అంబుజరావుకి అనుమానమెక్కువ.అతడు తన నీడను కూడా నమ్మడని ప్రతీతి. అతనికి పచ్చిపాలు వ్యాపారముండేది.పాడిరైతుల దగ్గర పాలు కొనడం.కొంచెం ధర పెంచుకొని ఇంటింటికీ వెళ్లి పాలు అమ్మడం అతని వ్యాపారం.
అతని వ్యాపారం బాగా విస్తరించడంతో కొందమంది యువతీ యువకుల్ని సహాయకులుగా పెట్టుకొని కొంత కాలానికి అతను పర్యవేక్షకుడుగా మారి వ్యాపారం మొత్తాన్ని తన దగ్గర పని చేసే యువతకి అప్పగించాడు.ఆ యువత చాలా నీతి నిజయతీలుతో పని చేసేది.అంబుజ రావు వ్యాపారం వంద బిందెలు, వెయ్యి డ్రమ్ములు అన్నంత స్థాయికి వచ్చింది, లాభాలు లక్షలకు చేరాయి, ఇదంతా తన వద్ద పని చేసే యువత చలువే అని అతనికి తెలుసు, అయినా అతి అనుమానాల అంబుజరావు ప్రతి క్షణంమూ అనుమానపు యక్ష ప్రశ్నలతో ఆ యువతని వేధిస్తూ వారి విధి నిర్వహపై డేగకళ్ళు వేసి కనిపెడుతుండేవాడు.
కొన్నాళ్ళకు అంబుజ రావు వ్యక్తిగత పని మీద ఒక నెల రోజులు పాటు విదేశాలుకు వెళ్తున్నారన్న సమాచారం తెలుసుకొని, అతను విదేశాలకు వెళితే మనం మరింత నీతి నిజాయితీలతో విధులు నిర్వర్తించి అతనికి మంచి పేరు,మంచి లభాలు తేవాలని అతని వ్యాపారాన్ని నడుపుతున్న యువత నిర్ణయించుకుంది.అదే విషయాన్ని అంబుజ రావుకి చెప్పింది కూడా...అయినా అనుమానం పెను భూతమై కనిపించగా అంబుజ రావు తాను పర్యవేక్షణలో లేని సమయంలో వ్యాపారం వద్దని నెల రోజులు పాటు తన వ్యాపారాన్ని తాత్కాలికంగా మూసేస్తున్నట్లు ప్రకిటించి విదేశాలకు వెళ్ళి పోయాడు.
నెల తరువాత విదేశాలనుండి వచ్చిన అంబుజ రావుకి చుక్కలు కనిపించాయి. తన వద్ద పని చేసే యువత మొత్తం వేరు వేరు ఉపాధి పనులకు వెళ్ళి పోయింది.తనకు పచ్చి పాలు అమ్మే రైతులు వేరే వాళ్లకు అమ్ముకోడానికి ఒప్పందం చేసుకున్నారు. తన దగ్గర పాలు కొనే వినియోగదారులు వేరే వాళ్ల దగ్గర కొనుక్కోడానికి అలవాటు పడ్డారు
దాంతో అంబుజ రావు తన పచ్చి పాలు వ్యాపారాన్ని శాశ్వతంగా మూసుకోవలసి వచ్చింది, అప్పుడర్ధమయ్యింది అతగాడికి అతి అనుమానాలు అనర్ధదాయకమని, అయినా అప్పటికే సమయం మించి పోవడంతో ఉసూరుమన్నాడు అంబుజ రావు.