"పిల్లలూ, మీరు పెద్దైనాక ఏం అవుదామని అనుకుంటున్నారు?" అని ఆ రోజు క్లాస్ టీచర్ సుందరం విద్యార్థులని ప్రశ్నించాడు.
సుందరం ఓ ఆదర్శ ఉపాధ్యాయుడు. తన ఉపాధ్యాయ వృత్తిమీద అత్యంత శ్రద్దగలవాడు. విద్యార్ధులకి మంచి విద్యాబుద్ధులు అందించి అందరి మన్ననలు అందుకున్నాడు. విద్యార్థులకి కూడా సుందరం మాష్టరు అంటే చాలా ఇష్టం. చదువు చెప్పేటప్పుడు మధ్యలో సందర్భానుసారం చిన్న చిన్న కథలు చెప్తూ వాళ్ళలో చదువుపట్ల ఆశక్తి పెంచేవాడు. అంతేకాక పిల్లలతో సరదాగా కబుర్లు కూడా చెప్పేవాడతను. అందుకే అతని క్లాస్ కోసం ఎదురు చూసేవారు విద్యార్థులందరూ.
సుందరం మాష్టారి ప్రశ్న విన్న విద్యార్థులు కొద్దిసేపు మనసులోనే ఆలోచించుకున్నారు. ముందు వరసలో కూర్చున్న వినోద్ లేచి నిలబడి, "నేను ఎంబిబియెస్ చేసి మా నాన్నలా పెద్ద డాక్టర్ని అవుదామనుకుంటున్నాను. పల్లెటూళ్ళో ఆస్పత్రి పెట్టి ప్రజల సేవ చెయ్యాలనుకుంటున్నాను. పేదలకి ఉచితంగా వైద్యం అందిస్తాను." అన్నాడు.
"మంచి నిర్ణయం! నీలా ఆలోచించే వాళ్ళుంటే పల్లెటూళ్ళలో ప్రజలకి వైద్యం అందుబాటులో ఉంటుంది. వాళ్ళ ఆరోగ్య సమస్యలు చాలావరకూ తీరతాయి. మరి నువ్వు పెద్దైతే ఏం కావాలనుకుంటున్నావు గౌరవ్?" అడిగాడు సుందరం.
"మాష్టర్‌గారూ! నేను ఇంజీనీరవుతాను. ఇంజినీరై దేశం కోసం డ్యాములు, బ్రిడ్జిలు కడతాను." అన్నాడు గౌరవ్.
"గుడ్! దేశ అభివృద్ధిలో ఇంజినీర్ల పాత్ర ఎంతైనా ఉంది." అన్నాడు సుందరం.
"ఐఏయెస్ పాసయి కలెక్టర్ అయి ప్రజాసేవ చేయాలన్నది నా ఆశయం." అన్నాడు కళ్యాణ్.
"చాలా మంచి ఆశయం." మెచ్చుకున్నాడు సుందరం.
ఆ తర్వాత ఆనంద్ నిలబడి, "నేను సైంటిస్టు అయి ఎన్నో కొత్త వస్తువులు కనుగొని దేశానికి సేవ చేస్తాను." అన్నాడు.
"నేను లాయర్ అయి ఎవరికీ అన్యాయం జరగకుండా చూస్తాను." అన్నాడు గోవింద్.
ఒకొక్కళ్ళు వాళ్ళ జీవితాశయాలని చెప్తూంటే సుందరం వింటూ వాళ్ళకి తగిన ప్రోత్సాహం అందిస్తున్నాడు.
గోపాల్ నిలబడి, "నేను పెద్దయ్యాక వ్యవసాయదారుడినవుతాను. అందుకోసం వ్యవసాయ విశ్వవిద్యాలయంలో చేరతాను." అన్న మాటలు విన్న క్లాస్‌రూములో మిగతా విద్యార్థులంతా గొల్లుమని నవ్వారు.
"ఇంత చదువు చదివి ఆఖరికి రైతువవుతావా?" అని గోపాల్‌ని వేళాకోళం చేసాడు ఒకడు. గోపాల్ బిక్కమొహం వేసాడు.
సుందరం మాష్టరు అందర్నీ నిశ్శబ్దంగా ఉండమని చెప్పి, "రైతుని చిన్నచూపు చూడవద్దు! రైతు దేశానికి వెన్నెముక వంటివాడు. వ్యవసాయదారుడు లేకపోతే మనకి ఆహారమే లేదు. అందరూ డాక్టర్లు, ఇంజీనీర్లు అయితే మరి మనకి ఆహారం ఎలా వస్తుంది? అందువలన గోపాల్‌యొక్క ఆశయం కూడా చాలా గొప్పది." అన్నాడు. విద్యార్థులందరూ నిజమేనని తలలూపారు.
"నేను పెద్దయ్యాక మిలట్రీలో చేరి మన దేశాన్ని శత్రువులబారి నుండి రక్షిస్తాను." అన్నాడు అభినందన్.
"శభాష్! దేశానికి ఆహరం అందించే రైతు ఎంత ముఖ్యమో, దేశాన్ని రక్షించే సైనికుడూ అంతే ముఖ్యం. అందుకే 'జై జవాన్! జై కిసాన్!' అని అన్నారు." అన్నాడు అభినందన్‌ని మెచ్చుకుంటూ.
చివరికి ఆదిత్య వంతు వచ్చింది. ఆదిత్య లేచి నిలబడి, "సార్! నాకు మీలా ఉపాధ్యాయుడిని అవాలని కోరికగా ఉంది." అన్నాడు.
ఆదిత్య మాటలు విన్న సుందరం మాష్టరు ఒక్కసారి విస్మయం చెందాడు, ఎందుకంటే అందరూ డాక్టర్లు అవాలనో, లేక ఇంజినీరో, లాయరో కావాలని అనుకున్నవారే కాని క్లాస్ అంతటిలోకి ఉపాధ్యాయుడవాలని కోరుకున్నది ఒక్క ఆదిత్య ఒకడే!
"బాగానే ఉంది, నాలా ఉపాధ్యాయుడివి అవాలని అనుకున్నావు సరే! ఎందుకు టీచర్ అవాలని అనుకుంటున్నావు?" అడిగాడు సుందరం.
"నేను టీచర్‌ని అయితే ఎంతోమందిని భవిష్యత్తులో డాక్టర్లు, ఇంజినీర్లు, కలెక్టర్లు, లాయర్లు అయ్యే విధంగా తీర్చిదిద్దగలను. అలా చేయటం ఉపాధ్యాయుడికి మాత్రమే సాధ్యం. అందుకే మీలా ఆదర్శ ఉపాధ్యాయుడిని అవాలని నా కోరిక” అన్నాడు ఆదిత్య.
"నువ్వన్నది నిజం. ఎంతోమంది భవిష్యత్తుని తీర్చిదిద్దగల అవకాశం ఒక్క ఉపధ్యాయుడికి మాత్రమే ఉంది. నువ్వు ఉపాధ్యాయుడివి అవుదామనుకోవడం చాలా మెచ్చదగింది." అని మనస్పూర్తిగా చెప్పాడు సుందరం.
నిజమే మరి! భావి భారత పౌరులను తీర్చిదిద్దగల అవకాశం, బాధ్యత కూడా ఉపాధ్యాయులపైనే ఉంది మరి! ఆ మహదావకాశం ఉపాధ్యాయులదే!