ఎంత అనుభవంతో చెప్పారో గాని యోగి వేమన "ఇంటిలోని పోరు ఇంతింత కాదయా" అని, అది అక్షర సత్యం అని నా అనుభవం చెప్పింది. ఇంట్లో పనులు చేయడానికి యంత్రాలు వచ్చినప్పటి నుంచి కష్టమనే పదాన్ని మర్చిపోయి, కుక్కర్ విజిల్స్ రాగానే కట్టేసి, టి.వి కి అతుక్కు పోయే ఆడవారి సంఖ్య ఈ మధ్య కొంచెం పెరిగింది. అందులో మా శ్రీమతికి అగ్రతాంబూలం ఇవ్వవచ్చు. చూస్తే చూసింది ఏదో కాలక్షేపానికైతే పర్వాలేదు. అందులో చెప్పే విచిత్ర వంటకాలను చేసి నా నాలుకను రాచి రంపాన పెడుతుంది. ఏదో పోనీలే అనుకుంటుంటే ఈ మధ్య ఒక కొత్త చిక్కు తెచ్చిపెట్టింది నాకు. ఈ మధ్యకాలంలో బ్యాంకు వారి పుణ్యమా అని నాలాంటి అత్తెసరు జీతగాళ్ళకు కూడా తక్కువ వడ్డీతో గృహఋణాలు ఇస్తున్నారు. ఇది కూడా మా ఆవిడ పసికట్టేసింది, టి.వి పుణ్యమా అని. అంతే, ఇల్లు కొంటావా చస్తావా అని రోజూ గోలే. అప్పటికీ చెప్పాను. నా గొర్రె తోక జీతానికి వచ్చేది ఇరవై లక్షలేనని. ఏదో వెనక్కు తగ్గుతుంది కదా అనుకున్నాను. ఒకరోజు నేను ఆఫీసు నుంచి రాగానే కాఫీ ఇచ్చి బలవంతంగా టి.వి ముందు కూర్చోబెట్టింది మీ కొక యాడ్ చూపిస్తానని. తప్పక కూర్చున్నాను. నాగార్జున ఘడి, మహేష్ డెన్ వర్, ఎవరో ఇద్దరు టి.వి నటుల బాత్ రూమ్ పిచ్చి ప్రకటనలు కాగానే తళుక్కున మెరిసింది ఒక యాంకర్ (పేరు తెలీదు) 'కొత్త ఇంటి కల నెరవేరలేదా! తక్కువ జీతమని విచారిస్తున్నారా! ఋణం దొరకదని బాధపడుతున్నారా! దిగులు పడకండి మేము మీకోసం వేస్తున్నాము ఒక సరికొత్త వెంచర్. రాజధానికి చేరువలో ఇరవై లక్షలకే డబుల్ బెడ్ రూమ్ ఫ్లాటు. అన్ని వసతులతో మీకోసం. G.S.T మాదే. ఋణం మేమే ఇప్పిస్తాం. నచ్చితేనే మీకు. బలవంతం లేదు. ఎందుకంటే ఇక మిగిలివున్నవి పదిలోపే. ఇంకెందుకు ఆలస్యం. భలే మంచి చౌకబేరమూ" అని పాడుతూ వివిధ భంగిమలలో చేతులు తిప్పి వెళ్ళిపోయింది. అలా చూపి త్వరగా చూడండి అని చెప్తూ ఫోను నెంబరు కూడా ఇచ్చింది. ఇది జరిగి వారం అయింది. ఇంట్లోకి అడుగుపెడుతూనే ఏమయింది ఇంటి సంగతి అని ఆమె అడగడం, నేను అడగలేదని చెప్పడం జరుగుతూనే ఉంది. ఈ రోజు కూడ పాత పాటే పాడదామనుకున్నా, కుదరలేదు. "చూడండి. అక్కడ ఉన్నవి ఇక నాలుగు ఫ్లాట్లేనట. ఇందాక యాంకర్ పప్పు చెప్పింది. ఇప్పుడు మీరు ఫోన్ చేస్తారా. నన్ను చెయ్యమంటారా" చివరి వార్నింగ్ లా చెప్పింది నా శ్రీమతి సుందరి. ఎందుకొచ్చిన గొడవలే అని " నేనే చేస్తాను. ఈ లోపల నువ్వెళ్ళి కాఫీ పట్టుకురా" అని ఆమె ఇచ్చిన నెంబరుకు రింగ్ చేశాను. "హలో నమస్తే. కూల్ రియల్ ఎస్టేట్. మీకెవరు కావాలి సర్." అవతలి నుంచి తీయని గొంతు. "నమస్తే అండి. రాజధానికి దగ్గరలో మీరొక వెంచర్ వేశారట కదా. దాని వివరాలు చెప్తారా. మేమూ ఒక ఫ్లాటు తీసుకోవాలనుకుంటున్నాము" అడిగాను. "ఓ. తప్పకుండా సర్. ఫ్లాట్ ధర ఇరవై లక్షలు. మొత్తం నాలుగు వందలు. ఒక్కొక్క బ్లాకులో నలభై చొప్పున పది బ్లాకులు. మా ప్రకటన చూసే ఉంటారు కదా. ముందు మీరు ఆన్ లైన్ లో పాతిక వేలు జమచేసి మాకు చెప్తే మేము మా చిరునామా చెప్తాము. మీరు అక్కడికి వస్తే మా వాళ్ళు మిమ్మల్ని వెంచర్ వద్దకు తీసుకు వెళతారు. మీకు అంగీకారమయితే నాకు ఫోను చెయ్యండి. మా ఖాతా సంఖ్య చెబుతాను" సుతిమెత్తగా చెప్పింది. సరేనని చెప్పి ఫోను పెట్టేసి కాఫీ తెచ్చిన మా సుందరికి విషయం చెప్పాను. ఎగిరి గంతేసింది. " నిన్ననే కదా పండగ అడ్వాన్సు తీసుకున్నారు. అందులోనుంచి కట్టేయండి. మంచి సమయం. ఖాతా నెంబరు కనుక్కోండి" అని తొందరపెట్టి డబ్బు జమ అయ్యేదాకా వదలలేదు. ****** తెల్లవారి లేచి పది గంటలకల్లా బయలుదేరి 'హతవిధీ' అనుకుంటూ ఆ అమ్మాయి ఇచ్చిన అడ్రసుకు చేరుకున్నాను. అక్కడ వాళ్ళు నన్ను సాదరంగా ఆహ్వానించి కాఫీ ఇచ్చి, ఒక కాగితం మీద సంతకం తీసుకున్నారు. అక్కడి నుంచి వాళ్ళ మేనేజరుతో కలసి కారులో వెంచరు వద్దకు బయలుదేరాము. దారి పోతూవుంటే వస్తుంది తప్ప వెంచరు కనుచూపుమేర తగలలేదు. అలా పోగా పోగా ఒక పాతిక కిలోమీటర్ల ప్రయాణం తరువాత అడవిలా ఉండే చోటికి తీసుకువెళ్ళి కారు ఆపారు. అంతా నిర్మానుష్యం. దూరంగా ఏదో తగలబడుతున్నట్లుగా ఉంది. ఆ అడవిలో ఒక వంద గదుల స్థలం చదును చేసి చిన్న ఇల్లు కట్టివున్నారు. " సార్. ఇది మన ఫ్లాట్లు కట్టే స్థలం. మీకు మోడల్ ఇల్లు చూపిస్తాను రండి" అంటూ ముందుకు కదిలాడు మేనేజర్. హాలు, బెడ్ రూములు, వంటగది, సర్వీసింగ్ మొత్తం కలిపినా రెండు వందల చదరపు అడుగులు లేదనిపించింది నాకు. " ఇవి గదులా అగ్గిపెట్టెలా. ఆ బాత్ రూములో స్నానాలు చేస్తే మనం వంటి మీద పోసుకున్న నీళ్ళు మరల అదే బక్కెటలో పడతాయి. ఇక హాలులో టి.వి పెడితే, దానిలోనే తలపెట్టి చూడాలి" మనసులో మాట పైకి అనేశాను. " భలేవారే సర్. అది ఎంత అదృష్టమనుకున్నారు. రెండు బక్కెట్టులకు బదులు, ఒక బక్కెటు నీటితో ఇద్దరు స్నానం చేయవచ్చు" పెద్ద జోకు వేశాననుకుని విరగబడి నవ్వాడతను. వళ్ళు మండింది నాకు. " అలా దూరంగా కనిపించే మంటలేమిటండి" మాట మార్చాను " అది పక్క ఊరివారి స్మశానవాటిక. ఇటు చూడండి. పెద్ద చెరువు. బర్రెలను తెచ్చి రోజూ ఇక్కడ స్నానం చేయిస్తారు. నీటిమీది గాలి ఎంత చల్లగా ఉంటుందో" ఇంకో జర్క్ ఇచ్చాడతను. పక్కనే ఉన్న ఇనుపకడ్డీతో వాడి తల పగలగొడదామన్నంత కోపం వచ్చింది నాకు. " ఎలా ఉందండీ ఇల్లు, లొకేషన్. నచ్చిందా. అన్ని ఫ్లాట్లు ఇలాగే ఉంటాయి. ముందుగా అయిదు లక్షలు కడితే మీ ఫ్లాటు కట్టడం మొదలు పెడతాము. చాలామంది కట్టేశారు. మిగతా పదహేను లక్షలు రెండు విడతలలో కడితే ఇల్లు మీ పేర రిజిస్టర్ చేస్తాము" రొటీన్ గా చెప్పాడతను. ఆ ఇల్లు మొత్తం కలిపితే తను ఉంటున్న ఇంటి హాలంత లేదు. దానికి ఎంత బిల్డప్ ఇచ్చారు యాడ్ లో. మా ఆవిడ మీద పిచ్చికోపం వచ్చింది. ఆలోచించి చెబుతానని అతనికి చెప్పి తిరిగి బయలుదేరాము. ఇంటికొచ్చి ఇల్లుపీకి పందిరి వేసినంత రచ్చ చేశాను మా శ్రీమతి మీద. ప్రకటనలు చూసి పనికిమాలిన పనులు చేయవద్దని చిందులువేశాను. నా దెబ్బకు భయపడిపోయిన ఆమె ఇల్లు వద్దు, వాకిలి వద్దు అడ్వాన్సు తిరిగి తీసుకురండి అన్నది. వెంటనే వాళ్ళకు ఫోన్ చేసి, ఇల్లు మాకు నచ్చలేదు, అడ్వాన్సు తిరిగి ఇవ్వమని అడిగాను. " ఓకె సర్. అది మీ ఇష్టం. కాకపోతే మీ మీద మేము పెట్టిన ఖర్చు, వృథా అయిన సమయమూ లెక్కవేసి పదివేలు మీ అడ్వాన్సు నుంచి మినహాయించి మిగిలిన సొమ్మును 90 రోజులలోపు మీ ఖాతాకు జమచేస్తాం. దయచేసి మీ బ్యాంకు వివరాలు చెప్పండి" బాంబు పేల్చింది ఆ అమ్మాయి "అదేంటి మేడమ్. మేము ఇల్లు వద్దనుకున్నాం కదా" సగం ప్రాణం చచ్చి అడిగాను. " అందుకే సర్. లేకపోతే మీలాటి వారు వచ్చి చూసిపోతూవుంటే మా ఖర్చులు ఎలా గిట్టుబాటు అవుతాయి సర్. ఈ వివరాలన్నీ తెలిపే పేపర్ మీద మీరు ఇందాక సంతకం కూడ పెట్టారుకదా. సారీ సర్. వెంటనే మీ ఖాతా వివరాలు పంపండి" అంటూ ఫోను పెట్టేసింది ఆ చిలకపలుకుల అమ్మాయి. పండగ అడ్వాన్సు సగం గోవిందా అనుకుంటూ సోఫాలో కూలబడ్డాను. విషయం అర్థమయిందేమో వంట గదిలోకి పారిపోయింది నా శ్రీమతి. ******* అయిపోయింది *******