హ్యాపీ ఫాదర్స్ డే - శ్రీరాజ్

happy fathers day

అమెరికా డల్లస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో తన తల్లిదండ్రుల రాక కోసం ఫ్లవర్ బొకేలతో ఎదురు చూస్తున్నాడు, ప్రశాంత్. పక్కనే భార్య సౌజన్య, ఆరేళ్ళ కొడుకు అనిక్ ఉన్నారు. ఆమె చేతిలో డిజిటల్ కెమెరా, బాబు చేతిలో వెల్-కం బెలూన్స్ ఉన్నాయి.

ప్రశాంత్ వచ్చిన పదేళ్ళకు తన తల్లిదండ్రులు తొలిసారి అమెరికాలో అడుగు పెడుతున్నారు. తనకి ఎంతో సంతోషంగా, ఉత్సాహంగా ఉంది.

అతను అమెరికాలో ఎమ్మెస్ చదివి, ఐ.టి. ఉద్యోగంలో స్థిరపడ్డాడు. తన తండ్రి చాలీచాలని జీతంతో, ఎన్ని ఆర్ధిక ఇబ్బందులు అడ్డొచ్చినా తన చదువు ఆపలేదు. తన భవిష్యత్తు గురించి ఆలోచన మానలేదు. తన కోసం అమ్మానాన్నలు అహర్నిశలు కష్టపడ్డారు. ఒక కొడుకుగా తన బాధ్యతలు ఎప్పుడూ మరిచిపోలేదు. అందుకే, వాళ్ళను అమెరికా తీసుకు రావాలని, జీవితాంతం సుఖపెట్టాలని ఎన్నోసార్లు ప్రయత్నం చేశాడు. కనీసం తమని చూడటానికి అతిథుల్లాగైనా రమ్మని ప్రాధేయ పడ్డాడు. కానీ, వాళ్ళు ముఖ్యంగా తండ్రి ఒప్పుకోలేదు.

ఇక ఏమీ చేయలేక, తను ఫ్యామిలీతో ప్రతి సంక్రాంతికి వైజాగ్ వెళ్ళటం, సెలవులన్నీ తల్లితండ్రులతో ఆనందంగా గడపటం చేస్తున్నాడు, ప్రశాంత్. అయితే, పని ఒత్తిడి వల్ల క్రితం సంక్రాంతికి వెళ్ళలేక పోయాడు.

ప్రశాంత్ వైజాగ్ లో తన తల్లితండ్రుల కోసం ఓ ఇల్లు కట్టిస్తానంటే, రిటైర్మెంట్ గ్రాట్యుటీతో కొనుకున్న ఫ్లాట్ చాలన్నాడు తండ్రి. కారు కొంటాను..సరదాగా తిరగండి నాన్నా అంటే, నా స్కూటరు ఉంది కదా.. అది మీ అమ్మకీ నాకూ సరిపోతుంది కన్నా అంటారు. డబ్బు పంపిస్తానంటే, పెన్షన్ ఉందంటారు. ఏమీ తన నుంచి ఆశించరు. ఏది ఇవ్వాలనుకున్నా తీసుకోరు. ఆఖరి ప్రయత్నంగా వాళ్ళ కోసం అమెరికా వదిలి, ఇండియా వచ్చేస్తానని తన నిర్ణయాన్ని ప్రశాంత్ తెలియజేశాడు.

“ వద్దురా కన్నా! వద్దు.. నీ భవిష్యత్తు బాగుండాలి. నేను తప్పకుండా అమెరికా వస్తాను... ఈ మట్టిలో కలిసిపోయే ముందు నీ దగ్గరకు కాకుండా ఎవరి దగ్గరకు వెళ్ళ గలను చెప్పు ? ... ”

అప్రయత్నంగా ప్రశాంత్ కళ్ళు చెమ్మగిల్లాయి, తండ్రి మాటలు గుర్తొచ్చి. ‘మై గ్రేట్ ఫాదర్... నాన్న ఎప్పుడూ బావుండాలి.. మాతోనే ఉండాలి’ మనసులో బాబాకి నమస్కరించాడు.

ఇమ్మిగ్రేషన్ పూర్తి చేసుకొని, వీల్ ఛైర్ సహాయకుల సాయంతో రావుగారు, తులసి బయటకు వచ్చారు. అంత దూరంలో వాళ్ళను చూడగానే ఉప్పొంగిన ఆనందంతో అంతా చేతులూపారు. పూలగుచ్ఛాలు అందించి, అమ్మానాన్నల కాళ్లకు నమస్కరించాడు, ప్రశాంత్ . అతనితో పాటు సౌజన్య కూడా అత్తమామలకు నమస్కరించింది. ‘హాయ్ తాతా!... హాయ్ నానా!’ అంటూ మనవడు నాన్నమ్మ ఒళ్ళో ఒదిగిపోతూ, తాతగారి చేతికి బెలూన్లు అందించాడు.

“నాన్నా! మీ ఆరోగ్యం ఎలా ఉంది ? ” ప్రశాంత్ మాటల్లో ఆదుర్దాను గమనించిన రావుగారు నవ్వుకుని, “ నిక్షేపంగా ఉన్నాను... సంక్రాంతికి మీరు రాలేదు కదా , నీ మీద బెంగతో మీ అమ్మ అర్జెంటుగా అమెరికా ప్రయాణం పెట్టింది ” అన్నారు. అప్పుడు గాని, ప్రశాంత్ మనసు తేలిక పడలేదు.

ప్రశాంత్ పోష్ (Porsche) కారు ఫ్రంట్ సీట్లో నాన్న పక్కన కూర్చొని, సరదాగా మాట్లాడుతూ, డ్రైవ్ చేస్తున్నాడు. జూన్ నెల కావడం చేత అసలు చలి అనిపించడం లేదు. వాతావరణం వేడిగా ఉంది. దారి పొడుగునా పచ్చని చెట్లు, ఎత్తైన భవనాలు, విశాలమైన బాటలు, క్రమబద్ధంగా పరుగులు తీస్తున్న వాహనాలు, పరిశుభ్రంగా కనిపిస్తున్న పరిసరాలు, అందం, ఆహ్లాదం మిళితమైన అమెరికా వాతావరణం మొదటిసారి రావుగారు చూస్తున్నారు.

ఎయిర్ పోర్ట్ మొదలు ఇల్లు చేరేవరకు సౌజన్య ఒక వేపు అత్తగారితో కబుర్లు చెబుతూ, మరో వేపు కెమెరాతో ఫోటోలు తీస్తూనే ఉంది.

సువిశాలమైన ప్రదేశంలో అందంగా కనిపిస్తున్న ప్యాలస్ లాంటి ప్రశాంత్ ఇంటి ముందు ‘రావుగారిల్లు’ అనే అక్షరాలు నీరెండకి తళతళ మెరుస్తున్నాయి. కొన్ని క్షణాలు అక్కడే తండ్రి ఆగిపోయాడు, కొడుకు వైపు గర్వంగా చూస్తూ. ఇంటి లోపల అత్యాధునికమైన ఫర్నీచరుతో ఎంతో అందంగా అలంకరించి ఉంది, కిచెన్ ముందు ‘అమ్మ

చేతి ముద్ద’ తింటున్న చిన్ని ప్రశాంత్ ఫోటో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఆ దృశ్యం చూసిన తల్లి కొడుకు ప్రేమాభిమానాలకి మురిసిపోయింది.

రోజంతా ఎంతో సందడిగా గడిచింది. బిజినెస్ క్లాసులో ప్రయాణం చేయడం వల్ల జెట్ ల్యాగ్ ఫీలింగ్ ఏమీ లేదు. అమెరికా జీవితం ఆస్వాదిస్తున్న తన కొడుకూ కోడల్ని తనకున్న చాలా సందేహాలను అడిగి నివృత్తి చేసుకున్నారు, రావుగారు. ఇంటి విషయాలు, నాన్న స్నేహితులు, వాళ్ళ యాక్టివిటీ గురించి అడిగి తెలుసుకున్నాడు, ప్రశాంత్. డైనింగ్ టేబులు దగ్గర అమ్మతో సరదాగా కబుర్లు చెప్పాడు. ఇంటికి వచ్చి , అమ్మకి యోగా పాఠాలు నేర్పించే టీచర్, పక్కింటి ఆంటీ, ఆవిడ పనిమనిషి మీద జోకులు వేసి, అందర్నీ నవ్వించాడు.

రావుగారు మనిషి తగ్గారు. అతనిలో మునుపటి ఉత్సాహం కూడా లేదు. తండ్రిలో వచ్చిన మార్పును ప్రశాంత్ గమనించాడు.

“నాన్నా! మీ కోడలు వీకెండ్ ప్రొగ్రామ్స్ చాలా ... అంటే పిట్స్ బర్గ్ టెంపుల్, న్యూయార్క్ సిటీ, నయాగరా ఫాల్స్, వాషింగ్టన్ డి.సి., ఫ్లోరిడా, లాస్ ఎంజిల్స్, లాస్ వేగస్, గ్రాండ్ కెన్యాన్, ఇంకా ... అబ్బో మీకు చూపించడానికి చాలా ఉన్నాయి. అమ్మా, మీరూ రెడీగా ఉండండి ”

“ అవును... మావయ్య గారూ! ఒక్కో వారం ఒక్కో ప్రదేశానికి వెళ్దాం ... మీరు బాగా ఎంజాయ్ చేస్తారు” సౌజన్య హుషారుగా చెప్పింది.

కాసేపు తాతగారితో, మరి కాసేపు నానమ్మతో అనిక్ ఆడుతూనే ఉన్నాడు.

“ తాతా ! యూ నో... టుమారో యీజ్ ఫాదర్స్ డే ... మరి నీ డాడీ ఏడీ ? ”

“ నువ్వే నా డాడీ ... యూ ఆర్ మై ఫాదర్ ... ” రావుగారు ముద్దుల వర్షం కురిపించారు మనవడి బుగ్గల మీద. అంతా హాయిగా నవ్వుకున్నారు. అనిక్ తో బాటు ఇంట్లో అందరికి దిష్టి తీసింది, తులసి.

మెయిన్ లెవెల్ లో అమ్మానాన్నల కోసం ఏర్పాటు చేసిన పడక గది చూపించి, గుడ్ నైట్ చెప్పాడు, ప్రశాంత్.

పడుకునే ముందు తాగమని సౌజన్య రెండు కప్పులతో వేడి పాలు అత్త్తగారి చేతికిచ్చింది. అనిక్ తాతగారిని నానమ్మని వాటేసుకొని ‘గుడ్ నైట్’ అన్నాడు ముద్దుగా.

*** *** ***

అర్ధరాత్రి రెండు గంటలు సమయం . సెక్యూరిటీ సైరన్ చెవులు చిల్లులు పడేలా మోగుతోంది. ఆగంతకులు ఎవరో ఇంట్లోకి చొరబడినట్లు హెచ్చరిస్తుంది. ఇల్లంతా ఏడీటి సెక్యూరిటీ ప్రొటెక్షన్ లో ఉంది. పాస్ కోడ్ ఎంటర్ చేసి, సెక్యూరిటీ ఆఫ్ చేస్తే గాని లోపలకు ప్రవేశించే వీలుకాదు. దానికి విరుద్ధంగా జరిగితే, విరామం లేకుండా సెక్యూరిటీ సైరన్ వినిపిస్తూ ఉంటుంది.

ప్రశాంత్ తుళ్లిపడి లేచాడు. గబగబా గదిలో లైట్లన్నీ వెలిగించి, సిసి కెమెరా చూశాడు. మెయిన్ ఎంట్రన్సు తలుపులు తెరిచి ఉన్నాయి. ఇంట్లోకి దొంగలు చొరబడ్డారని తెలుస్తుంది, చిన్నచిన్న చప్పుళ్ళు వినిపిస్తున్నాయి. డ్రైవ్ వే మీద వడివడిగా వెళ్లిపోతున్న ముసుగు మనిషి ఒకడు కనిపించాడు. అంతే ... క్షణం ఆలస్యం కాకుండా ప్రశాంత్ పిస్టల్ తీసి, రేంజ్ లో అస్పష్టంగా కనిపిస్తున్న వ్యక్తిని షూట్ చేశాడు. ముసుగు మనిషి నేలకు ఒరిగి పోయాడు. అతను పిస్టల్ తీసింది మొదటి సారైనా గురి తప్పలేదు.

సౌజన్య, అనిక్ భయంతో వణికి పోతున్నారు. ప్రశాంత్ ఎమర్జెన్సీ నెంబర్ -911 కి కాల్ చేశాడు.

“నాన్నా! అమ్మా, మీరూ గదిలోనే ఉండండి... బయటికి రావద్దు.... ” అంటూ కిందికి దిగి, మెయిన్ లెవెల్ కి వచ్చాడు. ఎదురుగా ఆందోళన పడుతున్న అమ్మ కనిపించింది. తల్లికి ధైర్యం చెబుతూ, గదిలోకి వెళ్ళమన్నాడు. అనుమానించిన అన్ని వైపుల వెదికాడు. ఎవరూ కనిపించలేదు. తనలో కొంత టెన్షన్ తగ్గింది.

“ కన్నా ! మీ నాన్న కనిపించడం లేదురా ... ఎటు వెళ్లారో?... అప్పుడప్పుడు నిద్రలో నడుస్తూ అటూ ఇటూ వెళ్లి పోతున్నారు. ఆ మధ్య డాక్టరు అంకుల్ నాతో చెప్పారు, అదేదో అల్జీమర్స్ ... మతి మరుపు జబ్బట... నీకిమ్మని మెడికల్ రిపోర్టులు కూడా యిచ్చారు... అమెరికాలో పెద్ద డాక్టర్లకి చూపించమన్నారు ... ”

అమ్మ మాటలకు ప్రశాంత్ తుళ్లి పడ్డాడు. చేతిలో గన్ జారి కింద పడింది. అయోమయంగా బయటకు పరుగు తీశాడు. నేల మీద నిర్జీవంగా పడి ఉన్న వ్యక్తి మొహం మీద దుప్పటి లాగి చూశాడు.

అంతే! అతను ‘నాన్నా!’ అని బిగ్గరగా అరిచి, తండ్రి మీద కుప్ప కూలి పోయాడు.

ఒక వైపు పోలీసు ఎమర్జెన్సీ కారు, మరో వైపు సెక్యూరిటీ వ్యాన్ సైరన్ చేసుకుంటూ వచ్చాయి . ఆ హడావిడికి వీధిలో ఉన్న చాలా ఇళ్ళలో లైట్లు వెలిగాయి.

*** *** ***

హాస్పిటల్ బెడ్ మీద ఉన్న ప్రశాంత్ స్పృహలోకి వచ్చాడు. ఇండియన్ డాక్టరు ఒకరు పక్కన ఉన్నారు. ఎదురుగా అమ్మ, సౌజన్య, బాబు కన్నీటి కళ్ళతో దీనంగా కనిపించారు. వాళ్ళను చూడగానే తనలో దుఃఖం తన్నుకొచ్చింది. డాక్టరు చెయ్యి గట్టిగా పట్టుకొని భోరున ఏడ్చాడు.

“ఈ చేతులతో నాన్నను చంపుకున్నాను... బతికే అర్హత నాకు లేదు. నన్ను చావనివ్వండి...డాక్టర్... ప్లీజ్..”

“ లేదు... తల్లిదండ్రుల పట్ల కృతజ్ఞత కలిగిన నీలాంటి కొడుకు బతకాలి... నీ ప్రేమ ముందు చావు కూడా తల వంచింది. మీ నాన్నకు ఏమీ కాలేదు ... అటు చూడు ”

అప్పుడే రూం లోకి అడుగు పెడుతున్న రావుగారిని చూపించాడు, డాక్టరు.

ప్రశాంత్ పరుగున వెళ్లి, రావు గారి భుజాల మీద వాలి పోయాడు. సంభ్రమాశ్చర్యాలతో కొన్ని క్షణాలు పసివాడిలా నాన్నను వదిలి పెట్ట లేదు.

“ హ్యాపీ ఫాదర్స్ డే ” ఆర్తి నిండిన స్వరంతో కొడుకు తెలిపిన శుభాకాంక్షలు ఓ వేద మంత్రంలా ఆ తండ్రికి వినిపించాయి.

మరిన్ని కథలు

Bakkati pellam-laavati mogudu
బక్కటి పెళ్ళాం - లావాటి మొగుడు
- మంత్రిప్రగడ ఆంజనేయులు
Barlo taagudu intlo vaagudu
బార్లో తాగుడు - ఇంట్లో వాగుడు
- మంత్రిప్రగడ ఆంజనేయులు
Panipilla
పనిపిల్ల (క్రైమ్ కథ)
- చెన్నూరి సుదర్శన్
Bhavaateetam
భావాతీతం
- DODDIPATLA KALYAN KISHORE
Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు