ఒకానొక పొద్దుటిపూట.
నరిసింగపురంలో కోతకొచ్చిన వరిపైరు బంగారంలా మెరుస్తోంది. దక్షిణంవైపు నుంచి వీచేగాలి పైరుమీంచి రహస్యంగా కదుల్తున్నప్పుడు... పైరు బంగారు వింజామరే అవుతుంది.
సూర్యుడి లేత కిరణాలు వరివైపు మీద ప్రసరించే అసలే బంగారు వన్నెతో మెరిసే పైరునీ... వరికంకుల్నీ దేదీప్యమానం చేస్తున్నాయి.
అప్పుడు -
ఎక్కణ్ణుంచి వచ్చిందో ఓ పాలపిట్ట, రివ్వుమంటూ వరి కంకుపైన వాలింది.
దాని చిట్టి కాళ్ళకి రక్తం అంటుకుంది.
పాలపిట్ట భయపడి ఉన్నట్టుండి గాల్లోకి లేచి, కొంచెం దూరం ఎగిరి, మరో వరికంకుపైన వాలబోయి, గాల్లోనే ఆగింది.
తను వాలాలనుకున్న ఆ వరికంకకు కూడా భీకరంగారక్తం వోడుతోంది.
ఒకానొక పొద్దుటిపూట... నరసింగపురంలో బంగారు వరిపైరు నెత్తుటి వర్షంలోఎలా తడిసిందో పాలపిట్టకి అర్ధం కాలేదు.
అది తుర్రుమని పంటబోదె మీంచి ఎగిరింది.
బోదెలో నీళ్ళకి బదులు రక్తం ప్రవహిస్తోంది.
ఏపుగా ఎదిగి... కోతకి సిద్ధమౌతోన్న పంట దేహాన్ని కమ్మేసినట్టు చిందరవందరగా ఏవేవో గుర్తులు... వందలకొద్దీ మనుషుల అడుగులు! గాల్లోంచి తేలుతూ రక్తపు వాసన!
హఠాత్తుగా మహా విధ్వంసం జరిగిన సాక్ష్యంగా గాయాల జాడలు! గాల్లో ఎగుర్తూ పరీక్షిస్తున్న పాలపిట్టకి మతిపోయింది.
"పంట చేనమ్మా! వరికంకమ్మా! నిన్నలేని రక్తం ఇవ్వాళ నిన్నెలా అంటిందీ? ఈ అడుగులు ఎవరివి? నీ బంగారు దేహాన్ని పైశాచికంగా కుమ్మిపారేసిన భయంకరమైన
వందలాది అడుగులూ...
గంభీరంగా... నిఖార్సుగా... గాండ్రించే గుండ్రటి పాదాలూ... ఏమిటివి? అసలేం జరిగింది?" అంటూ ఆరాతీసింది పాలపిట్ట.
నిన్నటి పొద్దుకీ, ఇవాళ్టి పొద్దుకీ మధ్య అంతరం ఎందుకో తెలీలేదు పాలపిట్టకి!
"ఏం చెప్పమంటావు పాలపిట్టా! నా పైన చిందరవందరగా పడిన వందలాది అడుగులు... నన్ను తెగేసి అమ్ముకు తినే రెండుకాళ్ళ వాళ్లవి. నువ్వన్నట్టు గంభీరంగా, నిఖార్సుగా పడిన గుండ్రటి అడుగులు మాత్రం పులిబిడ్డవి!"
ఈ మాటలు అంటున్నప్పుడు వరిపైరు గొంతు గద్గదమయ్యింది.
"అవును. వాటిని చూసినప్పుడే పోల్చుకున్నాను. అవి పులిగోర్లే అని" అంది ఆశ్చర్యంగా పాలపిట్ట. వరిపైరు మౌనంగా ఉండిపోయింది.
గాలికూడా ఆగిపోయింది.
పాలపిట్ట ఆశ్చర్యంగా, భయం భయంగా...
ఒక మహా విధ్వంసాన్ని తట్టుకోవడానికన్నట్టు గాల్లో గిరికీలు కొట్టి మల్లొచ్చి వరిపైరు ముందు ఉద్విగ్నంగా వాలింది.
ఉన్నట్టుండి వరిపైరు మీంచి గాలి మళ్ళింది. పైరు గొంతు సవరించుకుని పాలపిట్టకి జరిగింది చెప్పడం మొదలెట్టింది.
"ఎక్కడ పడితే అక్కడ ఉండదు పులిబిడ్డ... ఏ చోటును పడితే ఆ చోటును తన ఆవాసం చేసుకోదు. ఆకలేస్తేనే గానీ వేటకి కదల్దు. అట్లాంటి బిడ్డ రెండు రోజుల పాటు నా పొత్తిళ్ళ మధ్య తల దాచుకుంది" అంటూ ఆగింది పైరమ్మ.
పాలపిట్ట కళ్ళు విశాలమయ్యాయి ఆ మాటలు విని.
"ఏమిటీ! రెండు రోజులు నీ వొళ్ళో దాకుందా చిరుతా!" అంటూ నోరెళ్ళబెట్టింది పాలపిట్ట.
"అవును. రెండు రోజులు నాలోనే పొదవి పట్టుకున్నాను బిడ్డని. నా కడుపులో ఠీవిగా వొకింత జాలిగా, బోలెడు పౌరుషంగా తిరుగాడింది. తచ్చాడింది. నిద్రించింది. సేదతీరింది! నాకు చెప్పలేనంత ఆశ్చర్యం! నిజానికి ఒక పులి దాని మానాన అది ఏ చీకూ చింతా లేకుండా బతకాలంటే దానికి నలభై మైళ్ళ దట్టమైన అడవి కావాలి! అందులో కనీసం ఐదువందల జింకలుండాలి. తను తిని పారేసే కళేబరాలు కోసం తోడేళ్ళూ, నక్కలూ వుండాలి. నోటి దొరువులుండాలి. జింకలకోసం, దుప్పులకోసం, ఏపుగా దట్టంగా విస్తరించి గడ్డి వుండాలి... ఇన్ని వుంటే గింటే అప్పుడు అక్కడ ఒక పులి బిడ్డుండాలి. అదీ ఆ బిడ్డ రాజసం! అదీ తన జన్మలక్షణం. అటువంటి చిరుతపులిబిడ్డ ఈ నర్సింగపురం చొరబాటుదార్ల స్థావరంలోకి వచ్చి..." అని ఆగిపోయింది పైరు.
ఆపైన ఆమెకి దుఃఖం ఆగలేదు. భోరుమంది. గొంతు పూడిపోయింది.
పాలపిట్టకి భయమేసింది.
పదిమందికి అన్నంపెట్టి, ఆహారమయ్యే అద్భుత కల్పవల్లి, వరిపైరు కన్నీరు మున్నీరు కావడం పాలపిట్టకి అయోమయంగా తోచింది.
పంటచేను తనని తాను సంభాళించుకుని మళ్లీ మాట్లాడ్డం మొదలుపెట్టింది.
"అంతా మాయగా జరిగిపోయింది. ప్రశాంతమైన వాతావరణంలో దూరంగా జోరుగా వరికోతలు సాగుతున్నాయి. ఏపుగా పెరిగిన నా వొళ్లోకి దూసుకొచ్చింది పులిబిడ్డ. ఏమనాలో తెలీలేదు. ముద్దుగా కౌగలించుకున్నాను. అరుదైన చిరుతని" అంటూ సంబరపడింది కొంతసేపు వరిపైరు.
పాలపిట్టకూడా పొంగిపోయింది.
వరిపైరు చెప్పసాగింది -
"పులిబిడ్డా... దట్టమైన అడివి కడుపులో తిరగాల్సిన దానివి. ఇలా మైదానంలోకి ఎలా వచ్చావు? ఎక్కణ్ణుంచి వచ్చావు?" అని ప్రేమగా అడిగాను. శంఖవరం అడవిలోంచి... ఏలేరు కాలువ ఈదుకుంటూ వచ్చానంది.
సరే... ఇలా ఎలా వచ్చావు? అనడిగాను.
పౌరుషంగా గాండ్రించింది.
బిడ్డా... ఇది నీ తావుకాదు. ఇది నీ దోవకాదు. ఆపదలో పడతావు. ఎలా వచ్చావో అలాగే వెళ్ళిపో అని బుజ్జగించాను. వింటేనా?
"ఎక్కడికని వెళ్లను? ఏముందని వెళ్ళను? పచ్చి మంచినీటి దొరువైనా లేని సెలవులో కొలువు ఎలా కుదురుతుందో" చెప్పమని నిలదీసింది.
బిడ్డకి ఏం చెప్పాలో నాకు నోటమాట పెగల్లేదు.
అయినా తగుదునమ్మా అని నేను మాత్రం ఏం చెప్పగలనూ? ఒకప్పుడు నా వరికంకుల్లో, నాగేటి చాళ్ళు తీస్తున్నప్పుడు ఎడ్లకాళ్ళ గిట్లల కింద నుంచీ జీవశక్తి తరంగించేది. విత్తు నుంచి విత్తుకి, పంట నుంచి పంటకి -
ఒక అద్భుత ప్రయాణం కొనసాగుతూ వుండేది. పశువుల పేడ, పెంటతో, వాటి మూత్రంతో... వాటి అడుగుల పాటు వాన దేవుడు నన్ను ముద్దుగా తడిపినప్పుడు నాలో గొప్ప పులకింత... అందుకే పొంగి పోయి నిండుగా బతుకుని విరగపండించుకునే దాన్ని.
కానీ ఇప్పుడు? నాలో జీవశక్తిని దోచుకుపోయారు. యంత్రాల్తో నన్నో పనికిమాలిన దానిగా తయారుచేశారు. నాలో విషప్రయోగాలు అనేకం చేశారు. నాలో సారం మరణించింది. నా రూపురేఖలు మారిపోయాయి. సారహీన స్వరంతో ఇప్పుడు నేనేం మాట్లాడినా హాస్యాస్పదంగానే వుంటుంది.
రోలొచ్చి మద్దెలతో మొరపెట్టుకున్నట్టు -
పులొచ్చి పంటచేనులో దాకుంటే...
వెలువడే మాటలు చచ్చుబడి పోతాయి.
అయినా ఎలాగో సిగ్గు విడిచి పులిబిడ్డకి ఏవేవో సుద్దులు చెప్పాను. రెండురోజుల పాటు రాత్రీ, పగలూ మా యిద్దరి మధ్య సుదీర్ఘ చర్చలు కొనసాగాయి. పులిబిడ్డ నాతో అంది కందా -
"నేనుండే అడవిని ఆక్రమించుకున్నారు. అరణ్యాలు ఎప్పుడో పోయి వాటి స్థానంలో అభయారణ్యాలు వచ్చాయి. గతంలో ఈ అభయారణ్యాల చుట్టు పక్కల రైతులు జొన్నలు, రాగులు, వరి వంటి పంటలు వేసేవారు. దానివల్ల పశువులకు కావాల్సినంత గడ్డిదొరికేది. కానీ బంగారం మాయకమ్ముకుంది. తెల్లబంగారం అంటూ పత్తి పండి లాభం ఏమొచ్చిందో తెలీదుకానీ మేత లేక పశువులు అల్లల్లాడాయి. నాకోసం కేటాయించిన అభయారణ్యాల్లోకి మేకలు, గొర్రెలు, ఆవులు వంటి లక్షల జీవాలు వచ్చి పడ్డాయి. లేళ్ళకి, దుప్పులకి కావలసిన గడ్డిని ఊడ్చి పారేశాయి. చివరికి నాకు గొంతెండింది. నీరు తాగబోతే నీటి దొరవు దగ్గర సైతం నాకు ఏకాంతం లేదు. ఇది చాలదన్నట్టు ఈ దుష్టులు నీకే కాదు, నాకూ విషమే పెట్టారు. వినోదం కోసం నా ఇంటిని ఆక్రమించారు. నేనేమో ఒంటరినైపోయాను. ఏంటి చేనమ్మా! నేను తిండి తిని వారం రోజులయ్యింది. నా పంటి మధ్య మాంసం ముక్కపడి ఎన్నాళ్ళో అయ్యింది. పచ్చి మంచి నీళ్ళూ లేవు. నేనీ నరజాతిని క్షమించను. వీళ్ళకి ఇవాళ నేను మరణశిక్ష విధిస్తున్నాను. ఇవాళ నాకు విందుభోజనం! పంటచేనమ్మా... నన్ను నీ కడుపులో దాచుకోవమ్మా! నా జాతికోసం నీతిలేని ఈ రెండు కాళ్ళ జంతువుల్ని బలి ఇచ్చి తీరాలి..." అంటూ బిడ్డ నిద్రలో కూడా ఆకలితో పలవరించింది.
నాకు దుఃఖం ఆగలేదు పాలపిట్టా!
నేను నిస్సహాయురాలిని. నేను పులిబిడ్డకి ఆహారం కాదు. ఎందరికో ఆహారమై ఉద్దరించే నేను నా బిడ్డకి కడుపు నింపలేక పోయాను" అంటూ పొగిలి పొగిలి ఏడుస్తున్న వరిపైరుని ఎట్లా ఓదార్చాలో పాలపిట్టకి పాలుపోలేదు.
అప్రయత్నంగా అదికూడా ఏడ్చింది.
"ఆ తరువాత ఏం జరిగిందీ?" పాలపిట్ట భయంగా ప్రశ్నించింది.
"కొన్ని గంటల పాటు పులిబిడ్డ వీరవిహారం చేసింది. ఒక్క బిడ్డతో యుద్ధానికి వందలాది మంది రక్త పిశాచాల్లా కలిసొచ్చారు. పులిబిడ్డకి పంజాయే ఆయుధం. అంతకుమించిన వ్యూహాలు లేవు. కానీ రెండు కాళ్ళ వాళ్ళు ప్రాణభయంతో నాలుగువైపుల్నుంచీ కమ్ముకున్నారు. కర్రలతో కత్తులతో గొడ్డళ్ళతో వందలాది మంది అభిమన్యుడిని చుట్టుముట్టినట్టు పట్టుపట్టి మట్టుపెట్టారు. తుపాకులతో కాల్చారు. ఏ కండ కాకండ చీల్చారు. భుజాలకెత్తుకుని పైశాచిక నృత్యం చేశారు. పులి బిడ్డ వీరమరణం రెండుకాళ్ళ వాడికి ఆఖరి చరణం! ఈ దారుణం చూశాక నాకు ఒక్కటే అనిపిస్తోంది పాలపిట్టా" అంటూ వరిపైరు ఆగింది.
పాలపిట్ట చెవులు రిక్కించింది.
వీళ్లకి నేను ఆహారమయినందుకు సిగ్గుతో చితికిపోతున్నాను.
నా బిడ్డకి ఆహారం కానందున దుఃఖిస్తున్నాను." అంటూ వరిపైరు బావురుమని ఏడ్చింది.
పంటచేను ఏడ్చింది.
వరిపైరు కన్నీళ్ళూ, పాలపిట్ట కన్నీళ్ళూ పంట బోదెలోని రక్తంలో కలిశాయి.
***
ఉన్నట్టుండి గాల్లోకి లేచింది పాలపిట్ట.
ఎక్కడికీ? రెండు ధాన్యపు గింజలు కొరికి పొమ్మంది వరిపైరు. పాలపిట్ట వినలేదు.
రివ్వుమని పైకి లేచి... పులికి నివాళి ఇచ్చి వస్తానని ఆవేశంతో బయలుదేరింది. వరి పైరు నివ్వెరపోయింది.
పాలపిట్టని ఆపలేకపోయింది.
రివ్వున పులికి దహన సంస్కారం జరిగే చోటకి చేరుకుంది పిట్ట.
చిరుత దేహం చితిమంట పై రగుల్తోంది.
పాలపిట్ట రెండు కన్నీటి బొట్లు తర్పణ చేసింది.
అంతే - హఠాత్తుగా ఎక్కణ్ణుంచో ఒక ఉండేలు దెబ్బ!
చూస్తుండగానే పాలపిట్ట చిరుత చితిలోకి జారిపోయింది.
మహా ప్రళయం ఒకటి...
మనిషి కోసం కన్ను తెరిచింది!
----
(...వచ్చే వారం వంశీ కి నచ్చిన ఇంకో కథ)