బంగార్రాజు బంగారులక్ష్మిని తొలిచూపులోనే ప్రేమిస్తే, ఆమె అతన్నిమలిచూపులో ప్రేమించింది. వాళ్ళ ప్రేమ మూడు పార్కులూ, ఆరు సినిమాలుగా వర్ధిల్లింది. వాళ్ళ ప్రేమకి పార్కులో చెట్లూ, పుట్టలేకాక సిమెంటు బెంచీలు కూడా సాక్ష్యాలుగా, అలాగే బీచ్‌లో ఇసుక, సముద్రంలో కెరటాలు కూడా మూగ సాక్ష్యాలుగా నిలిచాయి. అంతేకాక పార్కులో పల్లీలబ్బాయి, బీచ్‌లో పానీపూరీవాడు ప్రాణమున్న సాక్ష్యులుగా తమ వంతు పాత్ర పోషించారు. ప్రేమికులుగా వెళ్ళినచోటకి వెళ్ళకుండా, తిరిగిన చోటకి తిరగకుండా తిరిగి ముచ్చటగా మూడునెలలు గడిపారోలేదా, వాళ్ళ డ్యూయెట్లు బంగారులక్ష్మి తండ్రి బలవంతరావు కళ్ళల్లో పడ్డాయి. పేరులాగే బలవంతరావు బలవంతుడే కాక భాగ్యవంతుడుకూడా! ఆ పట్టణంలోనే పెద్దదైన బంగారం షాపు యజమాని అయిన బలవంతరావు కూతురు పుట్టిన తర్వాత తనకు ఆ వ్యాపారంలో బాగా కలిసిరావడంవల్ల ఆమెకి బంగారు లక్ష్మి అని పేరుపెట్టి అల్లారుముద్దుగా పెంచాడు. వాళ్ళిద్దరి ప్రేమ అతనికి కిట్టలేదు. పెళ్ళికైనా, పేరంటానికైనా సమ ఉజ్జీయే ఉండాలని అతని అభిప్రాయం.
బంగారులక్ష్మిని పిలిచి, "నేను వజ్రంలాంటి సంబంధం నీ కోసం తెచ్చాను. అబ్బాయి వజ్రాల వ్యాపారి వజ్రేశ్వర్రావు ఏకైక కుమారుడు వజ్రేష్. నువ్వు ప్రేమిస్తున్న బంగార్రాజుకి పేరులోనే బంగారం ఉంది కాని అతను చేసేది మాత్రం ఇత్తడి సామన్లు తయారు చేసే కర్మాగారంలో గుమస్తా ఉద్యోగం. అతను మన అంతస్థుకి ఏమాత్రం సరితూగడు. నిన్ను సుఖపెట్టలేడు. అతన్ని మరిచిపోయి వజ్రేష్‌ని పెళ్ళాడు. ఈ పెళ్ళితో మన అంతస్తు, పరపతి కూడా పెరుగుతాయి." అన్నాడు బలవంతరావు. బంగారులక్ష్మి ముందు ఎదిరించింది, తర్వాత మొత్తుకుంది, ఆ తర్వాత ఏడ్చింది. ఓ పూట నిరసనగా భోజనం చేయడం మానేసింది. పంతంపట్టి పానీపూరీ తినడం కూడా మానేసింది. అయినా తండ్రి బలవంతరావు మనసు ఏ మాత్రం కరగలేదు. చివరాఖరికి రెండురోజులు దీర్ఘంగా ఆలోచించి…చించి, బలవంతరావు తెచ్చిన సంబంధాన్ని బలవంతంగా ఒప్పుకుంది.
ఆ విధంగా వాళ్ళ ప్రేమ కూడా దేవదాసు పార్వతి, రోమియో జూలియెట్, సలీం అనార్కలిలాంటి భగ్నప్రేమికుల జాబితాలోకి చేరిపోయింది. తమ ప్రేమకి,పెళ్ళికి బలవంతరావు శుభం కార్డు వెయ్యడానికి ఒప్పుకోలేదన్న సంగతి బంగార్రాజుకి తెలిసిపోయింది. అందుచేత, తమ ప్రేమ విఫలమైందని బంగార్రాజు ఎంత కుమిలిపోతున్నాడో పాపం అని, అతనింటికి ఓదార్పు యాత్రకి బయలుదేరింది బంగారులక్ష్మి. అతని రూముకి వెళ్ళేసరికి, బంగార్రాజు మూడుకాళ్ళ కుర్చీలో కూర్చొని టీపాయి మీదున్న గ్లాస్‌లో మందు వంపుకొని, సోడా కలుపుకుంటున్నాడు. జుట్టంతా దేవదాసులా చెదిరిఉంది. గడ్డం మాసింది. బంగార్రాజు దేవదాసు వాలకం చూసి బంగారులక్ష్మి కళ్ళనీళ్ళు పెట్టుకుంది.
"నన్ను మర్చిపో దేవదా, సారీ బంగార్రాజూ, మా నాన్న కుదిర్చిన సంబంధం చేసుకోక తప్పదు నాకు. నువ్వు మాత్రం ఇలా దేవదాసులా మందు కొడితే నేను భరించలేను. గంతకు తగ్గ బొంతలా నీకు తగ్గ అమ్మాయిని పెళ్ళిచేసుకొని సుఖంగా ఉండు. నన్ను మర్చిపో! నువ్వు బాధపడకు." అని బంగార్రాజుని ఓదార్చి వచ్చిన దారినే తిరిగి వెళ్ళింది.
బంగారులక్ష్మి వెళ్ళిపోయాక, "బాధపడటమా, నా బొంద! ఇంట్లో షేవింగ్‌బ్లేడ్ లేక షేవింగ్ చేసుకోలేదు, అది చూసి జడుసుకుంది. ప్రేమ భగ్నమైందని తాగుతున్నానని అనుకుంది తింగరిది, కాని నేను ఈ సంతోషాన్ని సెలెబ్రేట్ చేసుకోవడానికి తాగుతున్నానని ఆమెకెలా తెలుస్తుంది? నెలజీతమంతా పల్లీలకి, పానీపూరికీ, ఐస్‌క్రీములకీ, సినిమాలకి, గిఫ్ట్‌లకీ అయిపోతే నా గతేం కాను? ఇప్పటికే అప్పులపాలయ్యాను. ఇప్పటికైనా వదిలింది." అని పెద్దగా నవ్వాడు భగ్నప్రేమికుడిగా మారని బంగార్రాజు.
బంగారులక్ష్మి కారెక్కి, 'నాన్న తెచ్చిన వజ్రేష్ సంబంధమే బాగుంది! ఈ రెండు రోజుల్లో రెండు వజ్రాల నెక్లెస్లు, రెండు వజ్రాల ఉంగరాలు కానుకగా ఇచ్చాడు. నిన్న ఫైవ్ స్టార్ హోటల్లో మంచి డిన్నరిచ్చాడు. బంగారాజు దగ్గరేముంది నా బొంద! పానీపూరి మరోసారి కొనమంటనే ఏడుస్తాడు. కొన్న పల్లీల్లో సగంకన్నా ఎక్కువ తనే తినేస్తాడు. ఎంతైనా నాన్న తెచ్చిన సంబంధమే సూపర్!' మనసులో ఆనందంగా అనుకుంది.
ఆ తింగరి ప్రేమికుల మనసులోని మాటలు విన్న పైనున్న దేవదాసు పార్వతి తదితర భగ్నప్రేమికులంతా నివ్వెరపోయి ముక్కుమీద వేలేసుకున్నారు.