అర్ధాంగి - గొర్తి.వాణిశ్రీనివాస్

wife

నా మనసిప్పుడు మబ్బులు విడిన ఆకాశంలా నిర్మలంగా ఉంది. హాయిగా నిద్రపోతున్న కారుణ్య మొహంలోకి తొంగి చూసాను. నిన్న వాళ్ళమ్మని తీసుకొచ్చి అతని ఎదురుగా నిలబెట్టినప్పుడు ,అతని ఉద్వేగాన్ని,ఉద్రేకాన్నీ ఆపటానికి నా గుండెలో పొదువుకున్నప్పుడు ఆగని వెక్కళ్ళ శబ్దం నా గుండె చప్పుళ్లలో ఇంకా ప్రతిధ్వనిస్తోంది.. "మా అమ్మ ఎప్పుడో చచ్చిపోయింది.

నువ్వు నా తల్లివి కావు"అంటూ ఆవేశపడ్డప్పుడు అతని గొంతులోని ఆవేదన చూస్తే,బాల్యంలో ఒంటరితనం అతన్ని ఎంతగా బాధపెట్టిందో నాకు అర్ధమయ్యింది. రాత్రి అతనికి నచ్చచెప్పి ఆమెను ఇక్కడే ఉంచటానికి ఒప్పించేందుకు చాలా సమయం పట్టింది.

కానీ ఆమెను తన తల్లిగా ఒప్పించటంలో మాత్రం విఫలమయ్యాను.దానికి కొంత సమయం పడుతుంది. నిన్నటి విషాద ఛాయలు అతని మొహంలో ఇప్పుడు లేవు. పసిపిల్లాడిలా ముడుచుకుని పడుకున్నాడు.. మా పెళ్ళైన ఈ రెండేళ్లలో భర్తగా అతను నాకేలోటూ రానివ్వలేదు..

తల్లీ తండ్రీ స్నేహితులూ అన్నీ తనే అయ్యాడు. రెండేళ్ల కాలం రెండు క్షణాల్లా గడిచిపోయినదంటే కారణం అతని ప్రేమే. రెండేళ్ల క్రితం మా పెళ్లికి ముందు కారుణ్య నాతో అన్న మాటలు గుర్తొచ్చాయి. "శాంతీ!నీ సన్నిధిలో ఉంటే చాలు నాకు మనశ్శాంతిగా ఉంటుంది. నాకంటూ ఎవరూ లేరు..నేను అనాధను. పదేళ్ల వయసులో మా అమ్మమ్మ వరస ఒకమె నన్ను ఆశ్రమంలో చేర్చి వెళ్లి ఇక తిరిగిరాలేదు. వస్తుందని ,నన్ను తీసుకువెళుతుందని ఎంతగానో ఎదురు చూశాను.

మా నాన్నని మాత్రం నేనెపుడూ చూడలేదు.. అమ్మ తెల్లగా ఉండేది.అందంగా ఉండేది. చల్లని జాబిలిలా నావైపు చూస్తూ చక్కగా నవ్వేది. అప్పుడప్పుడూ నన్ను దగ్గరకు తీసుకుని ఏడ్చేది. "ఏడవద్దమ్మా!పెద్దయ్యాక నిన్ను కష్టపడకుండా చూసుకుంటాను.బోల్డు డబ్బులు తెచ్చి ఇస్తాను.నీకు నచ్చింది కొనుక్కో."అనేవాడిని.. పగలంతా అలల గోదారిలా హాయిగా నవ్వుతూ గడిపే అమ్మ,సాయంత్రం కాగానే కృత్రిమ దీపాలు అమర్చిన ఆవలి ఒడ్డులా తళుక్కున మెరిసే చీర కట్టుకుని,నల్లగా నాగుపాములా బారుగా వుండే జడలోతెల్లటి పూలను అలంకరించుకునేది.

నన్ను చూసినప్పుడల్లా కారుణ్యంతో విచ్చుకునే పెదవులు ,రాత్రి కాగానే రక్తం పూసుకున్నట్టు సిందూరంతో ఎరుపెక్కేవి రాత్రంతా నేనొక గదిలో ,అమ్మొక గదిలో. చీకటంటే నాకు భయం.నాకు భయం వేసినప్పుడల్లా అమ్మా అమ్మా అని అరిచేవాడిని. అరనిమిషంలో పరుగున వచ్చి నన్ను హత్తుకుని ఓదార్చేది.. అప్పుడు అలసిపోయిన మొహంతో, ఆరిపోయిన దీపంలా కళావిహీనంగా కనబడేది...

తలుపు వెనకనించి 'ఎంతసేపూ' అంటూ కరుకు గొంతు వినబడేసరికి నన్ను పడుకోబెట్టి పక్కగదిలోకి వెళ్లిపోయేది. అమ్మ నా దగ్గరే ఉంటే బాగుండు అనిపించేది. నేనంటే అమ్మకు ప్రాణం అటువంటి అమ్మ నన్ను ఎందుకు వదిలించుకుందో అర్ధం కాలేదు. నేను అమ్మకు ఎలా దూరమయ్యానో నాకే తెలియనదు"అంటూ ఏడుస్తున్న కారుణ్య మొహంలో పదేళ్ల పిల్లాడు అమ్మకోసం వెతుక్కుంటున్నట్టు అనిపించింది నాకు. ఒక అనాథను పెళ్లి చేసుకోవటానికి అమ్మా నాన్నా ఇష్టపడలేదు. "కోటీశ్వరుల సంబంధం నిన్ను కోరి చేసుకుంటామని వస్తే కాదని ఎవరూ లేని ఏకాకిని చేసుకోవడం

ఏవిటీ ఖర్మ కాకపోతే "అని అమ్మ మా పెళ్లికి ససేమిరా ఒప్పుకోలేదు.నాన్న కూడా నచ్చ చెప్పి నా మనసు మార్చాలని చూసారు. 'ఆత్మీయతకోసం తపించిపోయే కారుణ్య నన్ను ప్రేమగా చూసుకుంటాడు అనే నమ్మకం నాకుంది నాన్నా.అమ్మ ప్రేమకు నోచుకోని కారుణ్య మనసుకు నా అనురాగాన్ని పంచుతాము..'అని చెప్పి వాళ్ళని అతికష్టం మీద ఒప్పించి అతనికి అర్ధాంగినయ్యాను...

కానీ అతని జీవితానికి ఒక అర్ధాన్ని కల్పించాననే ఆత్మతృప్తి నాకు కలిగింది మాత్రం నిన్నే. కారుణ్య తల్లికోసం రెండేళ్లుగా వెతికిస్తున్నాను.. ఆవిడజాడ ఇన్నాళ్లకు తెలిసింది. ఆమెను ఈ ఇంటికి రప్పించి కారుణ్య ముందు నిలబెట్టగలిగాను . కానీ ఆమెను అమ్మగా ఒప్పించటానికి కొంత సమయం పట్టినా, ఈ ఇంట్లో ఉండటానికి ఒప్పించటంలో కృతకృత్యురాలిని అయ్యాను..

గది బయట ఏదో చప్పుడయ్యింది.బయటకు వచ్చి చూశాను. ఆవిడ బయట తలదించుకుని నిలబడింది. ఆవిడ పెదవులు అంతవరకూ బిగబట్టి ఉంచటం వలన సన్నగా ఒణుకుతున్నాయి.. కళ్ళు మాత్రం స్వేచ్ఛగా వర్షిస్తున్నాయి.. నాకు ఆమెను ఓదార్చాలని లేదు.. ఆమె గుండెలోని ఆవేదనను చల్లార్చే ఆ చల్లటి కన్నీటి జలాన్ని ఆపాలని కూడా నేననుకోలేదు..

మిమ్మల్ని అటువంటి ప్రదేశం నుంచి తప్పించి తీసుకురావడం ఎంతో కష్టమైంది.అయినా ఫర్వాలేదు.కారుణ్య కోసం నేనెంత సాహసం చేసినా తప్పుకాదు. ఒకరిని నమ్మి మోసపోవటం మీ తప్పు కాదుగా..అన్నాను "మాది అత్యంత సంప్రదాయ కుటుంబం. వయసు ప్రభావమో, నా గ్రహస్థితి బాగాలేకోగానీ ఒకరిని నమ్మి మోసపోయాననే విషయం సుబ్బలక్ష్మి కంపెనీకి చేరేదాకా నాకు తెలియదు. తిరిగి ఊరికి పోదామని ఎన్నోసార్లు ప్రయత్నించి విఫలమయ్యాను. అమ్మా నాన్నలు తమ పరువు పోయిందని ఉరిపోసుకున్నారని తెలిసి నేనూ చనిపోదామనుకున్నాను. అప్పటికే నా కడుపులో నలుసు

పెరుగుతోంది.నాకంటూ ఈ ప్రపంచంలో మిగిలిన ఒకే ఒకబంధాన్ని తెంచుకోలేక సుబ్బలక్ష్మి కాళ్ళా వేళ్ళా పడి బతిమాలుకుని పండంటి బాబుని ప్రసవించాను. తన ప్రమేయం లేకుండా ఈ లోకంలో కళ్ళు తెరిచిన నా బాబుని నాకు దూరం చేయాలనే సుబ్బలక్ష్మి ప్రయత్నాన్ని విఫలం చేస్తూ ఒక్క క్షణమైనా వదలక కంటికి రెప్పలా కాచుకుంటూ వచ్చాను. నాకోసం నా గదిలోకి వచ్చే వాళ్ళని బతిమలాడుకుని ఆ గదిలోనే ఓ పక్కగా పడుకోపెట్టుకునేదాన్ని. ఆకలేసి ఏడ్చే నా బాబుకోసం వెళ్లలేని నిస్సహాయతలో పొట్ట కూటికై ఒకరాడిస్తే ఆడే మర బొమ్మగా మారాను బాబు పెద్దవాడయ్యాడని వేరే గదిలో పడుకోబెట్టి వచ్చి చూసుకుని వెళుతుండేదాన్ని. ఒకరోజు చూసేసరికి బాబు లేడు...

సుబ్బలక్ష్మిని నిలదీసాను ఏడ్చాను ప్రాధేయపడ్డాను.నెత్తి బాదుకున్నాను. నా బాబుని నాకు చూపించమని అర్ధించాను. ఒక కలిగినింటి పిల్లలులేని దంపతులకు పెంపుకి ఇచ్చేశానని చెప్పింది అబద్ధం అంతా పచ్చి అబద్ధం .. కానీ ఆమాట నాకు ఓదార్పునిచ్చింది.మరోదారిలేక నా మనసును ఆ అందమైన అబద్ధంతో కప్పేశాను ఇన్నాళ్లూ.. చివరకు నీ దయవల్ల మేమిద్దరం కలుసుకునే అవకాశం వచ్చింది. అమ్మకోసం ఎదురు చూసి గుండె బండగా మారిపోయిందో మనసునిండా స్త్రీజాతి మీద తీరని ద్వేషం నిండిపోయిందో అనుకున్నాను కానీ నీ సాంగత్యంతో అతని మనసుకు లేపనం పూశావు.. ఆడ మనసులో ప్రేమ నిండి వుంటుందనే నమ్మకాన్ని కలిగించావు.. నువ్వు నచ్చ చెప్పబట్టే నా కొడుకు నన్ను క్షమించాడు.ఈ ఇంట్లోనే వుండమన్నాడు...

ఈ జన్మకి ఇదిచాలు."అంది ఆమె గది తలుపు దగ్గర నిలబడి వింటున్న కారుణ్య మౌన రోదన నాకు అర్ధమవుతోంది.. వీళ్లిద్దరి వేదనకు కారణం ఒక్కటే కాబట్టి ,ఇద్దరి మధ్యా ఉన్న సన్నటి తెర తొలగిపోయింది. అపార్ధాల మబ్బులు వీడిపోయాయి.. ఇకపై కారుణ్యకు కోల్పోయిన ప్రేమంతా దక్కుతుంది తల్లినుంచీ, భార్యనుంచీ త్వరలో పుట్టబోయే నా బిడ్డ నుంచి కూడా...

మరిన్ని కథలు

Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaalani kaagitam
కాలని కాగితం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు