కులము-కొలిమి - చెన్నూరి సుదర్శన్

Caste-furnace

నేను ఒక వాస్తవ సంఘటనను ఆధారంగా చేసుకుని, కథగా మలిచే యత్నంలో తీవ్రంగా ఆలోచిస్తున్నాను. ఇంతలో వాట్సాప్ సందేశంతో నా చరవాణి వెలిగింది.

నా అభిమాన పాఠకురాలు వనజ పంపిన సందేశమది. నా కథల సంపుటి చదివి అభినందనతో.. ఒక పెద్ద ఉత్తరం వ్రాసింది. ‘అన్నయ్యా’ అంటూ నన్ను సంభోదిస్తూ.. తన కుటుంబ విషయాలూ చెప్పుకునేంతలా సాన్నిహిత్యం పెంచుకుంది. ప్రతీరోజు ‘శుభోదయం’ అంటూ సందేశం పంపిస్తుంది. నేనూ శుభోదయంతో బాటు ఒక ‘సుభాషితం’ పంపిస్తూంటాను.

ఈరోజు ఉదయమే.. ‘మనిషిలో అహం తగ్గిన రోజు..!!, ఆప్యాయత అంటే అర్థమవుతుంది. గర్వం పోయిన రోజు..!!, ఎదుటి వారిని ఎలా గౌరవించాలో తెలుస్తుంది. నేనే..! నాకేంటి అనుకుంటే..!!, చివరికి ఒక్కరిగానే ఉండిపోవాల్సి వస్తుంది. గౌరవ మర్యాదలు ఇచ్చిపుచ్చుకుంటూ.. ఆనందంగా ఇతరులతో కలిసి జీవించడమే.. నిజమైన జీవితం. శుభోదయం’ అంటూ పంపించాను.

సామాన్యంగా మళ్ళీ మామధ్య సందేశాలు చోటు చేసుకోవడం అరుదు. కాని ఈరోజెందుకో వనజ నుండి మరో వాక్యం రావడంతో.. ఆశ్చర్యంగా చూశాను.

“రాత్రి నాకొడుకు చెయ్యి చేసుకున్నాడన్నయ్యా”

ఆశ్చర్యపోయాను. “ఎంత ఘోరం” అంటూ పోస్ట్ చేశాను.

“చెయ్యి చేసుకోవడం.. ఇదే మొదటిసారి కాదు. తొలిసారిగా నా బాధలు మీతో పంచుకుందామని..”

అలా వాట్సాప్‌లో మాసంభాషణ మొదలయ్యింది.

“మీఅమ్మాయి వివాహం లోగడనే అయ్యిందని తెలుసు. ఇక ఉన్న ఒక్క కొడుకు వివాహం ఈమధ్యనే చేశారు కదా.. వాట్సాప్‌లో పంపిన కార్డు చూసాను. నాకు వీలు కాలేదమ్మా.. రాలేక పోయాను”

“ఆపెళ్ళితోనే కష్టాలు మొదలయ్యాయి అన్నయ్యా..”

ఇది ఇంటింటి భాగవతమే.. ఈమధ్య కొడుకులు తల్లిదండ్రులను ఆస్తికోసం కొట్టడం.. చంపడం.. సర్వసాధారణమై పోతున్నాయి.

ఈవిషయం ఇప్పుడప్పుడే పూర్తయ్యేది కాదు. ముందుగా నాకథ పూర్తిచేసుకోవాలని..

“నేను మరో కథల పుస్తకం రాజన్నతో పంపించాను ఇచ్చాడా..” అంటూ విషయం మార్చాను.

“నిన్ననే తెచ్చిచ్చాడు”

రాజశేఖరం విశ్రాంత ఉపాధ్యాయుడు. నాకు వరుసకు అన్నయ్య అవుతాడు. అంతా అతణ్ణి రాజన్నా అని పిలుస్తూంటారు. కరీంనగర్ జిల్లా హుజురాబాదులో మా తాతయ్య ఇంటి ప్రక్కనే అతని ఇల్లు. నేను అదే ఊళ్ళో పుట్టాను. అందుకే ఆఊరన్నా.. ఆఊరి వాళ్ళన్నా నాకు కాసింత అభిమాన మెక్కువ.

అమ్మమ్మ, తాతయ్య కాలధర్మం చెందడంతో.. అక్కడ ఇల్లు అమ్మేశాం.

నేను పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా పదవీ విరమణ చేశాను.

ఏదో ఒక వ్యాపకం పెట్టుకోవాలని రచనా వ్యాసాంగాన్ని ఎన్నుకున్నాను. నేను తెలుగు భాషాభిమానిని. నాజీవితానుభవాలను కథల రూపంలో రాస్తూ.. మన తెలుగుభాషకు సేవచేయాలన్నది నాజీవితాశయం. పెన్షన్ డబ్బులు పొదుపు చేస్తూ.. పుస్తకాలు ప్రచురించుకుంటాను. మిత్రులకు.. రచయితలకు.. గ్రంథాలయాలకు ఉచితంగా పుస్తకాలు పంపించడం ఆనవాయితిగా పెట్టుకున్నాను. గత పదిసంవత్సరాలలో ఐదు పుస్తకాలు ప్రచురించుకున్నాను. అందులో రెండు బాల్యసాహిత్యాలు కూడాను. ఇలా ఆలోచనలో మునిగిన నేను వనజ నుండి మరో సందేశం రావడంతో ఫోన్ ముఖం వెలిగింది.. తెప్పరిల్లాను.

వాట్సాప్­లో మళ్ళీ సంభాషణ మొదలయ్యింది.

“నాకథ రాయండి.. అన్నయ్యా”

“కథ తరువాత గానీ.. మీ కొడుకు మిమ్మల్ని కొడుతుంటే మీవారు అడ్డుకోవడం లేదా..?”

“ఇద్దరినీ వరుసబెట్టి కొడుతున్నాడు.. వాడొక మూర్ఖుడు”

“మీరు మంచి గౌరవప్రదమైన ఆయుర్వేద డాక్టరు వృత్తిలో ఉన్నారు. బీదవారికి ఉచితంగా వైద్యం చేస్తున్నారని మా రాజన్న చెప్పాడు. కొడుకు ఎందుకు కొడ్తున్నాడు”

“కొడుకు పెండ్లి ఖర్చులు మేమే పెట్టుకున్నాం.. కానీ కట్నం తీసుకోకుంట ఘనంగ పెళ్లి చేశాం. కోడలుకు నగలూ.. మేమే చేయించాం. ఇప్పుడు నగలన్నీ పట్టుకొని తల్లిగారింటికి ఝండా ఎత్తేసింది”

“మీ కొడుకు ఉద్యోగం చెయ్యడం లేదా..! ”

“వాడు హైద్రాబాదులో మా ఫ్లాట్‌లోనే ఉంటాడు. ఒక ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడట”

“అదేంటి కొత్త దంపతులు కదా.. కొడుకు హైద్రాబాదులో.. కోడలు మీదగ్గర ఉండడం..”

“కొడుకు ప్రతీ శుక్రవారం రాత్రికి వచ్చి సోమవారం పొద్దున్నే తిరిగి హైదరాబాదుకు వెళ్తాడు”

“అదేం పద్ధతి.. ఇద్దరు కలిసి హైద్రాబాదు ఫ్లాట్‌లోనే ఉండవచ్చుకదా..”

“డబ్బులు సరిపోవడం లేవని ఈమధ్యనే భార్యను తీసుకు వెళ్ళడం లేదు. కొడుకు మంచి వాడే గానీ.. అంతా కోడలుతోనే వస్తోంది. కోడలు మా మీద చాడీలు చెబుతూ.. కొడుకుతో కొట్టిస్తోంది. నేను ఇంట్లో ఉండగూడదట..

నన్ను ఇంట్లో నుండి తరిమేయకుంటే.. వరకట్నం కేసు పెడ్తామని మాకోడలు తల్లిదండ్రులు బెదిరింపులు మరో ప్రక్క”

“మీ ఆయనకిదంతా తెలియదా..”

“తెలుసు.. ఆయనకూ నామీద కోపమే.. ఆస్తి నాపేరటుందని”

“ఆస్తి మీపేరనా..!”

“మా ఆయన పచ్చి తాగుబోతు.. ఆస్తి తగలబెడ్తాడని పొలాలను.. ఇంటినీ నాపేర రిజిస్టర్ చేశాడు మా మామయ్య. ఇప్పుడు ఆస్తంతా తమ పేరన బదిలీ చెయ్యిమని కొడుకు పోరు పెడుతున్నాడు”

“మీతో సఖ్యంగా ఉంటూ.. ఆస్తి రాయించుకోవాలి గానీ.. ఇదేం పద్ధతి. అయినా ఒక్కడేగా వారసుడు. మీ తదనంతరం ఆస్తి అంతా తనదేనాయే.. మీ కూతురుకు కూడా ఆస్తిలో వాటా ఇవ్వాల్సి ఉంటుంది కదా..!”

“అలాంటిదేమీ లేదు. నాకూతురు అత్తగారు కలిగిన కుటుంబం. మా ఆస్తి మీద వారికి కన్ను లేదు”

“మరింకేం..! మీ కొడుకు ఎందుకు తొందర పడ్తున్నాడు”

“ఆస్తి రాసిచ్చి ఇంట్లో నుండి వెళ్ళి పోవాలని మా ఆయన గూడా కొడుక్కే సపోర్ట్ చేస్తున్నాడు”

“నాకర్థం గావడం లేదు. మీరేమైనా మోసం చేస్తారని అనుమానమా.. మీరు ఆయనను మోసం చేసి పెళ్ళి చేసుకున్నారా..”

“లేదు. తనే.. నా వెంటపడి కావాలని పెళ్ళి చేసుకున్నాడు. అప్పుడు నాకు పదహారు సంవత్సరాలు. పదవ తరగతి చదువుతున్నాను. ఆయన జీవిత భీమా ఆఫీసులో పనిచేసే వాడు. నేను బడికి వెళ్ళాలంటే వారి ఆఫీసు ముందు నుండే దారి. నన్ను చూసి పెళ్ళి చేసుకుంటనని మాఇంటికి రాయబారం పంపాడు. మానాన్న పోలీసు కానిస్టేబుల్. ఒప్పుకోలేదు. అయితే ఎస్సై తో చెప్పించి.. ఒప్పించాడు. మాది రిజిస్టర్ మ్యారేజీ”

“రిజిస్టర్ మ్యారేజీ.. అవసరమే గానీ.. సంప్రదాయంగా కార్యక్రమాలేవీ జరుగలేదా!”

“మా ఆయన తల్లి దండ్రులకు, వారి కులం వాళ్ళు వేలివేస్తారనే భయం..”

ఈ కాలంలో.. కులాల సంగతి నేరుగా వనజను అడుగడం సబబు కాదనుకున్నాను. రాజన్నకు ఫోన్ చేస్తే కొంత సమాచారం దొరుకుతుందేమో..! అని ఆలోచించసాగాను. ఇంతలో వనజ నుండి వాట్సాప్‌లో మరో సందేశం వచ్చింది.

“మాది పల్లెటూరు. మాతాతయ్య గొప్ప పేరున్న ఆయుర్వేద డాకుటారు. మాఅమ్మ తాతయ్యకు సాయపడేది. ఇంటి పెరట్లో.. ఆయుర్వేద మొక్కలు పెంచే వాళ్ళం.. అలా మా ఇంట అందరికి ఆయుర్వేద వైద్యం అబ్బింది”

“మీరు పెళ్ళయ్యాక చదువు మానేశారా..”

“లేదు.. మా ఆయన ఎల్.ఐ.సి. ఏజంట్ ఇప్పించాడు. అది చేసుకుంటూ ప్రైవేటుగ బి.ఏ. పాసయ్యాను. జాబ్ గూడా వచ్చింది. కాని అప్పటికే నాబిడ్డ కడుపులో పడింది. మా ఆయన జాబ్ లో చేరనివ్వ లేదు. మరో ఏడాదికే మళ్ళీ తల్లినయ్యాను. కొడుకు పుట్టాడు. బాలింత రోగం బారిన పడ్డాను. మందులు వికటించింది. చెవులు సరిగ్గా వినరాకుండా అయ్యాయి. కుడి కాలు, కుడి చెయ్యి పూర్తిగా నా ఆధీనంలో లేకుండా పోయాయి”

పాపమనిపించింది. అందుకేనేమో..! వనజ నాకు వాట్సాప్‌లో పరిచయమే గాని ఒక్క సారి కూడా ఫోన్ చెయ్యలేదు.

“ఉద్యోగంలో చేరడానికి సమయం అడిగి తీసుకోవాల్సింది. ఉద్యోగం చేస్తే ఈసమస్య వచ్చేది కాదు. వాళ్ళ ఆస్తి వాళ్ళ ముఖాన కొట్టి మీకాళ్ళ మీద మీరు బతికే వారు. అయినా ఇప్పటికీ మించి పోయిందేమీ లేదు. ఆస్తి మీది కాదు కాబట్టి వారికిచ్చేయడం న్యాయం”

“ఆస్తి కోడలు పేరు మీద రాయాలట. నాకేమో..! వారికి పుట్టబోయే బిడ్డలకు ఆస్తి ఇవ్వాలని ఉంది. ఆస్తి రాసిచ్చినా.. ఇంట్లో నుండి వెళ్లి పోవాలని రాద్దాంతం చేస్తున్నారు”

వనజ మీద ఎందుకంత పగ.. నా కర్థం కాలేదు. వనజ చెప్పేది కూడా ఎంత వరకు నిజమో..! తెలియదు. ఒక పక్షమే విని నిర్థారణకు రావద్దు. రాజన్నకు ఫోన్ చేస్తే వాస్తవం తెలుస్తుందనుకున్నాను.

వనజ భర్త రామశర్మ.. రాజన్నకు తెలుసు.

“మీరొక పని చెయ్యండి. మీకొడుకు, కోడలు పెట్టే కష్టాలు.. హిసించే మాటలు ఒక కాగితం మీద రాసి నాకు పోస్ట్ చెయ్యండి. లోగడ నాకథలు చదివి చాలా చక్కగా విశ్లేసిస్తూ.. ఉత్తరం రాసారు. అది నాకు ఎంతో స్ఫూర్తిదాయకమయ్యింది. మీలో రాసే శక్తి ఉంది. రాసి పంపండి. కథకు అదే ప్రాణం” అంటూ వాట్సాప్‌లో విషయం పంపి.. నా కథ కోసం ల్యాప్­టాప్ తెరిచాను.

మరో నాలుగు వాక్యాలు వాట్సాప్ లో వచ్చాయి వనజ నుండి.

“గురూజీ.. మీనాన్న పోలీసు డ్రెస్సుతో దిగిన ఫోటోను, మీరు పంపిన మొదటి కథల పుస్తకంలో చూశాను. అందులో మానాన్నను చూసుకుంటూంటాను. మీ మీద మరింత అభిమానం పెరిగింది. అందుకే నాఆవేదనంతా మీతో చెప్పుకుంటున్నాను.నా కథ తప్పకుండా రాయాలి. ముగింపు మీ ఇష్టమే..”

అప్రయత్నంగా నాకళ్ళు చెమర్చాయి. వరకట్న కోరల్లో బలై పోయిన నాఅక్కయ్య గుర్తుకు వచ్చింది. చదువులో నా తెలివితేటలు చూసి అక్కయ్య నన్ను ఎప్పుడూ ‘గురూజీ’ అని పిలిచేది.

***

రాజన్నకు ఫోన్ చేశాను.

వనజతో జరిగిన సంభాషణ క్లుప్తంగా చెప్పి మరిన్ని వివరాలు అడిగాను.

“రామశర్మ ఇంతకు ముందే వచ్చి వెళ్ళాడు. తన కుటుంబంలో జరుగుతున్న గందర గోళమంతా చెబుతూ.. కన్నీళ్ళు పెట్టుకున్నాడు. అసలు సమస్య నాకు తెలుసు తమ్మడూ..” అంటూ రామశర్మ కుటుంబ గాధను వివరించాడు. వనజ చెప్పిందంతా వాస్తవమే.

“రామశర్మ వాళ్ళు మంచి ఆస్తిపరులు. ఇంట్లో తాను ఏకైక సంతానం. చాలా గారాబంగా పెరిగాడు.

వనజను తప్ప మెరెవ్వరినీ పెళ్ళి చేసుకోనని రామశర్మ మొండికేయడంతో అతని తల్లిదండ్రులు పెళ్ళికి ఒప్పుకోక తప్ప లేదు. వనజను కులాంతర వివాహం చేసుకున్నాడు.

పెళ్ళయ్యాక కులపెద్దల సూటి పోటి మాటలు భరించలేక వాళ్ళను వేరే కాపురం పెట్టించారు.

కొడుకు పుట్టిన ఆనందమో..! లేక వనజ ఆనారోగ్యమో..! తెలీదు గాని రామశర్మ తాగుడుకు బానిసయ్యాడు. ఉద్యోగం ఊడింది.

కోడలుకు అన్యాయం జరక్కుండా.. రామశర్మ తల్లిదండ్రులు ఆస్తిని వనజ పేరు మీద వీలునామా రాశారు.

ఇంట్లోనే వనజ ఆయుర్వేద హాస్పిటల్ తెరచింది. రామశర్మ సాయం చేసే వాడు. ఇంటి వెనకాల పెరట్లో ఆయుర్వేద మొక్కలు పెంచారు. పేద రోగులకు ఉచితంగా మందులివ్వడం మొదలు పెట్టారు. మంచి పేరు వచ్చింది.

అమ్మాయికి కులాంతర వివాహం చేశారు. అల్లుడు కూడా చాలా మంచి వాడని రామశర్మ చెబుతూంటాడు.

అబ్బాయికి మాత్రం తమ కులపు అమ్మాయే కావాలని పట్టుదలతో సంబంధాలు వెదకి.. వెదకి వేసారి పోయాడు రామశర్మ. ‘వనజ వేరే కులపు స్త్రీ.. మేము కులభ్రష్టులమవుతాం’ అని ఎవరూ అమ్మాయినివ్వడానికి ముందుకు రాలేదు. చివరికి ఒక ఛోటా మోటా.. రాజకీయ నాయకుని కూతురు సంబధం కుదిరింది. పెళ్ళి ఇక్కడే వైభవంగా చేశారు.

ఇక వనజ కష్టాలు ఆరంభమయ్యాయి.

ఒక రోజు రామశర్మ ఇంట్లో గొడవల గురించి చెబుతూ అసలు కారణం బయట పెట్టాడు. వాళ్ళ అబ్బాయికి సంబధం ఖాయం చేసుకునే ముందు రామశర్మ వియ్యంకుడు రెండు షరతులు విధించాడట. ఒకటి.. ఆస్తి మొత్తం తమ కూతురు పేర మార్పిడి చెయ్యాలి. రెండవది.. వనజ మూలాన తమ కుటుంబ పరువు మర్యాదలు గంగలో కలుస్తాయి కాబట్టి వనజను ఇంట్లో నుండి తరిమెయ్యాలి. తన బావమర్ధి పోలీసు సర్కిల్ ఇన్‌స్పెక్టర్.. ఏకేసులూ రాకుండా చూసుకుంటాడని.. తనూ లీడరే కాబట్టి రామశర్మకు ఏ ఇబ్బంది రాకుండా చూసుకుంటానని భరోసా ఇచ్చాడట. రహస్యంగా ఆ షరతులను ఒప్పుకోవాల్సి వచ్చిందన్నాడు రామశర్మ.

కోడలు కొన్ని రోజులు ఓపిక పట్టింది. వనజ తండ్రి చనిపోయాక.. గొడవ మొదలు పెట్టింది. ఆస్తి లాక్కొని వనజను ఇంట్లో నుండి వెళ్ళగొట్టండని.. పట్టుబడుతోంది. మొగణ్ణి ఉసిగొలిపుతూ.. వాళ్ళ మీదకు దాడి చేయిస్తోంది. ఆ కుంటిది బస్ స్టాండులో అడుక్కు తినాలని.. తన కులపిచ్చి ఆమెను రక్కసిగా మార్చేసింది. నేటి యుగంలో గూడా.. కులం కొలిమి చల్లారలేదు తమ్ముడూ.. ఇంకా రగులుతూనే ఉంది.

వనజకు ఈ షరతుల సంగతి చెబితే.. తను ఇంకా బిగుసుకొని కూర్చుంటుంది. ఆస్తి అసలే రాసివ్వదని.. రామశర్మ అంటున్నాడు.

ముందు ‘మే..! మే..!’ అనుకుంటూ. ఆస్తి రాయించుకోవాలనే ప్రయత్నం చేసారు. వనజ సందివ్వ లేదు. ఇక కొట్టడం మొదలు పెట్టారు. వనజ మంచి ఆలోచనా పరురాలు. భవిష్యత్తు ఆలోచిస్తూ.. దెబ్బలను సహిస్తోంది.

ఇంతకూ ఆమె కథ రాస్తావా తమ్ముడూ..” అంటూ అడిగాడు రాజన్న.

“అన్నయ్యా.. ముందు ఆమెను ఆదుకోవాలని ఉంది. రచయితలంతా.. సుద్దులు చెబుతూ.. ఆదర్శాలు వల్లిస్తూ.. కథలు రాస్తారే తప్ప వారు ఆచరించరు.

నావంతు సహకారం వనజకు అందిస్తాను. మనమంతా కలిసి వనజను ఆదుకుందాం..” అంటూ నా ప్రణాళిక సంక్షిప్తంగా ఫోన్లో చెప్పాను.

***

మరునాడు ఉదయమే.. “మంచి సలహాను మించిన విలువైన బహుమతి మరొకటి లేదు.. మనం ఎల్లప్పుడు ఉపకారం చెయ్యలేక పొవచ్చునేమో! గాని.. ఎల్లప్పుడూ ఉపకరించేలా మాట్లాడవచ్చును.. శుభోదయం” అంటూ వనజకు వాట్సాప్ సందేశం పంపించాను.

వనజ స్పందించింది.

మామధ్య వాట్సాప్ సంభాషణ మొదలయ్యింది.

“వనజా.. కథకు ఆ ఇతివృత్తం సరిపోదమ్మా.. మరింత జోడిస్తే మంచి కథ అవుతుంది. ఏ పత్రిక అయినా తప్పకుండా వేసుకుంటుంది”

“నాకు అంతగా తెలియదు గురూజీ.. కొడుకు, కోడలు పెట్టే కష్టాలు రాస్తే సరిపోతుందను కున్నాను”

“ముందు కష్టాలను ప్రతిఘటించాలని అనుకోవడం లేదా..”

“ఉంది గాని అబలను.. అవిటిదాణ్ణి.. ఎలా ఎదుర్కోను..! నాకేమీ పాలు పోవడం లేదు”

ఆమె కళ్ళు వర్షిస్తున్నాయని పసిగట్టాను.

“వనజా.. మీ కష్టాలకు మూల కారకుడు .. మీ వారే” అనే సందేశంలో.. కొడుకు పెళ్ళికి విధించిన షరతులు.. వనజ వెనకాల ఆమె కోడలు కుట్ర విడమర్చి వ్రాశాను.

‘అన్నీ కోల్పోయినా.. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకూడదు. అదొక్కటి ఉంటే చాలు.. మనం కోల్పోయిన వాటన్నింటినీ తిరిగి సంపాదించుకోవచ్చు’..మీకు అండగా ఉండి పోరాడుతాను” అని భరోసా ఇస్తూ.. ధైర్యం నూరిపోస్తూ.. వాట్సాప్ సందేశం పంపాను.

వనజ విషయాన్ని విడమర్చి వివరిస్తూ.. నాతోటి రచయిత మిత్రులందరికీ, అన్ని గ్రూపులకూ వనజ కోసం పోరాడుదామంటూ.. వాట్సాప్‌లో సందేశాలు పంపించాను.

రాజన్నకు ఫోన్ చేసి నేను వస్తున్నట్లు.. ఇంతలో తాను చేయాల్సిన పనులు చెప్పాను.

***

నా వాట్సాప్ సందేశానికి నాతోటి రచయితలు, స్నేహితుల నుండి విపరీతమైన స్పందన వచ్చింది.

హుజురాబాదులో దాదాపుగా వంద మందిమి ప్రోగయ్యాము. ఊళ్ళోని ‘స్త్రీ అభ్యుదయ సంఘం’ మా వెన్నంటింది.

‘కులము-కొలిమి’ అనే బ్యానరుని నేను, రాజన్న పట్టుకున్నాం. ‘కుల వివక్ష – గృహహింస’ అనే బ్యానరును వనజ, మరో మహిళ పట్టుకున్నారు. వనజకు అనుకూలంగా నినాదాలిస్తూ.. ఊరేగింపుతో వెళ్ళి ముందుగా పోలీసు స్టేషన్లో.. ఆ తరువాత మానవ హక్కుల పరి రక్షణ కార్యాలయంలో వనజ చేత వివరంగా రాసిన ఫిర్యాదులిప్పించాను. ఊరి యువజన అంబేడ్కర్ సంఘ మైదానంలో రాజన్న ఏర్పాటు చేసిన బహిరంగ సభ కోసం ఊరేగింపుతో.. అక్కడికి చేరుకున్నాం.

కుల వివక్షను నిరసిస్తూ.. నా మిత్రులు, కొందరు మహిళా మణులు, ప్రసంగాలు చేశారు.

వనజ తనపై జరుగుతున్న గృహహింస, కులం పేరుతో దూషణలు ఏకరువు పెట్టింది.

నా ప్రసంగంలో “రచయితలారా.. ఆదర్శాలను వల్లిస్తూ.. కేవలం రచనలను కొనసాగించడమే కాదు. ఇలా సమాజ సమస్యల్లో తల దూర్చి పోరాడాలి” అని చాటి చెప్పాను.

ఆమరునాడు ఉదయం మా న్యాయ పోరాట వార్తలు వచ్చిన అన్ని దినపత్రికలను తీసుకు వచ్చి వనజకు చూపించాడు రాజన్న.

వనజ కొడుకు, కోడలుతో బాటు ఆమె వియ్యంకుడు, వియ్యపురాలును అరెస్టు చేశారనే వార్త చదివి నన్ను కృతజ్ఞాతా పూర్వకంగా చూసింది వనజ.

“వారికి శిక్ష పడే వరకు మన పోరాటమాగదు” అన్నాను. *

మరిన్ని కథలు

Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaalani kaagitam
కాలని కాగితం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు