కడుపులోని ఆవేశం , ఆక్రోశం ,అంతా మాటల్లోనే నింపుకుని, అత్త కోసం ఎదురుచూస్తున్న క్షణం, రానే వచ్చింది!
అత్తను చూడగానే ,పట్టలేని ఉక్రోషం ఆపుకుంటూ,ఇక అడిగేయాలి అనుకుంటున్న మాటలు,
మనస్సులోనే మననం చేసుకుంది కొడలు పిల్ల. "ఎంత మోసం చేసావ్ అత్తయ్యా! ఎన్నో టీవీ సీరియల్స్ చూసి , నిద్ర లేని ఎన్నో రాత్రులు గడుపుతూ, మానసిక ఒత్తిడిని తట్టుకుంటూ,
నేను వేసుకున్న ప్లాన్ మొత్తంగా తలక్రిందులుగా చేశావు కదా!" ఆక్రోశంతో ఊగిపోతు అందుకుంది కోడలు. కాపురంకు వచ్చిన దగ్గర నుండి చూస్తూనే ఉన్నాగా నిన్ను, నా పైన పెత్తనం చెలాయించాలి అనే నీ కపటబుద్ది" "నువ్వు ప్రాథమిక విద్య మాత్రమే చదివి ఉంటావు" ""నేను! మా అత్తగారింటి పీ.హే.డి చేసాను." "నన్ను అంత తక్కువగా అంచనా వేయకు" "నీది మోడ్రన్ ప్లాన్ అయితేనేం! నాది మాస్టర్ర్మైండ్ అని తెలుసుకోలేక పొయావ్."
"అదే నీ తెలివి తక్కువ తనం," అది తెలుసుకో" అంటూ కను బొమ్మలు ఎగురవేసింది అత్తగారు.
"నేను నీకులాగే ఎన్నో టీవీ సీరియల్స్ చూసా.. ప్రతి పాత్రలో నన్ను నేను చూసుకుంటూనే, ఎన్నోరకాల కలలు కనేదాన్ని, చివరకు అవే నన్ను నీ నుంచి కాపాడుతాయి అని అర్థం చేసుకోలేక పోయావు కదా"
ఆ మాత్రం తెలీదా నీకు" సర్ది చెప్పేసింది అత్తగారు "ఎంత మాస్టర్మైండ్ అయినా ! చివరకు ముగింపు ఇచ్చింది నేనే కదా ! అది మరచిపోకండి" అంటూ ముక్కు చీదింది కోడలు పిల్ల. "అయినా అత్తయ్యా! వంటగదిలోకి వెళ్ళిన దానివి , కాలయాపన చేయకుండా,వెంటనే గ్యాస్ స్టౌవ్ వెలిగించాలని తెలియదా నీకు,"
"ఎందుకు అలా ఆలస్యం చేసావ్" అని సూటిగా ప్రశ్నించ లేక తల దించుకుంది కోడలు పిల్ల .
"వెలిగించాలని అనుకుంటున్నాను , దిక్కుమాలిన కరెంట్ పోయింది ,అందుకే ఆగాను."
"అమ్మ!అత్తయ్యా! నువ్వు తప్పించు కోవడానికి దొరికిన చిన్న అవకాశం అది అనుకున్నావా? అది నా మస్తిష్కంలో జనించిన ఒక మెరుపు లాంటి హ్యూహం. కానీ బెడిసి కోట్టింది కదా " అనుకుంది కోడలు పిల్ల
"అయ్యో అత్తయ్యా! ఎంత సేపటికి మీరు గ్యాస్ స్టౌవ్ వెలిగించడం లేదని ,ఆ కరెంట్ తీసింది నేనే"
"చీకట్లో ఏమీ కనిపించటంలేదు మీరు అగ్గిపుల్ల గీస్తారు, లీక్ చేసిన గ్యాస్ అంటుకుని ,మీరు హరి అంటారని !ఆత్రంగా చెవులు రిక్కించి వింటూ బయట కూర్చున్నాను."
"నేను అదే అనుకున్నాను కోడలు పిల్లా , "చీకట్లో చిరు దీపం సీరియల్ "గుర్తు వచ్చి, కరెంటు వచ్చేవరకూ సీరియల్ కోసం బయటకు వచ్చి చేసేదేముంది అని ,
నిన్న జరిగిన ఎపిసోడ్ ను తలుచుకుంటూ , ఏమి జరుగుతుందో ?అని ఆలోచిస్తూ, కూర్చుండిపోయాను అంతే." ఓసి నంగనాచి! ఎంత పని చేసావే! అమ్మో!ఘటికురాలివే అనుకుంటూ బుగ్గలు నొక్కుంది కోడలు పిల్ల. నింపాదిగా చెప్పిన అత్తగారిని కొరకొరా నమిలేయాలనేలా చూస్తూ
"అయినా! నా దరిద్రం కాకపోతే ,చీకటిలో మీరు ఏం చేస్తుంటారు " అని చూడటానికి వచ్చి ,అగ్గిపుల్ల గీసింది నేనే కదా.." ముందూ వెనుక ఆలోచించకుండా! మట్టి బుర్ర కదా నాదీ . అనుకుంటూనే తన నెత్తి పైన తానే ఒక్కటి వేసుకుంది కోడలు పిల్ల.
"సరిపోయిందిలే ! నన్ను పైకి పంపించాలని అనుకుని, గ్యాస్ లీక్ ప్లాన్ చేసి నాతోపాటు నువ్వు కూడా వచ్చావు కదా.." సరేలే! వచ్చే జన్మలో నైనా మంచిగా ప్లాన్ చెసుకో."
అత్తల్ని ఎప్పుడూనా తక్కువగా అంచనాలు వేయకు" "ఇప్పుడు చింతించి లాభం ఏముందిలే" ఇద్దరం తిరిగి ఒకే చోట చేరాం కదా!
"తెల్లవారుతుంది ! ఎవరి స్థానాల్లోకి వాళ్ళం వెళ్ళిపోదాం పదా! మనుషులు ఎవరైనా చూస్తే! దడసుకుని నానా హంగామా చేస్తారు "
"అదో పెద్ద గోలౌద్ది." "ఈ మాత్రం మాట్లాడుకూనే స్వేచ్చ కూడా మనకు ఉండదు." "పదా!ఇక మన స్థానాల్లోకి దూరి పోదాం!" అనుకుంటు ఎవ్వరి సమాధిలోకి వారు దూరిపోయారు. అత్తకు మించిన కోడలు, కోడలు మించిన అత్తగారు... ప్రతి రాత్రి ఇలాగే..ఇదో కాలక్షేపం అవుతుందేమో వారి ఆత్మలకు.