" వాతావరణం మరీ ప్రోవొకేటింగ్‌గా ఉంది. సన్నగా కురుస్తున్న వర్షం. పరుగులెడుతున్న మనసు. తొందరపెడుతున్న వయసు. తన ఫ్లాట్‌లో ఒంటరిగా కూర్చుని , కిటికీ లో నుండి వాన చినుకులని చూస్తూ అందమైన కలలని కంటున్నాడు ప్రహసిత్. ఏ దేవుడో కరుణించి ఈ వేళలో అందమైన ఓ అప్సరసని తన ముందు ఉంచితే బాగుండును అని ఆశపడుతున్నాడు. అతడి ఆశని భగవంతుడు విన్నాడేమో అన్నట్లు కాలింగ్‌బెల్‌మోగింది.వెళ్ళి డోర్‌తీసాడు. ఎదురుగా అందమైన అమ్మాయి. ఎప్పుడో ఆమెని తమ అపార్ట్మెంట్‌లోనే వేరే ఫ్లాట్‌లో చూసినట్టు గుర్తు. ' ఫ్లాట్‌కీస్‌లేవండీ ...కాసేపు కూర్చోవచ్చా ? ' అంటూ అతడిని దాటుకుంటూ లోనికి వచ్చింది. ప్రహసిత్‌ఆమెని ఏదో అడగబోయాడు. కానీ ఆమె ఏదీ వినకూడదన్నట్లు సరాసరి బెడ్‌రూములోనికివెళ్ళింది. గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభించింది అతనికి. ' ఇప్పుడేం చేద్దాం ? లోనికి వెళ్ళి చాంసు తీసుకుందామా ' అని క్షణంకాలం ఆవేశపడ్డాడు. కానీ ఇలాంటి అపరిచిత వ్యక్తిని నమ్మడం ఎంతవరకు క్షేమం అని కొద్దిగా భయపడ్డాడు.అతని మనసు డోలాయమాన స్థితిలో పడింది .."
వ్రాస్తున్న కథని పక్కన పెట్టి బద్ధకంగా వళ్ళు విరుచుకున్నాడు శశాంక. వర్థమాన తెలుగు రచయిత అతను. సుమారు ఇరవై కథల దాకా ప్రచురించ బడ్డాయి. ఇంకా బాగా వ్రాయాలని , పేరు సంపాదించాలని అతడి లక్ష్యం.
" ఏంటండీ ...ఇంకా మీ కథ పూర్తవ్వలేదా ? " టేబుల్‌మీద టీ కప్పు పెడుతూ అడిగింది అతని భార్య.
" లేదు సుశీ ...ఇంకా కొంచెం టైము పడుతుంది " అని చెప్పి టీ సిప్‌చేయసాగాడు.
“ సర్లెండి ...అదేదో తొందరగా కానివ్వండి. వచ్చే వారం బాబి గాడి బర్త్‌డే ఉంది కదా , వాడికి డ్రస్సులు కొనడానికి సాయంత్రం షాపింగ్‌కి వెళ్ళాలి.” అంటూ ఆర్డర్‌పాస్‌చేసి వెళ్ళిపోయింది.
“ సరే ఏం చేస్తాం..సంసారం అన్నాక ఇలాంటివి తప్పవు కదా “ అని చిన్నగా నిట్టూరుస్తూ వ్రాసుకోవడానికి ఉద్యుక్తుడయ్యాడు. ఇంతలో సెల్‌ఫోన్‌లో చిన్న బీప్‌వినపడింది. మెసేజ్‌వచ్చిన శబ్దం అది. సెల్‌చేతిలోకి తీసుకొని మెసేజ్‌చదివాడు.
“ మీ ' ప్రేమ కోసం ' కథ చాలా బాగుంది. చదివాక నా మనసంతా అదోలా అయిపోయింది. ప్రేమ గురించి ఇంత బాగా వ్రాయడం నిజంగా గ్రేట్! నాకు మిమ్మలని కలుసుకోవాలని ఉంది. మీతో ఎన్నో విషయాలు మాట్లాడని ఉంది. నాకు అవకాశం ఇస్తారా ? - మీ అభిమాని సుప్రియ “ అని వ్రాసి ఉంది. సంతోషంగా ఫీల్‌అయ్యాడు శశాంక.ఈ మధ్య ఒక పత్రికలో కథ పడినప్పుడు అతని ఫోటో తో పాటూ సెల్‌నంబర్‌కూడా వేసారు. అప్పటి నుండి ఇలాంటి మెసేజ్‌లు రావడం ప్రారంభించాయి. రచయితకు కావల్సింది ఇలాంటి అభినందనలే కదా ! ' సుప్రియ ' అన్న పేరు బట్టి కంపల్సరీ గా అందమైన అమ్మాయి అయి ఉంటుంది అని ఊహించాడు. చాలా మంది అభినందిస్తూ ఉంటారు. కాకపోతే ఈ అమ్మాయి ఒక అడుగు ముందుకేసి పర్సనల్‌గా కలవాలని ఆరాట పడుతోంది.నిజం చెప్పాలంటే అతనికి కూడా ఆమెని వీలైనంత తొందరగా కలుసుకోవాలని, తనని పొగుడుతుంటే విని ఆనందించాలని అనిపించింది. కానీ భార్యకు ఈ విషయం చెప్పాలా వద్దా అని ఆలోచించాడు. ‘ ఆ...చెబితే ఏముంది.క్లాసు పీకుతుంది, అప్పుడు ఈ మాత్రం మెసేజ్‌లు కూడా ఉండవు’ అనుకుంటూ ‘ ఇదేదో సీక్రెట్‌గా తనే తనే డీల్‌చేసుకోవాలి ‘ అని నిర్ణయించుకున్నాడు. ఆ సాయంత్రం మామూలుగానే భార్యతో షాపింగ్‌కి వెళ్ళాడు. ఇంటికొచ్చాక భోంచేసి బెడ్‌మీద వాలాడు. సుప్రియను ఎలా లైన్‌లో పెట్టాలా అని ఆలోచిస్తూ నిద్రలోకి జారుకున్నాడు.
* * *
మర్నాడు ట్రిమ్ముగా రడీ అయి ఆఫీసుకి వెళ్ళాడు శశాంక. కొంచెం సర్దుకున్నాక సుప్రియ సెల్‌కి ఫోన్‌చేసాడు. ఒక రచయిత ఫోన్‌చెయ్యడంతో థ్రిల్‌అయిపోయింది సుప్రియ. ఎంతో హుషారుగా మాట్లాడసాగింది. శశాంక్‌పరిస్థితి చెప్పలేం. అతని మనసు ఆనంద డోలికల్లో తేలియాడసాగింది.
" సుప్రియా ...నాక్కూడా మిమ్మల్ని కలవాలని ఉంది. వీలైతే సాయంత్రం ఆరు తర్వాత వస్తారా ? " అంటూ ఎక్కడికి రావాలో చెప్పాడు బ్రతిమాలుతున్నట్టుగా.
" ష్యూర్...తప్పకుండా వస్తాను " అని చెప్పి ఫొన్‌పెట్టేసింది.
ఆఫీసు అవగానే బైక్‌మీద రయ్యిన దూసుకుంటూ అరగంత తర్వాత స్పాట్‌లోకి వచ్చేసాడు శశాంక. అప్పటికే అక్కడ ఒక అమ్మాయి వెయిట్‌చేస్తోంది. ఆమెనే సుప్రియ అనుకుంటూ దగ్గరగా వెళ్ళి
" హాయ్..మీరు సుప్రియ కదూ .." అని నవ్వాడు. ఆమె ఔనంటూ తలూపాక " చాలా థాంక్స్! మీరు వచ్చినందుకు " అంటూ ఆనందంగా చెప్పాడు. ఆమె చిన్నగా నవ్వింది.
శశాంక ఆమెనే చూస్తున్నాడు. తను ఊహించిన దానికంటే అందంగా ఉంది. ముఖ్యంగా ఆమె కళ్ళు. విశాలంగా కోటి భావాలని పలికించగలిగేలా ఉన్నాయి.ఆరాధనగా చూడసాగాడు. సిటీకి దూరంగా ఉన్న గార్డెన్‌రెస్టారెంట్‌అది. తమ లాగే చాలా మంది అక్కడ కూర్చుని ఏదో డ్రింక్‌సిప్‌చేస్తూ మాట్లాడుకోసాగారు.
" ఏంటి ఆలోచనల్లో పడిపోయారు...నా కంపెనీ మీకు బోర్‌కొడుతోందా ? " బెరుగ్గా అడిగింది.
" అబ్బే ...అదేం కాదు. అందమైన మీ కళ్ళ గురించి ఆలోచిస్తున్నాను. మీరు నటిగా మారితే కళ్ళతోనే అన్ని భావాలని చూపెట్ట గలరు " కొద్దిగా పొగిడాడు. ఆమె చిన్నగా నవ్వింది. నెమ్మదిగా ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకొని ముద్దు పెట్టాడు. అందంగా సిగ్గు పడిందామె. తొలి ముద్దు పరవశం ఆమె బుగ్గల్లో ఎర్ర మందారమై విరిసింది.చాలా సేపు ఇద్దరూ తనివితీరా మాట్లాడుకున్నాక వదల్లేక వదల్లేక కదిలాడు శశాంక. అతనికి ఇదంతా చాలా థ్రిల్లింగ్‌గా ఉంది. రోజూ పొద్దున్నే లేవడం, ఆఫీసుకు వెళ్ళడం , సాయంత్రం ఇంటికొచ్చాక టీవీలో ఏదో ప్రోగ్రాంస్‌చూసి, వీలైతే కథ వ్రాయడానికి ప్రయత్నించి నిద్రపోవడం.ఇదే... సంవత్సరాల తరబడి ఇదే జీవితం. చప్పగా పరమ బోరు అయిపోయింది.అందుకే అతడి మనసు చిన్న మార్పు కోరుకుంది. సుప్రియతో స్నేహం చేయమని తొందర పెట్టింది. దాని ఫలితమే ఈ రహస్య సంబంధం. ఈ బంధం ఎటు దారి తీస్తుందో కాలమే చెప్పాలి.
* * *
శశాంకలో చాలా మార్పు వచ్చింది. బయట ఉన్నప్పుడు వీలైనంత అందంగా ప్రశాంతంగా కనిపించడానికి ప్రయత్నిస్తున్నాడు. ఆఫీసు నుండి ఆలస్యంగా ఇంటికి వస్తున్నాడు. అడిగితే వర్క్‌లోడ్‌పెరిగిందని చెబుతున్నాడు. భార్యతో మాట్లాడటం తగ్గించేసాడు. బాబిగాడినైతే చీటికీ మాటికీ విసుక్కోవడం మొదలు పెట్టాడు. కథలు వ్రాయడం ఎప్పుడో అటకెక్కిపోయింది. ఈ మార్పులన్నిటికీ కారణం సుప్రియతో అతడు సాగిస్తున్న ఎఫైర్. అందమైన అమ్మాయితో ప్రణయం వల్ల భార్యా పిల్లలు పనికిమాలిన వాళ్ళలాగ కనిపించసాగారు అతనికి.తప్పు అతనిది కాదు. అతడి మానసిక స్థితిది.
టేంక్‌బండ్‌పక్కనే ఉన్న పార్క్‌లో జనసమూహానికి దూరంగా కూర్చున్నారు శశాంక మరియు సుప్రియ. కళ్ళల్లో కళ్ళు పెట్టుకుని మౌనంగా సంభాషించుకుంటున్నారు. ఆ రోజు వేలెంటైంస్‌డే ! ప్రేమికుల దినం. ఆ రోజు తప్పనిసరిగా ప్రేమికులు గాఢంగా ప్రేమించుకోవాలి. లేకపోతే జీవితం వృధా ! ప్రస్తుతం ఇద్దరూ అదే పనిలో ఉన్నారు.
వాళ్ళ ఏకంతానికి భంగం కలిగించడానికన్నట్లు ఒక అమ్మాయి మరియు ఒక అబ్బాయి వాళ్ళని సమీపించారు. అమ్మాయి చేతిలో మైకు ఉంది. అబ్బాయి భుజం మీద చిన్న కెమేరా ఉంది. అంటే కెమేరా మేన్‌గంగతో రాంబాబు టైపు అన్న మాట. కొద్దిగా కంగారు పడ్డాడు శశాంక. అయినా వాళ్ళు వదలలేదు.
" సార్! ప్రేమ మీద మీ అభిప్రాయామేంటి సార్? " హుషారుగా అడిగింది అమ్మాయి మైక్‌మూతి ముందు పెట్టి.
" ప్రేమ అనేది మనిషికి భగవంతుడు ఇచ్చిన గొప్ప వరం. ప్రతి వారికీ ఇది అవసరం. ఇది లేని జీవితం ఒక నరకం " కవితాత్మకంగా చెప్పాడు. " వావ్! " అంటూ చప్పట్లు కొట్టిందా అమ్మాయి. కెమేరా తన పని తాను చేసుకు పోతోంది.ఒక ప్రముఖ టీవీ చానెల్లో ఇదంతా లైవ్‌షో గా టెలికాస్ట్‌అవసాగింది. ఈ విషయం తెలీని శశాంక రెచ్చిపోసాగాడు.
ఏంకర్‌సుప్రియ వైపు తిరిగి " మీరు చెప్పండి మేడం ప్రేమ గురించి " అని అడిగింది. అప్పటికే ప్రేమ మైకంలో కొట్టు మిట్టాడుతున్న సుప్రియ వెంటనే అందుకొంది.ఇటీవల వస్తున్న సినిమాల ప్రభావం కూడా ఆమె పైన చాలా ఉంది. కళ్ళు అరమోడ్పులు చేసి " ప్రేమ లేని జీవితం వ్యర్థం. ప్రేమించని మనసుకు లేదు అర్థం.ప్రాణమైనా ఇస్తా అవసరార్థం " చెప్పింది. ఏంకర్‌కి కళ్ళు తిరుగుతున్నట్లుగా అనిపించింది . అయినా కంట్రోల్‌చేసుకుని " ఇంతకీ మీ ప్రేమ పెళ్ళితో ముగుస్తుందా మేడం " అని అడిగింది.
" ఓ...తప్పని సరిగా ...త్వరలోనే మేము పెళ్ళి చేసుకోబోతున్నాము " శశాంకను గట్టిగా పట్టుకుంటూ చెప్పింది. వెర్రి మొహంతో దిక్కులు చూడసాగాడు శశాంక.
ఇంట్లో టీవీ చూస్తున్న బాబిగాడు టీవీ లో వాళ్ళ నాన్నను చూసి థ్రిల్‌అయిపోయాడు.
" అమ్మా ...నాన్న టీవీలో కనిపిస్తున్నాడు రావే " అంటూ గట్టిగా కేక పెట్టాడు. కిచెన్‌లో పని చేసుకుంటున్న ఆవిడ పరుగు పరుగున హాల్లోకి వచ్చింది. అందమైన పార్క్‌లో అందమైన అమ్మాయి పక్కన కూర్చుని ప్రేమ గురించి లెక్చర్‌దంచుతున్న భర్తని చూసి మైండ్‌బ్లాంక్‌అయింది ఆమెకి. ఉక్రోషంతో కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. " ఓరి దేవుడోయ్ ! నా కొంప కొల్లేరయిపోయిందిరా నాయనోయ్" అని ఏడ్చుకుంటూ అలాగే కూలబడిపోయింది.
* * *
హుషారుగా సాయంత్రానికి ఇంటికి చేరుకున్నాడు శశాంక. తాళం కప్ప వెక్కిరిస్తూ కనిపించింది.పక్కింటాయన వచ్చి -
" మీ సుశీల కు బాగా లేదు బాబూ....కళ్ళు తిరిగి పడిపోయింది. ఇప్పుడే మా ఆవిడ హాస్పిటల్‌కు తీసుకు వెళ్ళింది " అని చెప్పి తాళం చెవులు ఇచ్చాడు. కంగారు పడ్డాడు శశాంక. హడావుడిగా ఆయన చెప్పిన హాస్పిటల్‌వైపు దూసుకుపోయాడు. హాస్పిటల్‌కి వెళ్ళేటప్పటికి బాబిగాడు పరుగెత్తుకుంటూ వచ్చి కాళ్ళను చుట్టేసాడు. " డాడీ ...మమ్మీ పడిపోయింది డాడీ " అంటూ వెక్కి వెక్కి ఏడ్వసాగాడు. డాక్టర్‌ను కలిసి తన భార్య పరిస్థితి గురించి ఆరా తీసాడు. " ఏమీ కంగారు పడాల్సిన పని లేదు.. కొంచెం బీపీ డౌన్‌అయి అలా అయింది " అని డాక్టర్‌చెప్పడంతో రిలీఫ్‌గా ఫీల్‌అయ్యాడు. ఆ తర్వాత భార్య దగ్గరకు వెళ్ళాడు. బెడ్‌మీద మగతగా నిద్రపోతోంది సుశీల.సెలైన్‌నెమ్మదిగా ఆమె ఒంటిలోకి వెళుతోంది. పక్కనే నిశ్శబ్దంగా కూర్చుని కళ్ళు మూసుకున్నాడు శశాంక.
* * *
హాస్పిటల్‌నుండి డిస్చార్జ్‌అయి ఇంటికొచ్చాక చాలా మూడీ గా మారిపోయింది సుశీల. భర్తతో ఎక్కువగా మాట్లాడటం లేదు. అప్పుడప్పుడు చాటుగా కన్నీళ్ళు కూడా పెడుతోంది.పరధ్యానంగా ఉంటోంది. ఇదేమీ అర్థం కాక బాబిగాడు బాగా డల్‌అయిపోయాడు.శశాంక కూడా ఇందుకు భిన్నంగా ఏమీ లేడు. ఇంతకు ముందు ఆఫీసులో ఎంత ఒత్తిడి ఉన్నా ఇంటికొచ్చాక భార్యను కొడుకును చూసుకుని రిలాక్స్ అయ్యేవాడు. అప్పుడు ఇల్లు ' హోం ' లా ఉండేది. కానీ ఇప్పుడు ఇల్లు , ఇటుక, సిమెంట్‌తో కట్టిన ' హౌస్' లా అనిపిస్తోంది.
రోజూ లాగే ఆఫీసు నుండి రాగానే సోఫాలో నిస్సత్తువగా వాలిపోయాడు శశాంక. కాఫీ కప్పు తీసుకొచ్చి ఎదురుగా పెట్టి నిశ్శబ్దంగా వెళ్ళిపోయింది సుశీల. నెమ్మదిగా సిప్‌చేయసాగాడు. ఇంతలో కాలింగ్‌బెల్‌మోగింది. తీసి చూస్తే ఎదురుగా పోలీసులు ! హతాశుడయ్యాడు శశాంక !
" శశాంక మీరేనా ? సారీ టు డిస్టర్బ్‌యు ' అంటూ లోనికి వచ్చారు వాళ్ళు.
" అవును నేనే ...చెప్పండి ఏమిటి విషయం ? " భయంగా అడిగాడు.
" సుప్రియ అనే అమ్మాయి హత్యకు గురయ్యింది. ఆమె సెల్‌ఫోన్‌కాల్‌డేటా పరిశీలిస్తున్నప్పుడు మీ నెంబర్ కనపడింది. మిమ్మల్ని ఇంటరాగేట్‌చెయ్యడం కోసం వచ్చాము " గంభీరంగా చెప్పాడు ఎస్సై.
" మైగాడ్! హత్యకు గురయ్యిందా ? " షాకయ్యాడు శశాంక.
" సరే.. మీరు ఆమెను ఈ మధ్య కలిసారా ? " అసహనంగా అడిగాడు ఎస్సై.
" నేను...నేను.. " అంటూ నీళ్ళు నములుతున్నాడు శశాంక. ఈ సంభాషణంతా వంట గదిలో నుండి వినసాగింది సుశీల ! ఆమె ఇటువంటిదేదో జరుగుతుందని ముందుగానే ఊహించింది. కానీ ప్రేమ మైకంలో పడి కొట్టుకుంటున్న భర్తకు ఏ విధంగానూ చెప్పలేక ఇన్నాళ్ళూ నిశ్శబ్దంగా ఉండిపోయింది. ఇప్పుడు కూడా ఉపేక్షిస్తే తన కాపురం కూలిపోతుందని అర్థమయ్యాక ఇక ఉండలేకపోయింది. వంటగదిలో నుండి బయటకు వచ్చి
" ఈ పోలీసులేంటండీ ...ఎందుకొచ్చారు ? " అంటూ నిలదీసింది. నిలువు గుడ్లేసాడు శశాంక.
" మీ భర్త కు తెలిసిన అమ్మాయి హత్యకు గురయ్యింది. అనుమానంతో ఇంటరాగేట్‌చెయ్యడానికి వచ్చాము " చెప్పాడు ఎస్సై.
" నా భర్త ఒక రచయిత. ఎంతో మంది పాఠకులు ఆయనతో మాట్లాడుతూ ఉంటారు .. అంత మాత్రం చేత అన్నిటికీ ఆయనే బాధ్యుడా ? " నిలదీసింది.
సంభ్రమానికి లోనయ్యాడు శశాంక. ఇన్నాళ్ళూ మాట్లాడకుండా మూడీగా ఉంటున్న భార్య ఒక్కసారిగా తన వైపు వకాల్తా తీసుకుని మాట్లాడే సరికి వెయ్యి ఏనుగుల బలం వచ్చింది అతనికి. టెంషన్‌తగ్గి బుర్ర ఆలోచించడం మొదలు పెట్టింది. ' సుప్రియతో తన స్నేహం అప్పుడప్పుడు కలవడం మాట్లాడటం వరకే కదా ! అంతకు మించి తను ఏ తప్పూ చెయ్యలేదు కదా ! ఇక భయపడటం దేనికి? ' అనుకుని కొంచె స్థిమిత పడ్డాడు.
" అలాగని మేము అన్నామా ? అనుమానం ఉన్న ప్రతీ వాళ్ళని ఇంటరాగేట్‌చెయ్యడం మా డ్యూటీ " దర్పంగా అన్నాడు ఎస్సై.
" సరే ఇంటరాగేట్‌చేసుకోండి " అంటూ భర్త వైపు చూసింది సుశీల. అప్పటికే తేరుకున్న శశాంక పోలీసులు అడిగిన ప్రశ్నలకు ధైర్యంగా సమాధానాలు చెప్పసాగాడు . పూర్తిగా సంతృప్తి చెందాక ' మీ వైపు నుండి నేరం ఏమీ కనపడటం లేదు. అయినా సరే అవసరం అయితే స్టేషన్‌కి పిలుస్తాము. రావాల్సి ఉంటుంది ' అని చెప్పి వెళ్ళిపోయారు. ' హమ్మయ్య ' అని ఊపిరి పీల్చుకున్నాడు శశాంక. అప్పటి దాకా బిక్క చచ్చిపోయిన బాబి గాడు " డాడీ .." అంటూ కౌగిలించుకున్నాడు.
వాడిని దగ్గరకు తీసుకుంటూ ' ఎండమావి లాంటి ప్రేమ కోసం కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసాను. చిక్కుల్లో ఇరుక్కున్నాను. నా భార్య నన్ను అర్థం చేసుకోవడం వల్ల ఇందులోంచి బయటపడ్డాను. బుద్ధొచ్చింది. మళ్ళీ ఇలాంటి వాటి జోలికి పోను ' అనుకుని పశ్చాత్తాప్పడ్డాడు . భార్య మళ్ళీ తీసుకొచ్చిన కాఫీ ని సిప్‌చేస్తూ ఆమె వైపు కృతజ్ఞతగా చూసాడు వర్ధమాన రచయిత శశాంక