సీతాపురం అనే ఊళ్ళో ఉన్న పాపయ్య ధనవంతుడైనా పిసినారివాడుగా పేరుపొందాడు. అతనికి వారసత్వంగా వచ్చిన పాతికెకరాల పొలం, ఊళ్ళో కిరణా కొట్టు ఉన్నాయి. వ్యవసాయం, వ్యాపారం రెండూ కూడా బాగానే సాగుతున్నాయి. అయితే ఎవరు చేబదులుగానీ, అప్పుగానీ అడగడానికి పాపయ్య వద్దకు వచ్చినా ఏవో మంచి మాటలు చెప్పి పంపిస్తూండేవాడే కానీ ఎవరికీ ఎప్పుడూ అప్పు ఇచ్చిన పాపాన పోలేదు. అందుకే పాపయ్యని పిసినారికింద లెఖ్ఖ కట్టారు ఆ ఊరి జనం. అంతే కాకుండా ఊళ్ళో జరిగే ఏ కార్యక్రమానికైనా చందాలు కూడా ఇచ్చేవాడు కాదు పాపయ్య. పాపయ్య పిసినారితనం ఎరిగిన ఆ ఊరివాళ్ళు అతన్ని చందాలడగడం మానుకున్నారు.
ఆ ఊళ్ళో వైద్య సదుపాయం లేదు. వైద్యం కోసం ఆ ఊరి ప్రజలు పట్టణానికి వెళ్ళవలసి వచ్చేది. అయితే పట్టణం దూరంగా ఉండటంతో ఆ ఊరివాళ్ళకి చాలా ఇబ్బంది కలుగుతూ ఉండేది. ఒకొక్కసారి రోగుల ప్రాణాలు పట్టణం వెళ్ళే దారిలోనే గాలిలో కలిసిపోతుండేవి.
ఊరి పెద్దలంతా సమావేశమై ఊళ్ళో ఒక వైద్యశాల స్థాపించాలని నిశ్చయించుకున్నారు. అందుకోసం స్థలం, నిధుల సమీకరణ కోసం చర్చలు జరుగుతున్నాయి వారిమధ్య.
"మన ఊరిలో వైద్య సదుపాయాలు కలుగజేయాలంటే కనీసం లక్ష వరహాలైనా కావాలి. వైద్యశాలకోసం స్థలం సమీకరించాలి. అంతేకాక, వైద్యశాల నిర్వాహణం కోసం కూడా నిధులు కావాలి. మన ఊరివాళ్ళం అందరం వైద్యశాలకోసం మన వంతు సహాయం చేయాలి. ఈ మహత్కార్యంలో అందరూ పాలుపంచుకోవాలి." అని చెప్పాడు గ్రామపెద్దైన శివయ్య.
అందరూ అందుకు అంగీకరించారు. అక్కడ సమావేశమైన పెద్దల్లో ఒకడైన వీరయ్య, "మన ఊళ్ళో వైద్యశాల నిర్మించడానికి ఊరివాళ్ళందరూ తమ సహకారం అందిస్తారనడంలో ఏ మాత్రం సందేహం లేదు. అయితే పాపయ్యవద్ద నుండి మనం ఏమాత్రం సహాయం ఆశించలేము. అతను ఎప్పుడూ ఏ కార్యక్రమానికీ కూడా ఒక్క వరహా కూడా ఇచ్చిన పాపాన పోలేదు. అతను ఇవ్వలేదన్న సాకు చూపి మిగతావారు ఇవ్వకపోతే మాత్రం మన లక్ష్యసాధన కష్టతరమవుతుంది." అన్నాడు.
"పాపయ్య పిసినారితనం మన ఊరివాళ్ళందరికీ బాగా తెలుసు. అతన్ని ఉదాహరణగా ఎవ్వరూ తీసుకోరని ఆశిద్దాం. పాపయ్యని విరాళం అడటానికి వెళ్ళొద్దు." అన్నాడు మరో ఊరి పెద్ద రాజయ్య.
ఆ మరుసటి రోజునుండే వైద్యశాలకోసం విరాళాలు సేకరించే పని ప్రారంభమైంది. ఇంటింటికీ వెళ్ళి విరాళాలు సేకరిస్తున్నా పాపయ్య ఇంటి గడప మాత్రం తొక్కలేదెవరూ.
అయితే ఊళ్ళో వైద్యశాల నిర్మాణం కోసం చర్చ జరగడం, ఆ చర్చలో తన ప్రస్తావన రావడం పాపయ్యకి తెలిసింది. అతను ఆ సాయంకాలం గ్రామ పెద్దలు సమావేశమైనప్పుడు వాళ్ళ వద్దకు వెళ్ళాడు. పాపయ్య తమ వద్దకు రావడంతో విస్మయం చెందారు ఊరి పెద్దలందరూ. ఎప్పుడూ ధనార్జనలో మునిగితేలే పాపయ్య తమని కలుసుకోవడానికి రావడం అబ్బురమనిపించింది వారికి. అతనసలు ఎందుకు అక్కడికి వచ్చాడో వాళ్ళెవరికీ బోధపడలేదు.
పాపయ్య వాళ్ళని చూసి, "వైద్యశాలకోసం విరాళాలు సేకరించడానికి అందరి ఇంటికి వెళ్ళి, నా వద్దకు రాలేదేమీ?" అని అడిగాడు.
అతని ప్రశ్నవిని అందరూ ఆశ్చర్యపోయారు. అతని వద్దకు వెళ్ళినా విరాళం ఇవ్వడానికి మొండి చెయ్యచూపిస్తాడని తెలిసిన ఆ పెద్దలు ఆ విషయం ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నారు.
"నేను వైద్యశాల కోసం విరాళం ఇవ్వదలిచాను." అని పాపయ్య అనేసరికి ఊరి పెద్దలందరి ముఖాల్లోనూ ఆశ్చర్యం నిండిపోయింది.
"ఏమిటలా ఆశ్చర్యపోతున్నారు? నేను విరాళం ఇవ్వడానికే వచ్చాను." అన్నాడు తిరిగి.
"ఏమిటి పాపయ్యా! నువ్వు విరాళం ఇస్తావా?" విస్మయంగా అడిగాడు శివయ్య.
"ఏం నేను ఇవ్వకూడదా ఏమిటి? ఊళ్ళో అందరూ విరాళం ఇవ్వగా లేనిది నేను ఎందుకు ఇవ్వననుకున్నారు? గ్రామంలో జరిగే ఇతర కార్యక్రమాలకి చందా ఇవ్వడానికి నిరాకరించానుగాని, మనకోసం స్థాపించే వైద్యశాలకి నేను ఎందుకు విరాళం ఇవ్వను? నిరుపయోగమైన చిన్న చిన్న కార్యక్రమాలకి చందా ఇవ్వనందుకు నేను పిసినారిగా పేరుపొందాను. మరి వైద్యశాల నిర్మించడం మహత్కార్యం కదా! వైద్యశాల నిర్మాణంకోసం ఊరి కూడలిలో ఉన్న నా ఖాలీ స్థలం విరాళంగా ఇవ్వాలని నిర్ణయించాను. అంతేకాక, పాతికవేల వరహాలు కూడా ఇవ్వనిశ్చయించాను." అన్నాడు పాపయ్య ఎవ్వరూ ఊహించని విధంగా.
పాపయ్య అంతరార్థం గ్రహించారు ఊరిపెద్దలు. అనవసర కార్యక్రమాలకి డబ్బులు ఇవ్వనందున అతన్ని పిసినారిగా ముద్ర వేసారుగాని, ఇలా వైద్యశాలకోసం భారీ ఎత్తున విరాళం పాపయ్య ఇస్తాడని అనుకోలేదు.
పాపయ్య విరాళంతోనూ, అందరి సహకారంతోను అనతి కాలంలోనే ఆ ఊళ్ళో వైద్యశాల వెలిసింది. క్రమంగా పాపయ్యకున్న పిసినారి అన్న పేరు మాయమైంది. అతని దాతృత్వాన్ని అందరూ ఎరిగి పాపయ్యని మహాదాత అనసాగారు.
-డి వి డి ప్రసాద్