అనుకున్నది ఒకటి.... అయినది ఒకటి.... - సువర్ణ మారెళ్ళ

Thought is one .... is one ....

ఆ ప్రక్కింటి మంజుల రియాలిటీ షోలో పాల్గొని టీవీలో కనపడ్డ దగ్గరనుంచి మూతి విరుపులు, మౌనదీక్షలు, మాడువంటలు తప్ప సీతాపతి జీవితంలో ముసిముసి నవ్వులు, ముద్దు మురిపాలు లేకుండా పోయాయి. అతని భార్య సీత పేరుకు తగ్గట్టు అనుకూలవతే గాని,

ఒకటి చేయాలని ఫిక్స్ అయితే తన మాట తనే వినదు అనే సీతయ్య టైపు. పదిరోజుల క్రిందట సీత "మనమూ రియాలిటీ షో లో పాల్గొందాం అండి." అని ముద్దుముద్దుగా అడిగింది. "దానికేం భాగ్యం ఏ 'స్క్వేర్ మహిళల'కో, 'భిన్నరుచి' వంటల షోకో వెళ్ళవోయ్" చిన్నగా విజిల్ వేస్తూ సీత బుగ్గ మీద చిటిక వేశాడు సీతాపతి. " నేను వెళ్ళడం కాదండోయ్!! మనిద్దరం వెళ్ళాలి. లేదా మీరు ఒక్కరైనా వెళ్ళాలి.

ఆ మంజుల ఏమందో తెలుసా? నాలా నువ్వు రియాలిటీ షోకు ఎలా వెళతావులే పాపం!! మీ ఆయనకి ఆ షోలంటే పడవు కదా? అంటూ ముక్తాయించింది కూడా. అందుకే మనం లేదా మీరు ఖచ్చితంగా రియాలిటీషోలో పాల్గొనాలి. టీవీలో కనపడాలి. అప్పుడే దానికి బుద్ధి వస్తుంది." అని బళ్ళ గుద్ది మరీ చెప్పింది.

ఆలోచనలో పడ్డాడు సీతాపతి. అసలే అతను ఇలాంటి వాటన్నిటికీ ఆమడదూరం. పోనీ ఏదయినా కళలు వచ్చా అంటే, నిద్రలో వచ్చే కలలు తప్ప మరేమీ రావు. అయినా కొత్త పెళ్ళాం కొత్త కోరిక వింతదయినా తీర్చడం మొగుడుగా తన బాధ్యతని ఒకసారి అన్ని రియాలిటీ షోలను గుర్తు చేసుకున్నాడు. తన ఊరి ప్రసిడెంట్ పేరు కూడా తెలియని అతను 'ప్రశ్నమాది- పైసా మీది' ప్రోగ్రాం ఎంట్రీ గేటు దగ్గరకు కూడా వెళ్లలేదు.

సరే ఈ సరదా సీతది కాబట్టి, పోనీ సీతతో పాటు 'ఢాం' డాన్స్ ప్రోగ్రాంకి వెళదామంటే, తను డాన్స్ చేస్తే ఫిట్స్ వచ్చాయి అనుకుని తాళాల గుత్తి చేతిలో పెట్టడం గ్యారంటీ. పోనీ 'కలుగులో కలిసుందాం..' షోకి వెళ్దాం అంటే వందరోజులు అతనోక్కడు అలా ముక్కు మొహం తెలియని వాళ్ళతో తగువులు పడలేడు. మరీ ముఖ్యంగా ముద్దపప్పు, ఆవకాయ లేకుండా ముద్దు దిగదు.

ఇది అతని వల్లయితే ససేమిరా కానే కాదు. 'పాడమని నన్ను అడగవలేనా…' కి వెళదాం అంటే వాళ్ళు పాడమని అడిగినా, అడగక పోయినా సీతాపతి పాడితే మాత్రం తన్ని తగిలెయ్యడం జరుగుతుంది. ఏమంటే అతని గొంతు విప్పితే గాడిద గాండ్రింపే. వైఫ్ చేతిలో నైఫ్, నువ్వా_నేనా, భర్తతో సవాల్.. ఇలా అన్నిట్లోను నోటితో నీళ్ళు గ్లాసులో పోయడాలు. ఒంటి కాలుతో పరిగెట్టడాలు, అరిటి పండు అరనిమషం లో తినడం లాంటి అర్ధం పర్థంలేని ఆటలు, రియాలిటీ లేని రియాలిటీ షోలు. వామ్మో!! ఇలా చూడగా చూడగా రియాలిటీ షో అంటే వణుకు జ్వరం పట్టుకుంది.

పది రోజుల బట్టీ ఆపకుండా ఏదో ఒక రియాలిటీ షోను రివాజుగా చూస్తున్న సీతాపతికి టీవీ లో వచ్చే ఆ షో చూస్తూనే ఏదో జ్ఞానోదయం వచ్చిన వాడిలా "సీతా!.... ఒకసారి ఇలారా నేను నీకో విషయం చెప్పాలి" అంటూ గావు కేక పెట్టాడు. సీత వస్తూనే

ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను మీరు ఏదో ఒక రియాలిటీ షోకి ప్రయత్నించక పోతే మీకు విడాకులు ఇచ్చెయ్యడమే, రెండో మాట మీరు చెప్పద్దు, నేను వినద్దు." అంది ఒకింత సీరియస్ గా. "అబ్బ.. అబ్బ.. ఎంత ముందు చూపే నీకు.. నువ్వు అదేమాట మీద ఉంటే ఆ రియాలిటీ షోలోకి ఎంట్రీ సులువు అయిపోతుంది."

"అంటే ఏమిటి మనం షోకి వెళుతున్నామా.." అడిగింది సీత ఆశ్చర్యం, ఆనందం మేళవించి. "ఓహ్!! తప్పకుండా, అదే నువ్వు అన్నట్టు విడాకులు ఇచ్చేస్తే, ఇప్పుడే 'బతుకు రైలుబండి' రియాలిటీ షోకి అప్లికేషన్ పెట్టేస్తాను. రియాలిటీ షో లో పాల్గొనాలనే నీ కోరిక, నాకు నీ సతాయింపు రెండూ ఒకేసారి తీరిపోతాయి. ఏమంటావు!? " అన్నాడు అమాయకమైన ముఖం పెట్టి. సీతాపతి నుంచి ఆ ఊహించని పరిణామానికి సీత ఏడుపు ముఖంతో " వామ్మో!! ఇంకెప్పుడూ ఏ షోలో పాల్గొంటానని అడగను. అసలు టీవిలో కూడా చూడను.

అంత మాట అనకండి." అంటూ బతిమిలాడింది సీత. పాచిక పారినందుకు "హమ్మయ్య!" అనుకుని మనసులో నవ్వు కున్నాడు సీతాపతి.

మరిన్ని కథలు

Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaalani kaagitam
కాలని కాగితం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు