అడవిలో జంతువుల పిల్లలు ఆడుకుంటూ ఉన్నాయి. కోతి పిల్లలు అటూ ఇటూ దూకుతూ పొర్లుతూ వినోదం కలిగిస్తున్నాయి. జింక పిల్లలు గెంతుతూ, ఎగురుతూ రొప్పుతున్నాయి. కుందేలుపిల్లలు చలాకీగా చిందులు వేస్తున్నాయి. ఎలుగుబంటి పిల్లలు, నక్క పిల్లలు, అడవిపిల్లి పిల్లలు, ఉడుత పిల్లలు ఇలా జంతువుల పిల్లలు కలిసికట్టుగా ఆడుకుంటున్నాయి. ఒక ఏనుగు అటు వైపు పోతూ వాటి ఆటలు చూసి ముచ్చట పడింది.
కుందేలు పిల్ల జారీ పడితే నక్కపిల్ల దాన్ని పైకి లేపి దమ్ముదులిపి సరిచేస్తుంది. "బాల్యం ఎంత మధురమైనదో కాదా?" అనుకుంటూ ముందుకు కదలబోయింది. అప్పుడే ఓ జింక పరుగుపరుగునా రొప్పుతూ వచ్చి తన బిడ్డను జుట్టు పట్టుకుని కొడుతూ ఈడ్చుకు పోతుంది. "మాయదారి ఆటలు, మాయదారి ఆటలు" అనుకుంటూ పిల్లను బాదుతుంది. పాపం ఆ జింకపిల్ల "యా..." అని ఏడుపు సాగదీసింది. అప్పుడు ఏనుగు "ఏమమ్మా జింకా!, పిల్లను ఆడుకొనివ్వరాదు. ఎందుకలా కొడుతున్నావు" అని అడిగింది.
ఏనుగన్నా! ఈ స్నేహాలు మంచివి కావు. జాతులు మరిచి అవన్నీ ఎలా పొర్లుతున్నాయో చూడండి. ఆ కోతి సావాసం పడితే ఇంకెమన్నా ఉందా? దానిలాగే తయారవుతుంది. మా జాతి పరువుతీస్తుంది. ఇలాంటి స్నేహాలను మనం ఆదిలోనే తుంచేయాలి. లేకుంటే ముందుముందు పెద్ద సమస్యలై కూర్చుంటాయి. "జింక చెల్లెమ్మ! నీవు ఆందోళన పడకు. పిల్లల మనసులు కలుషితం చేయకు. చిన్న వయసు. ఏవేవో చిన్న చిన్న తప్పులు చేస్తారు. వారే తెలుసుకుని మానేస్తారు. ఇంత మాత్రానికి ఆ పసిదాన్ని గొడ్డులా కొట్టి ఈడ్చుకుపోవాలా?" అంది.
"నిప్పు రవ్వే కదా అని వదిలేస్తే అది ఊరుకుంటుందా. అంతా దగ్ధం చేస్తుంది. అలవాట్లు కూడా అంతే. వాటిని మొక్కగా వున్నప్పుడే తుంచేయాలి. మ్రాను అయినక ప్రయోజనం ఉండదు. చేతులుకాలాక ఆకులు పట్టుకున్న సామెత అవుతుంది" అంది జింక.
"చెల్లెమ్మ! నువ్వు అనవసరంగా ఆందోళన చెందుతున్నావు. జాతులు గురించి పిల్లల్లో విష బీజాలు నాట కూడదు. అందరం కలిసిమెలిసి ఉంటేనే సమాజం. ఎవరికివారం విడిపోయి ఉంటే అందరికి నష్టమే. పులో, సింహమో మనపై దాడి చేస్తే మనం ఒంటరిగా వాటిని ఎదుర్కోలేము. అదే అందరం ఐక్యంగా ఉంటే ఎంతటి బలవంతుడినైన తరిమికొట్టగలం. తెలిసిందా?" అంది ఏనుగు. జింక ఆలోచనలో పడింది.
"చెల్లెమ్మ! పసివారు కలిసిమెలిసి వుండటానికి మనం ఊతం ఇవ్వాలి. వారిని గమనిస్తూ ఏది మంచో ఏది చెడో వారికి తెలియజేస్తూవుండాలి. చెడువైపుకు వెళ్లకుండా చూడాలి. మంచిని ప్రోత్సహించాలి. మన పిల్లల మంచి అలవాట్ల ద్వారా చెడు పిల్లలలో కూడా మార్పు రావాలి. చెడు పిల్లలలోని చెడు అలవాట్లను మన పిల్లలు అలవాటు చేసుకోకుండా చూడటమే పెద్దలమైన మన బాధ్యత. అంతేగానీ వారితో అడుకోవొద్దు, కలిసిమెలిసి వుండొద్దు అనే హక్కు మనకు లేదు. పిల్లల ఆనందాన్ని హరించే హక్కు మనకు అసలు లేదు.
కలిసిమెలిసి ఉన్నప్పుడే మానసిక వికాసం కలుగుతుంది. పిల్లలు ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉండాలి. వారి ఇష్టాలకు తగిన స్నేహితులను వారే ఎంపిక చేసుకుంటారు. అవసర కాలమందు ఒకరికొకరు సాయం చేసుకుంటారు. మానవత్వంతో జీవిస్తారు. తెలిసిందా?" అంది ఏనుగు. ఏనుగు మాటలకు జింకలో మార్పు వచ్చింది. ఈడ్చుకు పోతున్న పిల్లను చంకనెత్తుకుని ఆడుకుంటున్న నానా రకాల జంతువుల పిల్లల వద్ద వదిలిపెట్టి వెళ్ళింది.
ఏనుగు కాసేపు వాటి ఆటలు చూసి వెళ్ళిపోయింది. పిల్లలు కూడా ఆడిఆడి అలసిపోయి వాటివాటి ఇళ్లకు వెళ్లిపోయాయి. తల్లిదండ్రులు స్వేచ్ఛ ఇచ్చినప్పుడే పిల్లలు మంచి స్నేహితులను ఎంచుకుంటారు. స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటారు. సమాజానికి పనికొచ్చే పౌరులుగా తయారవుతారు.