ఉదయము ఏడు గంటలకే మొబైలు ఫోను మోగటంతో విసుక్కుంటూ లేచిన సబ్ఇన్ స్పెక్టర్ రాజేష్ కళ్ళు నలుపు కుంటూ బెడ్ ప్రక్కన స్టూలుపై ఉన్నటువంటి మొబైలు చేతిలోకి తీసుకొని హలో అన్నాడు. "మిస్టర్ రాజేష్, నేను జగన్నాథ్ ని మాట్లాడుతున్నాను, నిద్ర లేపానా" . రాజేష్ వెంటనే సర్దుకుని "నమస్కారము సార్" అంటూ అటెన్షన్ లోకి వచ్చాడు. జగన్నాధ్ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్. "మిస్టర్ రాజేష్, మీ స్టేషను పరిధిలో ఉన్నటువంటి రిసార్టుల్లో అక్రమ కార్యకలాపాలు జరుగు తున్నాయని, పోలీసు వారు ఎటువంటి చర్యలు తీసుకోవటం లేదని ఈరోజు ఒక ప్రముఖ వార్తాపత్రికలో డబ్బా కట్టి మరీ రాశారు, మీరు వెంటనే తగిన చర్యలు తీసుకోండి,
లేదంటే విలేఖర్ల ప్రశ్నలకు జవాబు ఇవ్వాలంటే తల బొప్పి కడ్తుంది" అంటూ ఫోను కట్ చేశాడు జగన్నాధ్. రైల్వేస్టేషన్ దగ్గరలో దాదాపు మూడు ప్రముఖ రిసార్టులు ఉన్నాయి. రెండు రిసార్టులు ఇద్దరు ప్రముఖ పారిశ్రామికవేత్త లవి కాగా, మూడవది శుశ్రుత రిసార్టు ఒక బడా రాజకీయవేత్త బినామీది. కాలకృత్యాలు తీర్చుకున్న రాజేష్ యదావిధిగా పోలీసు స్టేషనుకి వెళ్ళాడు. ఆ రోజు సిబ్బంది ఎవరైనా సెలవులో ఉన్నారా అని విచారించి, అందరూ డ్యూటీకి వస్తున్నారని తెలుసుకొని సాయంత్రము ఐదు గంటలకల్లా తన ముందు హాజరు కావాలని ఆదేశాలిచ్చాడు. అదే రోజు శుశ్రుత రిసార్టుపై రైడ్ చేయాలని నిర్ణయించుకున్న రాజేష్ ఒక వాహనాన్ని సాయంత్రము ఐదు గంటలకు అద్దెకు రావలసిందిగా ఫోన్లో తెలిపాడు. రాత్రి ఎనిమిది గంటలకు ఒక జూనియర్ సబ్ ఇన్ స్పెక్టర్ ను, ఒక హెడ్ కానిస్టేబుల్ ను, ఆరుగురు కానిస్టేబుళ్లను ప్రయాణానికి సిద్ధం చేశాడు వారికి ఎటువంటి సమాచారం ఇవ్వకుండా. కొంతమంది సిబ్బంది తెలుసు కోవాలనే కుతూహలం ఫలించ లేదు. స్టేషను నుండి రెండు వాహనాల్లో రాజేష్ మరియు అతని సిబ్బంది నేరుగా శుశ్రుత రిసార్టు చేరుకొని ముందు, వెనకాల నుండి మూకుమ్మడి దాడి చేశారు. ఆ సమయంలో ఆ రిసార్టులో రేవ్ పార్టీ జరుగుతుంది. డీజే సౌండు హోరులో ఆడ, మగవారు జంటలుగా నృత్యం చేస్తున్నారు. కొంతమంది చేతుల్లో మందు గ్లాసులు, కొంత మంది చేతుల్లో సిగరెట్లు ఉన్నాయి. ఊహించని పోలీసు వారి దాడికి ఆడ, మగ వారు, రిసార్టు సిబ్బంది అటు ఇటు పరుగెత్తి తప్పించుకోవాలని ప్రయత్నించారు. కానీ అప్పటికే రాజేష్ సిబ్బంది లోపల నుండి తాళం వేయడం, వెనుక ద్వారం నుండి వచ్చిన సిబ్బంది తలుపు మూయడంతో పార్టీలో పాల్గొన్న వారికి తప్పించుకోలేని పరిస్థితి ఏర్పడింది. హాలులో ఉన్న రెండు గదుల నుండి ఈ హడావిడి విని రెండు జంటలు తలుపులు తెరుచుకుని హాలు లోకి వచ్చి పోలీస్ సిబ్బందిని చూసి నిర్ఘాంత పోయారు. రాజేష్ తన సిబ్బంది సహాయంతో రేవ్ పార్టీలో పాల్గొన్న ఎనిమిది మంది అమ్మాయిలు, పది మంది పురుషులు, రిసార్టు మేనేజర్, సిబ్బందిని అదుపులోకి తీసుకొని, వారి మొబైల్ ఫోన్లను, కార్లను స్వాధీన పరచుకుని, పంచనామా నిర్వహించి, పోలీసు స్టేషను కి తరలించేసరికి రాత్రి పన్నెండు గంటలైంది. మరుసటి ఉదయాన్నే ఆరు గంటల కల్లా బ్రేకింగ్ న్యూస్ అంటూ టివి ఛానళ్లలో ఈ వార్త హల్ చల్. రాత్రంతా అలసి పోయిన కారణం చేత రాజేష్ ఉదయము ఏడు గంటలదాకా నిద్ర లేవలేదు. తన మొబైలు ఫోను మోగటంతో మెలకువ వచ్చి చేతిలోకి తీసుకొని చూడగా పోలీస్ సూపరింటెండెంట్ జగన్నాధ్ నుండి ఆ కాల్. "గుడ్ మార్నింగ్ సార్" అంటూ రాజేష్ విష్ చేశాడు. "మిస్టర్ రాజేష్, నీకు తొందరెక్కువ, కుర్రచేష్టలు ఇంకా పోయినట్టు లేదు". "నేనేం చేశాను సార్" అన్నాడు రాజేష్. "ఉన్న పళంగా అర్జెంటుగా నన్ను కలుసుకో" అన్నాడు జగన్నాధ్. గబగబ కార్యక్రమాలు ముగించుకొని జగన్నాధ్ ఎదుట హాజరు అయ్యాడు రాజేష్. అప్పటికే పోలీసు యూనిఫాం లో ఉన్నాడు జగన్నాధ్. సెల్యూట్ చేసి నిలుచున్న రాజేశ్ ను కూర్చో అనడంతో కుర్చీలో కొసకు కూర్చున్నాడు రాజేష్. హోమ్ గార్డు రెండు కప్పుల్లో టీ తెచ్చాడు. "రాజేష్ , నీవు రాత్రి రైడ్ చేశావు బాగానే ఉంది, కానీ మీడియాకు లీకులెందుకు ఇచ్చావు, నీ అనుభవరాహిత్యం డిపార్టుమెంటుని, అధికారులని ఇబ్బంది పెడుతుంది" అంటూ జగన్నాధ్ సంభాషణ కొనసాగించాడు. "సారీ సర్ నా వలన ఏదైనా పొరపాటు జరిగిందా, మీ ఉత్తర్వులను కదా నేను పాటించింది" అన్నాడు రాజేష్. "శుశ్రుత రిసార్టు రాష్ట్ర మంత్రి గారి ముఖ్య అనుచరుడిది కదా , రేవ్ పార్టీ రైడ్ గురించి మీడియాకు తెలియడంతో మంత్రి గారికి తెలిసింది. మంత్రిగారి నుండి ఇప్పటికే రెండుసార్లు ఫోన్ కాల్ వచ్చింది". "నన్నేమి చేయమంటారు సర్" అన్నాడు రాజేష్. "బర్త్ డే పార్టీ చేసుకున్నారని, కుటుంబసభ్యులు, బంధువులు పాల్గొన్నారని, రేవ్ పార్టీ కాదని, కేసు క్లోజ్ చేయి". "అలా చేయడం నా వృత్తి ధర్మానికి విరుద్ధం సర్". "వృత్తి ధర్మాన్ని గురించి ఆలోచిస్తే మన ఇద్దరికీ శంకరగిరి మాన్యాలే గతి, అది గుర్తుంచుకో". "ఫర్వా లేదు సర్, డబ్బు, పరపతి మదంతో రేవ్ పార్టీ జరుపుకొని అక్రమ కార్యకలాపాలకు పాల్పడ్డారు. అటు వంటి వారిపై కేసు బుక్ చేయకుండా ఎలా వదిలి వేయమంటారు, రాష్ట్రాన్ని ఏలే మంత్రి కేసు క్లోజ్ చేయమని చెప్పడం భావ్యం కాదు సార్". "మంచి చెడు గురించి మాట్లాడే సమయం కాదు రాజేష్, మంత్రి గారి ఉత్తర్వులను మనం తు.చ. తప్పకుండా పాటించాల్సిందే". "క్షమించండి సర్, అరెస్టు చేసిన వారి నందరిని ఈ రోజే కోర్టు ముందు హాజరు పరుస్తాను" అంటూ సెల్యూట్ చేసి వెళ్లిపోయాడు రాజేష్. అన్నట్లు గానే ప్రథమ సమాచార నివేదిక మరియు రిమాండ్ రిపోర్టు యుక్తంగా అరెస్ట్ చేసిన వారిని అదే రోజు కోర్టు ముందు హాజరు పరిచాడు రాజేష్. కోర్టు వారిని జ్యుడీషియల్ కస్టడీకి తీసుకోవడం జరిగింది. మరుసటి రోజు ఈ వార్త జాతీయ పత్రికల్లో కూడా ప్రముఖంగా ప్రచురించబడింది. రాజేష్ ను కొనియాడుతూ కొన్ని పత్రికలు ప్రచురించాయి. ఆ మరుసటి రోజే భారీ ఎత్తున పోలీసు అధికారుల బదిలీ ఉత్తర్వులు వెలువడ్డాయి. రేవ్ పార్టీ రైడ్ ఫలితంగా ఆరు నెలల్లోపే రాజేష్ కి బదిలీ కావడం , అతనికి ఏ పదవి ఇవ్వకుండా పోలీసు హెడ్ క్వార్టర్సులో రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశాలు. తగిన మూల్యం చెల్లించుకున్నాడు రాజేష్ అని కరడు గట్టిన పోలీసు అధికారుల్లో చర్చలు జరిగాయి. రాజేష్ కడు పేద కుటుంబం నుండి ఎన్నో కష్టాలు పడి సబ్ ఇన్ స్పెక్టర్ గా ఎంపికైన వ్యక్తి. అతనిది నిజాయితీగా విధులు నిర్వహించుకోవాలనే మనస్తత్వం. తల్లి నాలుగిళ్ళలో పాచి పని చేస్తూ, తండ్రి పాలేరుగా పని చేస్తూ రాజేష్ ని చదివించి ఈ స్థాయికి తీసుక వచ్చారు. ఒక్కడే సంతానం కావడం వలన ఎంతో ఆప్యాయంగా పెంచుకున్నారు. చిన్నప్పటి నుండి పోలీసు కావాలనే కోరికతో డిగ్రీ చేసిన తర్వాత సబ్ ఇన్ స్పెక్టర్ ఉద్యోగానికి కోచింగ్ తీసుకుని సెలక్షన్ లో టాప్ ర్యాంక్ సాధించాడు. ఆరు నెలల దాకా రాజేష్ కి ఎటువంటి పోస్టింగ్ యివ్వలేదు. ఆ తర్వాత అతనిని అదే జిల్లా లోని మారు మూల పోలీస్ స్టేషన్ కి బదిలీ చేయడం జరిగింది. చార్జి తీసుకున్న రాజేష్ కి పోలీసు స్టేషను సిబ్బంది పూల బొకేలతో స్వాగతం పలికారు. పోలీసు స్టేషను సిబ్బందిని పరిచయం చేసుకున్నాడు. సబ్ ఇన్ స్పెక్టరుగా శిక్షణ పొందిన రోజుల్లో చేసిన ప్రతిజ్ఞను తానెప్పుడూ తప్పకూడదని మరోసారి నిర్ణయించుకున్నాడు. అప్పటికే లాకప్ లో ఒక స్త్రీ ఉంది. లాకప్ లో ఉన్న స్త్రీని, ఆ కేసుకి సంబంధించిన రికార్డుని తీసుక రావలసిందిగా సిబ్బందిని ఆదేశించాడు. రెండు నిమిషాల్లో కానిస్టేబుల్ ఆంజనేయులు రాజేష్ ఆజ్ఞను అమలు పరిచాడు. రికార్డును పరిశీలించిన రాజేష్ ఆ స్త్రీని "నీ పేరేమిటి" అని అడిగాడు. "లావణ్య" అంది. "అసలు పేరు, ఊరు చెప్పు". "మంజరి జోషి, ఆగ్రా సార్" అంది. "ఎన్నాళ్ళ నుండి ఈ పడుపు వృత్తిలో ఉన్నావు". "నాలుగు సంవత్సరాల నుండి". "ఈ వృత్తి చేయడం నీకు సిగ్గని పించటం లేదా". "మొదట్లో నేను అలాగే అనుకున్నాను, రాను రాను తప్పని పరిస్థితుల్లో బ్రతుకు తెరువు కోసం చేయాల్సి వస్తుంది". "చూస్తే బాగానే ఉన్నావు, బ్రతుకు తెరువు కోసం అని చెప్పడం ఫ్యాషనా!" "ఇందులో అబద్దం లేదు సార్, ముగ్గురు రౌడీలు నాకు మత్తు మందు ఇచ్చి ఆగ్రా నుండి బలవంతంగా ఎత్తుకొచ్చి దగ్గరలో ఉన్నటువంటి బ్రోతల్ లో అమ్మేశారు, అక్కడి వారు నన్ను చిత్ర హింసలు పెట్టి ఈ పనికి అంగీకరింప చేశారు. ఒక రోజు జరిగిన పోలీస్ రైడ్ లో నన్ను అక్కడి నుండి తప్పించారు. ఆ పరిస్తితుల్లో నా వారికి తిరిగి ముఖం చూపించలేక ఈ వృత్తిలో వచ్చిన డబ్బుతో జీవిస్తుంటే, మీ పోలీసు వారు నన్ను అరెస్టు చేశారు" అంటూ వెక్కి వెక్కి ఏడుస్తూ గోడు వెళ్ళ బోసుకుంది. "రేపు నిన్ను కోర్టు ముందు హాజరు పరుస్తాను, మెజిస్ట్రేట్ గారి ముందు నేరం ఒప్పు కున్నట్లైతే ఐదు వందలో వెయ్యి రూపాయలో జరిమానా వేస్తారు, ఆ డబ్బులు నేనే కడతాను, నీవు ఈ వృత్తి మానుకో" అన్నాడు రాజేష్. "మీ సలహా బాగానే ఉంది, కానీ నా భవిష్యత్తు ఏమిటి, వేరే ఏ పని చేయలేను,చేయాలనుకున్నా పడుపు వృత్తి చేసిన దానికి పని ఎవరు ఇస్తారు, అంతే కాకుండా ఇన్నాళ్లు పడుపు వృత్తి లో ఉన్న నేను ఇప్పుడు నా వారి దగ్గరికి వెళ్లి ముఖం ఎలా చూపించగలను సర్" . "నీ బాధ నేను అర్థం చేసు కోగలను, నీవు పనికై ఎవరినీ అర్ధించనవసరం లేదు, ఆలంబన అనే సేవా సంస్థ నీ లాంటి వారి కోసం ఉంది, కోర్టు ద్వారా నిన్ను అక్కడ చేర్పిస్తాను, అక్కడ ఎన్నో రకాల చేతి వృత్తులు నేర్పుతారు, నీకు ఇష్టమైనన్ని రోజులు ఉండి ఇష్టమైన వృత్తి నేర్చుకోవచ్చు" అంటూ సలహా ఇచ్చాడు రాజేష్. "అలాగే సార్, మీరు సూచించిన విధంగా నడచు కుంటాను, మీ మేలు జన్మలో మరచి పోలేను" అంటూ రాజేష్ కాళ్లపై పడింది. తను చెప్పినట్లు గానే రాజేష్ మంజరిని కోర్టు ద్వారా ఆలంబన సంస్థలో చేర్పించాడు. ఆలంబన సేవా సంస్థను దాదాపు 15 సంవత్సరాల క్రితం సురభి రామలక్ష్మి స్థాపించింది. రామలక్ష్మి కూడా యుక్త వయసులో మానవమృగాల చేత మోసగించబడింది. తద్వారా వేశ్యా వృత్తిలో దిగేటట్లు చేయ బడింది. ఒక మహానుభావుని దయతో ఆ వృత్తికి స్వస్తి చెప్పి ఈ సంస్థను నెలకొల్పి తన శాయ శక్తులా బాధిత పీడిత స్త్రీలకు ఆలంబనగా నిలుస్తుంది. ఎప్పటికీ దాదాపు 70 మంది స్త్రీలు ఆలంబన ద్వారా ఉపశమనం పొందుతున్నారు. అల్లికలు, కుట్లు, చేతి సంచులు మరియు స్త్రీలు ఉపయోగించే పర్సుల తయారీ, బుక్ బైండింగ్, కాగితం కవర్లు చేయటం, దిండు గలెబాలు కుట్టడం లాంటి పనులు నేర్పడానికి రామలక్ష్మికి మరో ఇద్దరు సహాయ పడతారు. తమకు ఇష్టమైన వృత్తిలో ప్రావీణ్యత పొందిన తర్వాత కొంత మంది స్వశక్తితో ఎదగాలనే ఆలోచనతో రామలక్ష్మి అనుమతి తో బయటకు వెళ్తారు. కొంత మంది వ్యాపారవేత్తలు ఇచ్చే నిధులు, విరాళాలతో సురభి రామలక్ష్మి సేవా కార్య క్రమాలు చేస్తూ గత 15 సంవత్సరాలుగా మంచి పేరు తెచ్చుకుంది. తానే స్వయంగా రాబడి ఖర్చులను ప్రతి నెల లెక్క రాసి నోటీసు బోర్డు పై పెడుతుంది. ఆలంబన కార్య క్రమాలకు ఆకర్షింపబడిన రాజేష్ ప్రతి నెల తన జీతం నుండి వెయ్యి రూపాయలు విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. రోజులు, సంవత్సరాలు గడుస్తున్నాయి. రాజేష్ వృత్తి ధర్మానికి భంగం కలుగకుండా నిజాయితీగా పని చేస్తున్నాడు. కొద్ది రోజుల్లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలనగా, జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ రాజేష్ కు ఫోను చేసి ప్రతి ఏటా ఇచ్చే ప్రతిభా పురస్కారానికి తన పేరును రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసు చేసినట్లు తెలిపాడు. ప్రతిభా పురస్కారం రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా అందుకో బోతున్నాననే ఉత్కంఠ గత కొద్ది రోజులుగా అతనికి నిద్ర లేకుండా చేసింది. ఎదురు చూస్తున్న స్వాతంత్ర్య దినం రానే వచ్చింది. తన తల్లిదండ్రులను కూడా ఆ వేడుకకు తీసుక వెళ్ళాడు. వారిద్దరు ప్రేక్షకుల్లో ఆశీనులైనారు. తాను ఆఫీసర్లకు కేటాయించిన స్థలంలో యూనిఫాం లో కూర్చున్నాడు. జెండా వందనం తర్వాత పురస్కారాలు ఇచ్చే కార్యక్రమం మొదలైంది. తన పేరు పిలవగానే హుందాగా లేచి వేదిక వద్దకు వెళ్లి ముఖ్యమంత్రికి సెల్యూట్ చేసి నిలుచోగా ముఖ్యమంత్రి రాజేష్ మెడలో మెడల్ వేసి, చేతికి ప్రశంసాపత్రం అందచేసి మెచ్చుకోలుగా భుజం తట్టాడు.
తనకు తెలియకుండానే కళ్ళల్లో నీరు వచ్చింది. తల్లిదండ్రులు సీట్లలో నుండి లేచి నిలబడి ఉద్వేగంతో చప్పట్లు కొట్టారు. సభికుల కరతాళ ధ్వనులతో సభ మార్మోగింది. ఆ రోజు పురస్కారాలు అందుకున్న వారందరిలో రాజేష్ చిన్నవాడు. పోలీసు సర్వీసులో ఉండే ఒడి దుడుకులను అధిగమించి రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా పురస్కారం అందుకోవడం మామూలు విషయం కాదు.
ఎన్నో సంవత్స రాలు సర్వీసు చేసిన వారికి కూడా అరుదుగా వచ్చే అవకాశం. ఉద్వేగం అణచు కుంటూ సరాసరి తల్లిదండ్రులను చేరి వారికి పాదాభి వందనం చేస్తుంటే కెమెరాలు క్లిక్ మన్నాయి. నీ మంచితనం, నిజాయితీయే నీకు శ్రీరామరక్ష అంటూ తల్లిదండ్రులు రాజేష్ ను గుండెలకు హత్తుకుని ఆశీర్వదించారు.