తుషారిక (హాస్య కథ) - చెన్నూరి సుదర్శన్

tusharika comedy story

బ్రహ్మానందం ప్యాంటు సైడు జేబులో నుండి చిల్లర డబ్బులు కొట్టేద్దామని.. దొంగలా చెయ్యి పెట్టగానే, కడక్ నోటు తగిలినట్టై కీచుమన్నాడు అతని బామ్మర్ధి భద్రయ్య ఉరఫ్ భద్రి. సిగ్గు పడుకుంటూ.. మూడు వంకర్లు తిరిగాడు.

“ఏం బామ్మర్ధీ.. అలా కేక పెట్టావేం?..” అనుకుంటూ కళ్ళెగురవేశాడు బ్రహ్మానందం. ఈమధ్య తల్లి చనిపోయినప్పు డు కొట్టించుకున్న గుండు తెల్లగా మొలకెత్తితే, నల్లరంగు వేసుకుంటూ.. భద్రి చెయ్యిని గమనించ లేదు.

“బావా.. నీ జేబులో జానెడు పొడుగుతో ఏదో తగిలింది” అంటూ దేబముఖం పెట్టేడు భద్రి.

“ఓ.. అదా..! తుషారిక.. చెయ్యి ఎందుకు పెట్టావు”

“తుషారిక అంటే ఏంటి బావా..!”

“మన ఎదుటి వారు మాట్లాడుతుంటే మనకు నచ్చనప్పుడు వాళ్ళ ముఖాల మీద చల్లుతాం చూడూ! అదే బామ్మర్ధీ.. పెప్పర్ స్ప్రే..! కాస్తా ఘాటెక్కువ. మిర్యాల పొడితో చేసిన సెంటు కదా..! దిమ్మ తిరిగి పడిపోతారు. దాన్ని పిచికారి చెయ్యడం.. మరో రకంగా తుషారిక అంటారు” అంటూ ఒక క్లాసు పీకాడు బ్రహ్మానందం.

“అది ఆడవాళ్లు వారి రక్షణ కోసం వాడుతారు.. నీకెందుకు?..” బావా..! మగవానివి కావా..? అన్నట్టు అడిగాడు భద్రి అమాయకంగా.. బామ్మర్ధి అనుమానాన్ని అర్థం చేసుకున్న బ్రహ్మానందం కళ్ళు నొసటికెక్కిచ్చుకుని.. భద్రి వంక గరం, గరంగా చూశాడు. బావకు కోపమొచ్చిందని గ్రహించిన భద్రి మాట మార్చాడు.

“బావా..! ఓమారు చూపించు” అంటూ ముద్దుగా మూతి మూరెడు సాగించాడు.

“బామ్మర్ధీ నీకు ప్రతీ దానికి తొందరెక్కువ.. కాసేపు ఓపిక పట్టలేవా..! మనం వెళ్ళేది పంచాయితీ తీర్మాణం వినడానికే కదా.. అక్కడ చూద్దువు గాని దీని పవరేంటో..” అనుకుంటూ ముసి, ముసి నవ్వులు పెదవులపై పూయించసాగాడు బ్రహ్మానందం.

“అయితే నువ్వు ఈనాటి పంచాయితీ పెద్దమనుషుల మీద ప్రయోగిస్తావన్న మాట.. బలే.. బలే..” అని ఉబ్బిస్తూ.. బ్రహ్మానందం ప్యాంటు జేబులో నుండి తుషారిక తీసి కళ్ళు మిటకరించుకుంటూ చూడసాగాడు. బ్రహ్మానందం తన కుడిపక్క మీసాలను ఎడంచేతి చిటికెన వేలుతో దువ్వుకుంటూ..

“ఒరేయ్! భద్రీ మరేమనుకున్నావ్?.. పంచాయితీలో తీర్మాణం మనకు ఎలాగూ అనుకూలంగా రాదు.. కనీసం మన తడాఖా అయినా ప్రదర్శించాలి కదరా.!”

భద్రి బాతు మాదిరిగా తలూపుతూ.. మరో ప్రక్క తుషారిక మీదున్న స్విచ్ లను ఒకదాని తరువాత మరొకటి నొక్కుకుంటూ.. విచిత్రంగా చూడసాగాడు. అందులోని రసాయనం ఒక్క సారిగా ఫౌంటేన్ లా పైకి ఎగిసి భద్రి ముక్కుపై దాడి చేసింది. ఆ ఘాటుకు ముక్కు చటుక్కున మూసుకున్నాడు.. కళ్ళనుండి జివ్వున చిమ్మని నీళ్ళను తుడ్చుకుంటూ..

“బావా..! తుషారిక బాగానే పనిచేస్తూంది.. దీంతో చంద్రం బావ అతని మద్ధతు దారులంతా గోదావరిలో కొట్టుకు పోవడం ఖాయం” చటుక్కున భద్రి చేతిలో నుండి తుషారికను లాక్కున్నాడు బ్రహ్మానందం.

“అదేంటి భద్రీ..! అప్పుడే చీదేస్తే ఎలా?.. అక్కడ సరిపోవద్దూ.. ” అంటూ ఉరిమి చూశాడు.

“దీని ఆపరేషన్ తెలుసుకోవద్దా బావా!”

“పరేషాన్ గాకు.. ఆపరేషన్ అదే వస్తది”

ఇంతలో హార్న్ కొట్టుకుంటూ.. క్వాలీస్ బండి వచ్చి, గేటు ముందు ఆగే సరికి.. ముఖం మోదుగు పువ్వులా వెలిగిపోయింది. బ్రహ్మానందంకు వత్తాసు పలికే వంకర టింకరగాండ్లు బఫూన్ల మాదిరిగా క్వాలీస్ లో నుండి దిగుతుంటే.. “ఒంటికన్ను ఓబలేషు.. లాభం, ఎత్తుపండ్ల ఎంకటేషు.. రెండు, తొంటచెయ్యి శంకరి.. మూడు, పంగకాళ్ళ పండరి.. నాలుగు, గద్దముక్కు గరుడాచలం.. అయిదు” అంటూ.. ఒక్కొక్కరిని ఒక రెండువేల నోటులా లెక్కించసాగాడు భద్రి. మరి కొంతమంది పంచాయితీ దగ్గరికి నేరుగా వస్తామని కబురు పెట్టిన విషయం తెలుసుకుని సంబరపడ్డాడు. బ్రహ్మానందానికి ఏనుగెక్కినంత బలం వచ్చింది. పంచాయితీలో ఎలా హల్ చల్ చేయాలో.. ఆక్షన్ చేసుకుంటూ చూపించాడు.

చేతి వాచీ చూసుకుని.. “టైమయ్యింది.. పదండి వెళ్దాం..” అంటూ భద్రిని, అనుచరులనూ.. ఇషారా చేశాడు. ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా కొందరు క్వాలీసులో.. మరి కొంతమంది బైకుల మీద బయలుదేరారు. బ్రహ్మానందం పక్కింటి చంద్రం కళ్ళల్లో దుమ్ముకొట్టుకుంటూ బండి వెనుకాల, మరో బండి పరుగులు తీయసాగాయి. తన గులాబీ రంగు దస్తీతో ముక్కు మూసుకుంటూ.. ‘జనాల బతుకుల్లో ఎలా దుమ్ము కొట్టాడో! అలాగే ఇప్పుడూ బ్రహ్మానందం దుమ్ము కొట్టుకుంటూ పోవడం.. చంద్రం మనసులో తిట్టుకున్నాడు. ‘వానికి దుమ్ము కొట్టుడు అలవాటే.. నేను బాల్యం నుండీ గమనిస్తున్నా. ఈ రోజు పంచాయతీ తీర్మాణం కదా.!. న్యాయం నాప్రక్కనే ఉన్నది. ఏ నలుగురిని అడిగినా.. నాదే న్యాయమంటున్నారు’ అని గొణుక్కుంటూ.. కారులో తనూ బయలుదేరాడు.

చంద్రం శాల్తీ బక్కపలుచన.. కాని గుండె బలం గొప్పది. పూర్వం గాంధీతాత నిరాహార దీక్షలు చేసినట్టు చంద్రం గూడా నా జామీను నాకు కావాలని.. నిరాహార దీక్షలు చేశాడు.. ఊరి జనానికి ఉలుకు పుట్టి చంద్రంకు మద్ధతు పలికారు. బ్రహ్మానందం ‘దొబ్బుడు గొర్రెంక’ అనీ.. అతని వగలమారి వేషాలన్నీ గుర్తించారు. చంద్రంకు న్యాయం చెయ్యాలని ఊరి పెద్ద మనుషులంతా కంకణం కట్టుకున్నారు. దాంతో బ్రహ్మానందంకు ఎటూ పాలుబోక ‘కుడితిల పడ్డ ఎలుక’ వలె కొట్టుకో సాగాడు. తోక తొక్కిన త్రాచుచులా విషం గ్రక్కసాగాడు. అతని తాత ముల్లె ఎవడో తిన్నట్టు నీల్గసాగాడు. చంద్రంకు న్యాయంగా పంచాల్సిన భూమిని, దిగమింగి చిప్ప చేతికిద్దామనుకున్న బ్రహ్మానందానికి మింగుడు పడ్డం లేదు.

అసలు బ్రహ్మానందం చంద్రంకు ఓ అయ్యోడు కాడు.. ఓ అవ్వోడు కాడు.. పాలోడు కాడు.. ఆఖరికి కులపోడూ కాడు.. మరి ఈ పంచాయితీ ఎక్కడిది?.. పది సంవత్సరాలుగా కలిసి ఉన్నవారు ఇప్పుడు వేరుబడదామని ఎందుకనుకుంటున్నారు.. తెలుసుకోవాలంటే.. కాస్త వెనక్కి తిరిగి చూడాలి.

బ్రహ్మానందం, చంద్రం ఇద్దరూ మరో రాష్ట్రం నుండి బ్రతకాడానికై కూడబలుక్కుని తెలుగు రాష్ట్రానికి వచ్చి గుంటూరు పల్లెలో స్థిరపడ్డారు. ఇండ్లు, జాగలు కలిసి పొత్తులో కొనుక్కుంటే.. లాభమని పల్లె పెద్దమనిషి మారయ్య సలహా ఇచ్చాడు. కొత్త ఊరిలో అతని మాట వినక తప్ప లేదు. ఇద్దరూ.. కలిసి జీవనం సాగించాలి అని పల్లె పెద్దల తీర్మాణం చేశారు.. వద్దు, వద్దని ఎంత బతిమాలినా.. ‘చెవిటి వాని ముందు శంఖమూదినట్లే’ అయ్యింది వారి పని. ‘కలిసి ఉంటే బలం’ అని నూరి పోశాడు మారయ్య. అన్నదమ్ముల మాదిరిగా కలిసి బతకాలని ఆజ్ఞాపించాడు. ‘పొత్తుల సంసారం’ అన్నప్పుడు త్యాగ బుద్ధి ఉండాలని వేదాంత ధోరణిలో చెప్పాడు. కొన్నాళ్ళు బాగానే గడిచింది.

చంద్రం అమాయకుడు. బ్రహ్మానందం అతణ్ణి ‘తమ్ముడూ..’ అని పిలుస్తుంటే ఐసై పోయాడు. ‘పుట్టుకతో పుట్టిన గుణం కాష్టంలో కాలినా పోదు’ అన్నట్టు బ్రహ్మానందం తేలు కొండి వేషాలు కొద్ది రోజులకే బయట పడ్డాయి. చంద్రంను మోసం చేస్తూ.. పీక్క తినడం మొదలు పెట్టాడు. చంద్రం అది పసిగట్టి..

“అన్నయ్యా.. ఇలా చెయ్యడం నీకు న్యాయం కాదు” అని ఒక రోజు నిలదీశాడు.

“తమ్ముడూ.. రాజధాని మారడం మూలాన భూములకు విపరీతమైన ధరలు పెరిగి పోతున్నాయి.. మన భూములన్నింటిని నేను అభివృద్ధి చేసి ఎక్కువ ధర పలికేలా పాటుపడుతున్నా..” అని కల్లబొల్లి కబుర్లు చెప్పాడు. చంద్రం మొదట నిజమేనని నమ్మాడు గాని.. దినం, దినం బ్రహ్మానందం ద్రోహం బట్టబయలుకాసాగింది. దాంతో ఇద్దరి మధ్య గొడవ చిలికి, చిలికి గాలివానలా మారింది. చంద్రం తన వాటా తనకు కావాలని తెగేసి చెబుతూ.. బ్రహ్మానందం చేసే మోసాలు మారయ్య ముందు ఏకరువు పెట్టాడు. బ్రహ్మానందం “కలిసి ఉంటేనే ప్రగతి.. విడిపోతే అధోగతి..” అని మారయ్య అన్న మాట తిరిగి అతనికే వినిపించాడు. దాంతో మారయ్య మరి కొన్నాళ్ళు వేచి చూద్దామని చంద్రంను సముదాయించాడు.

ఇప్పుడు బ్రహ్మానందం సుద్దులు చెప్పుకుంటూ.. ‘ఏకు మేకై’ కూర్చున్నాడు. చంద్రంకు బిచాణా లేకుండా చేస్తున్నాడు.

***

గుంటూరుపల్లె బొడ్రాయి దగ్గర పెద్ద మర్రి చెట్టు.. భూమి లోనికి పాతుక పోయిన దాని ఊడలు చూస్తుంటే.. అప్సరసల నాట్యభంగిమలు మదిలో కదలాడుతూ.. ఆనంద పరవశులం గాక తప్పదు. దాదాపు వంద వత్సరాల చెట్టు అని పల్లెలో చెప్పుకుంటారు. మూడు ఏకరాల స్థలంలో మురిపెంగ చూడ ముచ్చటగ ఉంటుంది. పల్లె జనమంతా దాని కిందికి వచ్చి చేరినా ఏమాత్రమూ ఎండ తగలకుండా.. వాన చినుకు పడకుండా తన కడుపులో పెట్టుకొని ఆదుకుంటుంది.

ఆ ఊరిలో ఏ పంచాయితీ అయినా.. దాని కిందనే పరిష్కారంకావడం ఆనవాయితీ..కొత్తగా ఎన్నిక అయిన ఆ ఊరి సర్పంచ్ మీనాదేవి అంటే గ్రామప్రజలకు ఎనలేని గౌరవం.. ఆమె పంచాయితీ తీర్మాణానానికి తిరుగు లేదని గ్రామ పెద్దల విశ్వాసం. ఈ రోజు మీనాదేవి గారి తీర్పు ఎలా ఉంటుందో చూద్దామని ఊరి జనమంతా మర్రిచెట్టు కిందకు వచ్చి చేరారు. చెట్టు గద్దె చుట్టూ పెద్ద మనుషులు కూర్చున్నారు.. మధ్యలో కాస్త ఎత్తు మీద మీనాదేవి సీటు. ఆమె రాగానే అందరికీ న్యాయం చేసే తల్లి వచ్చిందన్నట్టు జనమంతా లేచి నిలబడి చేతులు జోడించారు.

చంద్రం కనుసైగ చేయగానే.. కొందరు యువకులు ఒకరి చేతులు మరొకరు పట్టుకుని మీనాదేవికి, మిగతా పెద్దమనుషులకూ హానీ జరుగకుండా.. వలయాకారంలో నిల్చున్నారు. ఊహించని పరిణామానికి బ్రహ్మానందం ఖంగుతిన్నాడు. తన వెంట వచ్చిన అనుచరులకు చెవుల్లో ఏదో ఊదాడు. ముందుగా మారయ్య లేచి తాను సాక్షులను విచారించిన వాంగ్మూలాన్ని మీనాదేవి ముందు పెట్టాడు. అందులోని అంశాలను పెద్దమనుషులముందు చర్చించి తీర్పునివ్వలని మీనాదేవిని కోరాడు. చర్చ ముగిసింది. మీనాదేవి తీర్పు కోసం జనమంతా చెవులు చేటలు చేసుకుని చూడసాగారు.

బ్రహ్మానందం ఉన్నఫళంగా లేచి తన అనుచరులతో చంద్రం మీదకు దాడికి దిగాడు. చంద్రం మద్ధతుదారులు ఎదురు తిరిగారు. జనమంతా నిర్ఘాంతపోయారు. తీర్పు వినకముందే గొడవ ఎందుకని కొందరు ఆవేశంగా అడ్డుకోసాగారు.

ఆ సమయం కోసమే ఎదురి చూస్తున్న బ్రహ్మానందం తన ప్యాంటు జేబులో నుండి తుషారిక తీసి మీటను పదే, పదే నొక్కసాగాడు. అది విషం చిమ్మే నాగుంబాములా బుస్సు, బుస్సు మని శబ్దం చెయ్యసాగింది. దాని నోట్లో నుండి ముందుకు చిమ్ముతుందనుకున్న పెప్పర్ స్ప్రే ఉల్టా, పల్టా అయింది. దాని వెనుక భాగం నుండి జులాబు తీసుకున్నట్టు ఝాడించసాగింది. బ్రహ్మానందం నవరంధ్రాలూ బెదిరి పోయాయి.. కళ్ళు బైర్లు కమ్మాయి. బొంగరం మాదిరిగా గిర, గిరా తిరుక్కుంటూ నేల మీద దబుక్కున పడ్డాడు. బ్రహ్మానందం తిరగుడుకు పిచికారి నలుమూలలా విరజిమ్మి భద్రితో బాటు బ్రహ్మానందం భద్రత కోసం వచ్చిన వారంతా కళ్ళు తేలేసి ఒకరి మీద మరొకలు కర్సుకుని పడి స్పృహ కోల్పోయారు.

‘ఎవరు చేసిన పాపం.. వారనుభవించక తప్పదన్నా’ అన్న చందాన ఆంబులెన్సు పాడుకుంటూ వచ్చి అందర్ని మూటకట్టుకొని ఎత్తుక పోయింది.

మీనాదేవి తీర్పు చదివింది...

చంద్రంకు అనుకున్న న్యాయం జరిగిందని.. జనమంతా చప్పట్లతో జేజేలు పలికారు.

***

ఆసుపత్రిలో గంట సేపటికి కాస్త కోలుకుని లేచి కూర్చున్నాడు బ్రహ్మానందం.

“తుషారిక అలా రివర్సై మన మీదికే చిమ్మింది..” ఏంటి సంగతి? అన్నట్టుగా భద్రి వంక అనుమానంగా చూశాడు.

“బావా.. అది వాడే పద్ధతి పూర్తిగా తెలుసుకోకుండా ప్రయోగించడం ఇలాగే ఉంటుంది.. తుషారికకు ‘ఇన్’, ‘ఔట్’ అని రెండు స్విచ్‍లున్నాయి. అది చెప్పబోతుంటే పొద్దున కన్నెర్ర చేస్తివి.. భయపడి మిన్నకున్నాను.. నువ్వు ‘ఔట్’ స్విచ్ ఒత్తకుండా ‘ఇన్’ స్విచ్ నొక్కావు, అది మన మీదకే చిమ్మింది.. మన ప్రాణాలమీదికి వచ్చింది..” అంటూ అసలు సంగతి చెప్పాడు భద్రి.

మళ్ళీ కళ్ళు తిరిగి బెడ్ మీద చటుక్కున వాలి పోయాడు బ్రహ్మానందం.*

మరిన్ని కథలు

Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaalani kaagitam
కాలని కాగితం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు