టైం చూశాడు డిటెక్టివ్ పురంధర్.
మధ్యాహ్నం పన్నెండు కావడానికి ఇంకా పది నిముషాలు ఉంది.
ఒక గంట క్రితం వచ్చిన ఫోన్ కాల్ గుర్తు చేసుకున్నాడు.
"ఇప్పుడే నీ కూతుర్ని కిడ్నాప్ చేశాం.
ఐదు లక్షలు క్యాష్ రెడీ చేసుకో.
సరిగ్గా పన్నెండు గంటలకు ఫోన్ చేసి, క్యాష్ ఎక్కడ ఎలా ఇవ్వాలో చెబుతాను. పోలీసులకు తెలిసిందో నీ కూతురు ఫినిష్." కఠినంగా చెప్పి, సమాధానం కోసం ఎదురు చూడకుండా ఫోన్ పెట్టేసాడు అవతలి వ్యక్తి.
పురంధర్ మొహం నిండా చెమటలు పట్టాయి.
కర్చీఫ్ తో తుడుచుకున్నా ఆగడం లేదు.
అది గమనించిన అతని భార్య శారద, కూతురు ప్రవల్లిక అతని వద్దకు వచ్చారు.
"హైదరాబాద్ లోనే ఫేమస్ డిటెక్టివ్ పురంధర్ గారికి ఫోన్లోనే చెమటలు పట్టించిన వారెవరోగానీ, వారికి హ్యాట్సాఫ్ చెప్పాలి " నవ్వుతూ అంది ప్రవల్లిక.
"వాళ్లెవరో నా కూతుర్ని కిడ్నాప్ చేశారట." చెప్పాడు పురంధర్.
"మై గాడ్! మీకు మరో కూతురు వుందా? మమ్మీ! నాన్నకు మరో ఫ్యామిలీ ఉన్నట్లు ఎప్పుడూ చెప్పలేదే?" తల్లిని ఉడికిస్తూ అంది ప్రవల్లిక.
"నాకూ ఇంతవరకు తెలీదు మరి. ఈ డిటెక్టివ్ మీద మరో డిటెక్టివ్ ను నియమించాలేమో…" అంది శారద.
"ఐతే ఇది లేడీ డిటెక్టివ్ ప్రవల్లిక మొదటి కేసు.
ఒక్క రోజులోనే కేసు సెటిల్ చేస్తాను." చెప్పింది ప్రవల్లిక.
"ఇది నవ్వుకోవలసిన విషయం కాదు. నాకున్న అనుభవాన్ని బట్టి నిజంగానే కిడ్నాప్ జరిగింది. అవతలి వ్యక్తి క్రూరత్వం అతని గొంతులో తెలుస్తోంది.
ఒక అమ్మాయి ప్రస్తుతం ఆపదలో ఉంది.
ఆ అమ్మాయి అదృష్టమో,దురదృష్టమో ఫోన్ కాల్ ఆ అమ్మాయి తండ్రికి బదులుగా నాకు వచ్చింది.
నెల రోజులకు ముందే ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసి దారుణంగా రేప్ చేసి చంపేశారు కొందరు దుర్మార్గులు. అప్పట్నుంచి ఎక్కడ ఇలాంటి కిడ్నాప్ విషయం గురించి విన్నా మనసు కకావికలమైపోతోంది." బాధగా చెప్పాడు డిటెక్టివ్ పురంధర్.
మరో రెండు నిముషాలు గడిచాయి.
సరిగ్గా పన్నెండు గంటలయింది.
అనుకున్నట్లే అతని సెల్ ఫోన్ మ్రోగింది.
"మీరు ఎవరికి ఫోన్ చేసారో తెలుసా ....." అంటూ ఏదో చెప్పబోయాడు పురంధర్.
"నీ కూతురి శవం చూడాలనుకుంటున్నావా?
చెప్పింది వినడం వరకే నీ బాధ్యత." గద్దించాడు అవతలి వ్యక్తి.
మౌనం వహించాడు పురంధర్.
"సరిగ్గా సాయంత్రం నాలుగు గంటలకు క్యాష్ రెడీ చేసుకొని కె బి ఆర్ పార్క్ దగ్గర వెయిట్ చెయ్. ఎవరికి అందజేయాలి అనేది అప్పుడు ఫోన్ చేసి చెబుతాను. “అని చెప్పి వెంటనే ఫోన్ కట్ చేసాడు కిడ్నాపర్.
వెంటనే అతనికి ఫోన్ చేసి తన కూతురు తన వద్దే ఉందని చెబుదామనుకున్నాడు పురంధర్.
కానీ ఆవేశాన్ని బలవంతంగా అణుచుకొన్నాడతను.
తండ్రి వంక ఆరాధనపూర్వకంగా చూసింది ప్రవల్లిక.
వాస్తవానికి ఇది డాడీ ప్రాబ్లమ్ కాదు.
నేను తన ఎదురుగానే ఉన్నాను.
ఇది తనకు అప్పగించిన కేసు కూడా కాదు.
ఐనా ఒక అమ్మాయి ఆపదలో ఉన్నదంటే తన కూతురే ఉన్నట్లు రియాక్ట్ అవుతున్నాడు. ఆ గుణమే అతన్ని గొప్ప డిటెక్టివ్ ని చేసింది. ఈ కిడ్నాప్ విషయంలో 'డాడీకి హెల్ప్ చెయ్యాలి' అనుకుంది. ఆ విషయమే అతనికి చెప్పాలనుకుంది.అంతలో మళ్ళీ అతని ఫోన్ మ్రోగడంతో ఆగింది ప్రవల్లిక. .
అసిస్టెంట్ కమిషనర్ అఫ్ పోలీస్ ప్రతాప్ ఫోన్ చేసాడు.
"పురంధర్ గారూ...నేను ఏ సి పి ని మాట్లాడుతున్నాను. ఒక గంట క్రితం అబిడ్స్ లో ఒక అమ్మాయిని ఎవరో కిడ్నాప్ చేసారు. రోడ్ ప్రక్కనే నడిచి వెడుతున్న ఒక అమ్మాయి ప్రక్కనే కార్ అపి లోపలికి లాక్కుని వెంటనే వెళ్లి పోయారు. లాస్ట్ మంత్ జరిగిన రేప్ అండ్ మర్డర్ కేస్ గురించి తెలుసు కదా. అప్పటినుంచి మా మీద ప్రెషర్ ఎక్కువగా ఉంది.
ఈ కేస్ విషయంలో మీ హెల్ప్ కావాలి. ప్లీజ్..."అంటూ అభ్యర్దించాడు.
"తప్పకుండా ప్రతాప్ గారూ...ఇలాంటి కేస్ లు వచ్చినప్పుడు నేను ఊరికే ఎలా ఉండగలను? అన్నట్లు ఇప్పుడే నాకు కిడ్నాపర్ నుండి కాల్ వచ్చింది." అంటూ తనకు వచ్చిన కాల్ వివరాలు వివరించాడు పురంధర్.
"అంటే నేరస్తుడే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాడన్నమాట. ఇక వాడి పని అయిపోయినట్లే.
మా డిపార్ట్మెంట్ కాస్త ఊపిరి పీల్చుకోవచ్చు."చెప్పాడు ప్రతాప్.
"ప్లీజ్ డోంట్ రిలాక్స్. అవతలి వ్యక్తి చాలా దుర్మార్గుడనిపిస్తోంది." అన్నాడు పురంధర్.
"ఆ చుట్టుపక్కల సి సి కెమెరా ఫుటేజ్ తెప్పిస్తున్నాను.
“ఈ లోగా మిమ్మల్ని కలుస్తాను. ఇఫ్ యూ పర్మిట్…. " అభ్యర్దించాడు ప్రతాప్
"తప్పకుండా రండి.వెయిట్ చేస్తుంటాను. ఇద్దరం కలిసి పరిశోధిద్దాం. అయినా పర్మిషన్ అడగాల్సిన అవసరం ఉందా మీకు?” నవ్వుతు అన్నాడు పురంధర్.
"సరిగ్గా పావు గంటలో బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 14 లోని పురంధర్ ఇంటికి వచ్చాడు ప్రతాప్.
"రండి అన్నయ్య గారూ! వదినగారు, పిల్లలు ఎలా ఉన్నారు?" లేచి నిలబడి పలకరించింది శారద.
ప్రవల్లిక కూడా నిలబడి "బాగున్నారా అంకుల్?" అని పలకరించింది.
"బాగున్నాను చెల్లెమ్మా. మీ వదిన కూడా మిమ్మల్ని చూడాలంటోంది. వీలు చూసుకొని, తీసికొని వస్తాను."అని శారదకు బదులిచ్చి ప్రవల్లిక వంక తిరిగి, "హలొ ప్రవల్లికా. టెన్త్ లో,ఇంటర్లో స్టేట్ ఫస్ట్ వచ్చావు సరే. బి టెక్ లో కూడా యూనివర్సిటీ టాపర్ వి అట గదా.
సినిమాలు, టీవీ వదిలేసి పుస్తకాల పురుగు అయిపోయావా ఏమిటి?" అన్నాడు ప్రతాప్.
"అదేమీ లేదు ప్రతాప్ గారూ.
రిలీజైన ప్రతి సినిమా ఫస్ట్ డే నే చూసేస్తుంది.
స్నేహితులతో కలిసి టెన్నిస్ ప్రాక్టీస్ చేస్తోంది.
ఇక షాపింగ్ సంగతి చెప్పనక్కర లేదు.
కానీ చదివేటప్పుడు పూర్తి ఏకాగ్రత తో చదువుతుంది".కూతురు గురించి గర్వంగా చెప్పాడు పురంధర్.
"నెక్స్ట్ ఏమి చెయ్యాలనుకుంటున్నావు ప్రవల్లికా?ఫారిన్ వెళ్లే ఆలోచన ఏమైనా ఉందా?"
"లేదు అంకుల్. నాన్న లాగా డిటెక్టివ్ కావాలనుకుంటున్నాను" అంది ప్రవల్లిక.
"డిటెక్టీవ్ కావడానికి చాల ధైర్యం,తెగింపు,తెలివితేటలూ ఉండాలి. అవన్నీ నీలో పుష్కలంగా ఉన్నాయి. అల్ ది బెస్ట్" అన్నాడు ఏ సి పీ ప్రతాప్.
ప్రతాప్ తన భర్తతో ఫ్రీగా మాట్లాడుకోవడానికి వీలుగా వంటిట్లోకి వెళ్ళింది శారద.
ప్రవల్లిక కూడా తన రూమ్ లోకి వెళ్ళింది.
"పురంధర్ గారూ...పోయిన నెల జరిగిన సంఘటన ప్రజల్లో భయాందోళనలు కలిగించింది. డిపార్ట్మెంట్ మీద నమ్మకం కూడా తగ్గింది. ఇంతలో ఈ సంఘటన...అన్నట్లు ఆ కిడ్నాపర్ సాయంత్రం వస్తాడా? ఆ సమయంలో మనం పట్టుకోవడానికి వీలు ఉందా?" ప్రశ్నించాడు ప్రతాప్.
" సాయంత్రం కే బి ఆర్ పార్క్ దగ్గరకు వెళ్ళేది నేనే కాబట్టి ఖచ్చితంగా వాళ్ళను పట్టుకొవచ్చు. కానీ అతడు నిజంగా మనీ కోసమే కిడ్నాప్ చేశాడా?మనల్ని మిస్ లీడ్ చెయ్యడానికి ఆలా చెప్పాడా?మన ఆలోచనలని సాయంత్రం నాలుగు గంటలకు మళ్లించి, ఈ లోగా ఆ అమ్మాయికి ఏదైనా హాని చేస్తాడా?అందుకే మనం సాయంత్రం వరకు వెయిట్ చెయ్యకుండా వెంటనే రంగం లోకి దిగాలి. ఇక మనం మీ ఆఫీసుకి వెళదాం.సీసీ కెమెరా ఫుటేజ్ వచ్చిఉంటే పరిశీలిద్దాం. మీ డిపార్ట్మెంట్ లో అందరినీ అలర్ట్ చెయ్యండి" అన్నాడు పురంధర్.
"అలాగే పురంధర్ గారూ….మనం బయలుదేరుదాం" అంటూ పైకి లేచాడు ప్రతాప్.
ఇంతలో తన గదిలోనుండి ప్రవల్లిక బయటకు వచ్చి "వన్ మినిట్ అంకుల్ ప్లీజ్ " అంది.
"చెప్పమ్మా" అంటూ మళ్ళీ సోఫాలో కూర్చున్నాడు ప్రతాప్.
"కేసు దాదాపు పరిష్కారానికి వచ్చింది అంకుల్. మీరూ, డాడీ పర్మిషన్ ఇస్తే నేను చేసిన పరిశోధన చెబుతాను.తరువాత ఏంచేయాలో మీరు డిసైడ్ చెయ్యండి" అంది ప్రవల్లిక తనూ సోఫాలో కూర్చుంటూ.
"మై గాడ్!నిజంగానా? ఏదైనా క్లూ దొరికిందా? నువ్వు రూంలోనే ఉన్నవుగా? నాకు ఏమీ అర్ధం కావడం లేదు. కాస్త వివరంగా చెప్పు. టెన్షన్ తట్టుకోలేక పోతున్నాను." అన్నాడు ప్రతాప్.
"బహుశా నా నంబర్ కి కాల్ రావడాన్ని బట్టి ఏదైనా క్లూ దొరికి ఉంటుంది" అన్నాడు పురంధర్.
"ఎగ్జాక్ట్లీ డాడ్. వివరంగా చెబుతాను. వినండి" అంది ప్రవల్లిక.
పురంధర్, ప్రతాప్ లు ప్రవల్లిక చెప్పేది వినడానికి ఉత్సాహంగా ముందుకు వంగారు.
శారద కూడా వంటిట్లోనుంచి వచ్చి అందరికి టీలు అందించి తనూ వినడానికి కూర్చుంది.
తన పరిశోధన వివరాలు చెప్పడం ప్రారంభించింది ప్రవల్లిక.
"డాడీ తన క్లయింట్లకోసం వేరే నంబర్ వాడుతారు. ఆ సిమ్ కార్డు వేరే ఫోన్ లో ఉంటుంది.
ఇప్పుడు కాల్ వచ్చిన నంబర్ కొద్దిమందికి మాత్రమే తెలుసు.
నెలక్రితం కిడ్నాప్ అండ్ మర్డర్ జరిగింది కదా.
తరువాత నేను నా ముఖ్య స్నేహితురాళ్ళు నలుగురిని పిలిచి, విపత్కర పరిస్థితులలో ఎలా బిహేవ్ చెయ్యాలో చెప్పాను.
ఇంటినుండి బయటకు వెళ్ళేటప్పుడు ఎక్కడికి వెళ్తోందీ… ఎవరో ఒకరికి చెప్పడం, వాట్సప్ లో లైవ్ లొకేషన్ షేర్ చెయ్యడం లాంటివి నేర్పాను. పోలీస్ స్టేషన్ నంబర్ లు, షీ టీం నంబర్ లు ఇచ్చాను.
వీటన్నిటితో బాటు డాడ్ నంబర్ కూడా ఇచ్చాను.
ఆ నంబర్ కు కాల్ రావడాన్ని బట్టి కిడ్నాప్ అయింది నా స్నేహితురాళ్ళలో ఒకరు కావచ్చని గెస్ చేశాను.
అందుకే వాళ్లందరికీ ఫోన్ చేశాను.
ఒక్క కీర్తి మాత్రమే లిఫ్ట్ చేయలేదు.
బయలుదేరే ముందు అబిడ్స్ కి వెళుతున్నట్లు మరో ఫ్రెండ్ నిత్యాకు ఫోన్ చేసిందట.
కాబట్టి కిడ్నాప్ అయింది కీర్తి అని ధృవీకరించుకున్నాను.
కీర్తి వాళ్ళ నాన్న హార్ట్ పేషేంట్.
అందుకే కిడ్నాపర్ ఫోన్ నంబర్ అడిగినప్పుడు తెలివిగా డాడ్ నంబర్ ఇచ్చి ఉంటుంది.
నేను వెంటనే కీర్తి వాళ్ళ అమ్మకు ఫోన్ చేశాను. వాళ్లకు ఎవరితోనైనా వివాదాలు ఉన్నాయేమో కనుక్కున్నాను.
వాళ్లకు అబిడ్స్ లో ఒక గార్మెంట్స్ షాప్ ఉంది. పార్ట్నర్ మోసం చేసినట్లు తేలడంతో కీర్తి వాళ్ళ నాన్న అతనిమీద చీటింగ్ కేస్ పెట్టాడు. అతనికి రెండేళ్లు జైలు శిక్ష పడింది.
అతని భార్య, అతన్ని వదిలి పెట్టి పిల్లల్ని తీసుకుని వెళ్లిపోయిందట.
జైలు నుండి విడుదలయ్యాక అతను కీర్తి వాళ్ళ ఇంటికి వచ్చి 'మీ అంతు చూస్తానంటూ' బెదిరించాడట.
వాళ్ళు ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదట.
కాబట్టి కిడ్నాపర్ అతడే అని డిసైడ్ అయ్యాను.
అతని అడ్రస్ తెలీదని,ఖైరతాబాద్ లో ఎక్కడో ఉంటాడని చెప్పింది కీర్తి వాళ్ళ అమ్మ.
వెంటనే నా ఫ్రెండ్ నిత్యా కు కాల్ చేశాను.
కీర్తి వాట్సప్ లైవ్ లొకేషన్ చేసిందనీ, ప్రస్తుతం ఖైరతాబాద్ లో ఉందని చెప్పింది తను.
బహుశా కిడ్నాపర్, ఫోన్ ను కీర్తివద్ద నుండి లాక్కుని కార్ లోనే క్రిందకు విసిరి కొట్టి ఉంటాడు.
అదృష్టవశాత్తు ఫోన్ ఆఫ్ కాలేదు.
ఇక నేను ఇందాక కీర్తికి కాల్ చేసినప్పుడు రింగ్ అయింది కానీ ఎవరూ లిఫ్ట్ చేయలేదు.
అంటే మొబైల్ కార్ లోనే ఉండిపోయింది.
కిడ్నాపర్లు కీర్తిని తీసికొని ఇంట్లోకి వెళ్లిపోయారు."
తన పరిశోధన వివరాలు పూర్తి చేసింది ప్రవల్లిక.
చప్పట్లు కొట్టి, తనను అభినందించారు పురంధర్,ప్రతాప్ లు.
"మనం వెంటనే ఖైరతాబాద్ వెళదాము. ప్రతాప్ తో అన్నాడు పురంధర్ పైకి లేస్తూ.
"చిన్న రిక్వెస్ట్ " అంటూ తనూ పైకి లేచాడు ప్రతాప్.
"చెప్పండి" అన్నాడు పురంధర్.
"మనతో బాటు జూనియర్ డిటెక్టివ్ ప్రవల్లికను కూడా తీసుకువెడదాం.ప్లీజ్ ..."రిక్వెస్ట్ చేసాడు ప్రతాప్.
అంగీకారంగా తల ఊపాడు పురంధర్.
ఆనందంతో తల్లికి బై చెప్పి, వారివెంట వెళ్ళింది ప్రవల్లిక.
దారిలోనే లోకల్ పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేసి, ఆ ఇంటి వద్దకు రమ్మన్నాడు ప్రతాప్.
ఖైరతాబాద్ లో కిడ్నాపర్ ఇంటికి కాస్త దూరంగా జీప్ అపి, ముగ్గురూ ఆ ఇంటికి నడిచి వెళ్లారు.
ముందుగా పురంధర్ తన భుజంతో ఇంటి మెయిన్ డోర్ ను బలంగా మోదాడు.
అతని దెబ్బకు డోర్ విరిగి పడింది.
వెంటనే సింహంలా లోపలి దూకి, ఎదురుగ ఉన్న కిడ్నాపర్ పొట్టలో బలంగా గుద్దాడు పురంధర్.
ఆ దెబ్బకు అతడు క్రిందకు పడిపోయాడు.
కిడ్నాపర్ అసిస్టెంట్లు మరో ఇద్దరిని ఏ సి పి ప్రతాప్ గన్ చూపి లొంగదీసుకున్నాడు.
కీర్తి నోటికి వేసి ఉన్న టేప్ ఊడదీసి, కట్లు విప్పింది ప్రవల్లిక.
కీర్తి ఆనందంతో ప్రవల్లికను కౌగిలించుకొంది.
ఇంతలో స్థానిక పోలీసులు వచ్చి దుండగులను అరెస్ట్ చేసారు.
అప్పటికే అక్కడకు చేరుకున్న టి వి ఛానళ్ల వారు ప్రతాప్ ద్వారా ప్రవల్లిక తెలివితేటల గురించి విని, ఆమెను ఇంటర్వ్యూ చెయ్యడానికి రెడీ అయ్యారు.
*********** సమాప్తం**********