ఆ రోజు 31-05-2014 నేను ప్రభుత్వ ఉద్యోగిగా యాభై ఎనిమిది సంవత్సరాలు పూర్తి అయిన సందర్బంలో మా సెక్షన్ వాళ్లు గెట్ టు గెదర్ అరేంజ్ చేశారు. ఆ కార్యక్రమం అయి పోయి అందరూ మాట్లాడక మీ జీవితంలో మరపురాని సంఘటన ఏదైనా ఉందా? అని నన్ను అడిగారు. నే గతంలోకి వెళ్ళాను. మా నాన్నగారు హైదరాబాద్ సెక్రటేరియట్‌లో సెక్షన్ ఆఫీసర్‌గా పని చేసేవారు. ఆ కారణంగా నా చదువు మొత్తం హైదరాబాద్ లోనే కొనసాగింది.
“ఈ సారి కూడా పాస్ అవ్వకపోతే ఊరికి వెళ్ళి వ్యవసాయం చేసుకోవలసి వస్తుంది జాగ్రత్త!” అని హెచ్చరించారు మా నాన్నగారు.
మరో రెండు రోజుల్లో మాకు పదవ తరగతి పరీక్షలు ప్రారంభం కాబోతున్నాయి. పోయిన ఏడాది అంటే 1971 సంవత్సరంలో పదవతరగతి పరీక్షలు వ్రాసి ఒక్క లెక్కల పేపర్లో తప్పాను. ఇప్పటిలాగా అప్పట్లో ఏ సబ్జెక్ట్‌లో ఫెయిల్ అయితే అది ఒక్కటే వ్రాసి పాసయ్యే విధానం లేదు. ఒక్క సబ్జెక్ట్ ఫెయిల్ అయినా మళ్ళీ అన్ని సబ్జెక్ట్లు అంటే పదకొండు పేపర్లు వ్రాయవలసిందే.ఆ విధంగా ఇప్పుడు రెండవసారి అన్నీ పరీక్షలు వ్రాస్తున్నాను.
ఆ రోజు ప్రొద్దున్నే గబగబా తయారయ్యి మా ఇంటికి దగ్గరలో ఉన్న ఆంజనేయస్వామి గుడికి వెళ్ళి ఈ సారి తప్పకుండా పాసయ్యేట్లు చూడు స్వామీ కొబ్బరికాయ కొట్టి కోవా ఉండలు సమర్పించుకుంటానని మొక్కుకున్నాను.
గుడి నుంచి ఇంటికి వచ్చి పరీక్ష అట్ట, హాల్ టికెట్ మొదలైనవి తీసుకుని బస్‌లో పరీక్ష రాయబోయే సెంటర్‌కు బయలుదేరాను.ఈ సారి మాకు సెంటర్ అఫ్జల్‌గంజ్‌లో ఉన్న హిందీ మార్వాడీ విద్యాలయ స్కూల్లో పడింది. మొదటి రోజు తెలుగు పరీక్ష బాగా వ్రాశాను. తరువాత పరీక్షలు బాగా వ్రాశాను.
రానే వచ్చింది లెక్కల పరీక్ష వ్రాసే రోజు. మొదటి పేపర్ లెక్కలు అంతంత మాత్రంగా చేశాను.మరుసటి రోజు రెండవ పేపర్ ప్రశ్నాపత్రం తీసుకుని చిన్న లెక్కలన్నీ బాగానే చేశాను. ఆ రోజు మాకు ఇన్విజిలేటర్‌గా వచ్చిన సార్ “పిల్లలూ! ఈ రోజు లెక్కల ప్రశ్నాపత్రంలో పది మార్కుల ఒక లెక్క చాలా కష్టంగా వచ్చింది.
ఆ లెక్కను నేను బ్లాక్ బోర్డ్ మీద చేస్తాను... అందరూ గబగబా జవాబు పత్రంలో ఎక్కించుకోండి...కాసేపట్లో హెడ్మాస్టర్ గారు చెకింగ్‌కు రాబోతున్నారు! అని ఆ లెక్కను చేశారు.
అందరితో పాటు నేనూ ఆ లెక్కను జవాబు పత్రంలో గబగబా ఎక్కించాను.
“అందరూ ఎక్కించుకున్నారా?” అని అడిగి బోర్డును తుడిపేశారు. అప్పట్లో స్క్వాడ్ సిస్టమ్ లేదు. ఎవరైనా చీటీలు పెట్టి కాపీలు కొడుతూ పట్టుబడితే, ఇన్విజిలేటర్స్ వారి ప్రశ్న మరియూ జవాబు పత్రాలను తీసుకుని పరీక్ష గది నుండి బయటకు పంపించి వేసేవారు. ఇప్పటి లాగా డిబార్ సిస్టమ్ కూడా అప్పట్లో లేదు.
ఆ రోజు రాత్రి నేను బాగా నిద్రపోయాను ఎందుకంటే లెక్కల పరీక్షలో పాస్ మార్కులు తప్పకుండా వస్తాయని. మిగిలిన పరీక్షలన్నీ బాగా వ్రాశాను. రెండు నెలల తరువాత పరీక్ష ఫలితాలు వచ్చాయి. నేను పాసయ్యను. నాకు ఎక్కడ లేని సంతోషం కలిగింది.
“వ్యవసాయం చేయడం తప్పించుకున్నావురా!” అన్నారు నాన్నగారు నవ్వుతూ. అదే రోజు సాయంత్రం ఆంజనేయస్వామి గుడికి వెళ్లి కొబ్బరికాయ కొట్టి కోవా ఉండలు సమర్పించుకుని నా మొక్కు తీర్చుకున్నాను. ఒక పది రోజుల తరువాత మార్కుల లిస్ట్ కూడా వచ్చింది. అన్నీ సుబ్జెక్ట్‌లలో మంచి మార్కులు వచ్చాయి కానీ లెక్కలలో సరిగ్గా పాస్ మార్కులు వచ్చాయి.
‘దైవం మానుష రూపేణా!’ అని అంటారు. ఆ రోజు లెక్కల పరీక్ష రెండవ పేపరుకు ఆ ఆంజనేయస్వామి వారే ఆ సార్ రూపంలో వచ్చారని భావించాను. ఇది నా జీవితంలో ఎప్పటికీ మరచి పోలేని సంఘటన అని చెప్పగానే మా స్టాఫ్ అంతా చప్పట్లు కొట్టారు.
ఆ సార్! ఎక్కడున్నారో తెలియదు కానీ నేను మాత్రం ఆయనను ఇప్పటికీ దైవంగానే భావిస్తున్నాను.