అందమైన తల్లి - బి.రాజ్యలక్ష్మి

andamaina talli

సంధ్యాసమయం, చల్లనిగాలి ,పచ్చని చెట్లు ,నీలిమేఘాలపయనం ,అరుణరగాసూర్యాస్తమయం !అందమైన చంద్రోదయం !మనోహర దృశ్యం .కళ్లల్లో నిలిచిపోతున్న కమనీయకావ్యగీతిక . ప్రశాంత ఆహ్లాదవాతావరణం ,రాధిక పెరట్లో వాలుకుర్చీలో కూర్చుని ప్రకృతిలో లీనమై అరమోడ్పుకళ్ళతో నిలీగగనపు సౌందర్యాన్ని ఆస్వాదిస్తున్నది .ఎందుకో పెదాలపై నవ్వు !భావాలను పంచుకోవడానికి యెవరూ లేరు .కవితలల్లడానికి తనకు అంతపద సంపద లేదు .చిన్నచిన్న చినుకులు నీకు మేం తోడు వున్నాం గా అన్నట్టు వానజల్లు మొదలయ్యింది .చినుకులలో తడుస్తూ పాట పాడుకోవడం రాధిక కు చలాయిష్టం .ఆహ్లాదసమయం లో ,ఆహ్లాదం పంచుకోవాల్సిన సమయం లో రాధిక మనసులో యేదో వెలితి !తనకే తెలియని తనకు తానే వేసుకునే ప్రశ్నలు .

మురళి తన భర్త ,తన సహచరుడు ,తనంటే అమితప్రేమ .యెంతో అన్యోన్యత .అందమైనవాడు .హోదా ,చదువు ,అందమైన ఇల్లు ,అందమైన తోట అన్నీ లేదా అన్నీ భార్య కోరుకున్నవన్నీ లభించాయి .మురళి కాలేజి లో భౌతికశాస్త్రం చెప్తాడు .వస్తుతః భావుకుడు కాదు .అతని ప్రపంచం పుస్తకాలూ పరిశీలన ,జిజ్ఞాస !రరాధిక మురళి దగ్గర కోరుకుంటున్నది ఏమిటి !

రాధికకు కిందటి రోజు సంఘటన గుర్తుకొచ్చింది .మురళి చదువుకుంటున్నాడు ,అతనినే చూస్తూ ఇంత అందమైన వ్యక్తి తన భర్త . ఉంగరాల జుట్టు ,కోటేరులాంటి ముక్కు !చక్కటి కనుబొమ్మలు .ఆజానుబాహువు !కాఫీ కప్పు తో నించున్న భార్య ను చూస్తూ "చీర చాలా బాగుంది రాధీ "నవ్వుతు అన్నాడు మురళి .

రాధిక చీర చిలకాకుపచ్చ జరీచీర !నెమళ్లు అంచు ,రాధికకు చీర నప్పిందికూడా !కానీ కానీ చీర మాత్రమే నచ్చిందా మురళికి ?తను అందం గా లేదా !తనలో తాను నవ్వుకుంది .పైకిమాత్రం మురళిని చూసినవ్వింది . వానతుంపరలో ప్రకృతి సోయగాలను చూస్తూ రాధిక మనసు గతంలోకి తొంగిచూసింది .

"రాధీ యీ చీరలో యెంత బాగున్నావో ,ముద్దొస్తున్నావు .బాపుబొమ్మలా వున్నావు "తన స్నేహితురాళ్లు పొగుడుతుంటే రాధికకు సంతోషం

రాధిక చక్కటి అందం చుపారులను వెంటనే ఆకట్టుకుంటుంది . పచ్చటి పసిమి ,గుండ్రటి కళ్ళుమిలమిలా మెరుస్తూ నావ్వ్వుతూ వుంటాయి .విశాలమైన ఫాలభాగం యే బొట్టుచుక్క పెట్టినా ముద్దుగా వుంటుంది .సహజం గా ఆడపిల్ల యెప్పుడూ అందాన్ని గుర్తిస్తే ఆనందిస్తుంది .రాధిక ప్రక్రుతి నీలిమేఘాలపయనం కోకిలమ్మ గానం పరవశించిపోతుంది .

భవిష్యత్తువైవాహిక జీవితం తన భర్త తన అందాన్ని యెంత పొగుడుతాడో తలుచుకుని తలుచుకునీ మురిసిపోయేది రాధిక అద్దం లో చూసుకుంటూ తిలకం దిద్దుకున్నా కాటుక కళ్లు దిద్దుకుంటున్నా ముంగురులు సవరించుకుంటున్నా తన భర్త తనల్ని యెంత పొగుడుతాడో తల్చుకుంటూ సిగ్గూ సంతోషం నవ్వూ అన్నింటినీ వూహించుకుని బంగారు కలలు కన్నది .తనూ తన భర్తా షికారుకెళ్తున్నట్టుగా -------------------

"రాధి యెంత అందం గా వున్నావు ?"

"ఏదీ నవ్వు ముత్యాలు రాల్చవా "

"వయ్యారి నడక లో యెన్ని హొయలొ "

ఇలా వూహించుకుని రాధిక పరవశించి యెన్నో తీయని వూహలు !మధురభావనలు !!! రాధిక పెళ్లయ్యింది . అందమైన మురళి భర్త .సోయగాల కళ్లతో అతనిని చూసే తరుణం వచ్చిందని మురిసింది కానీ ------కానీ పెళ్లయ్యింది --తరుణం వచ్చింది ----వెళ్లిపోయింది . కలలు కలలుగానే మిగిలాయి .

తను ఆశించినట్టుగా ఒక్కరోజూ అందాన్ని పొగిడేవాడు కాదు . మంచి భర్త . ఆప్యాయం గా ప్రేమగా చూసుకుంటాడు మొదట్లో రాధిక గమనించలేదు ,తర్వాత గమనించిన రాధిక పట్టించుకోలేదు . కొద్దిగా చనువు పెరిగాక "ఏమండీ కొప్పు యిలా బాగుందా "ఒకరోజు అడిగింది .

"ఆఁ --బానేవుంది "అని మురళి రాధికను చూసి సీరియస్ గా చదువులో తలదూర్చాడు .

రాధిక యే ప్రశ్న వేసినా ముక్తసరిగా "బాగుంది"అనే సమాధానమే !! రాధికకు నిర్లిప్తత అలవాటయ్యింది .

--------------

చీకటి పడుతున్నది . వానజల్లు యెక్కువయ్యింది .మురళి యింకా రాలేదన్న కంగారు మొదలయ్యింది . లోపలికి వచ్చి తలుపుమూసింది . నిరాశగా,కరిగిపోతున్న కాలం ఆశాకిరణం ఒకటి మురిపించి మెరిపించింది . రాధిక జీవితపయనం లో మధురచలనం వచ్చింది . ,మాతృభావన !!!అందమైన భావన !!మరో జీవికి తను తల్లి !! రాధికకు మధుర అనుభూతి !! "రాధీ

మృదువైన పిలుపుకి మత్తుగా పడుకున్న రాధిక కళ్లు తెరిచింది .

"బాబు నీలా యెంతో అందం గా వున్నాడు "అన్నాడు మురళి .ఏమిటీ .... అతడంటున్నది --- తను వింటున్నది వింత గా మెరుస్తున్న కళ్ళతో భర్తను చూసింది .

"అవును రాధీ విశాలమైన కళ్లు ,కోటేరులాంటి ముక్కు ,సన్నని పెదాలు ,నీ అందాన్నంతా పోగుపోసుకున్నాడు " యెంతో తమకం గా బాబును మద్దాడుతున్నాడు మురళి .

తను కన్న కలలు కల్లలు కాదు ,తన మురళి సౌందర్యారాధకుడే !!తనుకోరుకున్న మాట తన భర్త నోట్లోనించి వచ్చింది . తనచిన్నకోరిక యీ రోజు తీరింది . నీరసం గా వున్న రాధిక కళ్లల్లో తృప్తి . అందమైన తల్లినయ్యాను హాయిగా నవ్వుకుంది రాధిక .

మరిన్ని కథలు

Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaalani kaagitam
కాలని కాగితం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు