అత్తమ్మ - గొర్తి.వాణిశ్రీనివాస్

Aunt

"అమ్మా!నువ్వీ మధ్యన చాలా మారిపోయావ్. ఒకప్పటి నీ మాట తీరు కూడా మారిపోయింది, సంయమనాన్ని కోల్పోతున్నావ్ , నీకేమైంది"తల్లితో అంది విద్యాధరి ఆఫీసుకు తయారవుతూ .

"నేనేంచేశాననే? ఊరికే నా మీద ధ్వజమెత్తుతున్నావ్? నేను నోరు తెరిస్తేనే తప్పంటున్నావ్ అసలు నోరే మెదపొద్దంటే చెప్పు. మూగనోము పడతాను" అంది అరుంధతమ్మ కూతురి ఫిర్యాదును తిప్పి కొడుతూ. అరుంధతమ్మ భర్త కామేశం స్వర్గస్థులై ఐదేళ్లయ్యింది. కామేశం ప్రైవేట్ స్కూల్ మాస్టారుగా పనిచేశారు. జీవితమంతా కష్టించి సంపాదించి కూడబెట్టిన డబ్బుతో కట్టించిన ఇంటిని అమ్మేసి ఒక్కగానొక్క కూతురు విద్యాధరికి మంచి సంబంధం చూసి పెళ్లి చేసింది అరుంధతమ్మ. అల్లుడు మంచివాడు.అమ్మాయిని బాగా చూసుకుంటే చాలని, వాళ్ళ పెళ్లయ్యాక ఉన్న ఊళ్ళోనే ఒక అద్దె ఇల్లు తీసుకుని వుందామనుకుంది అరుంధతమ్మ. అందుకు అల్లుడూ,వియ్యపురాలూ ఒప్పుకోలేదు. కూతురైతే సరేసరి.పట్టు పట్టి మరీ తన తల్లిని ఆమెతోపాటే బెంగుళూరు తీసుకు వెళ్ళింది . అప్పటినుంచీ కూతురు విద్యాధరి,అల్లుడు అభిరామ్,అతని తల్లి పార్వతమ్మ తోపాటే ఉంటోంది అరుంధతమ్మ.

"అమ్మా! పొద్దున మీ అల్లుడిని అలా కడిగేశావేంటి? నీకు మందులు సాయంత్రం తెస్తానని ముందే చెప్పారుగా. 'లోకువై పోయాను, నేనంటే మీకసలు విలువలేదు' అదీ ఇదీ అంటూ చీటికీ మాటికీ ఆయన్ని పట్టుకుని అన్ని మాటలనడం ఏం బాలేదమ్మా," అంది విద్యాధరి "ఒక్కగానొక్క కూతురివి, ఉన్న డబ్బంతా మీ చేతుల్లో పెట్టి మీ పంచన చేరినందుకు నాకీ శాస్తి జరగాల్సిందే. నిన్ననగా మందులు తెచ్చిపెట్టమంటే ఉట్టి చేతులు ఊపుకుంటూ వచ్చాడు. ఇదేంటి బాబూ మందులు తేలీదా అన్నాను అంతేగా అంతకంటే మీ ఆయన్ని నేనేమన్నానే? మాట పడ్డ అల్లుడు బానే వున్నాడు, నీకు పొడుచుకొస్తోందేమే ఇంత కోపం? ఈ వయసులో నీ చేత బుద్ధి చెప్పించుకోవాల్సొచ్చింది . ముక్కు చీత్తూ రాగాలు తీసింది అరుంధతమ్మ.

"ఎందుకమ్మా అంత బాధ పడతావు.నిన్ను నేను బాగానే చూసుకుంటున్నాను కదా! ఆయన వాళ్ళమ్మకు కూడా ఒక్కడే కొడుకు కాబట్టి ఆవిడ బాధ్యతను ఆయనే వహించాలి. నీకూ నేనొక్కదాన్నే కూతుర్ని కాబట్టి నీ బాధ్యత నేను తీసుకోవాల్సి ఉందని పెళ్లికి ముందు నేను పెట్టిన కండిషన్ కి ఒప్పుకుని,ఇప్పటికీ ఆయన కట్టుబడే వున్నారు కదా." అంది విద్యాధరి. "మీ ఆయన ఏం చెప్పి నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడో గుర్తులేదా? 'మిమ్మల్ని మా అమ్మతో సమానంగా చూసుకుంటాను, బతికున్నంత కాలం ఏ లోటూ రాకుండా చూసుకుంటాను 'అంటేనే కదా ఇల్లు అమ్మగా వచ్చిన దాంట్లో కొంత నీ పెళ్లికి ఖర్చుచేసి మిగిలినదంతా మీ చేతుల్లో పెట్టి , చిల్లి గవ్వలేకుండా చేసుకుని గుడ్డిగవ్వలా మీ ముందు నుంచున్నాను. నిష్ఠూరంగా అంది అరుంధతమ్మ. "ఊరుకోమ్మా, ఆయనకి నీ మాటలు వినపడితే బాధ పడతారు. అయినా నువ్వు ఇచ్చిన దాని కంటే నాలుగింతలు మా అత్తగారు కూడా ఇచ్చారు. ఈ డూప్లెక్స్ హౌస్, కారు ఈ హోదా అన్నీ ఆవిడ ఇచ్చిన డబ్బుతో కొన్నవే కదా. ఆవిడ నీకుమల్లే పోట్లాడుతున్నారా? ఆయన ఆ మాటే అంటే మనం తల దించుకోవాలి. ఇక గమ్మునుండు. "తల్లితో గుసగుసగా అంది విద్యాధరి. "అవతల వాళ్ళు ఎలా వున్నా అధికారం దక్కించుకోవటానికి నోటితో చలాయించాలని నువ్వేగా నాతో చెప్పావ్. నోరెత్తిన మీ అత్త గారి నోరు మూయించి ఊరు పంపేశావు . ఆవిడ అక్కడే కాలక్షేపం చేసేంతలా ఆవిడ బుర్ర తిన్నావు నిన్ను చూసి అల్లుడు కూడా నా మీద పెత్తనం చలాయించి నన్ను కూడా వచ్చిన చోటికే సాగనంపకుండా ముందర కాళ్ళకి బందం వేస్తున్నానే. అప్పుడే ఏం చూశావ్. మీ ఆయన్ని చెడుగుడు ఆడించెయ్యనూ. నా ముందు నోరెత్తనిస్తానా.?" అంది అరుంధతమ్మ చిటికలేస్తూ.

"అమ్మా!నువ్వేం అనుకోనంటే ఒక మాట అంటాను. నీ కంటే మా అత్తగారే చాలా మంచిది. నన్నెప్పుడూ ఒక్క మాట కూడా అని ఎరగదు. నేనే అప్పుడప్పుడూ నోరు జారి ఆవిడని నొప్పించాను. ఆవిడ మంచితనం ఏంటో నీ ప్రవర్తన చూస్తుంటే నాకిప్పుడు తెలుస్తోంది. రేపే ఊరికి వెళ్లి ఆవిడని తీసుకొస్తాను. నీకేం కావాలన్నా నన్నడుగు. నేనే తీసుకొస్తాను.ఆయన వింటే బాగుండదు నీ నోటికి ఒక దండం. మా ఆయన ఎంత ఫీల్ అవుతున్నారో ఏంటో పాపం.నాకు గిల్టీ గా ఉంది. అంటూ బండి స్టార్ట్ చేసి ఆఫీసుకు వెళ్ళిపోయింది విద్యాధరి. కూతురు అటు వెళ్ళగానే నీరసంగా సోఫాలో జారగిలబడింది అరుంధతమ్మ. ఎన్నో ఆలోచనలు మెదడును తొలుస్తుంటే కళ్ళు మూసుకుంది.

"అత్తమ్మా !బి.పి మాత్ర వేసుకుని ఈ నీళ్లు తాగండి" అంటూ మంచినీళ్లు గ్లాసు తీసుకొచ్చి అత్తగారి చేతికి అందించాడు అల్లుడు అభిరామ్. "అదేంటి బాబూ నువ్వు నాకు మంచినీళ్లు తేవడం ఏవిటి, ఇప్పటికే నేను నీకెంతో రుణపడి వున్నాను"అంది లేచి నుంచుంటా. "కూర్చోండి అత్తమ్మా! ఏం ?నేను మీకు సేవ చెయ్యకూడదా? నేను కూడా మీకు చాలా రుణపడి ఉంటాను ఎప్పటికీ" అన్నాడు అభిరామ్ అత్తగారి చేతికి టాబ్లెట్ ఇస్తూ.

"అదేంటి బాబూ!"అంది ఆశ్చర్యంగా చూస్తూ. "మీరూ విద్యాధరీ మాట్లాడుకున్న మాటలు అన్నీ విన్నాను . మీ తెలివితేటలను,సమయస్ఫూర్తిని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను అత్తమ్మా. మీ కూతురి ముందు నన్ను సాధించి ఆమె దృష్టిలో మమ్మల్ని ఉన్నతంగా పెంచటానికి మీరు పడుతున్న తాపత్రయం చూస్తున్నాను. మిమ్మల్ని మీరే తక్కువగా చేసుకుంటూ , విద్యాధరి మా అమ్మ మంచి తనాన్ని గుర్తించేలా చేస్తున్నారని నాకు అర్ధమైంది. ప్రస్తుత కాలాన్ని బట్టి , తల్లి దండ్రులను చూడ్డంలో ఆడా మగా ఇద్దరికీ సమాన బాధ్యత ఉంది. పిల్లల దగ్గర శేష జీవితం గడపడానికి ఒకేసారి వచ్చిన ఇద్దరు వియ్యపురాళ్లనూ సమన్వయ పరుస్తూ, ఇద్దరూ ఉద్యోగాలు చేసుకోవడం నేటి యువత ముందున్న పెద్ద సవాలు. మీ గురించీ తను,

మా అమ్మ గురించి నేనూ వాదులాడుకోకుండా మా ఇద్దరికీ అర్ధమయ్యే విధంగా మీరాడుతున్న నాటకం గమనిస్తూనే వున్నాను. ఇతరులను దారిలోకి తేవాలంటే, ముందుగా మనం వాళ్ళ దారిలోకి వెళితే గానీ వాళ్ళు మన దారికి రారని మీ ప్రవర్తన ద్వారా తెలియచెప్పారు. మీరు తెలివైన వారు. మా అమ్మను పంపేసిన విద్యాధరి ఇప్పుడు తప్పు తెలుసుకుంది. తిరిగి తీసుకురావాలి అనే ఆలోచనకు ప్రేరణ కలిగించారు. మీలాంటి అత్తమ్మలున్న ఇళ్లలో సమస్యలు రావు. వచ్చినా త్వరగా సమసిపోవడం కష్టమైన విషయమేమీ కాదు." అన్నాడు అభిరామ్

"నువ్వూ, మీ అమ్మగారూ మంచి వాళ్ళు. నా కూతురు నాకు ఏలోటూ రాకుండా చూడాలనే తాపత్రయంలో మీ అమ్మ గారి విషయంలో తొందర పడింది. నువ్వు కూడా మంచి మనసుతో అర్ధం చేసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మనందరం ఒకటిగా కలిసుండాలంటే అది నా కూతురిగా కంటే , అది అత్తమ్మ కూతురిగా ఉంటేనే అందం ఆనందం" అంది అరుంధతమ్మ . "అవును ,విద్యాధరి మా అమ్మ కూతురు నేను ఈ అత్తమ్మ కొడుకుని అయితే ఇక మన మధ్య ఏ సమస్యా రాదు కదా అత్తమ్మా "అన్నాడు అభిరామ్ అత్తమ్మకి సంతోషంగా నమస్కరిస్తూ.

మరిన్ని కథలు

Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaalani kaagitam
కాలని కాగితం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Gnana tatwam
జ్ఞానతత్వం
- - బోగా పురుషోత్తం, తుంబూరు.