అయితే నీ పేరు ఇవాల్టి నుండీ చక్రధర్ కాక, చక్కెరధర్ అయిపోయిందన్నమాట! అన్నాడు తన కొలీగ్ చక్రధర్ ని ఆటపట్టిస్తూ భానుమూర్తి. మిగతా వారంతా నవ్వారు.
వాళ్ళని ఉక్రోషంగా చూశాడు చక్రధర్. తనకి సుగర్ వ్యాధి వచ్చిందన్న బాధతో ఏదో తోటిఉద్యోగస్తులు, ఎప్పట్నుండో డయాబెటిక్ తో ఉన్నవారు, ఏదైనా సలహా ఇస్తారేమో అని వాళ్ళతో తన కొత్త బాధ పంచుకుంటే ఇలా ఏడిపిస్తున్నారు అనుకున్నాడు.
చక్రధర్ ఆమధ్య భార్యతో హైద్రాబాద్ నుండి విశాఖపట్నానికి చేసిన రైలు ప్రయాణంలో తెచ్చుకున్న మంచినీళ్ళు విజయవాడ వచ్చేలోపుగానే తాగేసి, విజయవాడలో ఇంకో బాటిల్ కొంటే భార్య ఆశ్చర్యపోయింది. పైగా వైజాగ్ చేరే లోపు నాలుగుసార్లు టాయ్లెట్ కి వెళ్ళిరావడం గమనిస్తూనే ఉంది. ‘ఇదేంటీయన!? రాత్రి పడుకుంటే తెల్లారిగానీ లేవరూ!? నీళ్లైతే తాగనే తాగరు! అందునా ప్రయాణాల్లో అసలే తాగరు. అలాంటిదేమైంది చెప్మా ఈయనగారికి!?’ అననుకుందిగానీ, అప్పటికి ఏం అడగలేదు. తర్వాత మర్చిపోయింది. మళ్ళీ తిరుగుప్రయాణంలో అదే తంతు చూసి, ఉదయం ఇంటికి వెళ్ళగానే అడిగింది గుర్తుగా, “ఏంటి ఎప్పుడూలేంది, ఈ మధ్య ట్రైన్ జర్నీలో తెగ నీళ్ళు తాగడం, టాయ్లెట్ కి వెళ్ళడం చేస్తున్నారు? కిందటినెల కాంప్ ల కెళ్లిన ప్రతీసారీ వాటర్ బాటిల్ పెట్టేవా? అని అడిగి మరీ తీసుకెళ్లారు కూడానూ. కొంపదీసి సుగర్ గాని రాలేదుకదా మీకు!” అని.
“అమ్మో! లేనిపోని అనుమానాలుపెట్టకే! అసలే నాకు స్వీట్స్అంటే తెగపిచ్చి. కొంపదీసి సుగర్ గాని వస్తే నాపనైనట్లే!” అని హడిలిపోయాడు చక్రధర్, కోవిడ్ టెస్ట్ చేయించుకొమంటే భయపడే వాడిలా.
“లేదులేదు ఇవి సుగర్ లక్షణాలే! మా అన్నయ్యకి ఇలానే అయి, టెస్ట్ చేయించుకుంటే, ఒంట్లో ఏకంగా ఓ బస్తాడు సుగరుందని తేలింది. అయినా అదొక్కటే కాదు. ఈ మధ్య మీ ఫాంట్లు, షర్టులు లూజై పోతున్నాయని ఒకటే గోల కదా. అంటే చిక్కిపోయారన్నమాట. ఇవన్నీ దాని లక్షణాలే. సాయంత్రం డాక్టర్ దగ్గరకెళ్దాం” అని తీసుకెళ్లింది.
ఆమె అనుమానపడ్డట్టే, డాక్టర్ గారు సుగర్ అని తేల్చేసి, మందులు వ్రాసి, బాగా వాకింగో,జాగింగో, యోగానో చేస్కోమని చెప్పి,తన దగ్గరున్న డైటీషియన్ని అడిగి తినేవి, తినకూడనివి లిస్ట్ అడిగి దాన్ని ఫాలో అయిపోమనన్జెప్పి, నెలకో రెణ్ణెన్నెల్లకో ఓసారి చెకింగ్ కి వస్తూండమని చెప్పారు.
ఆ డైటీషియన్ ఇచ్చిన లిస్ట్ చూసి గుడ్లు తేలేశాడు చక్రధర్. అది చూసి అతని భార్య, ”మీకేం! ఇందులో ఉన్నవన్నీ పాటించలేక నేను చావాలి మధ్యలో. మీకో రకం తిండి. మాకోరకం తిండి. ఇన్ని రకాలు ఎంతకని, ఎన్నాళ్లని వండుతాను? పైగా మీరు చూస్తుండగా స్వీట్లు తినలేము. అలా చేస్తే మళ్ళీ అదో దిష్టి మాకు” అని విసుక్కున్నా, భర్తని చూసి జాలి పడింది. “అయ్యో పాపం ఇంకా ఏభై ఏళ్ళు కూడా నిండలేదీమానవుడికి. ఇప్పటినుండి ఎంతకని సుగరుకెదురీదుతాడు? సతీ సావిత్రిలా నేనే ఇతన్ని యముడిలాంటి చక్కెర నుండి రక్షించుకుందును గాక!” అని ఆత్మ శపధం చేసుకుని, “పోన్లెండి! ఏదో సరదాకన్నా. మీకెందుకు! మీ డైట్ సంగతి నేను చూసుకుంటాగా!” అని భరోసా ఇచ్చింది, కొత్తగా ఎన్నికైన ఎంఎల్‌ఏ ప్రజలకిచ్చిన వాగ్దానంలాగా.
భార్య విసుగుకన్నా, తర్వాత ఇచ్చిన హామీకన్నా తను మానేయాల్సిన స్వీట్స్ పైనే, ముఖ్యంగా బేసరిలడ్డూ పైనే దృష్టి ఉంది చక్రధరానికి. రోజూ ఆఫీస్ నుండొస్తూనే ఓ బేసరిలడ్డు తినడం అతనికి అలవాటైపోయింది. నెలకి ఓ రెండుకేజీలు కొని, అట్టేపెట్టుకుంటాడు. ఇంటికొచ్చిన వారికెవరికైనా భార్య ఆ లడ్డు పెడితే, ఆ క్షణాన మూలశంక ఉన్నవాడిలా కుర్చీలో అసహనంగా కదుల్తూ, తింటున్నవాళ్లవైపు గుర్రుగా చూస్తూ, వాళ్ళు వెళ్ళేక భార్యని విసుక్కుని, ఆ షార్టేజ్ మేరకు మళ్ళీ లడ్డూలు కొనుక్కుని డబ్బా నింపేసేవాడు. పాపం, అలాంటిది ఆ లడ్డులకి ఎసరొచ్చేసరికి “ఛీ! ఈ సుగర్ కడుపు మాడ! నా కడుపు మాడ్చేసింది!!” అని తిట్టుకున్నాడు. జూనియర్ ఇంటర్ చదువుతున్న కొడుకు, 8 వ తరగతి చదువుతున్న కూతురు తండ్రికి డయాబెటిస్ వచ్చిందన్న విషయం తెలుసుకుని.. కాసేపు అయ్యో అని, ‘అయితే డాడీ, మీ బేసరి లడ్డూల కోటా ఇకపై మాకే.. మీరు ఎప్పట్లానే నెలకి రెండుకేజీలూ కొనడం మానకండి’ అని సలహా లాంటి ఆర్డర్ జారీ చేసేశారు.
----------------------------------------------
ఆఫీసులో తన కొలీగ్స్ లో ఓముగ్గురు డయాబెటిక్ అని తెల్సుకనుక, లడ్డూలు తినేమార్గం ఏమైనా దొరుకుతుందేమోననే ఆశతో వాళ్ళతో ఈ విషయం చెప్తే, వాళ్ళు చక్కెరధర్ అని ఆటపట్టించడంతో ఉడుక్కుని, ఇంకాస్త బెంబేలెత్తిపోయాడు చక్రధర్. వాళ్ళు తర్వాత చక్రధర్ తో మాటల్లో వాకింగ్ బెస్ట్ అనీ, యోగా బెస్ట్ అని, ఏ రోజన్నా కాస్త ఎక్కువగా ఏమన్నా తిన్నా, స్వీట్స్ తిన్నా ఏం కాదనీ ఇంకో టాబ్లెట్ ఎక్కువేసుకుంటే సరిపోతుందనీ, విఆర్ డైట్ బెస్ట్ అనీ, హోమియో, ఆయుర్వేదం మంచివనీ…. ఇలా ఏదీ స్థిరమైన, సరైన సలహా ఇవ్వకుండా ఇంకాస్త అయోమయంలో పడేసారతన్ని. ఇలా కాదని సెల్ ఫోన్లో యు ట్యూబ్ లో వెతికాడు. “ఇలా చేస్తే 24 గంటల్లో మీ సుగర్ మాయం. పైగా రమ్మన్నా రాదు!”, “ఇలా చేసిచూడండి..మీరెంత డయాబెటిక్ అయినా అన్నిస్వీట్లు హాయిగాతినొచ్చు...” ఇలా కోకొల్లలుగా వచ్చిన వీడియోలు చూసి వాటిలోచెప్పిన పద్ధతుల్లో ఏవి పాటిస్తే ఎలా ఉంటుందోనని భార్యతో చర్చించాడు. అప్పటికే ఆవిడ తన సెల్ ఫోన్ లో “పక్కింటి పురాణం, అమ్మలక్క – చెమ్మచెక్క, మీ(వారి) ఆరోగ్యం మీ చేతుల్లో, ఇళ్ళు-ఒళ్ళు లాంటి తనున్న వాట్సాప్ గ్రూపుల్లో ‘సుగరు వస్తే ఏంచేయాలి చెప్మా!’ అని ఓ ప్రశ్న సంధించగానే, వందలాది చిట్కాలు సునామీలా ముంచెత్తాయి. వాటిల్లోంచి ఓపిగా వెతికి, వెతికి ఓ వందచిట్కాలు పట్టుకుని మళ్ళీ వాటిల్లో తను సులువుగా చేయదగ్గవేమున్నాయా అనే వడపోతలో ఉంది.
ఇద్దరిమొత్తానా చూసినవీ, చదివినవీ విశ్లేషించి, చివరికి కొర్రలు, సామలు, అరికలు, ఊదలు, సజ్జలు, గంట్లు, రాగులు, జొన్నలు, ఓట్స్ వంటివి సూపర్ డూపర్ అని అన్నీ ఘోషించడం, పైగా ఈ మధ్య ఎవరిళ్ళకి వెళ్ళినా, “మేం అన్నం, చపాతీలు, పుల్కాలు మానేసి చాలా రోజులైంది. ఇదిగో ఈ కొర్రలు, సామలు, ఊదల మీద పడ్డాం. మహా బాగుందనుకోండీ.. మీరూ తినండి.” అని ఊదరగొడ్తూ వాటి గొప్పతనాన్ని చెప్తూండడంతో వీళ్లూ వాటి మీదపడ్డారు. వాటితో దోసెలు, ఇడ్లీలు, పరమాన్నాలు(అందులో పంచదార బదులు స్వీటెనర్ పిల్స్ వేస్తూ) చేసుకు తినడం మొదలెట్టారు. మధ్య మధ్యలో రక రకాల ఆకుల, పచ్చి కూరల పసర్లు, రసాలు త్రాగడం మొదలెట్టాడు చక్రధర్. పన్లో పని, మీకొచ్చిన సుగర్ నాకు రాకూడదనేం ఉంది. నేనూ మీ డైట్ నే ఫాలో అవుతాను అని చక్రధర్ భార్య కూడా భర్తతో పాటు డైటింగ్ మొదలెట్టింది. మొదట్లోవాటిరుచి ఏదోలాఉన్నా, అలవాటుపడిపోయారు. కార్బోహైడ్రేట్స్ పెంచుతాయని బంగాళాదుంపలు, తియ్యగా ఉంటాయని కేరెట్, బీట్రూట్ వంటివి కూడా కొనడం, వండడం మానేయడంతో పిల్లలిద్దరూ ఇసుకదొరకని కార్మికుల్లా, కాంట్రాక్టర్లలా పెద్దఎత్తున నిరసన ప్రకటించడంతో వాళ్ళకి అన్నం, వాళ్ళకి నచ్చిన కూరలు వేరేగా వండేసేదావిడ. ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాకదా వాకింగ్ కొన్నాళ్లు మానేస్తానే, పొద్దున్నే లేవాలంటే బద్దకం గా ఉంది అని భార్యతో చెప్పి , మొదట్లో చేసిన వాకింగ్ మెల్లమెల్లగా మానేశాడు చక్రధర్. అసలు సుగర్ అని తెలిసినదగ్గరనుండీ, వాకింగ్ కి ఉదయాన్నే లేచి వెళ్లాలంటేనే ఏడుపొస్తోంది చక్రధర్ కి. ఆయనగారితో పాటూ తానూ తెల్లరుఝామునే లేవాలంటే బద్దకం గా ఉండి, ‘పోన్లే! కొన్నాళ్లు చూద్దాం’ అని ఆవిడ కూడా ఉరుకుంది.
-----------------------------------------------
ఓ రెండునెలలు పోయాక డాక్టర్ దగ్గరకి వెళ్ళి టెస్ట్ చేసుకుంటే.. సుగర్ పెద్దగా ఏం తగ్గలేదు. “అబ్బే! ఇది సరిపోదండీ. ఇంకా తగ్గాలి. వాకింగ్ చెయ్యడం లేదా ఏం!? ఈ మధ్య వచ్చిన పండుగలకి బూర్లు, బొబ్బట్లు బాగా లాగించేసి నట్టున్నారు” అని అన్నీ అనుమానాలు వ్యక్తపరచి, అవే నిజమన్నట్టుగా ‘ఇలా అయితే కష్టమే! బాగా స్ట్రిక్ట్ గా ఉండండి. లేకపోతే మీకు ఆరోగ్య నష్టం, నాకు ఆర్ధికలాభం!’ అని నవ్వాడు డాక్టర్.
“అయ్యో! స్వీట్లే తినలేదు డాక్టర్. నాకిష్టమైన బేసరీలడ్డు కూడా కొనడం మానేశా. ఒకవేళ కొన్నా, మా పిల్లలకోసమే కొంటున్నా! అయితే వాకింగ్ కాస్త తగ్గిందనుకోండి! అని ఉన్న నిజంలో సగం నిజాయితీగా డాక్టర్ కి చెప్పాడు చక్రధర్. తాము తింటున్న ఆహారం గురించి చెప్పలేదు, కొర్రలు అంటే కొర కొర చూస్తాడేమో, ఊదలు అంటే ఏమేమో చెప్పి ఊదరగొట్టేస్తాడేమోనని భయపడి.
“అబ్బే! స్వీట్స్ మానేసినా గానీ వాకింగ్, జాగింగ్, యోగా ఏదో ఒకటి ఉండాల్సిందే. మరీ ఇప్పట్నుండీ పూర్తిగా మందులమీదే నడిపిస్తే.. త్వరలోనే ఇన్సులిన్ ఇంజెక్షన్లు తీసుకోవాల్సి వస్తుంది. అంతదాకా ఎందుకు?” అని భవిష్యత్ భయాన్ని, వర్తమాన జాగ్రత్తని కలిపి చెప్పాడు డాక్టర్.
ఇందులో డాక్టరుకీ, భార్యకీ తెలీని విషయం ఏమిటంటే.. బేసరి లడ్డు చాపల్యంతో ఇంట్లో అయితే దొరికిపోతానని, అప్పుడప్పుడు ఆఫీస్ నుండొస్తూ, తన ఖాతా స్వీట్ షాప్ దగ్గరే ఓ లడ్డు తినేసి వచ్చేసేవాడు. అందువల్ల తన స్వీట్ విషయం వాళ్ళిద్దరికీ చెప్పకపోయినా, సుగర్ టెస్టింగ్ లో దొరికిపోయాడు, డోపింగ్ టెస్ట్ లో దొరికిన ఆటగాడిలా. “డాక్టర్ చెప్పింది నిజమేకదా, అంత స్ట్రిక్ట్ డైట్ కంట్రోల్ చేసినా సుగర్ కొద్దిగానే తగ్గడమేంటో? మహా అయితే వాకింగ్ కి కాస్త బద్దకిస్తున్నారు.. ఆపాటిదానికే సుగర్ కంట్రోల్లోకి రాదా!? ఏదో తేడా కొడుతోంది! అనుకుని, సిఐడి ఆఫీసర్ లా ఓ రోజు సాయంకాలం తమ ఖాతా స్వీట్ షాప్ కి వెళ్ళి ఆరాతీస్తే భర్త-బేసరి లడ్డు ఎపిసోడ్ బయటపడింది. “హన్నా!! నేనూ కూడా స్వీట్స్ మానేసి, డైటింగ్ చేస్తూ మీతో పాటూ సుగర్ పేషెంట్లా ఉంటూంటే.. మీరు మాత్రం స్వీట్స్ లాగించేస్తారా! ఇవాల్టి నుండీ మీకు కాఫిలో సుగర్ ఫ్రీ పిల్స్ కూడా వేయను!” అని ఇంటికొచ్చి భర్తని దులిపేసింది ఆవిడ. “తీయనైన జీవితానా..చేదువిషం తాగేవా!!” అన్న ఘంటసాల పాటలోని ఆ చరణం పాడుకున్నాడు చక్రధర్.
----------------------------------------------
మూడు నెలల తర్వాత మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు చక్రధర్ భార్యతో సహా. “గుడ్ ప్రోగ్రెస్. మీ బ్లడ్ సుగర్ లెవెల్ నార్మల్లో ఉంది. క్రితంసారికీ, ఇప్పటికీ చాలా మార్పువచ్చింది. ఇంతకీ ఏం జాగ్రత్తలు తీసుకున్నారేం!? చెప్తే నేనూ నా ఇతర పేషెంట్లకి ఆ ట్రిక్స్ చెప్తా” అన్నాడు డాక్టర్, అవేంటో తెలుసుకోవాలనే కుతూహలంతో. భార్య వైపు మెచ్చుకోలుగా చూశాడు చక్రధర్. అది గమనించి, "అదీ సంగతి! నేనప్పుడే అనుకున్నా! ఇంటి ఇల్లాలు జాగ్రత్త తీసుకోకపోతే ఇలాంటివి సాధ్యం కావు. మీరు లక్కీ ఫెలో! అవేంటో నాకూ చెప్పమ్మా!” అన్నాడు డాక్టర్ నవ్వుతూ ఆమెని మెచ్చుకుంటూ. మొహమాట పడుతూ ఆమె చెప్పింది విని “ఓహో! ఇలాంటివి కూడా చెయ్యొచ్చా!” అని భళ్ళున నవ్వేశాడు.
జరిగిందేమిటంటే.. అంతకుముందు డాక్టర్ ‘సుగర్ ఇంకా తగ్గాలి’ అని వాకింగ్ మీద బాగా నొక్కిచెప్పడంతో ఈయనగారి వాకింగ్ బద్దకం, దొంగచాటుగా స్వీట్లు తినే అలవాటు ఎలాగైనా వదిలించాలి అని తన బాబాయికి ఫోన్ చేసింది చక్రధర్ భార్య.
“మీ ఆయన వాకింగ్ ఉదయాన్నే తప్పనిసరిగా చెయ్యాలంటే ఒకటే మార్గముందమ్మా! నేను రేపు వస్తానుండు” అని చెప్పాడు బాబాయి. అన్నట్టు గానే ఉదయాన్నే ఆరుగంటల కల్లా వచ్చేసిన బాబాయి గారు తనతో పాటు తనింట్లో ఆ మధ్యే పుట్టిన పామేరియన్ బ్రీడ్ కుక్క పిల్లని ఆమెకిస్తూ,“ఇది ఇకపై మీ ఇంట్లోనే ఉంటుంది. దీని పేరు పింకీ. దీన్ని రోజూ రెండు పూటలా వాకింగ్ కి తీసుకెళ్లే బాధ్యత మీ ఆయనది. దీన్ని ఉదయం అయిదున్నరకే బయటికి తీస్కెళ్లాలి, లేకపోతే అరిచి అరిచి ఇంట్లో వాళ్లని పడుకోనీదు. ఇంకా లేట్ చేస్తే ఇంట్లోనే తనపని కానిచ్చేస్తుంది. అందుకని మీ ఆయన బద్ధకం వదిలించుకుని వాకింగ్ కి వెళ్లాలంటే ఇదే మందు. రోజూ రెండుపూటలా దీన్ని బయటికి తీస్కెళ్లమను. ఇవాల్టి సాయంత్రం నుండీ మీ ఆయనదే డ్యూటి! అని దాన్ని చక్రధర్ ని నిద్రలేపి మరీ అంటగట్టాడు, విషయం మరోసారి అతనికి చెప్తూ.
భార్యవంకా, ఆమె బాబాయి వంకా, పింకీ వంకా గుర్రుగా చూసాడు చక్రధర్. “దీన్ని రోజూ బయటికి తీసికెళ్లడం అలవాటు చేసుకున్నావనుకో, నీకు వాకింగ్ అదే అలవాటైపోతుంది. నీకు సుగర్ బాగా తగ్గిందనుకో, ఎప్పుడేనా స్వీట్స్ తిన్నా ఏం కాదు. నేను సుగర్ లో థర్టీ ఇయర్ ఇండస్ట్రి! కొన్ని కిటుకులు చెప్తాలే” అన్నాడు బాబాయి. స్వీట్స్ తినొచ్చు అన్నమాట నోట్లో బేసరి లడ్డు కుక్కినట్టనిపించి, మంచంమీంచి దిగ్గునలేచి, “అలా అయితే! ఓకే! ఇప్పుడే రెడీ అయి వస్తా, ఆ కిటుకులేవో చెప్దురుగానీ” అని పది నిమిషాల్లో బ్రష్ చేసుకునివచ్చి, ఇప్పుడుచెప్పండి అన్నాడు చక్రధర్, ఏం చేస్తే స్వీట్స్ తినే ఛాన్స్ వస్తుందో తెల్సుకోవాలనే ఆతృతతో, బడ్జెట్లో ఆదాయపుపన్ను రాయితీకోసం ఎదురుచూసేవాడిలా.
“ఆ!! మరీ అంత ఎగ్జయిటైపోకల్లుడూ.. ‘ఇలా చేస్తే 24 గంటల్లో ఎన్ని స్వీట్లు తిన్నా ఏం కాదు’ అనే వీడియొ లాంటిది కాదు నేచెప్పేది. వాళ్లెదో తమ వీడియో అందరూ చూడాలని టెంప్ట్ చెయ్యడానికి అలాంటి ప్రచారం చేసుకుంటారు. బట్టతలపై మళ్ళీ మామూలుగా జుట్టు పెరగడం, ఒంట్లో కొచ్చిన సుగర్ పోవడం ఎప్పటికీ జరిగేపనులు కావు. అందుకే ముందుగా ‘నేను సుగర్ పేషెంట్ ని!’ అనే భయం ఉండకూడదు. పైగా ఆ సుగర్ని నీ అదుపులో ఉంచుకోవాలి. అసలు మన కంట్రోల్లో ఉంచుకోదగ్గ అనారోగ్యం అంటూ ఏదైనా ఉంటే అది ఈ డయాబిటీసే. అసలిది ఇండో-పాక్, ఇండో-చైనా సరిహద్దుసమస్య లాంటిదనుకో. అది మనమీదకి దండెత్తినప్పుడల్లా దాన్ని తిప్పికొడుతూండాలి. నేనాపనే చేస్తున్నా. అంటే తిండి విషయం లో జాగ్రత్తగా ఉండాలి. మీరు రోజూ తినే ఆ కొర్రలు, సామలు, అరికలు వంటి వాటిలో కూడా కార్బో హైడ్రేట్స్ ఉన్నా, అవి మెల్లగా గ్లూకోస్ గా మారడం వల్ల సుగర్ లెవెల్స్ అమాంతంగా పెరగకుండా ఉంటాయి తప్ప, అసలు సుగర్ అన్నదే లేకుండా చేయవు. అదేపనిగా భోజనంతో పాటూ స్వీటూ, పళ్లూ తినేస్తే, అంటించిన తారాజువ్వలా సుగర్ పైకెళ్లిపోతుంది. అందుచేత నువ్వు స్వీట్ తినాలి అనుకుంటే ఖాళీ కడుపుతో అంటే టిఫిన్ కి బదులుగానో, ఏ సాయంత్రమో స్నాక్స్ కి బదులుగానో తిను. అలానే ఓ అరటిపండో, సీజన్లో మామిడిపండో తిన్నా వాటి ముందు వెనుకా ఓ రెండుగంటల పాటైనా ఏమీ తినకుండా ఉంటే పర్లేదు. అలా అని రోజూ తినేసేవ్! ఇంకా ఏవో చిట్కాలున్నాయి. అవన్నీ తీరిగా ఒక్కొక్కటీ చెప్తాలే. అయినా గానీ, ఏదో ఒక వ్యాయామం, కనీసం వాకింగ్ తప్పదు సుమా. అందుకే నీకీ పింకీ ట్రీట్మెంట్ మొదలెట్టా. అన్నిటికన్నా ముఖ్యం మీ డాక్టర్ గారు ఏం చెప్తే అది చెయ్యడం. నీ శరీత తత్వాన్ని బట్టి, నీకే మందులు నప్పుతాయో అవే వ్రాస్తారాయన. సాధారణం గా ఏ ఇద్దరు మనుషులూ ఒకేలా ఉండనట్టే, ఏ ఇద్దరు సుగర్ పేషెంట్ల టాబ్లెట్స్ ఒకేలా ఉండవు.ఎవడి సుగర్ గోల వాడిదే. ఆపై నీ ఇష్టం!” అన్నాడు బాబాయి.
అతను ఇంకా ఏవేవో చెప్పి, ఒంట్లో సుగర్ తగ్గించేచిట్కాలు చెప్తాడనుకుంటే, భయపెట్టేడో, ధైర్యం చెప్పేడో అర్ధం కాక, “పోన్లే! ఎప్పుడైనా స్వీట్ తినాలంటే ఏం చేయాలో చెప్పాడీయన. ఏ మాత్రం నష్టం తగ్గినా, ఆమేరకు అదీ లాభం అనే అనుకోవాలి , మా ఆవిడతో కాపురంతో పాటు, ఈ సుగర్ తో కూడా తియ్యని కాపురం చెయ్యాల్సిందే!” అననుకున్నాడు చక్రధర్. ఆతర్వాత మూణ్ణెల్లకి డాక్టర్ దగ్గరకెళ్లి, అలా గుడ్ అనిపించుకుని, భార్యకి ఓ సర్టిఫికేట్ కూడా తెచ్చుకున్నాడన్నమాట. శుభమే కదా!!
====సమాప్తం====