"రండి బాబూ!...రండి!...అమ్మల్లారా రండి!... అయ్యల్లారా రండి! ఇప్పుడే జపాన్ నుండి దిగుమతై వచ్చిన ఈ క్రీములు, షాంపూ, హెయిరాయిలూ ఓ నెలరోజులు మాత్రమే వాడి మీ వయసు పదేళ్ళు తగ్గించుకోండి! మీ కోసమే ప్రత్యేకంగా తయారైన ఈ షాంపూ, హెయిరాయిలు వాడండి, మీ జుట్టు శాశ్వతంగా నల్లబడటమే కాక, బట్టతల మీద కూడా జుట్టు మొలిచి కీకారణ్యంలా మారిపోతుంది. ఈ క్రీము వాడి యవ్వనవంతులు కండి! ఆలసించిన ఆశాభంగం! అన్నల్లారా, అక్కల్లారా, ఈ వస్తువులు కొని ఒకే ఒక్క నెలరోజులపాటు వాడి చూడండి! నెలరోజుల తర్వాత నా చేత తమ్ముళ్ళారా, చెల్లెళ్ళారా అని పిలిపించుకోండి." పెద్ద గొంతుతో చెప్తూ పేవ్‌మెంట్‌పై తను అమ్మే వస్తువుల ప్రచారం చేసుకుంటున్నాడు దగేశ్వర్రావు.
దగేశ్వర్రావు మాటలు చెవినపడి అరక్షణంలోనే బోలెడంతమంది అతని చుట్టూ చేరారు. ఆ మూగిన వాళ్ళల్లో చాలా అరగుళ్ళు, పూర్తిగుళ్ళ వారు కూడా ఉన్నారు. తమ వయసు తగ్గించుకోవడం కోసం మధ్యవయసు స్త్రీపురుషులు ఎగబడ్డారు. క్షణాల్లో అతని వద్దనున్న వస్తువులన్నీ హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి.
సరిగ్గా అదే సమయంలో బాలరాజు అటువైపు వెళ్తూ ముందు అక్కడ గారడీవాడెవడో గారడీ ప్రదర్శిస్తున్నాడేమో అని అనుకున్నాడు. ఆ తర్వాత దగేశ్వరరావు మాటలు, అక్కడ చుట్టుముట్టిన జనాల మాటల్ని విన్నాడు. బాలరాజంటే బాలాకుమారుడేమీ కాదు. ప్రభుత్వ ఉద్యోగం వెలగబెడుతున్నా ఇంతవరకూ పెళ్ళి కాలేదు. ముప్ఫై అయిదేళ్ళు దాటాయి ఈ మధ్యనే. ఇంట్లో పెళ్ళి సంబంధాలు చూస్తున్నారు, కానీ ఏవీ కుదరట్లేదు. పెళ్ళి కావలసిన అమ్మాయిలందరూ సాఫ్ట్‌వేర్ ఉద్యోగులవైపే మొగ్గుచూపుతున్నారు కాని బాలరాజులాంటి ప్రభుత్వ ఉద్యోగివైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. పోనీ ప్రేమించి పెళ్ళి చేసుకుందామా అంటే అది కూడా సాధ్యమవలేదు. రోజులు గడుస్తున్న కొద్దీ బాలరాజుకి బెంగపట్టుకుంది తనకిక పెళ్ళికాదేమోనని, పెళ్ళికాని బాలరాజులా మిగిలిపోతానేమోనని. చూస్తూండగా ఏళ్ళు గడిచిపోతున్నాయి. రోజులు గడుస్తున్నకొద్దీ పెళ్ళికాదేమోనని బెంగపట్టుకుంది పాపం బాలరాజుకి. ఈలోపు జుట్టు ఊడి కొద్దిగా బట్టతల వచ్చింది. జుట్టు నెరవనారంభించింది కూడా. అద్దంలో తన ప్రతిరూపం వెక్కిరిస్తూ కనిపిస్తోంది. చాలా రకాల షాంపూలు, క్రీములులాంటివి వాడిచూసాడు, అయినా ఫలితం ఏమీ కనబడలేదు. ఆ అదివారం సాయంకాలం నెరిసిన జుట్టుకి రంగు పులుముకొని ముస్తాబై వీధిలోకి వచ్చిన బాలరాజుకి దగేశ్వర్రావు దివినుండి దిగివచ్చిన దేవుడిలా కనిపించాడు. దగేశ్వర్రావు మాటలు వినగానే ప్రాణం లేచివచ్చింది బాలరాజుకి. 'తన జుట్టు సమస్య తీరడమే కాక, వయసు కూడా పదేళ్ళు తగ్గినట్లు కనిపిస్తాడని ఘంటాపధంగా చెబుతున్నాడు. ఓ సారి వాడి చూస్తే పోలా?' అనుకుని ఎగబడుతున్న జనాన్ని తోసుకుని ముందుకెళ్ళాడు బాలరాజు.
"ఇవి నిజంగా పని చేస్తాయా?" అనుమానంగా అడిగాడు బాలరాజు దగేశ్వర్రావుని.
"ఏమిటీ,పనిచేస్తాయా అని మెల్లగా అంటున్నారా? జపాన్ నుండి వచ్చిన సరుకండీ బాబూ! కావలిస్తే చూడండి నా జుట్టు ఎలా దుబ్బులా పెరిగిందో? నా వయసు నలభై ఏళ్ళైనా, ముఫై ఏళ్ళవాడిలా కనపడటం లేదూ! ఒక్కొక్కటి వంద రూపాయలు, సరిగ్గా నెలరోజులు వాడితే పదేళ్ళ వయసు తగ్గిపోతుంది." ఛాలెంజ్ చేస్తున్నట్లు చెప్పాడు. అయితే దగేశర్రావు వయసు ముప్ఫై ఏళ్ళేనన్న విషయం పాపం అక్కడున్నవాళ్ళెవరికీ తెలియదు.
"సరే! అన్నీ రెండు డజన్లు చొప్పున ఇయ్యు!" అని డబ్బులు ఇచ్చి అవి తీసుకుని బాలరాజు చాలా సంతోషంగా ఇంటికి తిరిగివచ్చాడు. ఆ రోజునుండి బాలరాజు ఆ క్రీముల్ని, షాంపూని, హెయిరాయిల్‌నీ క్రమం తప్పకుండా శ్రద్ధగా వాడుతునే ఉన్నాడు. ఓ నెల రోజుల వరకూ బాగానే ఉంది. ఆ తర్వాత నుండి జుట్టు నల్లబడటం మాట అటుంచి రోజు రోజుకీ ఎక్కువ తెల్ల బడుతోంది. బాగానే ఊడి చేతులోకి వచ్చేస్తోంది కూడా. ఆర్నెల్లయ్యేసరికి తల అర్ధచంద్రాకారంలా మెరిసిపోతోంది. వయసు పదేళ్ళు తగ్గేమాట అటుంచి, పాతికేళ్ళు పైబడినట్లు కనిపిస్తున్నాడు ప్రస్తుతం పాపం బాలరాజు! ఇప్పుడు బాలరాజుని చూసినవాళ్ళంతా మీ మనవలేం చదువుతున్నారని అడుగుతున్నారు. అలాంటి మాటలు వినగానే తల గోడకేసి బాదుకోవాలనిపిస్తోంది బాలరాజుకి. తనని నిలువునా దగాచేసి ఈ పరిస్థితికి కారణమైన దగేశ్వర్రావు మీద పట్టలేని కోపం వచ్చింది బాలరాజుకి.
తనకి క్రీములు, షాంపూలు అమ్మిన దగేశ్వర్రావుని ఎలాగైనా వెతికి పట్టుకొని చితక్కొట్టాలని తిరుగుతున్నాడు బాలరాజు. ప్రతీ రోజూ సాయంకాలం అదే పనిగా పెట్టుకున్నాడు. మొత్తానికి ఒకరోజు దగేశ్వర్రావు బాలరాజుకి దొరికేసాడు. అతన్ని చూస్తూనే బాలరాజు పళ్ళు పటపట కొరికాడు. బాలరాజుని చూడగానే అతను, "రండి తాతగారూ, రండి! ఈ క్రీము, షాంపూలు, హేయిరాయిల్ కొనండి. మీ వయసు పాతికేళ్ళు వెనక్కి వెళుతుంది!" అని అహ్వానించాడు.
"తాతగారు ఏమిట్రా? పాతికేళ్ళు వెనక్కి వెళ్ళడమా! నా వయసు ఎంత అనుకున్నావు? ఈ మధ్యనే ముప్ఫై అయిదు దాటింది. అది సరే! చూడు... ఆర్నెల్ల క్రితం నీ దగ్గర ఈ వస్తువులు కొని వాడటంవలనే నా పరిస్థితి ఇలాగైంది. ఇవివాడితే వయసు పదేళ్ళు వెనక్కు వెళుతుందని అన్నావు గుర్తుందా, కాని అవి వాడిన తర్వాత నా వయసు పాతికేళ్ళు పైబడినట్లు ఉంది, తెలుసా!" కోపంగా అని అతని కాలర్ పట్టుకున్నాడు బాలరాజు.
ముందు భయపడినట్లు కనిపించినా ఆ తర్వాత వెంటనే సర్దుకొని తన కాలర్ బాలరాజు చేతినుండి విడిపించుకొని, "ఇంతకీ మీరు ఎన్ని రోజులు వాడారేమిటి ఇవి?" అని అడిగాడు.
"రెండు డజన్లు కొని, ఆర్నెల్లు వాడాను. ఫలితమేమీ కనపడలేదు సరికదా నా పరిస్థితి ఇలాగైంది." బావురుమన్నాడు బాలరాజు.
"అలా చెప్పండి మరి! నేను ఇవి అమ్మేటప్పుడు ఏమిటన్నాను? నెలరోజులు వాడితే పదేళ్ళు వెనక్కి వెళతారన్నాను కదా, అవునా?" అడిగాడు.
"అవును... అయితే ?"
"మరి మీరేం చేసారు? ఆర్నెల్లు వాడారు. అందువల్ల మీరు ఆరుపదుల వయసు వెనక్కి వెళ్ళారు. అలా మీ వయసు కిందటి జన్మ వరకు వెళ్ళి అక్కడ కూడా పాతికేళ్ళు తగ్గింది. అందుకే ఇలా అయిందికానీ, ఇందులో నా తప్పేమీ లేదు." అన్నాడు. అతను చెబుతున్నదేమిటో అర్ధమవడానికి రెండు నిమిషాలు పట్టింది బాలరాజుకి. అర్ధమైన తర్వాత చూసేసరికే తన సామాన్లు యావత్తూ గబగబ బ్యాగ్‌లో కుక్కుకొని క్షణంలో అక్కణుంచి మాయమయ్యాడు దగేశ్వర్రావు.
బాలరాజు పాపం దిక్కుతోచక తలచెత్తో పట్టుకొని అక్కడే కూలబడ్డాడు.