ముళ్ల చక్రం - రామకృష్ణ డి

The wheel of thorns

బ్రతకడానికి చాలా బాగుంటుంది అని పాతికేళ్ల తర్వాత విశ్వనాధం తన సొంత ఊరు కుటుంబంతో సహా కలిసి వస్తున్నాడు. మార్గ మధ్యలోనే తన చిన్ననాటి జ్ఞాపకాలు ఆ పల్లెటూరితో తనకున్న అనుబంధాల్ని గుర్తు చేసుకుంటున్నాడు. ప్రధాన రహదారికి ఒక కిలోమీటరు దూరంలో ఉన్న వాళ్ళ గ్రామం క్రిష్ణపల్లి అంటే తనకు ఎంతో మక్కువ.

రోడ్డుకి ఇరువైపులా పచ్చని పంట పొలాలు, ఊరి ముందు ఒక పెద్ద చెరువు చెరువులో చూడ చక్కని కలువ పువ్వులు, నీటిలో రకరకాల చేపలు, వాటిని వేటాడటానికి పైన తిరుగుతున్న కొంగలు, పిచ్చుకల కిచ కిచలు, రామచిలుకల అందాలు, ఆకాశమే హద్దుగా ఎగురుతున్న గ్రద్దలు, ఎంతటి చెట్టునైన తొర్రలు చేసే వడ్రంగి పిట్ట శబ్దాలు, కోకిల మధుర గానాలు అన్నీ ఆ ఊరి సొంతం.

రోడ్డు వెంబడి చిన్న పిల్లల టైరు బండి ఆటలు, బావి దగ్గర అందమైన ఆడపడుచుల ముచ్చట్లు, రచ్చబండ దగ్గర పెద్దవారి సమూహపు సమావేశాలు, అరుగు మీద ముసలి వారి ముచ్చట్లు ఇవే ఆ ఊరికి ఎప్పుడూ కోలాహలం. దాదాపు ప్రతీ ఇంటికి బండి ఎడ్లు,దున్నలు. ఇంట్లో ఒక మూల మునకాల కర్ర, పూజు, పలుపు,పడుగు.ఇంకో మూల గునపాం, గుజ్జపార, పార, కత్తి, గొడ్డలి. అట్టుకు మీద వివిధ రకాల కుండల్లో బిందెల్లో అనేక రకాల వంటకాలు, వంటకి కావాల్సిన ముడిసరుకు. అట్టుకకు వేలాడే ఉట్టిలో అన్నం,చారు,కూర,పెరుగు,మజ్జిగ. ఇంటి ముందు గాడీ బుట్టి, బుట్టిలో ధాన్యం, ఇంటికో గోశాల అందులో ఆవులు గేదెలు దూడలు, ఒక పక్కగా నాగలి, నొల్ల చెక్క, గరిసె. అది వారి సంసారం. పొద్దున్నే గిన్నెడు అంబలి, తరువాత పొలంలో ఉల్లిపాయ మిరపకాయతో గిన్నెడు సల్ది అన్నం, పెసలు, మినువులు, ఉలవలు, శెనగలు, నూలు వేపుకొని ఉడకబెట్టి ఇంకా రకరకాలుగా తయారు చేసి సాయంత్రపు ఆహారం కింద సరదాగా తీసుకోవడం.

పండగలకి పబ్బాలకి నాటుకోడి, వేట మాంసం రుచులే వాళ్ళకి అసలు పండగ రుచి. చెరువుల్లో కాలువల్లో పట్టే రొయ్యలు, సుక్క మిట్ట, తాటి మిట్ట, తాటి గిడుసు, సవడలు, జలకొయ్యలు, మార్పులు, ఇంగ్లాలు, బొమ్మిడాలు, బొచ్చులు, పిత్త పరిగిలు, బేడ్సు పెరిగి, బంగారు పాప మొదలైన చేపలు దొరికేవి. ఇంకా స్వచ్ఛమైన మామిడి పండ్లు, తాటి ముంజలు, తియ్యేరుగు, తాండ్ర, పనసపండు, ఊరి పొలిమేరల్లో ఉన్న రకరకాల పండ్లు తినటం. ఇవే వారి ఆహారపు అలవాట్లు అంత చక్కగా ఆరోగ్య కరంగా ఉండేవి. ఆ ఊరిలో ఉన్న పాఠశాలలో చక్కని చదువు చెప్పేవారు, భారం లేని విద్య నేర్పేవారు. సాయంత్రం వేళల్లో చక్కగా ఆట పాటలు ఆడుకునేవారు. బామ్మ, తాతయ్య, నాయనమ్మ మొదలైన పెద్దవారి వద్ద కబుర్లు, కథలు చెప్పుకుంటూ కొత్త విషయాలు, మంచి విషయాలు, సాంస్కృతిక అలవాట్లు నేర్చుకునేవారు. కబడ్డీ, వాలీబాల్, గుంటాట, టీకాట, గోళీలు, గాలీ వాన, కోతి కొమ్మచ్చి, క్రికెట్, కోకో, రాముడు సీత, మొదలైన ఆటలు వారికి ప్రధాన క్రీడలు.

ముఖ్యంగా వారికి సమయంతో పని లేదు, పలానా సమయానికి పలానా పని చెయ్యాలి అని కచ్చితమైన నియమాలు ఏమి లేవు. వాతావరణాన్ని బట్టి వారి దిన చర్య ఉండేది. తెల్లారితే పొలంలోకి వెళ్లడం, చీకటి పడ్డాక ఇంటికి వచ్చెయ్యడం. అన్ని కాలాల్లో పనులు ఉండేవి కావు, ఋతువులు కాలాల్ని బట్టి వారికి పనులు ఉండేవి మిగతా సమయంలో ఇంటి దగ్గర ఊర్లో చెట్ల కింద చల్లగా ఉన్న చోట అందరూ కలిసి చక్కగా కబుర్లు చెప్పుకుంటూ కలిసి మెలిసి ఉండేవారు. గడియారం ఏ వీధి చివరనో లేకా కాస్త సంపన్నుల కుటుంబంలో మాత్రమే ఉండేవి, టైం తెలుసుకోవాలి అంటే వారి ఇంటికి వెళ్లి తెలుసుకొని వచ్చే వారు, లేదా ఆకాశవాణి రేడియో కేంద్రాలలో చెప్పే సమయం ద్వారా తెలుసుకునే వారు. ఒక్కోసారి సమయం చెప్తారు అనే అక్కడ కాసేపు రేడియో విని సమయం తెలుసుకునే వారు. విశ్వనాథ్ గత ఆలోచనలోనుంచి బయటకి వచ్చాడు.

తన స్వగ్రామం కి వెళ్ళే రహదారికి చేరుకున్నారు. మట్టి రోడ్డు రోడ్డు మీద పిల్లల టైరు బండి ఆటలు లేవు, సిమెంట్ రోడ్డు ఐపోయి రహదారి కాలీ లేకుండా బైకులు, ఆటోలు, వివిధ రకాల వాహనాలతో నిండిపోయి ఉంది. రోడ్డుకి ఇరువైపులా ఉండాల్సిన పచ్చని పంట పొలాల స్థానంలో లే అవుట్లు 'రియల్ ఎస్టేట్ పేరిట ఇళ్ళ స్థలాలు' వేసేశారు. ఊరికి ముందు ఉన్న చెరువులో ఉండాల్సిన కలువ పువ్వులు లేవు. ఉపాధి హామీ పథకం పేరిట చెరువు అంతా తవ్వించడం వలన అనుకున్నాడు. ఇంకా ఇంటికి చేరుకోక ముందే ఇంత మార్పు ఉంది ముందు ముందు ఇంకెలాంటి మార్పులు చూస్తానో అనుకున్నాడు

మనసులో. కొన్ని రోజుల పాటు తన స్వగ్రామాన్ని గమనించాడు తన చిన్న నాటి స్వగ్రామాన్ని నేటి స్వగ్రామాన్ని పోల్చి చూస్తే చాలా మార్పులు సంభవించాయి. వ్యక్తిగత ఎదుగుదల, ఆర్థిక అభివృద్ది బాగుంటుంది అని చిన్నప్పుడే తెలిసిన వారి ద్వారా పట్టణంలో పెరిగి పెద్దయ్యాడు. అక్కడ పరిస్థితులు ఇతరులతో సత్సంబంధాలు రోజు రోజుకీ కొరవడుతున్నాయి. అక్కడి ఆహారపు అలవాట్లు వంటకు కావాల్సిన ముడి సరుకు రోజు రోజుకీ కల్తీ ఐపోతున్నాయి. ముఖ్యంగా ప్రతీది సమయానుకూలంగా చెయ్యాలి, పొద్దున్న లేచిన దగ్గరినుండి రాత్రి నిద్రపోయేదాకా సమయాభావం పాటిస్తూ చెయ్యాల్సిందే. పని చేసే కార్యాలయంలో కూడా టార్గెట్లు, ఒకరి కింద లేదా మరొకరకి లోబడి చెయ్యాలి, పలానా సమయానికి పలానా పని పూర్తి చెయ్యాలి అని.

ప్రతీ పని సమయానికి చెయ్యడం తప్పు కాదు, కానీ చేసేటప్పుడు కూడా మనసుకి శాంతం ఉండదు. 'మన జీవితం మనం శాసించే విధంగా ఉండాలి, కాలాతీతంగ మన పయనం పరుగులు పెట్టాలి, కానీ కాలం మనల్ని సాసిస్తూ సాధిస్తూ అందులో ఉన్న ముళ్ళు మనల్ని ప్రతీ క్షణం గుచ్చుతున్న ముళ్ల చక్రం లా ఉండకూడదు.' అనే ఉద్దేశంతో తన జన్మ స్థలంలో ఆ ముళ్ల చక్రం తో అంత పని ఉండదు. తనకు ఉన్న ఐదు ఎకరాల పొలం చేసుకుంటూ పల్లె టూర్లో ఉన్న అందమైన ఆహ్లాదకరమైన వాతావరణం మధ్య చక్కగా బ్రతుకుదాం అని తన స్వగ్రామానికి వచ్చేశాడు. ఇప్పుడు ఇక్కడ పరిస్థితులు చూస్తుంటే తను ఊహించిన దానికి భిన్నంగా ఉన్నాయి.

అప్పుడు ఉన్నంత అందమైన ఆహ్లాదకరమైన వాతావరణం లేదు, పొద్దున్న లేచిన దగ్గర నుండి రాత్రి నిద్రపోయేదాకా వీరి జీవన గమనం కూడా మారిపోయింది. తెల్లారితే పక్షుల కిచ కిచలు, కోయిల గాత్రాలు ఏమి లేవు, వాతావరణ కాలుష్యం వలనా లేకా మొబైల్ టవర్ల రేడియేషన్ వలనా లేకా స్వచ్చమైన నీరు సమయానికి దొరకకపోవడం వలనో వీటన్నీటి కారణం చేతనో దాదాపు పక్షులు కనుమరుగైపోతున్నాయి. తెల్లారితే రాగి జావ తినేవారు పోయి ఇప్పుడు అంతా టిఫిన్ లకు అలవాటు పడిపోతున్నారు. స్వతంత్రంగా పెరిగే కోడి, వేట మాంసం స్థానంలో కృత్రిమంగా మందుల ద్వారా పెంచే కోడి మాంసానికి అలవాటు పడిపోతున్నారు. ఆ రోజుల్లో దొరికే రక రకాల చేపలు ఇప్పుడు దొరకడం లేదు, వేరు వేరు ప్రదేశాల నుండి ఐస్ గడ్డల్లో ఉంచిన చేపలకి అలవాటు పడిపోయారు. అప్పుడు తిన్న ఆరోగ్యకరమైన చిరుధాన్యాలు వాటినుండి లభ్యమయ్యే వివిధ రకాల వంటకాలు ఇప్పుడు తినటం మానేశారు. పానీపూరి, చాట్, న్యూఢిల్స్ మొదలైన అనారోగ్య కరమైన చిరు తిళ్లుకు అలవాటు పడిపోయారు. ప్రాథమిక పాఠశాలకు స్వేచ్చగా వెళ్ళేవారు ఆ రోజుల్లో. ఇప్పుడు అదంతా పోయి, ప్రైవేట్ పాఠశాల విద్య ఉన్నత విద్య అనుకొని వేలకు వేలు ఫీజులు కట్టి భారమైన బరువు ఉన్న పుస్తకాలతో ఆటోల్లో బస్సుల్లో కిక్కిరిసి పంపించేస్తున్నారు తల్లి తండ్రులు.

ఇంటి పెద్దల వద్ద కథలు, మంచి విషయాలు నేర్చుకోవడం మానేశారు. ఆరోగ్య కరమైన ఆటలు కనుమరుగు ఐపోయి ఏ పిల్లవాడిని అడిగినా ఆటలు అంటే చరవాణిలో ఆటలు పేర్లు చెప్తున్నారు అవే ఆడుతున్నారు. పల్లెటూరు లో కూడా సమయం యొక్క నియమాలు ఎక్కువ ఐపోతున్నాయి, సమయాన్ని నియమంగా పాటించడం తప్పు కాకపోయినా ఇక్కడ కూడా ముళ్ల చక్రం లాంటి సమయం రోజు రోజుకీ ముంచుకొస్తుంది. కానీ..! ఇంకా మనం నియమించుకున్న నియమాలలో ఉంది పల్లె వాతావరణం. పట్నంలో మనం ఎంత కాదు కూడదు అనుకున్నా.. దాదాపు ముళ్ల చక్రం చుట్టూ తిరగాల్సిందే. మనకి సాధారణంగా లభ్యమయ్యే ఆహారపు పంట, చిరుధాన్యాలు, తాజా కూరగాయలు, ఇతరత్రా స్వచ్ఛమైన ఆహార పదార్థాలు మనకి కావాలి అనుకుంటే కచ్చితంగా దొరికే అవకాశాలు ఉండనే ఉన్నాయి. ఒకప్పటి రోజుల నుండి ఇంకా పూర్తిగా ఆధునికం పేరుతో బయటకు రాకుండా.. సాంస్కృతి సాంప్రదాయాలకు విలువలనిస్తూ గడుస్తున్న కుటుంబాలు చాలానే ఉన్నాయి. మనం ఏది చెయ్యాలి ఏది చెయ్యకూడదు, ఎలాంటి ఆహారం తీసుకోవాలి, పిల్లల్ని ఏ విధంగా పెంచాలి చదివించాలి,

పల్లె జనాలు కొంత మంది అటు ఇటుగా కొట్టు మిట్టాడుతున్న వారికి సమకాలీనం చేస్తూ ఆదర్శంగా ఎలా నిలవాలో తానే ఒక ఉదాహణగా ఉండాలి అనే దృఢ నిశ్చయం తీసుకున్నాడు విశ్వనాధం. చక్కని ప్రకృతి మధ్య తనుకున్న ఐదు ఎకరాల పొలంలో ఏ పంట పండించుకోవాలి, పంట కలుషితం కాకుండా ఎలా పండించి కోవచ్చు, తన పంట ద్వారా మరో పది కుటుంబాలకు మంచి ఆహారం అందివ్వగలను అనే విశ్వాసంతో ముళ్ల చక్రానికి దూరంగా రథ చక్రానికి (ఎడ్ల బండికి) దగ్గరగా అడుగులు వేశాడు విశ్వనాధం.

మరిన్ని కథలు

Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaalani kaagitam
కాలని కాగితం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు