కొత్త మిద్దె ఆదెమ్మ - కనుమ ఎల్లారెడ్డి

The new midge Ademma

అదో గ్రామం.అన్ని కులాలు,మతాల వారు ఉన్నారు. చర్చ్,మసీదు,రామాలయాలు ఉన్నాయి. అసలైన లౌకిక వాదం నడుస్తుంది అంటే ఆ ఊరి పేరే చెప్పొచ్చు.అదే చిట్టూరు. అందరూ కలసి మెలసి ఉంటారు. ఏ మత ఉత్సవాలు జరిగిన ఘర్షణలు ఉండవు. ఆ ఊర్లో ఎవరి ఇండ్లు రెండు అంతస్తులు లేవు. ఆదెమ్మ గారే కొత్తగా రెండు అంతస్తులు మేడ కట్టుకుంది. ఆ ఊర్లో అప్పటికే ఐదు, ఆరు మంది ఆదెమ్మలు ఉండగా ఈవిడను కొత్త మిద్దె ఆదెమ్మ అని పిలిచేవారు. మిద్దె పేరే ఇంటి పేరై కూర్చుంది.

ఆదెమ్మ ఆరడుగులు ఉంటుంది. సన్నగా ఉంటుంది. నుదుటిపై రూపాయ కాసంత బొట్టు, అసలు, సిసలైన ముతైదువు లాగా ఉంటుంది. అరవై ఏండ్ల వయసులోనూ ఆరోగ్యం గా ఉంది. వ్యవసాయ పనులు చేయించడంలో దిట్ట. కూలీలందరిన్నీ ఆకట్టుకునే శైలి ఉంది. ఆదెమ్మ వచ్చి పిలువగానే ఆమె పొలంలోకి వెళ్లేవారు కూలీలు. ఆ రోజు ఆకాశం మబ్బులు కమ్ముకుంది. పొలం వెళ్ళిన ఆదెమ్మ ఎంత సేపటికి రకపోయే సరికి కంగారుగా వెళ్ళాడు ఆదెమ్మ భర్త ఓబిరెడ్డి. చిన్నగా తుంపర్లు పడుతున్నాయి. దానిమ్మ తొటంతా తిరిగాడు. ఎక్కడా ఆదెమ్మ కనిపించ లేదు.దూరంగా " కాపాడండి " అనే కేకలు వినపడ్డాయి. అది ఆదెమ్మ గొంతే. ఆత్రంగా ఆ కేకలు వినిపించిన వైపుకు వడి వడిగా అడుగులు వేశాడు ఓబిరెడ్డి. " కాపాడండి, ఎవరైనా ఉంటే రండి, అయ్యో కూరుకుపోతోంది" అనే మాటలు వినిపించాయి. అది వినగానే ఓబిరెడ్డి నడక వేగం పెంచాడు.గుండెలు దడ దడ కొట్టుకుంటున్నాయి. "ఏమైంది ఆదెమ్మకు " అనుకుని అక్కడికి చేరుకున్నాడు. ఆ సన్నివేశం చూడగానే ఆశ్చర్య పోయాడు. ఓ ఊబిలో చిక్కుకొని పోయింది ఓ స్త్రీ. ఆదెమ్మ చీరె విప్పి చెట్టు కోసకు గట్టిగా కట్టి ఆవిడకు అందించింది.

ఊబిలో ఉన్న స్త్రీ గట్టిగా మూలుగుతూ చీరె అందుకుంది. అయితే ఆదెమ్మ లాగ లేక పోతోంది.అప్పటికే గొంతు దాకా కూరుకు పోయింది. " అయ్యాయో" అంటూ వచ్చాడు ఓబిరెడ్డి. తన టవల్ తీసి ఆవిడకు అందించాడు. చీర పట్టుకున్న ఆవిడ టవల్ గట్టిగా పట్టుకుంది. ఆదెమ్మ కూడా ఓబిరెడ్డి నడుము గట్టిగా పట్టుకుంది. ఆవిడ పైకి రావడానికి విశ్వ ప్రయత్నం చేస్తోంది. అతి కష్టంతో ఊబిలో నుంచి బయట పడింది. ఆయాసంతో అంగలారుస్తుంది. ఆదెమ్మ, ఓబిరెడ్డి నిట్టూర్చారు. "హమ్మయ్య బైట పడ్డావు " అంది ఆదెమ్మ చీర చుట్టుకుంటూ. " ఎలా పడ్డావు బూమ్మ "అడిగాడు ఓబిరెడ్డి. "చింత చెట్టు చిగురు కోస్తుంటే పట్టు తప్పానయ్య సమయానికి ఈ కొత్త మిద్దె ఆదెమ్మ వచ్చి ప్రాణాలు కాపాడింది. ఇంతలో మీరు వచ్చారు. మీ రుణం తీర్చుకోలేను " అంది కళ్ళు వత్తుకుంటు. "ఇంకెప్పుడు ఇటు రాకు దీని చుట్టూ కంచె కొట్టించి ఒక బోర్డ్ పెడతాను.చాలా మంది ఈ మార్గంలో వస్తుంటారు అనుకుని ఆ రోజే ఊరిలో చాటింపు వేయించి, ఆ చింత చెట్టు, ఊబి చుట్టు కంచె వేయించింది.అప్పటి నుంచి బూమ్మ ప్రాణాలు ఎవరు కాపాడారు అంటే ఆ కొత్త మిద్దె ఆదెమ్మ అని అందరూ చెప్పుకోసాగారు.

మరిన్ని కథలు

Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaalani kaagitam
కాలని కాగితం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Gnana tatwam
జ్ఞానతత్వం
- - బోగా పురుషోత్తం, తుంబూరు.