*అనుభవం* - భాగవతుల భారతి

* Experience *

అపార్ట్మెంట్ సంస్కృతి వచ్చాక, సమూహంలో ఉన్నామనే సంబరమే గానీ, ఎవరూఎవరికీ ఏమీకారు.పక్కవాడి పీకకోసినా, వాసన గుప్పుమనే వరకూ బయటికి తెలీదు. నేనూ ఆ సంస్కృతిలో భాగమేగా! అందుకే ఈజనారణ్యంలో ఒంటరిగా గుండెలు పీచుపీచు మంటూ బ్రతికేస్తున్నా.

ఒంటరి ఆడదాన్ని,ఉద్యోగరీత్యా,పరిస్థితుల దృష్ట్యా, *అసాధారణ్ఎన్ క్లేవ్* లో నివాసం. అక్కడికీ పని ఎంత తొందరగా ముగించుకుని వద్దామన్నా, రాత్రి తొమ్మిది. వస్తూనే ఇంట్లో ఎన్ని లైట్లున్నాయో, అన్నీ వేసేసి, ఇల్లూ, ఇంటి చుట్టూ పరిసరాలూ ఓ సారి పరికించి, మళ్ళీ తలుపులు వేసి, కొన్ని లైట్లు తీసి, పనిలో నిమగ్నమైపోతా. అలాఎందుకంటే, ఎన్నో డిటెక్టివ్, కథలూ, సినిమాలు చూసి, నేర్చుకున్న అరకొర ఙ్ఞానం. కర్టెన్ల వెనకాల, బాల్కనీలలో,మంచాలక్రింద కప్ బోర్డులలో ఎవరైనా ,దాక్కుని, తీరా మనం తలుపువేసాక, బయటి కొచ్చి చాకుతో బెదిరించి, "డబ్బెక్కడ పెట్టావ్?" అని కీచు గొంతు తో ప్రశ్నించీ~అమ్మో నాకసలే భయ్యం. ఇదివరకైతే పులిపిరికాయ తో, ఇంతింత మీసాలతో వచ్చేవారు,దొంగలు .

ఇప్పుడు మంకీకాప్లూ గ్లౌజులూ, గుర్తుకూడా పట్టలేమ్. వాళ్ళకి తెలీదుగా నా లాంటి వాళ్ళు మామూలుగా వచ్చినా, వంద సార్లు చూసినా తర్వాత వేరే చోట చూస్తే గుర్తు పట్టలేరనీ. ఎందుకో ఆ రోజు, ఆఫీసులో లేటయింది. పైగా జోరున వర్షం. బయటికి వచ్చా. నర సంచారం లేదు. పిట్ట బిఱ్ఱు మంటల్లా. చుట్టూ నిర్మానుష్యం.బండి ఎంతకూ స్టార్ట్ కాదే. ఏంచేయాలి? బండి ఆఫీసులో పెట్టి, ఆటో ఎక్కి పోతే, అవును మంచి ఆలోచన బండి ఆఫీసులో పెట్టి, అందులో గొడుగు తీసుకుని,బయటి కొచ్చి రెండడుగులు వేసా.
బరబరమని బండరాళ్ళు దొర్లించిన గొంతుతో. "ఏమ్మా !ఆటో కావాలా " వినబడి ఉలిక్కి పడి అటుచూసా. అంతే పై ప్రాణాలు పైనే పోయాయ్. ఒంటికన్ను వాడు చింపిరిజుట్టూ ,బుఱ్ఱమీసాలూ ఎఱ్ఱ పంట్లాం లాగూ ,పైన వర్షానికి నల్లటోపీ నోట్లో బీడీ నన్నే తినేసాలా చూస్తున్నాడు. "వద్దు" అన్నాను "వానలో ఎట్టెడతారమ్మా?" అన్నాడు బరబరమని. భయంతో బిగుసుకుపోతూ, గబగబా ముందుకు పోయి, వెనక్కి తిరిగి చూసా. అమ్మో ఎవరితోనో మాట్లాడుతున్నాడు. నాకెందుకో అత్యాచారం ప్రియాంక గుర్తుకు వచ్చిపైప్రాణాలు పైకే పోయాయి. మళ్లీ వెనుదిరిగి చూసా,

బీడీ కాలుస్తూ నన్నే చూస్తున్నాడు. ఏంచేయాలి? ఆటోలేం లేవు. మళ్ళీ వెనక్కి చూసా నా వెనుకే వస్తున్నాడు. నాకేం ఖర్మ రా బాబూ! ఆఫీసులో ఎవర్నయినా హెల్ప్ అడిగితే బాగుండేదా?అమ్మో ఈ రోజుల్లో ఎవర్నీ నమ్మటానికి లేదు. అని పరుగులాటి నడకతో చౌరస్తా వరకూ వెళ్ళి, భయంభయంగానే, ఏదో ఆటో పట్టుకుని నా ఫ్లాట్ కి చేరాను. సరిగ్గా అప్పుడే వానకి కరెంట్ పోయింది.

తడుముకుంటూ తాళం తీసాను. లైట్లన్నీ వేసి, చుట్టూ పరికించి చూడకుండానే, గదిలోకి వెళ్ళా. అవునూ ఇందాకటి నుండీ గుర్తురాలా! నాఫోన్ ఏదీ? ఫోనులో ఛార్జ్ ఐపోయింది. పొద్దుటి నుండీ పెట్టలేదుగా. హయ్యో! ఇప్పుడేం చేయాలి? ఇంట్లో ఎవరూ దూరలేదుకదా! వెదికి చూసి, తినే ఓపికలేక బెడ్ రూమ్ లో దూరా! అక్కడమెుదలయింది.అసలుభయం. కిటికీ తలుపులు గ్లాస్ డోర్స్ పై నీడలు, అదిగో ఆ బుఱ్ఱ మీసాలవాడు,నావెనకే ఇల్లు వెదుకుతూ వచ్చేసాడు.

కిటికీ దగ్గర తిరుగుతున్నాడు. ఇదిగో ఇటువచ్చాడు. తలుపులు దభాధభా బాదుతున్నాడు. కెవ్వు కెవ్వు ~ నేనరిచినా ఎవరికీ వినబడదే అదిగో నిజంగానే కిటికీ అవతల నీడ. అటూఇటూ తిరుగుతూ, ఒకడే వచ్చాడా? ఎవరినైనా వెంటబెట్టుకొని వచ్చాడా? నలుగురో పదిమందో! ఆ నీడలు చూస్తే చాలా మందే ఉన్నట్లున్నారు. ఆడవాళ్ల కి ఈ పరిస్థితులలో ఇలాంటి ఆలోచనలే వస్తాయా? అదిగో మళ్లీ చప్పుడు తలుపులవే! నాయింటివా? వేరేవాళ్ళవా?

అవిగో నీడలు! ఫోన్ లేదు, కరెంట్ లేదు. చీకటి, భగవంతుడా, ఏ ఆడపిల్లకూ ఇలాంటి పరిస్థితి రాకూడదు నో ~ భయంతో నోరు పిడచకట్టేస్తోంది, నీరసం తో స్ప్రహ పోయేలా ఉంది. పడుకోవాలి. అమ్మో గదిలో మంచంమీదే! వాడు కిటికీ అద్దాలు పగల గోట్టుకువస్తే? బెడ్ రూమ్ తలుపువేసేసా! సోఫాలో ~అదిగో మళ్లీ చప్పుడు బాబోయ్ తలుపు బద్దలు కొట్టుకు వస్తే? సోఫాను తలుపులకు అడ్డం పెట్టి ~ హమ్మయ్య ఇప్పుడు. తలుపుల మోత ఆగిపోయిందే! దొంగ వెధవ నేను జాగ్రత్త పడ్డానని తెలుసుకున్నాడు. ఇక మంచినీళ్ళు తాగి నిద్రపోదాం.

///////////

తలుపులు దబిడిదిబిడి బాదుతున్నారు ఎవరో కళ్ళు విప్పి చూసా. తెల్లగా తెల్లారింది. రాత్రిజరిగిందంతా సినిమా రీళ్ళలా మళ్ళీ గుర్తుకు వచ్చింది. అమ్మో వాడే! తెల్లవార్లూ ఇక్కడే ఉన్నాడా? వెళ్ళి మళ్లీ వచ్చాడా? తెల్లవారింది, వాన తగ్గింది కాబట్టి, బయటి కెళ్ళి, అందర్నీ పిలవవచ్చు. ఎక్కడ లేని ధైర్యం తెచ్చుకుని, తలుపులకి అడ్డంగా ఉన్న సోఫా ఇవతలికి జరిపి, తలుపు పక్కనున్న కిటికీ లోంచి చూసా. బబ్లూ...పక్క ఫ్లాట్ వాళ్ళ బాబు. హమ్మయ్య తలుపుతీసా. ఆంటీ ! నిన్న కొంచెం ఎండ వచ్చిందని, బట్టలు ఉతికి డాబా మీద ఆరేసింది మమ్మీ. ఐతే గాలి వానకి, ఎగిరి పోయి మీ కిటికీ చువ్వలకు వేలాడుతున్నాయ్. ఊగుతున్నాయ్. రాత్రి మీరు రావటం మమ్మీ చూసిందట.మీరు హెల్ప్ చేస్తారేమో అడిగి రమ్మని నన్ను పంపింది. తలుపులు ఎంత కొట్టినా మీరు తీయలేదాంటీ. మీరేమైనా హెల్ప్ చేస్తారా? "మా నాయనే! బట్టలు డాబా మీద ఆరేసారా? నా నెత్తి మీద ఆరేయక పోయారా? తెల్లవార్లూ నా కిటికీ చువ్వలకు వేలాడినవి అవా!? తలుపులు కొట్టింది నువ్వా? బాబోయ్ ఇదంతా తెలీక మనసులో ఎన్ని క్రైం స్కిట్ లు రాసానురా. ఎన్ని డిటెక్టివ్ కథలు రాసా, సినిమా కథలు రాసా. ఎన్ని ఊహా గానాలు చేసా! మీ మెుహాలు మండా! కూడూ నీళ్ళు లేక భయంతో చచ్చాను కదరా! "అనుకుని, పైకి మాత్రం" సరే బబ్లూ కమాన్ " అన్నాను.

మరిన్ని కథలు

Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaalani kaagitam
కాలని కాగితం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Gnana tatwam
జ్ఞానతత్వం
- - బోగా పురుషోత్తం, తుంబూరు.