ్చినట్లున్నాడు." అని అటెండర్ అనడంతో ఆయనను వెంటనే లోపలికి పంపమన్నాడు.

లోపలికి వచ్చిన శ్రీనివాసరావు డాక్టర్ కు నమస్కరించాడు.

ప్రతి నమస్కారం చేసిన డాక్టర్ ప్రసాద్ "కూర్చోండి. ఇంతసేపు ఎందుకు వెయిట్ చేసారు? అటెండర్ కు చెప్పి లోపలికి వచ్చి ఉండవచ్చు కదా! " అన్నాడు.

"కాస్త వివరంగా మీకు నా సమస్య గురించి చెప్పాలి. అందుకే అందరూ వెళ్లే వరకూ ఆగాను. మీరు అనుమతిస్తే ..." అంటూ సంశయంతో ఆగాడు శ్రీనివాసరావు.

కాలింగ్ బెల్ కొట్టి అటెండర్ ను పిలిచాడు డాక్టర్.

"రెండు కాఫీ పంపించు" అని అటెండర్ తో చెప్పి శ్రీనివాసరావు గారి వైపు తిరిగి "ఇక మీరు చెప్పండి" అన్నాడు.

"నా చెవిలో శబ్దాల గురించి....వాస్తవానికి అది నాకు సమస్య కాదు. పైగా ఒక వరంగా భావిస్తున్నాను" అన్నాడు శ్రీనివాసరావు.

"వాట్?" కుర్చీలోంచి ముందుకు వంగాడు డాక్టర్ ప్రసాద్. "ఇంటరెస్టింగ్ గా వుంది.సందేహించకుండా చెప్పండి."

"నేను పదో తరగతి చదివేటప్పుడు తలకు చిన్న దెబ్బ తగిలింది.దెబ్బ త్వరగా మానిపోయింది. కానీ అప్పటినుంచి చెవిలో ఎదో జోరీగ శబ్దం చేస్తున్నట్లు నాకు అనిపించడం మొదలైంది. ఆ శబ్దం రోజంతా ఉండదు. అప్పుడప్పుడు వినిపిస్తుంది.నాకు ఆ శబ్దంలో కొన్ని మాటలు కూడా వినిపించేవి. ఒకసారి నా ఫ్రెండ్స్ క్లాస్ ఎగ్గొట్టి సినిమాకు వెళ్ళడానికి ప్లాన్ చేసి నన్నూ పిలిచారు.

వెళదామా వద్దా అని తేల్చుకోలేని నాకు వెళ్లవద్దని చెవిలో ఎవరో చెప్పినట్లు అనిపించింది.

నేను వెళ్ళలేదు. మరుసటి రోజు, స్కూల్ ఎగ్గొట్టిన వాళ్లందరినీ హెచ్ ఎం ఎండలో నిలబెట్టారు.వెళ్ళొద్దని నన్ను ఆపిన నా చెవిలోని జోరీగకు మనసులోనే థాంక్స్ చెప్పుకున్నాను.

ఒక ఆదివారం రోజు ఫ్రెండ్స్ అందరూ ఇంట్లో చెప్పకుండా మా ఉరి చెరువులో ఈతకు బయలుదేరారు.

నన్నూరమ్మని పిలిచారు. బయలుదేరే ముందు అమ్మ దగ్గరకు వెళ్ళాను. చెవిలో ఎవరో ‘అమ్మకు చెప్ప’మన్నట్లు వినిపించింది. చెప్పాను.పెద్దవాళ్ళ తోడు లేకుండా వెళ్లవద్దంది అమ్మ.

దాంతో ఆగి పోయాను.

ఆ రోజు ఇద్దరు పిల్లలు నీళ్లలో మునిగి పోవడం జరిగింది. మిగిలిన పిల్లలందర్నీ వాళ్ళ తల్లిదండ్రులు చావగొట్టారు.ఆ రోజు నుండి నాకు నా చెవిలో జోరీగ పై నమ్మకం పెరిగింది.

ఇక నేను ఇంటర్ చదివే రోజుల్లో జరిగిన సంఘటన చెబుతాను. కాలేజీ నుండి బయటకు వస్తున్న ఒక స్టూడెంట్ పైన నలుగురు గూండాలు అటాక్ చేసారు. రక్తం వచ్చేలా కొడుతున్నారు. ప్రతి విషయంలో ‘వద్దు వద్ద’నే నా చెవిలోని జోరీగ వెళ్లువెళ్ళమంటోంది. అక్కడ ఉన్నది నలుగురు గూండాలు.నేను మాములు స్టూడెంటుని. వెళితే నా ఎముకలు ఫ్రాక్చర్ కావడం ఖాయం. నేను తప్పు విన్నానేమో అనుకున్నాను. చెవిలో శబ్దాలను జాగ్రత్తగా విన్నాను. 'తొందరగా వెళ్ళు' అన్నట్లు వినపడింది. ఇక ఆలస్యం చేయలేదు నేను. గుడ్డి ధైర్యంతో ముందుకు దూకాను. ఇద్దరు గుండాలను కాలర్ పట్టుకుని వెనక్కి లాగాను. పిడికిలి బిగించి ఒకడి పొట్టలో గుద్దాను. స్టూడెంట్స్ లో చలనం వచ్చింది. అందరూ మా వైపు వచ్చారు. గూండాలు భయపడి పారిపోయారు. జరిగిన సంఘటన నన్ను స్టూడెంట్ లీడర్ని చేసింది.

డిగ్రీ మరో కాలేజీలో చేరిన నన్ను ర్యాగింగ్ భూతం వదల్లేదు. ఎదురుగా వస్తున్న ఓ అమ్మాయికి 'ఐ లవ్ యూ' చెప్పమన్నారు, నా సీనియర్ లు. వద్దని చెప్పింది నా చెవిలో జోరీగ. జోరీగ మాట విన్నాను నేను. పనిషమెంట్ గా యాభై గుంజీలు తీయించారు నా చేత. మరో కుర్రాడి చేత ఆ అమ్మాయికి 'ఐ లవ్ యూ' చెప్పించారు. ఆ అమ్మాయి ఏడుస్తూ ఇంటికి వెళ్ళిపోయింది. ఆ రోజే ఆ అమ్మాయి సూయిసైడ్ చేసుకుంది. ర్యాగింగ్ చేసిన సీనియర్లనూ , 'ఐ లవ్ యూ' చెప్పిన జూనియర్ నూ పోలీసులు అరెస్ట్ చేసారు. సీనియర్ లను ఎదిరించిన నాకు, ఆ కాలేజీలోనూ హీరో ఇమేజ్ వచ్చింది. డిగ్రీ పూర్తయ్యేవరకూ నేనే ఆ కాలేజీకి స్టూడెంట్ లీడరును.

ఇక నేను ఉద్యోగంలో చేరాక జరిగిన సంఘటన.

మా ఆఫీస్ లో దాదాపు అందరూ లంచగొండులే. నేను మాత్రం వారితో చేరలేదు. ఒక రోజు మా ఆఫీస్ ఉద్యోగులకు దళారీగా పనిచేసే శేఖరం, నా ప్రక్క సీటులో ఉన్న దామోదరం వద్దకు వచ్చాడు. అతనితో చాలాసేపు మాట్లాడి వెళ్ళాడు.

కాస్సేపటికి దామోదరం నా వద్దకు వచ్చాడు. ‘కాస్సేపట్లో నా వద్దకు ఓ పెద్దాయన వస్తాడని, అతడి పని పెండింగ్ లో పెడితే మిగతా అంతా శేఖరం చూసుకుంటాడ’ని చెప్పాడు.

దామోదరం చెప్పినట్లే కాస్సేపటికి ఓ పెద్దాయన నా దగ్గరకు వచ్చాడు. తన ఫైల్ ఏమైందో చూడమన్నాడు.వాస్తవానికి ఆ ఫైల్ వేరే వ్యక్తి వద్ద నెల రోజులనుండి పెండింగ్ లో ఉంది.అతను లీవ్ లో వెళ్లడంతో నా దగ్గరకు వచ్చింది. అతన్ని తిప్పి పంపమని ప్రక్క సీటునుంచి దామోదరం సైగ చేస్తున్నాడు. చెవిలో జోరీగ మాత్రం అతని పని ఆపవద్దన్నది.

జోరీగ మాటే విన్నాను నేను. పెద్దాయన పని పూర్తి చేసి, నా పై ఆఫీసర్ సంతకం కోసం పంపాను. కానీ అక్కడ కూడా శేఖరం ప్రభావం ఉండటంతో పెద్దాయన పని ఆగి పోయింది. మరుసటి రోజు మళ్ళీ నా పై ఆఫీసర్ వద్దకు వచ్చాడు పెద్దాయన.

"ఏంటీ? శేఖర్ చేతికి ఇవ్వననీ, డైరెక్టుగా నాకే ఇస్తాననీ అన్నవట?" అడిగాడు ఆఫీసర్.

"పాతకాలం వాడిని కదా ! ఎవ్వరినీ నమ్మను. మరోలా అనుకోకండి." అంటూ తాను తెచ్చిన పైకం అందించాడాయన. గబుక్కున ఆ డబ్బును అందుకుని జేబులో కూరుకున్నాడు మా ఆఫీసర్.పెద్దాయన తాలూకు ఫైల్ పై సంతకం చేసాడు. దామోదరం వద్దకు వెళితే ఆర్డర్ కాపీ ఇస్తాడని చెప్పాడాయన. దామోదరానికి కూడా 'సమర్పించి' కాపీ తీసుకున్నాడు పెద్దాయన.

తరువాత నా దగ్గరకు వచ్చాడాయన.

జోరీగ మాటలకు ఎదురు చూడకుండా ‘నాకేమి అవసరం లేద’ని చెప్పాను నేను.

'కరెక్ట్' అంది జోరీగ.

నాలాంటి వారి వల్లే దర్మం ఒంటి పాదంతో అయినా నడుస్తోందనీ, మా ఆఫీస్ లో మిగతావారికి తగిన గుణపాఠం జరుగుతుందని చెప్పి వెళ్లాడయన.

కాస్సేపటికి ఏ సి బి వాళ్ళు వచ్చారు. దామోదరాన్నీ, మా పై ఆఫీసర్ నూ అరెస్ట్ చేసారు.

కొద్ది రోజులకు ఆఫీస్ లో మిగతా వాళ్ళను మారుమూల ప్రాంతాలకు ట్రాన్స్ఫర్ చేసారు.

తరువాత నెల రోజులకే నాకు ప్రమోషన్ వచ్చింది. ఆ రోజు ఆఫీస్ కు వచ్చింది సీఎం గారికి చిన్నప్పటి టీచర్ అట. అయన సి ఎం గారికి విషయం చెప్పటంతో ఏ సి బి రైడ్ జరిగింది.

తరువాత కూడా నా చెవిలో శబ్దాలు నాకు చాలా సహాయం చేసాయి. నా పెళ్లి విషయంలోనూ, పిల్లల చదువుల విషయంలోనూ నాకు సరైన సూచనలు ఇచ్చింది నా చెవిలోని జోరీగ. ఆ శబ్దాలు లేకుంటే ఇంతకాలం ఉన్న ఒక తోడు కోల్పోయినట్లు అనిపిస్తుంది నాకు. మా అబ్బాయికి ఈ విషయాలు చెబుదామంటే వినిపించుకోవడం లేదు. భ్రమలు మానుకొని ట్రీట్మెంట్ చేసుకోమంటున్నాడు. దయచేసి నాకు ఏ ట్రీట్మెంట్ వద్దు. నా మార్గదర్శకుడిని చంపేయవద్దు."

చెప్పటం ముగించాడు శ్రీనివాసరావు.

ఇంతలో అటెండర్ కాఫీ తీసుకోని వచ్చి ఇద్దరికీ ఇచ్చాడు.

కాఫీ తాగుతున్నంత సేపూ ఏదో ఆలోచించాడు డాక్టర్ ప్రసాద్.

తరువాత శ్రీనివాస రావు వైపు తిరిగి "మీరు చెప్పింది శ్రద్ధగా విన్నాను. మీకు వాస్తవానికి ‘టిన్నిటస్’ అనే ప్రాబ్లెమ్ ఉంది. అందు వల్ల మీకు చెవిలో ఏవేవో శబ్దాలు వినిపిస్తాయి. వాటిని మీరు ఏవో సూచనలుగా భావించారు. నిజానికి మీకు సూచనలు ఇచ్చింది మీ సంస్కారం,విచక్షణా జ్ఞానం మాత్రమే. మీ స్వభావం మంచిది. అందుకే మీ వివేకం మీరు తప్పుదారి పట్టకుండా హెచ్చరించింది." అన్నాడు.

నమ్మలేనట్లు చూసాడు శ్రీనివాస రావు.

"మీకు ఒక చిన్న నిరూపణ చేస్తాను..అన్నట్లు మీకు సలహాలు ఇస్తున్నందుకు మీరు నాకు ఒక వెయ్యి రూపాయలు ఫీజు గా ఇవ్వాలి . సరేనా?"అడిగాడు డాక్టర్ ప్రసాద్.

"సరే' అంది శ్రీనివాసరావు చెవిలో జోరీగ.

"సరే" అన్నాడు శ్రీనివాస రావు.

"మీ కుడిచేతి చూపుడు వేలు, మధ్య వేలు ముందుకు జాపండి" అన్నాడు ప్రసాద్.

అలాగే చేసాడు శ్రీనివాస రావు.

"ఇప్పుడు మీ మనసును చెవిలో శబ్దాల నుండి ఈ రెండు వేళ్ళ పైకి మరలించండి.

నా ఫీజు వెయ్యి రూపాయలు ఇవ్వాలనిపిస్తే చూపుడు వేలు కదులుతుంది. రేపు ఇస్తానని చెప్పి జారుకోవాలనిపిస్తే మధ్య వేలు కదులుతుంది." అన్నాడు ప్రసాద్.

తన వేళ్ళ పైనే మనసు లగ్నం చేసాడు శ్రీనివాస రావు.

అతని చూపుడు వేలు అప్రయత్నంగా కదిలింది.

"వాస్తవానికి మీ సమస్యకు సైక్రియాటిస్టు వద్దకు వెళ్ళాలి. ఆయనకు భారీగా ఫీజు ఇవ్వాల్సి ఉంటుంది. మీకు అంత ఖర్చు తగ్గించాను కాబట్టి నాకు ఒక ఐదు వేలు ఫీజు గా ఇస్తే సంతోషిస్తాను" అన్నాడు డాక్టర్ ప్రసాద్.

'ఇవ్వు....ఇవ్వు ...' అని సూచించింది జోరీగ.

"మరోసారి మీ వేళ్ళ మీద మనసు పెట్టండి. ఐదు వేలు ఇవ్వాలనిపిస్తే చూపుడు

వేలు కదులుతుంది. ఈ డాక్టరుకు ఆశ పెరుగుతోందనిపిస్తే మధ్య వేలు కదులుతుంది." అన్నాడు డాక్టర్.

అప్రయత్నం గానే శ్రీనివాసరావు చూపుడు వేలు కదిలింది.

"ఇప్పుడర్ధమయ్యింది కదా! ఫీజు ఎగవేయడానికి మీ మనసు ఒప్పుకోలేదు. అందుకే మీ చూపుడువేలు కదిలింది.

రెండవ సారి నేను అడిగిన మొత్తం ఎక్కువే.

అయినా మీ చూపుడువేలు కదిలింది.

అంటే మీకు ఇబ్బంది అయినా సహాయం చేసినవారు అడిగింది కాదనలేని మనస్తత్వం మీది.

అందుకు తగ్గట్లే మీ చెవిలో శబ్దాలు వినిపిస్తాయి. మీ వేళ్ళు కదులుతాయి.

కాబట్టి మీరు ధైర్యంగా మీ చెవికి ట్రీట్మెంట్ చేసుకోండి. అంతగా అవసరమైతే మీ రెండు వేళ్ళ సహాయం తీసుకోండి. అన్నట్లు నా సలహాలకు మీరు ఏ ఫీజు చెల్లించనవసరం లేదు." చెప్పాడు డాక్టర్ ప్రసాద్.

కృతజ్ఞతలు చెప్పి బయటకు నడిచాడు శ్రీనివాస రావు.

**************

మరిన్ని కథలు

Bhavaateetam
భావాతీతం
- DODDIPATLA KALYAN KISHORE
Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న
ఓ breaking news
ఓ బ్రేకింగ్ న్యూస్
- బివిడి ప్రసాద రావు