అవంతీనగర రాజ్యాన్ని నాగభూషణుడు అనే రాజు పరిపాలించేవాడు. నాగభూషణుని భార్య హైమవతి. వారికి సంతానం లేకపోవడం ఇద్దరినీ కలచివేసింది. తమ తర్వాత రాజ్యం శత్రువుల పాలు అవుతుందని ఇద్దరూ దిగులు పడ్డారు. ముఖ్యంగా మహారాణి ఆ రాజ్యం ఇతరుల పాలు అయితే వారి పరిపాలన సక్రమంగా లేకపోతే ప్రజలు పరిస్థితి ఏమిటని బాధపడింది. రాజును మరో పెళ్ళి చేసుకోమని పట్టుపట్టింది. రాణి మాట కాదనలేక మాలిని అనే ఆవిడను పెళ్ళి చేసుకున్నాడు. కానీ వారికీ సంతానం లేదు. అయితే కొత్త సమస్య వచ్చిపడింది. రోజంతా మాలినీతోనే గడుపుతూ నాగభూషణుడు రాజ్య పాలనను పట్టించుకోవడం లేదు. పైగా మద్యపానానికి బానిస అయినాడు. రాజ్యంలో అహింస, దోపిడీ, దౌర్జన్యాలు ఎక్కువైనాయి. ఇది హైమవతిని కలచివేసింది. ఎంత చెప్పినా మహారాజు వినిపించుకోవడంలేదు.
ఒకరోజు పార్వతీదేవికి మొక్కుకోవడానికి ఆలయానికి నడుచుకుంటూ వెళ్తుంది హైమవతి. దారిలో అడవిలాంటి ప్రదేశంలో అద్భుతమైన తేజస్సుతో ఒక పసి బాలుడు కనిపించాడు. కొన్ని రోజుల వయసు మాత్రమే ఉండే ఆ బాబుని అలా అనాథగా ఎవరు ఎందుకు వదిలేశారా అని హైమవతి ఆలోచించింది. ఆ బాలుణ్ణి దేవుడు ఇచ్చిన వరంలా భావించి, తీసుకున్నది. అలా బాలుణ్ణి తీసుకుని వస్తుండగా హైమావతిని నాగుపాము వెంబడించింది. బాలుని పట్టుకొని హైమవతి వేగంగా పరుగెత్తుతుంది. కానీ పాము వేగమే ఎక్కువగా ఉంది. పాము హైమవతి సమీపంలోకి రాగానే హైమవతి ఆగి, వెనుతిరిగి, నాగుపాములు మొక్కింది. దయచేసి తమని వదిలిపెట్టమని, బాలునికి సంవత్సరం వయసు రాగానే తానే వస్తానని, అప్పుడు కాటు వేయమని ప్రార్థించింది. అప్పుడు నాగుపాము వెనుతిరిగి వెళ్ళిపోయింది.
రాజ్యానికి వచ్చిన మహారాణి ఆ బాలుడు దొరికిన విధానం రాజుకు చెప్పి, ఆ బాలుడిని పెంచి, పెద్ద చేసి, , రాజును చేద్దామని అంది. సంతోషించాడు రాజు. ఒకరోజు మహారాజు బాలుని ఆడిస్తుండగా మాలిని తానే స్వయంగా గ్లాసులో పాలు పోసుకుని బాలునికి తాగించబోయింది. అప్పుడే అక్కడికి వచ్చిన రాజు ఆ పాలు తీసుకొని తాగబోయాడు. మాలిని కంగారుగా "ఆ పాలు బాలుని కోసం మహారాజా!" అని అంది. అప్పుడే అక్కడికి వచ్చిన హైమవతి మాలిని కంగారును గమనించి అనుమానంతో ఆ పాలు లాక్కొంది. పాలగ్లాసు జారిపడింది. అక్కడికి పరుగు పరుగున వచ్చిన పెంపుడు పిల్లి ఆ పాలను త్రాగి, నురుగలు కక్కి చనిపోయింది. "ఛీ! పాపాత్మురాలా! ఈ పసి బాలుడు నీకేం అపకారం చేశాడని చంపాలని చూశావు. అసూయతో చేసిన ఈ పాపానికి శిక్ష అనుభవిస్తావు." అంది హైమవతి. నాగభూషణుడు మాలినిని ఒక చెంపదెబ్బ వేశాడు. మరోసారి ఇలాంటిది పునరావృతమైతే చెరసాలలో వేయిస్తానని హెచ్చరించాడు. ఇంత పెద్ద పాపానికి ఓ చెంపదెబ్బ శిక్షా? ఇక్కడే ఉంటే తమకు రక్షణ కరవని భావించింది హైమవతి. మహారాజుకు చెప్పకుండా బాలుని తీసుకుని దూరంగా వెళ్ళిపోయింది. రాజ్యానికి దూరంగా ఒక అడవిలో తపస్సు చేసుకుంటున్న గొప్ప పేరున్న మహామునిని ఆశ్రయించింది. "నీకేమీ భయం లేదు తల్లీ! ఇక్కడే ఉండి ఈ బాలుని పెంచి పెద్ద చేస్తూ అన్ని విద్యలూ నేర్పించవచ్చు. నిన్ను కూతురిగా, ఈ బాలుణ్ణి నా మనవడిగా భావిస్తాను." అన్నాడు మహాముని. బాలునికి విజయుడు అని పేరు పెట్టారు. మహాభారతంలో అర్జునుడిలా ఎక్కడా అతనికి అపజయం కలుగవద్దని ఆ పేరు పెట్టారు. ఆ ప్రాంతం శ్రీపురం రాజ్యంలో ఉంది. ఆ రాజ్యం తిరుమల వర్మ పరిపాలనలో ఉంది. సరిగ్గా బాలునికి సంవత్సరం వయసు వచ్చింది.
ఒకరోజు హైమవతి ఆ అడవిలో అలా వెళ్తుండగా నాగరాజు కనిపించాడు. తన జాడ ఎలా కనిపెట్టాడని ఆశ్చర్యపోయింది హైమవతి. ఆ నాగుపామును ఇలా ప్రార్థించింది. "నా ప్రాణం పోతే నా బాలుడు దిక్కులేనివాడు అవుతాడు. బాలునికి పదేళ్ళు నిండగానే నేనే వస్తాను. అప్పుడు నా ప్రాణం తీయవచ్చు." అని తన వృత్తాంతం అంతా వివరించింది. ఆ బాలుని కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను తెలిపింది. నాగుపాము అసహనంగా అక్కడ నుంచి వెళ్ళిపోయింది.
కుమారునికి తగిన వయసు రాగానే విద్యాభ్యాసానికి మంచి గురువు వద్దకు పంపింది. క్రమంగా, వ్యాయామం, యుద్ధ విద్యలు నేర్చుకోవడానికి పంపింది. అయితే విజయునికి పదేళ్ళు దాటినా నాగుపాము మళ్ళీ కనిపించలేదు. నాగుపాము మరణించి అయినా ఉండాలి లేదా తాను చెప్పింది విని, కాటు వేయడం పూర్తిగా విరమించి అయినా ఉండాలని హైమవతి భావించింది. విజయునికి నైతిక విలువలను, రాజ ధర్మాన్ని నూరిపోసింది. సామాన్య ప్రజల మధ్యే విజయుడు తిరిగేట్లు చేసి, ప్రజల కష్టసుఖాలను తెలుసుకునేలా చేసింది. యుక్త వయసు వచ్చేసరికి ఒక మహారాజుకు తెలియాల్సిన అన్ని అంశాలు విజయునికి తెలిశాయి.
శ్రీపురం మహారాజు తిరుమల వర్మకు సౌశీల్య అనే కూతురు ఉంది. ఒకరోజు చెలికత్తెలతో కలసి అందమైన ఉద్యానవనంలో విహరిస్తుంది. ఇంతలో పొరుగు దేశం నుంచి మారువేషంలో వచ్చిన శత్రువులు కొందరు వీరి మీదకు దాడిచేశారు. అప్పుడే అక్కడికి వచ్చిన విజయుడు వాళ్ళందరినీ చీల్చి చెండాడినాడు. రాజకుమారిని రక్షించాడు. సౌశీల్య విజయునికి కృతజ్ఞతలు తెలిపింది. ఇద్దరూ ఒకరిపట్ల మరొకరు ఆకర్షితులు అయ్యారు. పెద్దల అంగీకారంతో వారి వివాహం జరిగింది.
అవంతీనగరం బలహీనం కావడంతో ఏనాటి నుంచో కాచుకొని ఉన్న శత్రు రాజు తన సైన్యంతో దాడి చేసి, అవంతీ నగరాన్ని స్వాధీనం చేసుకున్నాడు. నాగభూషణుని చెరసాలలో బంధించాడు. ఈ విషయం తెలిసిన తిరుమల వర్మ తన అల్లునికి విషయం చెప్పాడు. శ్రీపురం నుంచి పెద్ద సైన్యంతో విజయుడు అవంతీ నగరంపై దండయాత్ర చేశాడు. అవంతీని స్వాధీనం చేసుకున్న శత్రురాజును చిత్తుగా ఓడించి, అవంతీని స్వాధీనం చేసుకున్నాడు. అవంతీ నగరానికి విజయుడు రాజు అయినాడు. తండ్రిని చెరసాల నుండి విడిపించాడు. మాలిని శత్రు రాజుకు సహకరించిందని తెలిసి, ఆమెను చెరసాలలో బంధించాడు. హైమవతి నాగభూషణుని చేరి, జరిగింది చెప్పింది. నాగభూషణుడు సంతోషించాడు. మహారాణికి క్షమాపణ చెప్పాడు. నూతన రాజైన విజయుని ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలిపాడు. విజయుడు ధర్మవంతంగా పరిపాలన సాగిస్తున్నాడు.
ఒకరోజు హైమవతి యథావిధిగా పార్వతీదేవికి మొక్కుకోవడానికి గుడికి వెళ్తుంది. మార్గమధ్యంలో నాగుపాము ఎదురైంది. ఆశ్చర్యం! పాతికేళ్ళైనా నాగుపాము మొదటి సారి చూసినప్పుడు ఎలా ఉందో అలాగే ఉంది. తాను ఇచ్చిన మాట ప్రకారం తనను కాటు వేయమని కోరింది. నాగుపాము వెంటనే కాటు వేసింది. ఆశ్చర్యం! అక్కడ నాగుపాము మాయమై అందమైన యువకుడు ప్రత్యక్షం అయ్యాడు. తనకు శాపవశాత్తూ ఈ రూపం కలిగిందని ఆ వృత్తాంతం చెప్పాడు.
ఆ యువకుని పేరు విక్రముడు. ఒకరోజు విక్రముడు అడవిలో వెళ్తుండగా ఎవరో వేటకై విసిరిన బాణం విక్రమునికి రాసుకుంటూ పోయింది. అదృష్టవశాత్తు విక్రమునికి స్వల్పంగా గాయం అయింది. అటుగా వెళ్తూ సమీపంలో ఉన్న ఒక మునిని చూసి, "మునివర్యా! ఎవరో వేటకై వేసిన బాణం నాకు తగిలింది. ఇటువైపు ఎవరినైనా చూశారా?" అని అడిగాడు. తాను చూడలేదని ముని చెప్పాడు. మరోసారి అదే అడవిలో వేటకై వచ్చిన విక్రముడు దూరంగా పరుగెత్తుతున్న జింకకు గురిచూసి బాణం వేశాడు. జింక పారిపోయింది. బాణం మునీశ్వరుని పక్కనే పడింది. "మూర్ఖుడా! నీకు ఇంతకు ముందు ఎవరో వేసిన బాణం తగలగా నన్ను అనుమానించి, నాపై పగ తీర్చుకోవాలని చూశావా? నువ్వు నాగుపామువైపో!" అని ఆ ముని శపించాడు. విక్రముడు మునీశ్వరుని కాళ్ళా వేళ్ళా పడి జరిగింది చెప్పి, బ్రతిమాలాడు. అప్పుడు మునీశ్వరుడు ఇలా అన్నాడు. "నువ్వు మూగజీవాలను వేటాడటం పెద్ద తప్పు. పొరపాటున శపించాను కాబట్టి శాప విమోచనం చెబుతా. నువ్వు పాపాత్ములను కాటు వేస్తే వారి ప్రాణాలు పోతాయి. ఎవరైనా గొప్ప పుణ్యాత్ములను కాటు వేస్తే ఆ పుణ్యాత్ముల స్పర్శ వల్ల నీకు శాపవిమోచనం కలుగుతుంది. ఆ పుణ్యాత్ములకు నీ విషం అమృతంలా పనిచేసి ఆయురారోగ్యాలను పెంచుతుంది."అని. ఇది విని హైమవతి సంతోషిస్తుంది. "విక్రమా! నా వెంట రా! మా రాజ్యంలో నీకు గొప్ప పదవిని ఇస్తా." అన్నది. విక్రముడు రాణివెంట వెళ్ళాడు. విక్రముని చూసి, నాగభూషణుడు ఎంతో ఆశ్చర్యపోయి అతణ్ణి ఆలింగనం చేసుకున్నాడు. "మహారాణీ! ఇతడు ఎవరో కాదు. 30 సంవత్సరాల క్రితం కనిపించకుండా పోయిన మా తమ్ముడు. బాధలో ఈ విషయం నీకు చెప్పలేదు. నా తమ్ముడు అంటే నాకు ప్రాణం. నాకు సంతానం ఉన్నా సరే, నా తర్వాత ఇతనినే రాజును చేద్దామని అనుకున్నాను. మళ్ళీ నా తమ్ముడిని చూస్తున్నట్లు కు నాకు చాలా సంతోషంగా ఉంది." అన్నాడు. మహారాణీ ఆశ్చర్యపోయింది. విక్రముడు తాన శాప వృత్తాంతం అన్నకు చెప్పి, మహారాణితో ఇలా అన్నాడు. "వదిన గారూ! మీ గొప్పదనం కళ్ళారా చూస్తున్నాను కాబట్టే మిమ్మల్నే ఏనాటికైనా మిమ్మల్నే కాటు వేయాలని చూస్తున్నా. అటు నాకు శాపవిమోచనం కలుగుతుంది. ఇటు నా విషం అమృతంలా మీకు ఆయురారోగ్యాలను పెంచుతుంది. మీ గొప్పదనానికి ఏమిచ్చినా తక్కువే! మీరు ఎంతో శ్రద్ధతో పెంచిన విజయుడు రాజు కావడమే న్యాయం. నేను విజయునికి సహాయంగా ఉంటూ ఈ రాజ్యాన్ని కంటికి రెప్పలా కాపాడుతాను." అని. సంతోషించారు అందరూ.