ఒక గ్రామంలో శివయ్య అనే గృహస్థు ఉండేవాడు. శివయ్యకి ఇతరులకు సహాయపడే గుణం చిన్నప్పటినుండి ఉంది. సహజంగా దానగుణం కల శివయ్య ఎవరు సహాయంకోసం అర్ధించినా ఎప్పుడూ లేదనేవాడు కాదు. అతని సహాయగుణానికి తగినట్లే అతని వద్ద వారసత్వంగా వచ్చిన ఆస్తిపాస్తులు ఉండేవి. అతని వద్ద సహాయం పొందనివారు ఆ ఊళ్ళో ఎవరూ లేరు. శివయ్య దానగుణం చూసిన కొంతమంది తమకి అవసరం లేకపోయినా తమ జల్సాలకోసం అతని సహాయం కోరేవారు. రామయ్య శివయ్యకి మంచి మిత్రుడు. రామయ్య ఓ రోజు శివయ్యని ఈ విషయమై హెచ్చరించాడు.
"శివయ్యా! నువ్వు ఎవరికిపడితే వారికి దానం చెయ్యడం మానుకో! నీ వద్దకు వచ్చేవారందరూ వాస్తవంగా అవసరం ఉండి రావడంలేదు. నీ వద్ద తీసుకున్న ధనంతో జల్సాలు కూడా చేసుకునేవారున్నారు. అపాత్రందానం చెయ్యటం కూడా ఒకవిధంగా తప్పే! ఎవరికైనా సహాయం చేసేముందు వారి అవసరాలు సరైనవా, కాదా చూసి చెయ్యడం మంచిది." అని హితవు పలికాడు.
రామయ్య హితవు నచ్చని శివయ్య, "ఎవరైనా ఊరికినే సహాయం అడగరు కదా! అవసరం లేకపోతే ఎందుకు అడగడానికి వస్తారు?" అన్నాడు.
శివయ్యకి ఇలా చెప్పి ప్రయోజనం లేదని గ్రహించిన రామయ్య, సరైన సమయం చూసి అపాత్రదానంపై అతనికి జ్ఙానోదయం కలిగించాలని భావించాడు.
సరిగ్గా ఆ సమయంలోనే, రామయ్య అక్కడ ఉండగానే రంగడు అనే రైతు వచ్చాడు. వస్తూనే శివయ్యకి నమస్కరించి, "శివయ్యా! నా పంటపొలంలో పైరుకి ఎరువులు కొనడానికి నా వద్ద డబ్బులు లేవు. ఎరువులు సమయానికి వెయ్యకపోతే ఇన్నాళ్ళూ పడిన శ్రమ వృధా అవుతుంది. అలాగే కాయగూరల మడిలో మందులు చల్లాలి. నాకో రెండువందల వరహాలు అప్పు ఇస్తే నీ మేలు ఈ జన్మలో మరిచిపోను." అన్నాడు రంగడు.
రంగడి విషయం రామయ్యకి బాగా తెలుసు. డబ్బులు ఇవ్వవద్దని శివయ్యకి కళ్ళతో వారించినా అదేమీ పట్టించుకోకుండా ఇంట్లోకి వెళ్ళి రెండువందల వరహాలు తెచ్చి రంగడికిచ్చాడు.
ఆ ధనం పుచ్చుకొని రంగడు వంగివంగి దండాలు పెట్టి అక్కణ్ణుంచి వెళ్ళాడు.
రంగడు వెళ్ళిపోయాక, "రంగడికి ఎందుకు డబ్బులు ఇచ్చావు? వాడి సంగతి నీకు తెలియదా? నువ్వు ఇచ్చిన డబ్బులతో తాగి తందనాలాడుతాడు, జూదం ఆడతాడు. అందుకోసమే నీకు డబ్బులు అడిగాడు. వాడి భార్య చిన్నచిన్న పనులు చేసుకొని ఇల్లు గడుపుతోంది పాపం! ఆ డబ్బులేవో ఆవిడికిచ్చినా ఏమైనా ప్రయోజనం ఉండును. నువ్వు ఇచ్చిన డబ్బులెలాగూ తిరిగి రావు. నీ అపాత్ర దానం వల్ల నష్టమే తప్ప లాభం ఏమీ లేదు." అన్నాడు రామయ్య.
"ఏమో! నువ్వు అలా అనుకుంటున్నావు కాని, నిజంగానే ఎరువులు, క్రిమి సంహారక మందులు కొనడానికి డబ్బులు అడిగాడని నాకు తోస్తోంది. రంగడు ఎందుకు అబద్ధం ఆడతాడు?" అన్నాడు శివయ్య.
"పోనీ అలాగే అనుకుందాం. అయితే నువ్వు ఇచ్చిన డబ్బులు ఎంతవరకు రంగడు సద్వినియోగం చేస్తాడో చూద్దాం. ఒకవేళ వాడు నేననుకున్నట్లు చేస్తే మాత్రం నువ్వు ఇలా ఎవరికి పడితే వారికి ధన సహాయం చేయనని మాటివ్వాలి." అన్నాడు రామయ్య.
అందుకు ఒప్పుకున్నాడు శివయ్య. ఇద్దరూ రంగడిని అనుసరించి వెళ్ళారు. అయితే శివయ్య అనుకున్నట్లు రంగడు ఎరువులకొట్టువైపు వెళ్ళకుండా కల్లు అమ్మే అంగడికి వెళ్ళి, అక్కణ్ణుంచి ఊరికి దూరంగా ఓ పాడుపడిన ఇంట్లో జూదం ఆడుతున్న తన స్నేహితుల వద్దకు వెళ్ళాడు. రంగడిని అనుసరించి వెళ్ళిన శివయ్య, రామయ్య కొద్ది దూరంలో చాటుగా నిలబడ్దారు.
రంగడిని చూస్తూనే అక్కడ వాడి స్నేహితులలో ఒకడు, "ఏమిట్రా! డబ్బులు తెచ్చావా, లేదా? ఆటలో అప్పులేదు సుమా!" అన్నాడు.
"డబ్బులు తెచ్చానురా! ఇవిగో చూడు!" అని తన వద్ద ఉన్న ధనం చూపించాడు రంగడు.
"అమ్మో అంత డబ్బే?! ఎక్కడ దొరికాయిరా అంత డబ్బులు నీకు, కొంపతీసి దొంగతనం చేసావా ఏమిటి?" అని అడిగాడు ఇంకో స్నేహితుడు వాడివద్ద ఉన్న డబ్బులు చూసి ఆశ్చర్యపోతూ.
"దొంగతనం చెయ్యవలసిన ఖర్మ నాకేం పట్టలేదు. శివయ్యలాంటి వెర్రివాడు ఉన్నంతకాలం మనలాంటి వాళ్ళకి డబ్బులకి కొదవ ఏమిటి? పొలంలో పైరు కోసం ఎరువులు, మందులు కొనాలంటే రెండువందల వరహాలు ఇచ్చాడు. అయినా శివయ్యకి డబ్బులకి కొదవేమిటి? తరాల తరబడి తిని కూర్చున్నా తరగని ఆస్తి ఉంది అతనికి. అప్పు పేరు చెప్పి డబ్బులు తీసుకున్నా ఎలాగూ తీర్చేది లేదు కదా! నాకో రెండువందల వరహాలు ఇచ్చినంతమాత్రం అతని ఆస్తి ఏమైనా అరిగిపోతుందా, తరిగిపోతుందా?" అన్నాడు రంగడు.
వాడి మాటలకి విరగబడి నవ్వారు అక్కడ ఉన్న వాడి నలుగురు స్నేహితులూను.
"అవునురా! నా వద్ద ఓ సారి కల్లు తాగడానికి డబ్బులు లేకపోతే, నా భార్యకి ఒంట్లో బాగులేదని, వైద్యానికి డబ్బులు లేవని సాకు చెప్పి శివయ్యనడిగి వంద వరహాలు పట్టుకొచ్చాను. అయినా శివయ్య ఏమైనా తన ఆస్తులు పైకి వెళుతున్నప్పుడు పట్టుకుపోతాడా?" పెద్దగా నవ్వుతూ అన్నాడో స్నేహితుడు.
"అవును! నేను నా కొడుకుని పక్క ఊరిలోని పాఠశాలలో చేర్చాలని ఓ సారి, మా అమ్మకి వైద్యంకోసమని ఓ సారి అతని వద్ద డబ్బులు తీసుకున్నాను. అలాంటి వెర్రివాళ్ళు ఉన్నంతకాలమూ మనకి డబ్బుల సమస్య లేదు." అన్నాడు మూడోవాడు.
"నేనైతే ఎన్నిసార్లు ఆ వెంగళయ్య వద్దనుండి ఎన్ని సాకులు చెప్పి అప్పు తీసుకున్నానో లెక్కే లేదు. అప్పు తీరుస్తామా ఏమిటి? అలా డబ్బులు దొరికినంత కాలం మనకి జూదం ఆడటానికి సమస్యేలేదు." అన్నాడు నాలుగోవాడు.
చాటుగా నిలబడి వాళ్ళందరి మాటలు విన్న శివయ్యకి విపరీతమైన ఆవేశం వచ్చింది. వాళ్ళందరూ తన వద్ద రకరకాల సాకులు చెప్పి ధన సహాయం పొందిన వైనం గుర్తుకు వచ్చింది. అప్పు అని చెప్పి ఇవ్వడమే కాని, వాళ్ళెవరూ తీర్చిన పాపాన పోలేదు. తను కూడా చేసిన సహాయం వెంటనే మర్చిపోయేవాడే కాని ఎవర్నీ ఎన్నడూ తిరిగి అడిగి ఎరగడు. అయితే తను చేసిన ధన సహాయం ఇలా దుర్వినియోగం అవుతున్నదని ఏమాత్రం ఊహించలేదు శివయ్య. ఆవేశంగా వాళ్ళవైపు వెళ్ళబోయిన శివయ్యని ఆపాడు రామయ్య.
"ఇప్పుడు నువ్వు వాళ్ళని నిందించి లాభం లేదు. చూసావా, నీ వద్దనుండి సహాయం పొంది ఆ ధనం దుర్వినియోగం చేసికూడా నీ మీద ఎలాంటి అభిప్రాయం ఏర్పరచుకున్నారో? అలాగని ఎవరికీ ధన సహాయం చేయద్దని నీకు చెప్పను. ఎవరికైనా ధన సహాయం చేసే ముందు నువ్వు సరైన వాళ్ళకి సహాయం చేస్తున్నావో లేదో ఓ సారి ఆలోచించుకో! ఎవరు నీ సహాయం కోరివచ్చినా ముందు వెనుకలు ఆలోచించి మాత్రమే ధన సహాయం చెయ్యు. ఇకనైనా అపాత్ర దానం మానుకో!" అని సలహా ఇచ్చాడు రామయ్య.
ఆ తర్వాత నుండి శివయ్య ధన సహాయం కోరి తనవద్దకు వచ్చినవాళ్ళకి అన్నీ బాగా విచారించే సహాయం చేసేవాడు, కాని మరెన్నడూ అపాత్ర దానం చేయలేదు. రంగడిలాంటివాళ్ళు తమకి ధన సహాయం చేయలేదని పైకి దూషించినా ఆ విషయం పట్టించుకోలేదు ఎన్నడూ. తనకి ఈ విషయంలో జ్ఙానోదయం కలిగించిన రామయ్యకి తన కృతజ్ఙతలు తెలియజేసాడు శివయ్య.