సుల్తి - అఖిలాశ

sulti

ఎండాకాలం సెలవలంటే జాఫర్ కి చానా ఇష్టం. వీధిలో పిల్లోలతో ప్యాకిలాట, రింగ్ రింగ్ బిళ్ళ రూపాయి బిళ్ళ, పోలీసు-దొంగ, ఇంటి దగ్గర శివాలయం గుడి బయట ఉండే… జారే బండ ఆట ఇలా ఎన్నో ఆడుకోవచ్చు. అట్టనే లయోలా కాలేజి కొండ ఎనిక్కి పోతే… తుమ్మ చెట్లకు ఉండే జీరింగులు తెచ్చుకోవచ్చు. జీరింగులను అగ్గిపెట్టెలో పెట్టి… గుడ్లు పెట్టినాయ లేదా అని రోజుకు పదిసార్లు చూసుకుంటాడు. ఇంట్లో తెలియకుండా దోస్తు గాళ్ళతో కలిసి.. ఊరికి దగ్గరలో ఉన్న రోజుకొక పల్లెకి పోయి… చింతకాయలు, కలీ పండ్లు, మేడి పండ్లు, రేణిగాయలు, చెనక్కాయలు తెచ్చుకుంటాడు. అప్పుడప్పుడు కొత్తిమీర, వంకాయలు, టమోటా లాంటి కూరగాయలు కూడా ఇంటికి తెచ్చి ఇస్తాడు. ఎవరు ఇచ్చినారని నానీ అడిగితే? మా దోస్తు వాళ్ళు… పంట పెట్టినారు అందుకే ఇచ్చినాడు అనే వాడు.

***

ఈ ఎండాకాలం సెలవల్లో కూడా అట్టనే ఆడుకోవాలనుకున్నాడు. కానీ పక్క వీధిలో ఉన్న చిన్నమ్మ, ముద్దనూరు నుండి రెండో పెద్దమ్మ, ప్రొద్దుటూరు నుండి నాలుగవ పెద్దమ్మ అందరూ ఒకేసారి ఇంటికి వచ్చినారు. రేపటి కార్యక్రమం కోసం ఏదో మాట్లాడుకుంటున్నారు?. జాఫర్ కి ఏమి అర్థం కావడం లేదు. కొత్త బట్టలు కావాలని… ఎంత అడిగిన తెచ్చేవారు కాదు… అలాంటిది కొత్త జుబ్బ కొట్టించారు… రేపు పొద్దున్నే లేసి కొత్త బట్టలు వేసుకుంటే.. నీకు, తమ్మునికి సుల్తి చేయిస్తామనింది… ప్రొద్దుటూరు నుండి వచ్చిన నాలుగవ పెద్దమ్మ.

జాఫర్… అవేవి పట్టించుకోలేదు. తనకు కొత్త బట్టలు తెచ్చారు, పొద్దున్నే లేస్తే తొడుక్కోవచ్చు అనుకున్నాడు. అనుకున్నట్టే తెల్లవారగానే జాఫర్ నానీ (అవ్వ)… జాఫర్ ని, తమ్ముడిని నిద్ర లేపింది. వేడి వేడి నీళ్ళు తలకు పోసింది. కొత్త జుబ్బ తొడిగింది, నెత్తికి టోపీ పెట్టింది. ఎప్పుడూ లేనిది కొత్త బట్టలు వచ్చాయని తెగ సంబరపడిపోయాడు… జాఫర్.

***

చూడు జాఫర్… నిన్ను, తమ్ముడిని చిన్నాయన సైకిల్ లో లాలు సాహెబ్ కాడికి తీసుకుపోతాడు. మీకు సుల్తి చేయిస్తాడు. నువ్వు… ఏడ్చకూడదు, తమ్ముడు జాగ్రత్త అని చెప్పింది. సరే అన్నట్టుగా… తల ఊపాడు జాఫర్.

తన స్నేహితుడు అన్వర్, షఫీ కూడా సుల్తి చేయించుకున్నారు. సుల్తి చేసుకుంటే ఎర్ర బట్ట కట్టుకోవాలని జాఫర్ కి తెలుసు కానీ… సుల్తిలో ఏమి చేస్తారో… తెలియదు. అది బాధగా ఉంటుందని ఒక సందర్భంలో మున్వర్ చెప్పినట్టు గుర్తు. అయినా… పర్వాలేదు నాకు కొత్త జుబ్బ కొట్టించారు… రోజు ఏమి కావాలంటే అది తెచ్చిస్తాము అంటున్నారు… అది సాలులే అనుకున్నాడు మనసులో.

***

చిన్నాయన సైకిల్ లో లాలూ సాహెబ్ దగ్గరికి తీసుకుపోయి జాఫర్ కి, జాఫర్ తమ్ముడికి సుల్తి చేసుకొని ఇంటికి ఆటోలో తెచ్చినాడు. సుల్తి చేసేటప్పుడు మత్తు సూది వేయడంతో జాఫర్ కి పెద్దగా నొప్పి లేదు కానీ… ఇంటికి రాగానే మెలకువ వచ్చింది. నొప్పి తట్టుకోలేక పోయాడు. గొంగేలు పెట్టి ఏడుస్తూ… మా అమ్మ కావాలి. అమ్మ దగ్గరికి పోతాను. మా అమ్మ యాడుంది?. మా అమ్మను చూడాలని కేకలు పెట్టాడు.

“యాడుందిరా…? మీ అమ్మ ఎప్పుడో లేచిపోయింది.” నోరు మూసుకొని ఉండు… మేము కాబట్టి ఇవన్నీ చేస్తున్నాము… అదే మీయమ్మ అయితే గొంతులో వడ్లగింజ వేసేదని… ముద్దునూరు పెద్దమ్మ కసురుకుంది. జాఫర్… ఆ మాటలేవి పట్టించుకోలేదు, అసలు పెద్దమ్మ చెప్పే మాటలు… జాఫర్ కి అర్థం కాలేదు. మా అమ్మ కావాలి, అమ్మను చూడాలని… గట్టి గట్టిగా అరిచాడు.

ఇట్లయితే… మాట వినడని నానీ… వీపు విమానం మోత మోగించింది. నోరు మూసుకొని పడుకో లేదంటే సంపుత నా కొడక. ఏమి తక్కువైందని ఇప్పుడు… అమ్మ కావాలి.. గిమ్మ కావాలి అంటాడావు. ఇంట్లో ఇంతమంది ఉంటే… అమ్మతో ఏం పని? అది నిన్ను ఎప్పుడో వదిలి పోయింది. నోరు మూసుకొని పడుకో అని వదిరింది.

జాఫర్… ఏడ్చి ఏడ్చి పడుకున్నాడు. మధ్యాహ్నం లేవగానే మటన్ ,రొట్టె తినిపించారు. నొప్పిగా ఉందని నానీతో చెప్పి… మూలిగాడు. ఏం కాదులే… సాయంత్రం సోమిరెడ్డి దగ్గరికి తీసుకుపోయి సూదులు వేయిస్తాలే… నొప్పి తగ్గుతుందని నచ్చచెప్పింది… నానీ. ఇక చేసేది లేక అలానే పడుకున్నాడు.

“పడుకున్నాడే… గాని జాఫర్ కి నిద్ర పట్టడం లేదు. అమ్మ యాడికి పోయింది?. నాకింత బాధగా ఉన్న కూడా అమ్మ గాని, నాయన గాని చూడటానికి ఎందుకు రాలేదు?. నానీ… నన్ను ఎందుకు ఇంతగా కొడతాంది?. పెద్దమ్మోలు బాగానే చూసుకుంటున్నారు గాని అమ్మ విషయం ఎత్తితే తిట్టడం, కొట్టడం చేస్తున్నారు. ఇవన్నీ… జాఫర్ పసి మనసులో చేరి ముల్లులా గుచ్చుకుంటున్నాయి. ఆ ఆలోచనలతోనే మెల్లగా నిద్రలోకి జారుకున్నాడు.”

అలానే మూడు రోజులు గడిచింది. ఇప్పుడు… పెద్దగా నొప్పి లేదు గాని… మెల్లగా నడవగలుగుతున్నాడు. అయితే నీళ్ళు పోసేటప్పుడు… సుల్తి చేసిన చోట గ్లాసు అడ్డు పెట్టుకోవాలి. కదిలితే నీళ్ళు లోపలికి పోతాయి. నీళ్ళు పోతే నొప్పి ఎక్కువగా ఉంటుంది. నానీ నీళ్ళు పొసేంత సేపు కదలకుండా గ్లాసును… సుల్తి చేసిన చోట పెట్టుకొని నిలబడతాడు. అప్పుడప్పుడు కదిలితే… నానీ వీపు మీద నాలుగు వేసేది. బయటకి తెలియకుండా… కుళ్లి కుళ్లి ఎడ్చుకునే వాడు… జాఫర్.

మొత్తానికి 21 రోజులు గడిచిపోయింది.

“కొత్త బట్టలు తొడిగి, మెళ్ళో పూల హారం వేసి, నెత్తికి టోపీ పెట్టి సాంగ్యం చేసారు. ఇంట్లో అంతా సందడి సందడిగా ఉంది. జాఫర్ మనసు అమ్మ కోసం వెతుకుతోంది.”

“అమ్మ… అమ్మ… అమ్మ… ఎప్పుడు వస్తుంది?.”

“మా అమ్మ… నన్ను చూడటానికి… రాదా…?”

“ఈ ఏడాది… ఎండా కాలం సెలవులు జాఫర్ మనసులోని… తడిని పీల్చేశాయి….”

***

మరిన్ని కథలు

Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaalani kaagitam
కాలని కాగితం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు