అవి నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న రోజులు.
మా ఇంగ్లీషు లెక్చరర్ శ్రీనివాస్ గారు ట్రాన్స్ఫర్ అయ్యారు. ఆయన స్థానంలో పీటర్ సార్ వస్తున్నారని తెలిసింది. ఆయన చాలా స్ట్రిక్ట్ అని మా స్టూడెంట్స్ అంతా గుసగుసలాడుకున్నారు.
పీటర్ సార్ రానే వచ్చారు.మొదటి రోజు అందరి పరిచయ కార్యక్రమాలు అయ్యాయ్యి. “స్టూడెంట్స్..స్టూడెంట్స్ లాగా ఉండాలి రోడ్ సైడ్ రోమియోల్లా ఉండ కూడదు” అని చెప్పారు.”అందరం అలాగే సార్!” అన్నాము. సార్ లెసెన్స్ చెబుతూనే ప్రతి ఒక్కరినీ పరిశీలనగా చూసేవారు.ఒకరిద్దరు చొక్కా పై గుండీని పెట్టుకోకుండా వదిలేశారు.అలా వదిలేసిన వారి దగ్గరకు వెళ్ళి “ఆర్ యూ రోడ్ సైడ్ రోమియో? ప్లీజ్ పుట్ ద బటన్ ఫస్ట్” అని కోప్పడ్డారు.
ఏ లెక్చరర్ క్లాసులో అయినా మేము మా ఇష్టం వచ్చినట్లు ఉండే వాళ్లం కానీ పీటర్ సార్ క్లాస్‌లో చాలా జాగ్రత్త పడేవాళ్లం. మా క్లాస్‌లో ప్రసాద్ అనే అతను ప్రతి విషయానికీ పందెం అనే మాట వాడే వాడు. ఎవరితో అయిన పందెం కట్టాడంటే అతను గెలవాల్సిందే.
మా గ్రూప్ ఫ్రెండ్స్‌లో నాకు మంచి పేరుంది. “ఒరే శేఖర్! నీవు ప్రసాద్‌తో పందెం కట్టి ఎలాగైనా గెలిచి మన గ్రూప్ పేరు నిలబెట్టాలిరా!” అన్నాడు శివ. నేను దానిని సవాలుగా తీసుకున్నాను. ఒక రోజు ప్రసాద్‌తో “నాతో పందెం కాయగలవా?” అన్నాను.
“పందెం ఏంటో చెప్పు” అన్నాడు ప్రసాద్.
“పీటర్ సార్ క్లాస్‌లో నీవు క్లాస్ మొత్తం చొక్కా పై రెండు గుండీలు పెట్టుకోకుండా ఉండాలి...నువ్వు గెలిస్తే వంద రూపాయలిస్తాను. ..నువ్వు ఓడిపోతే మాత్రం ఇంకెప్పుడూ పందెం మాట ఎత్త కూడదు!” అన్నాను.
“ఓ అలాగే ఈ పందెం నేను ఒప్పుకుంటున్నాను” అన్నాడు. మరుసటి రోజు పీటర్ సార్ క్లాస్ మొదలయ్యింది. లెసన్ చెబుతూ స్టూడెంట్స్‌ను గమనిస్తున్నారు. సార్ కంట్లో ప్రసాద్ పడనే పడ్డాడు.
“ప్రసాద్! గెటప్ అండ్ పుట్ ద షర్ట్ బటన్స్” అన్నారు కాస్త కోపంగా.
“సార్! బటన్స్ ఊడి ఎక్కడో పడిపోయాయి” అన్నాడు ప్రసాద్. ఏం జరుగుతుందోనని నేను మా వాళ్లు ఎదురు చూడసాగాము.
“నో ప్రాబ్లం మై డియర్ ఫ్రెండ్ ఇట్స్ వెరీ కామన్” అని సార్ చొక్కను పైకెత్తి మొల తాడును బయటకు తీశారు. దానికి నాలుగు పిన్నీసులు ఉన్నాయి. రెండు పిన్నీసులను తీసి స్వయంగా ప్రసాద్ చొక్కాకు గుండీల స్థానంలో పెట్టి...యు ఆర్ నాటే రోడ్ సైడ్ రోమియో...డోంట్ రిపీట్ వన్స్ అగైన్” అని వార్నింగ్ ఇచ్చారు.
ప్రసాద్ బక్క చిక్కి పోయాడు. సార్ క్లాస్ అయిపోగానే “శేఖర్ పందెం నువ్వే గెలిచావు” అన్నాడు మొఖం వేళ్లాడేసుకుని. ఎలాగైతేనేం మన గ్రూప్ పేరు నిలబెట్టవురా అన్నారు నా స్నేహితులు. అన్న మాట ప్రకారం ప్రసాద్ ఇంటర్ రెండు సంవత్సరాలయ్యే వరకు పందెం మాట ఎత్తితే ఒట్టు.