" ఏమే ఎంత బలుపు కాకపోతే నాకు ఉదయం చేసిన కూరవేస్తావా? ఏం రాచకార్యాలు వెలగబెడుతూ సాయంత్రం కూర చేయడం మానేసావు. తాగొచ్చాడులే వెధవ ఏం గుర్తుపడతాడులే అనికదా నీధైర్యం " కంచాన్ని ఎత్తికొట్టి భార్య జుట్టు పట్టుకున్నాడు జానకిరామయ్య. " మీరు ఉదయం భోజనానికి రాకుండా ఎక్కడో తిన్నానని చెప్పారు. అంత కూర వృథాగా పారెయ్యలేక మీకూ కొంచెం వేశానండీ" భయంతో వణికిపోయింది అన్నపూర్ణ.
" అంటే పొద్దున నీ వాటారా ఇది. పొద్దున తినలేదు కాబట్టి ఇప్పుడు తిని చావు అనేగా అర్థం. ఎంత బరితెగించావే నువ్వు" జుట్టుపట్టి ఊపాడు " అయ్యో నేను అలా అనలేదండి. మిగిలింది పారబోసుకుంటే ఏమొస్తుంది అని అనుకుని వేశానండి. తప్పయింది" వణికిపోతున్నది అన్నపుర్ణ. " నీ బాబు సంపాదించి పెట్టిన సొమ్ముకదా. వృథా అయిపోతుందని బెంగా, పైసాకు టికాణా లేనిదానా" అని వంచి వీపు మీద గుద్దాడు జానకిరామయ్య. " అబ్బా కొట్టకండి. చేసి పెడతాను. పదినిముషాలలో అయిపోతుంది" అంటూ జానకిరామయ్య కాళ్ళు పట్టుకుంది.
" వెళ్ళు. అరగంటలో వేడి వేడి భోజనం నాముందుండాల. అడుక్కుతినే కుంకవి. నీకింత పొగరేంటే " అని భార్య జుట్టు వదలి కాలితో తన్నాడు. ఎగిరి అవతలపడి తిన్నగా లేచి వంటింట్లోకి వెళ్ళింది. జానకిరామయ్యకు స్వయాన మేనకోడలు అన్నపూర్ణ. బోలెడంత ఆస్తి పరాయివాళ్ళకు పోగూడదని పదేళ్ళ పైచిలుకు తేడా వున్నా, అప్పటికే విధవరాలయిన పెద్దకూతురుని ఒప్పించి కుందనపు బొమ్మలాంటి మనవరాలు అన్నపూర్ణను పదమూడో యేటే కొడుకుకిచ్చి కట్టబెట్టించింది జానకిరామయ్య తల్లి సుబ్బాయమ్మ.
అప్పటికే తాగుబోతు, తిరుగుబోతు అయిన కొడుకు పెళ్ళయితే దారికి వస్తాడనుకుంది. కానీ అది జరగక పోగా మనవరాలి బ్రతుకును కూడ నాశనం చేసింది. ఆ దిగులుతోనే ఆమె కాలం చేసింది. తల్లి చేసిన పనికి తలబాదుకుని ఏడ్చి ఏడ్చి, ఇక తమ్ముడు మారడని తెలిసి, అక్కడ ఉండలేక ఆశ్రమాలు పట్టుకుని వెళ్ళిపోయింది అన్నపూర్ణ తల్లి విశాలాక్షి. పోతే పోయింది, తిండి ఖర్చు తగ్గిందనుకున్నాడే గాని, ఆమె గురించి వాకబు కూడ చెయ్యలేదు జానకిరామయ్య. భర్త మాటలకు ఎదురు చెప్పలేని అన్నపూర్ణ దుఃఖాన్ని దిగమింగుకుని సంసారాన్ని నడుపుకొస్తున్నది.
పిల్లలు లేకపోవడం ఆమెకు దేవుడు కల్పించిన మరో దురదృష్టం. ఉండి వుంటే వాళ్ళూ ఇలాగే తయారవుతారని, ఇది ఒకరకంగా అదృష్టమేనని తృప్తి పడుతుంటుంది ఆమె. అందరూ తనను దురదృష్టవంతురాలని దెప్పిపొడుస్తున్నా, ఆమె ఆడపడచు మరియు పిన్ని అయిన వసంత మాత్రం ఆమెకు ప్రతి విషయంలో అండగా నిలబడేది. అదొక్కటే అన్నపూర్ణ చేసుకున్న అదృష్టం. బహుశా ఆమె అంటే భయం వల్లనేమో కామోసు అన్నపూర్ణను ఇంటినుంచి గెంటకుండా ఉండనిచ్చాడు జానకిరామయ్య.
అరగంటలో వేడివేడిగా వండి వడ్డించింది అన్నపూర్ణ. కాస్త మత్తు దిగిందేమో శుభ్రంగా తిని చెయ్యి కడుక్కుని లేచాడు. " రాత్రి పదయ్యింది. అంట్లు తోమడాలు, గ్యాసు కడగాలు పెట్టుకోకుండా కాస్త గతికి త్వరగా గదిలోకి రా" అంటూ గదిలోకి వెళ్ళిపోయాడు.
వంకరగా నవ్వుకుంది అన్నపూర్ణ. ఇది ఆమెకు కొత్త కాదు. గత పదేళ్ళుగా జరుగుతున్న తంతే. కాకపోతే ఈ మధ్య ఎవరి అద్దు ఆపూ లేకపోవడంతో జానకిరామయ్య పని ఆడింది ఆట, పాడింది పాటగా జరిగిపోతున్నది. గబగబా నాలుగు మెతుకులు మింగి గదిలోకి వెళ్ళింది. తల వంచుకున్న మేక మీద పులి స్వారీ చేసింది. మనిషిని మనిషిగా చూడలేని మృగపు మగాడు ఆకలిని తీర్చుకున్నాడు
*********
మంచంలో ఉన్న జానకిరామయ్యకు గతం కళ్ళముందు తెరలా కదిలింది. కాలికి మందు రాసి మర్ధనా చేస్తున్న అన్నపూర్ణను చూస్తున్నాడు. అతని కళ్ళలో రెండు కన్నీటి చుక్కలు మెరిశాయి. ఈ జన్మలో చేసిన పాపం వచ్చే జన్మలో అనుభవిస్తారని పెద్దలు చెప్పేవారు. అది ఒక తరం ముందు మాట. నరకంలోకి వచ్చే జనసంఖ్య పెరిగి యమ ధర్మరాజు కు శ్రమ ఎక్కువయిందేమో, ఈ మధ్య కాలంలో ఎప్పటి పాపాన్ని అప్పుడే అనుభవించేలా చేస్తూ, ప్రాయశ్చిత్తాన్ని ఈ జన్మలోనే పూర్తిచేసి పంపేలా చేస్తున్నాడు. బహుశా దాని పర్యవసానమే కాబోలు, జానకి రామయ్యకు కాలు విరగడం జరిగింది. తాగిన మత్తులో బండి నడుపుతూ వేగంగా వచ్చి ఎదురుగా ఆగివున్న ట్రాక్టరును గుద్ది పక్కకు పడ్డాడు. సరిగ్గా అదే సమయంలో వెనుక నుంచి వస్తున్న కారు జానకి రామయ్య కాలి మీదుగా వెళ్ళి పోయింది. మోకాలు దగ్గర ఎముకలు నుజ్జు నుజ్జవడంతో ఆ కాలు తీసి వీయాల్సి వచ్చింది. అసలు ప్రాణమే పోవలసింది. అన్నపూర్ణ మాంగల్య బలమో, ఇంకా తీరని చాకిరీ ఋణమో గాని జానకి రామయ్య బ్రతికి బట్ట కట్టి మంచాన పడ్డాడు. నలభై అయిదేళ్ళకే అవిటి బ్రతుకయింది అతనిది. ఆరు నెలలు మంచం దిగ గూడదన్నారు. తరువాత చంక కింద కర్రతో శేష జీవితాన్ని గడప వచ్చని చెప్పారు వైద్యులు. పడిన రోజు నుంచి పగలనక, రాత్రనక భర్తను అంటి పెట్టుకుని సేవలు చేస్తున్నది అన్నపూర్ణ. ఇప్పుడిప్పుడే భార్య అంటే ఏమిటో తెలుసుకుంటున్నాడు జానకి రామయ్య. బంధువులంతా చుట్టపు చూపుగా వచ్చి పోయారే గాని, పట్టుమని పది రోజులు నిలబడ్డ వారు లేరు. అతని చిన్నక్కయ్య వసంత మాత్రం ఆసుపత్రిలో ఉన్న పది రోజులు అన్నపూర్ణకు చేదోడు వాదోడుగా ఉండి వెళ్ళింది. అది కూడ తమ్ముడి మీద ప్రేమతో కాదు, అన్నపూర్ణ మీద జాలితో. " నొప్పి తగ్గిందా" అడిగింది అన్నపూర్ణ " తగ్గింది పూర్ణా. ఇక చాలు" " కాలు తీశేసారని బాధ పడుతున్నారా. మరొక కాలు ఉందిగా. పోయిన కాలు బదులుగా నేను మీకు తోడు వుండి నడిపిస్తాను బాధ పడకండి" " నేనంటే నీకు కోపంగా లేదా పూర్ణా" " ఎందుకు " " నిన్ను ఎన్నో రకాలుగా బాధ పెట్టాను. తప్ప తాగి ఒక పశువు లాగ నీపట్ల ప్రవర్తించాను. మంచాన పడితే గాని నీ విలువేమిటో నాకు తెలియ లేదు" " ఇప్పుడవన్నీ ఎందుకండీ. అయిందేదో అయి పోయింది. గతాన్ని తలచి బాధ పడ కూడదు. మన చేతులలో ఏదీ ఉండదు. 'బుద్ధిః కర్మానుసారిణి" అంతే. మన తల రాత బాగ లేనప్పుడు అలాగే జరిగి పోతుంది. అనుభవించ వలసిందే. అవన్నీ ఆలోచిస్తూ కూర్చుని మనసు పాడు చేసుకోకండి. భగవంతుడి దయ వల్ల మీరు క్షేమంగా ఉన్నారు. నాకదే చాలు. కొద్ది సేపు నిద్ర పోండి " అంటూ భర్తకు దుప్పటి కప్పి లోపలికి వెళ్ళింది అన్నపూర్ణ. ఆడ వారికి భూదేవంత సహనం ఉంటుందని ఇన్నాళ్ళూ ఎవరో చెబితే విన్నాడు. కానీ ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాడు. ఈ జ్ఞానోదయం దెబ్బ తగలక ముందే కలిగి వుంటే జీవితం మరోరకంగా ఉండేది. అన్నీ సవ్యంగా ఉన్నన్ని రోజులు ఒళ్ళు కొవ్వెక్కి భార్యను నలుచుకు తిన్నాడు. ఇప్పుడు అవిటి వాడయి ఇంకొక రకంగా ఆమెను హింస పెడుతున్నాడు. తలచు కుంటుంటే తన మీద తనకే అసహ్యం వేస్తున్నది. దీనికి తాగుడు ఒక కారణమయితే, మేన కోడలనే చిన్నచూపు మరొక కారణం. జానకి రామయ్యకు తను భార్యకు ఎంత ద్రోహం చేశాడో, క్రమ క్రమంగా అర్థం కాసాగింది. ఆలోచనలతోనే నిద్రలోకి జారుకున్నాడు.
********
" ఏరా ఎలావుంది? కాలిగాయం పూర్తిగా మానిందా? నీ ఖర్మ కాకపోతే ఏమిట్రా యిది. ఆ పాడు తాగుడు లేకుంటే ఈ ప్రమాదం జరిగేదే కాదు" వచ్చిన ప్రతిసారీ పాడే పాటే అందుకుంది చిన్నక్క వసంత. " ఎందుకే అక్కా చచ్చిన పామును ఇంకా చంపుతావు" నొచ్చుకున్నాడు. " నిన్ను చూస్తుంటే జాలి కలగడం లేదురా నాకు. నువ్వు పసి దాన్ని చేసి అన్నపూర్ణను రాచి రంపాన పెట్టిన రోజులే పదే పదే గుర్తుకు వస్తున్నాయి. అప్పుడలా, ఇప్పుడిలా దానికి నరకాన్ని చూపిస్తున్నావు కదురా" ముక్కు చీదింది వసంత. " పిన్నీ ఏమిటా మాటలు. అక్కవు నువ్వలా అంటే ఆయన ఎంత బాధ పడతారు. అలా అనవద్దు. తప్పులు చేయని వారమెవరము పిన్నీ. నా రాత అలా రాసి వుంటే, దానికి ఆయనేం చేస్తాడు. అవన్నీ వదిలెయ్యండి. రండి ఇవాళ ఆయనకిష్టమైన సాంబారు చేస్తున్నాను. మీ చేతి సాంబారంటే ఆయనకు ప్రాణం. సమయానికి దేవుడు పంపినట్లు వచ్చారు. మీ చేతుల తోనే చేద్దురు గాని" అంటూ వసంతను లోపలికి తీసుకెళ్ళింది అన్నపూర్ణ. అక్క అన్న మాటలకు నొచ్చుకున్నాడే గానీ, కోపం రాలేదు జానకి రామయ్యకు. కారణం ఆమె మాటలలో తొంగి చూసిన నిజం. తప్పు తెలుసుకున్న మనసు పడే పశ్చాత్తాపమే ఇప్పుడు పడుతున్నాడు. కానీ ఏం లాభం? సగం జీవితాన్ని చిందర వందర చేసుకున్నాడు.
*******
" ఎంత కష్టమొచ్చి పడిందే తల్లీ నీకు. సుఖమనేదే లేదటే నీ బ్రతుకులో. అయినా అనుకొని ఏం లాభం. మీ అమ్మమ్మ కొడుకు మీది ప్రేమతో నిన్ను నరకం లోకి త్రోసింది " అక్క కూతురి బాధ చూడలేక పోతున్నది వసంత. " ఒకరిది తప్పు అనడం మంచిది కాదు పిన్నీ. ఎవరైనా పిల్లలను కనగలరు గాని, వారి అదృష్టాన్ని కనగలరా చెప్పు. భగవంతుడు నాకు మేలే చేశాడు పిన్నీ. అవయవాన్ని దూరం చేసినా మనిషిని మిగిల్చాడు. అదే పది వేలు " తప్తి పడింది అన్నపూర్ణ. " ఏమే పూర్ణా. నిన్నంతగా బాధ పెట్టిన వాడికి ఇలా సేవ చేయాలంటే నీకు మనసెలా ఒప్పతున్నది. వాడు నాకు తమ్ముడే కావచ్చు. కానీ వాడు నిన్ను పెట్టిన బాధలు తలచుకుంటే, భగవంతుడు వాడికి తగిన శాస్తి చేశాడనిపించినా, ఇక్కడా నిన్ను అన్యాయమే చేశాడనిపిస్తున్నది" " అలా అనకు పిన్నీ. భర్త భార్యకు తొలి బిడ్డ లాంటి వాడు. బిడ్డ తప్పుచేస్తే దండించాలనుకుంటాము గానీ, పోగొట్టుకోవాలనో, దూరం చేసుకోవాలనో అనుకోము. మామయ్యకు భగవంతుడే శిక్ష వేశాడు. ఇంకా మనం తనను మాటలతో హింసించ కూడదు. మంచంలో ఎల్ల కాలమూ ఉండడుగా. సంవత్సరానికైనా లేస్తాడు. ఒంటి కాలితోనైనా తన పని తను చేసుకోగలుగుతాడు. ఇక సంపాదనంటావా ఎలాగూ సంవత్సరానికి లక్ష రూపాయలు కౌలు వస్తుంది. ఇద్దరమే కదా పిన్నీ చాలు. ఆపదలప్పుడు ఆదుకోను నువ్వు, బాబాయి ఉండనే ఉన్నారు" " ఎంత ఓర్పే తల్లీ నీకు. అందుకేనేమో మీ బాబాయికి నువ్వంటే ప్రాణం. మాకు కూతురు లేని లోటు నువ్వు తీర్చాలంటుంటాడు. ఇక వాసు గాడి సంగతి నీకు తెలుసు. వాడికి నువ్వే లోకం. అందరికీ చెప్తుంటాడు మా అక్క దేవత అంటూ" అన్నపూర్ణ తల నిమురుతూ మురుసుకుంది వసంత . " పిన్నీ. అమ్మ తరువాత అమ్మ లాంటి దానివి. నీ దీవెన చాలు నాకు. మీ ఆశీర్వాదాల వల్లే నా మాంగల్యం నిలబడింది. నువ్వింకేమీ ఆలోచించకు. నా బ్రతుకు బాగు పడినట్లే. ఇక ఆయన తాగుతాడని నేను అనుకోవడం లేదు. ఆయన కోలుకున్న తరువాత, వీలుంటే ఏదైనా చిన్న ఉద్యోగం చూడమను బాబాయిని, కాస్త కాలక్షేపంగా ఉంటుందాయనకు" " మేముండగా నీకు ఏ ఇబ్బందీ కలుగనీయమమ్మా. మా జానకి రాముడు ఏనాడో చేసుకున్న పుణ్యమే నిన్ను భార్యగా పొందడం. చిన్నదానివైనా నీ నుంచి నేర్చుకోవలసినది చాలా ఉందమ్మా. నీ నమ్మకమే నీకు శ్రీరామరక్ష. ఇదిగో సాంబారులో ఉప్పు కూడ వేశాను. కొద్ది సేపు తెర్లనిచ్చి దించు. వస్తానమ్మా" అంటూ అన్నపూర్ణ నుదిటి మీద ముద్దు పెట్టుకుని బయటకు నడిచింది వసంత. " సరే పిన్నీ " అంటూ ఆమెను అనసరించింది సాగనంపడానికి. " వస్తానురా రాముడు. ఇక నైనా దాన్ని బాధ పెట్టకుండా చెప్పినట్లు విను" తమ్ముడి తల మీద చెయ్యి వేసి నిమురుతూ అన్నది వసంత " నేను మంచి వాడిని కాదు కదక్కా " అతని చెంపల మీదుగా కన్నీరు ధారగా కారుతున్నది. " తప్పులు అందరూ చేస్తారురా. కానీ తెలుసుకుని దిద్దుకున్నవాడే మనిషి" అనునయించింది వసంత " నేను తెలుసుకో లేదక్కా. తన సహనంతో, ప్రేమతో నన్ను లాలిస్తూ, ఈ అవిటి వాడికి సేవలు చేస్తూ, నాలోని మనిషిని నిద్ర లేపిందక్కా పూర్ణ. ఆడ పిల్ల ఓర్పే కాపురానికి రక్ష అని చాటి చెప్పింది. ఏం చేసినా తన ఋణం తీర్చుకో లేనక్కా" అతని కన్నీరు ఆగటం లేదు. " ఏమండీ. అలా బాధ పడకండి. మీది మంచి మనసు కనుక మనిషిగా మారారు. అది చాలండీ నాకు. భార్య భర్త నుంచి కోరేది ఆ ప్రేమను మాత్రమే. అందు కోసం ఎన్ని కష్టాలనైనా భరించ గలదు. మీరు, నేను వేరు కాదు. మీరు నిశ్చింతగా ఉండండి. మీకు నేనున్నాను" భర్త పాదాల వద్ద నిలబడి భరోసా ఇచ్చింది అన్నపూర్ణ. వసంత మనసుకు ప్రశాంతత చేకూరింది. తన తమ్ముడు మారాడు. కాదు అన్నపూర్ణ మంచితనం, సంయమనమే వీడిని మార్చింది. ప్రతి చిన్న విషయానికి భర్తతో తగాదా పెట్టుకుని సంసారాన్ని నరకం చేసుకునే పిల్లలున్న ఈ రోజులలో ఎంతో బాధ్యతగా వ్యవహరించి తన కాపురాన్ని తనే దిద్దుకున్నది అన్నపూర్ణ. ఇక వీరి జీవితాలలో తొలకరి వచ్చినట్లే. మనసు నిండిన ఆనందంతో ఇంటికి బయలుదేరింది వసంత.