మట్టిలో మాణిక్యం - డాక్టర్. షహనాజ్ బతుల్

Ruby in clay

తన ఛాంబర్లోకి వెళ్లి కూర్చున్నారు, ఆఫీస్ కి రాగానే, ఎడిటర్ గారు. ఎదురుగా టేబుల్ పైన పాఠకుల, ఉత్తరాలు, కనిపించాయి.

బహుశా సబ్ ఎడిటర్ గారు పెట్టి ఉంటారు. ఉత్తరాల వంక చూసి, కొన్ని కార్డులు చేతి లోనికి తీస్కొని, చదివారు.

ప్రచురణకు యోగ్యం కానివి, ప్రక్కన పడేసారు. తర్వాత ఒక కవరు తీసి, చింపి, లోపల ఉన్న, ఉత్తరము, బయటకు తీశారు. అది ఇలా ఉంది.

ఎడిటట్ గార్కి

ఒక వార /మాస పత్రిక లకు ఆయువు పట్టు బొమ్మలు. బొమ్మ లేని కథ ఉప్పులేని, కూర వలె ఉంటుంది. పాఠకులు ఫలానా సీరియల్/కథ/కవిత/వ్యాసం బాగుంది అని వ్రాస్తారు. విమర్శలు వ్రాస్తారు. కానీ ఎవ్వరూ బొమ్మలు వేసే ఆర్టిస్టుల గురించి వ్రాయరు.

చిత్రకారులకు ప్రోత్సాహం కావాలి. మంచి, మంచి చిత్రకారులను, ఎక్కడినుండో తీసుకొని, వచ్చి, ప్రోత్సహించి, మీ 'విజయం' వార పత్రికలో వేయించారు మీరు.

విజయం వార పత్రికలో ఏ చిత్రకారుడు, బొమ్మ వేసినా, క్రింద సంతకము లేకున్నా, బొమ్మను చూసి, ఎవరు వేసారో చెప్పగలను.

ఈ వారం విజయం వారపత్రికలో , క్రొత్త మలుపు' కథకు బొమ్మ, తప్పకుండ క్రొత్త చిత్రకారుడు, వేసి ఉండాలి.

చిత్రం చాలా బాగుంది. కానీ క్రింద సంతకము లేదు.

చిత్రకారునిగా మంచి భవిష్యత్తు, ఉంటుంది. అతను మొదటి సారయినా, చాలా బాగా వేసాడు. ఇకనుండి, ఈ చిత్ర కారుని చేత కూడా బొంమ్మలు వేయిస్తూ, ఉండమని, పేరు తెలుపమని కోరుకుంటున్నాను.

పాఠకుడు, గౌతమ్ (హైదరాబాద్ )

నిజముగా ఎంత బాగా వ్రాసాడు ఈ పాఠకుడు. పాఠకులు, సీరియల్/ కథ /కవిత/వ్యాసం బాగున్నాయని ఎడిటర్లకు ఉత్తరము వ్రాస్తూ ఉంటారు. కానీ ఎవ్వరూ చిత్రం గురుంచి గాని, చిత్రకారుని గురించి గాని వ్రాయరు. ఏ కళా కారునికైనా కావలసింది ప్రొత్సాహం.

క్రొత్త చిత్రకారుడు వేసిన బొమ్మలు, పాఠకులకు నచ్చితే ఇంకేం కావాలి. పాఠకులకు నచ్చటమే కదా కావలసింది.పాఠకులకు నచ్చితే, పత్రిక సర్క్యూలేషన్ పెరుగుతుంది.బొమ్మలు లేకపోతే, పత్రికలూ కూడా బాగుండవు.

ఇంతవరకు ఈ గౌతమ్ వ్రాసినటువంటి ఉత్తరం ఎవ్వరూ వ్రాయలేదు. ఎడిటర్ గారు కూర్చొని, ఆలోచిస్తున్నారు. వెంఠనే కాలింగ్ బెల్ నొక్కి, సబ్ ఎడిటర్ గార్ని పిలిపించారు.

'కూర్చో నీతో మాట్లాడాలి', అన్నారు ఆ పాఠకుడు వ్రాసిన ఉత్తరం ఇచ్చి చదువమన్నారు.

'నాకు ఒక ఆలోచన వచ్చింది' అన్నారు.

ఏమిటన్నట్లు చూసాడు, మధు, సబ్ ఎడిటర్.

'ఈ ఉత్తరానికి బహుమతి ఇద్దాం.'

' బహుమతా?'

'అవును. బహుమతి పొందిన ఉత్తరం అని ప్రింట్ చేయించి, ఈ ఉత్తరం, ఉత్తరాల పేజీలో పైన పబ్లిష్ చేద్దాం.'

'అలాగే సార్, మీ ఇష్టం.'

'దీనిని, వెంఠనే, పబ్లికేషన్కి పంపు' అని చెప్పి ఆ ఉత్తరం అందించారు.

* * *

ఒకసారి తాను ఒక పని మీద విశాఖ పట్నం వెళ్లారు. ఒకచోట కారు ఆపి, సందు లోపలకు వెళ్లారు. రోడ్డు వెడల్పు ఫర్వా లేదు. బాగానే ఉంది.

రోడ్డు మీద ఒకచోట ఒక చిత్రం తననాకర్షించింది.అతన్ని, గమనించ సాగారు. ఒక వ్యక్తి రోడ్డు మీద, రంగు సుద్ద ముక్కలు, బొగ్గు ముక్కలు తీసుకొని, వాటితో బొమ్మ వేస్తున్నాడు.

తైల సంస్కారము లేని జుట్టు, చిరిగిన బట్టలు అతని పేదరికాన్ని సూచిస్తున్నాయి. అతను చాలా ఏకాగ్రతాగా హనుమంతుని, బొమ్మ, వేస్తున్నాడు.

వార పత్రికలలో, మాస పత్రికలలో బొమ్మలు వేసే చిత్రకారు లందరూ పెయింటింగ్లో శిక్షణ పొందిన వాళ్ళు లేక క్రియేటివ్ ఆర్ట్ ఉన్న చదువుకున్నవాళ్ళు.

కానీ ఇతను చదువు లేని పేదవాడు. ఎంత బాగా వేస్తున్నాడు. అచ్చు ఫోటో తీసినట్లుంది. ఎవరు నేర్పారీ విద్య.

బొమ్మ పూర్తయ్యేవరకు అక్కడే నిల్చొని, గమనించారు. ఇంత బాగా బొమ్మ వేయగలగటం ఒక కళ. దేవుడిచ్చిన వరం. అనుకున్నారు.

చూస్తున్న వాళ్ళల్లో కొంతమంది. చిల్లర, నోట్లు వేస్తున్నారు. ఈ డబ్బులతో అతను కడుపు నింపుకుంటున్నాడేమో? ఇలా రోడ్డు మీద వేస్తే, నాలుగు కాసులు రాల్తాయి.

ఇతనికి చదువు నేర్పి, ఇతని చేత, పత్రికలో బొమ్మలు వేయిస్తే, బొగ్గులతో వేసే బదులు, బ్రష్ తో స్కెచ్ పెన్నులతో వేస్తాడు.ఇతనిని ప్రోత్సహిస్తే, తప్పేమిటి, అనుకున్నారు.

భుజము తట్టి, 'చాల బాగా బొమ్మ వేశావు. అని చెప్పి, 100 రూపాయల నోటు ఇచ్చారు.

'దండాలు బాబయ్య', అని నమస్కరించాడు. నోటు వంక ఆశ్చర్యముగా చూస్తున్నాడు.

'ఉంచుకో. నీ పేరేమిటి?' అడిగారు

'రంగన్న'

'రంగన్నా నువ్వు నాతో వస్తావా? ఉద్యోగమిస్తాను'.

'యాడికి బాబయ్య, ఉజ్జోగామా?'

'నాకు బొమ్మలు వేసి, పెట్టాలి. డబ్బులిస్తాను.'

'యాడ ఎయ్యాలి?'

'కారులో తీసుకు, వెళతాను.'

'కారులోనా?'

'ఫర్వా లేదు రా నేను, నిన్నేమీ చెయ్యను.'

'మరి నా పెళ్ళాం పిల్లలు?'

'వాళ్ళెక్కడ ఉన్నారు?'

'మా ఇంట్లో బాబయ్య'

'మీ ఇళ్ళక్కడ?'

'ఈడ్నే దగ్గరే.'

'మళ్ళి, తీసుకొచ్చి, దింపుతాను.'

తన సరంజామా అంతా సంచీ లో వేసుకున్నాడు. బొమ్మ వంక, అపురూపముగా, చూసుకున్నాడు. తను సృష్టించిన బొమ్మ, తన బిడ్డతో సమానం మరి. అత్త ఇంటికి వెళ్తున్న కూతురిలా బాధ పెడ్తున్నాడు.

ఎంతైనా కస్టపడి, వేసాడు. తాను తయారు చేసుకున్న, బొమ్మ. కానీ ఏమి లాభం. కార్లు స్కూటర్లు, సైకిల్స్ అన్ని వెళుతూ ఉంటాయి. అన్ని తొక్కు తాయి. మళ్ళి రంగులు పోతాయి.

అతన్ని విశాఖ పట్నము లో తానున్న గెస్ట్ హౌస్ కి తీసుకొని వెళ్లారు.

'రంగన్నా నువ్వు పుస్తకాలలో బొమ్మలు వేయాలి.'

'కాగితం మీదనా బాబయ్యా. నాకు చాత కాదు'

'నువ్వు ముందు చదువుకోవాలి. ఉత్తరం చదివేటంత చదువు వస్తే, చాలు. నీ మకాం హైదరాబాద్ కి మార్చాలి.'

'నాకు చాత కాదు. నన్నొగ్గేయండి బాబయ్యా.'

'లేదు. నీకు చేతనవుతుంది. నువ్వు చెయ్య గలవు. నీకు చదువు చెప్పటానికి మనిషిని ఏర్పాటు చేస్తాను.'

ఆ గెస్ట్ హౌస్ లో సురేష్, పనబ్బాయి వచ్చాడు. అతను పదవతరగతి వరకు తెలుగు మీడియం లో చదివాడు. అతనికి చెప్పారు, రంగన్నకి, చదువు, చెప్పమని.

రంగన్న విషయాలు అడిగి కనుక్కున్నారు. రంగన్న తండ్రి రాళ్లు కొట్టి, సన్నికలు చేసి, అమ్ముతుంటాడు.

తనకు చిత్రాలు వేసుకోవడములో ఆసక్తి ఉన్నది, కాబట్టి, ఇలా రోడ్డు మీద,

బొమ్మలేసుకుంటున్నాడు. వివాహమైంది. ఇద్దరు పిల్లలున్నారు. త్రాగుడు సిగరెట్లు అలవాటు లేదు.బొమ్మల మీద, మనుష్యులు వేసిన డబ్బులతో భార్యా బిడ్డలను పోషిస్తున్నాడు.

తర్వాత కొంతకాలానికి, సురేష్, రంగన్నకి చదవటం, వ్రాయటం వచ్చిందని, చెప్పిన తర్వాత అతని కుటుంబాన్ని హైదరాబాద్ కి పిలిపించారు.

హైదరాబాద్ లో పేదవాళ్ళు ఉండే ఏరియా లో ఉన్నాడు. ఒకరోజు అతన్ని ఆఫిస్ కి పిలిపించారు. కళాకారులు, డ్రాయింగ్ షీట్ పైన బొమ్మలు వేస్తున్నప్పుడు గమనించ మన్నారు.అతన్ని ఆఫీసులో కూర్చోపెట్టి, బొమ్మ వేయించారు. కథ చదివించారు. బాగానే చదివాడు.

'ఇప్పుడు ఈ కథకు తగ్గట్టు బొమ్మ వెయ్యి. ముందు ఒక పేపర్ మీద అవుట్ లైన్ వేసి ఇవ్వు. నేను బాగుందని చెప్తే అసలు బొమ్మ వేద్దువుగాని. అన్నారు

ఆ విధం గా వేసిన బొమ్మ అది. గౌతమ్ అనే పాఠకుడు, క్రొత్త చిత్రకారుడని, గుర్తించాడు. కార్యాలయములో పనిచేస్తున్న ఆర్టిస్టులు, చదువుకున్న వాళ్ళు, ట్రయినింగ్ అయిన వాళ్ళు. ఒక్కోసారి, బాగా వెయ్యక పోతే, మార్చమని, చెప్పి, మళ్ళీవేయించడం జరుగుతుంది.

కానీ ఇతను మొదటిసారి, పెన్ను బ్రష్ పట్టుకున్నా, ఎటువంటి శిక్షణ లేకున్నా, ఇప్పుడిప్పుడే చదువు నేర్చుకున్నా, మళ్ళీరిపీట్ చెయ్య వలసిన అవసరము లేకుండా, చాలా బాగా వేసాడు.

దానికి పారితోషికం వెయ్యి రూపాయలు ఇచ్చారు. చాలా సంతోషించాడు.

'ఇంకో బొమ్మ వెయ్యనా' అడిగాడు.

'నేను పిలుస్తానులే' అన్నారు. అతన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశముతో ఎక్కువే ఇచ్చారు.

మాట్లాడే విధానం, భాష మారాయి. బట్టలు కూడా నీటుగా తొడుగుతున్నాడు.రెండో బొమ్మ కూడా వేయించారు. కానీ అది పత్రికా ప్రెస్లో ఉంది. మొదటి బొమ్మకు ప్రతి స్పందనే ఈ గౌతమ్ ఉత్తరం.

ఈ రంగన్నను పెర్మనెంట్ ఉద్యోగస్తుడిగా వేసుకోవాలి. అప్పుడు ప్రతి నెలా జీవితము వస్తుంది. ఒక్కొక్కప్పుడు, అవసరమైతే ఎక్స్ట్రా పనిచేస్తే ఓ.టి వస్తుంది.

అదే విషయము తానే స్వయముగా, అతనికి చెప్పాలి. అతని వద్దకు వెళ్లి, స్వయముగా చెప్పాలనుకొని, కారు తీసుకొని బయలు దేరారు.

అతనిచ్చిన అడ్రస్ ప్రకారము ఒక సందు లోనికి వెళ్ళాలి. అతను రెండో బొమ్మ వేసాక ఇంకో బొమ్మ కూడా వేయించారు. ఆ తర్వాత పిలవలేదు. అతనూ కన్పించలేదు. ఈ శుభ వార్త విని, సంతోషిస్తాడు. గౌతమ్ వ్రాసిన ఉత్తరము కూడా చూపించాలి. చాలా సంతోషిస్తాడు.

దిగి అతనింటి సందు వరకు వచ్చారు. కానీ కారు లోపలకు వేళ్ళ లేదు. సందు చివర కారు ఆపారు.

ఎడిటర్ గారు కారుదిగి లోపలకు నడుస్తున్నారు. రంగన్న ఇల్లెక్కడ? అని అడిగితే, లోపలకు, వెళ్లామన్నారు. సందు లోపలకు తిరిగారు.

అక్కడ గుంపు కన్పించింది. మాస్క్ పెట్టుకొని, కొద్దీ కొద్దీ దూరంలో మనుష్యులు నిల్చున్నారు. శోకాలు విన్పిస్తున్నాయి. ఏమైంది?

ఎవరైనా చనిపోయారా? కరోనా వ్యాపించి ఉంది. ఎవరైనా కరోనాతో చనిపోయారా? కరోనా మూలంగా ఎవరైనా చనిపోయినా బంధవులు, రాలేక పోతున్నారు. శవం తాలూకు బంధువులు కూడా తక్కువ మంది ఉంటున్నారు.

కొంతమంది, కొడుకులు, కూతుళ్లు వేరే రాష్ట్రాల్లో ఉన్నా, విదేశాలలో ఉన్నా తల్లిదండ్రులు చనిపోయినా రాలేరు. ఈ కరోనా ఎప్పుడు పారిపోతుందో, అనుకుంటూ రంగన్న ఇల్లెక్కడ అని ఎవరినో అడిగారు.

వాళ్ళు చూపించింది, ఆ గుంపు వైపే.తన మనస్సు ఎదో కీడును శంకిస్తుంది. గబగబా అక్కడకు వెళ్లారు. మనుష్యులు దగ్గరగా నిలబడ లేరు కాబట్టి, శవాన్ని చూసారు. అది రంగన్న శవం.అతని భార్య, అతని శవం పైపడి రోదిస్తుంది. పిల్లలు ఏడుస్తున్నారు.

రంగన్న భార్య, ఎడిటర్ గార్ని చూసింది.

'మీరేనా బాబుగారు మా ఆయన చేత బొమ్మలు వేయించింది.' అడిగింది. ఔను అన్నట్లు తల ఊపారు.

'మనకిక అన్నీ మంచి రోజులే అని చెప్పాడయ్యా. బొమ్మ బాగా వేసాను. చూడు అందరూ మెచ్చుకుంటారు అన్నడయ్యా.' అంటూ ఏడుస్తుంది. ఆమె బాధ వర్ణనా తీతము. ఎవ్వరికి ఇటువంటి కష్టము రాకూడదు.

'ఎలా జరిగిందమ్మా' అడిగారు.

'ఏదో కరోనా అట బాబయ్య అది వస్తే లచ్చలు కావాలట. మా వద్ద లేవు.' అని చెప్తూ ఏడుస్తుంది.

ఎంతో గంభీరంగా ఉండే ఎడిటర్ గారి కళ్ళల్లో నీళ్లు. రంగన్న భార్యకు ధైర్యము చెప్పి , కొడుకుకి తండ్రి విద్య వస్తే, అతనికి, పత్రికలో బొమ్మలు వేసే, అవకాశము ఇస్తానని చెప్పారు. జేబులో నుండి ఐదు వేలు తీసి రంగన్న భార్యకి ఇచ్చి వెనుతిరిగారు.

మట్టిలో మాణిక్యానివి నీవు రంగన్న. మా పత్రికలో నీ చేత బొమ్మలు వేయించుకొనుటకు నాకు ప్రాప్తం లేదు. అనుకొని వెను తిరిగారు.

మరిన్ని కథలు

Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaalani kaagitam
కాలని కాగితం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు