ఆఫీసునుంచి ఇంటికొస్తూ, మధ్యలో రైతుబజార్లో కూరలు కొనుక్కుని ఇంటికి బయల్దేరాను. ఓ చేతిలో బాస్ ఇచ్చిన హోం వర్క్ ఫైలూ, మరో చేతిలో నిండుగా ఉన్న కూరల సంచీ... నడక కాస్త కష్టమనిపించినా, ఇల్లు దగ్గరే కావటంతో నడవసాగాను. ఇంతలో ఎవరో వెనకనుండి “సార్!” అని పిలవటంతో, వెనక్కి తిరిగి చూశాను. అతనికి యాభై ఏళ్ళుంటాయేమో… నెరిసిన గడ్డం, చిరుగుల షర్టూ... చూడటానికి బతికి చెడ్డవాడిలా ఉన్నాడు. చేతిలో ఏదో ప్లేటుంది.
నా దగ్గరికొచ్చి “సార్! మేలైన జాతి వజ్రాలు, వైఢూర్యాలు, మరకతాలూ, మాణిక్యాలూ పొదిగిన ఉంగరాలు. ఉద్యోగ, వ్యాపారాల్లో అదృష్టాన్ని తెచ్చిపెట్టే ఉంగరాలు. మీ జన్మనక్షత్రం చెబితే దానికి తగ్గ ఉంగరం ఇస్తాను. ఒక్కటి తీసుకోండి” అన్నాడు. నేనతణ్ణి తేరిపార చూసి, “ఇవి అంత గొప్ప ఉంగరాలైతే, మీరే ఒకటి పెట్టుకునివుంటే మిమ్మల్నీ అదృష్టం వరించేదిగదా” అన్నాను వ్యంగ్యంగా.
అతడి ముఖం ఒక్కసారిగా వివర్ణమైపోయింది. కళ్ళలో నీళ్ళు తిరిగాయి. “నిజమే సార్. వేదం చదివిన నోటితో అడుక్కోవటానికి మనస్కరించక ఏదో ఇలా... ‘ఉదర పోషణార్ధం బహుకృత వేషమ్’ అన్నారుగదా...” అన్నాడు. ఆ మాటలకు నాకే బాధనిపించి “వేదం చదివి... మరి ఇదేమిటిలా?” అనడిగాను. “నిజానికి ఇది నా వృతి కాదు. గతంలో నేనో గుడిలో పూజారిని. కానీ రోడ్డు వెడల్పు చెయ్యటంకోసం ఆ గుడిని కూల్చివేశారు. అందర్నీ బ్రోచే ఆ దేవదేవుని విగ్రహాలకే గతిలేదు. ఇక అల్పమానవుడినైన నేనెంత! ఇదిగో ఇలా రోడ్డునబడ్డాను. రెక్కలొచ్చిన పిల్లలు గూడు వదిలి ఎగిరిపోయారు. అనారోగ్యంతో మంచాన బడ్డ మా ఇంటిదీ, నేనూ మిగిలాం. ఏ అయ్య అయినా దయతల్చి ఒక ఉంగరం కొంటే ఓ పది రూపాయలు మిగుల్తాయి” నాకు గుండె తరుక్కుబోయింది. నా చేతిలోని కూరల సంచీని, జేబులో వున్న వెయ్యి రూపాయలనూ ఆయన చేతుల్లో పెట్టి, “ఇవి మీ విద్వత్తుకు… కాదనకండి” అనేసి, ఓ నమస్కారం పెట్టి, వడివడిగా అక్కడ్నుంచి సాగిపోయాను. **000**