అనగనగా ఒక పల్లెటూరు.ఆ వూరిలోయాభై ఏళ్ళ పెద్దమనిషి అంకులేసు అనేవాడున్నాడు. వాడోకుళ్ళుబోతు.వక్రబుధ్ధికలవాడు.ఆకాశ రామన్న వుత్తరాలు రాయటంలో దిట్ట.ఇతరులు బాగుంటే ఓర్చుకోలేడు. తను మాత్రమే బాగుండాలనకొంటాడు.
పెళ్ళయిన జంట మొదలు కొని పిల్లాపాపలతో కాపురం చేసుకునే నడివయష్కులనుంచి కాటికి కాళ్ళు చాచుకొని రేపో మాపో నన్నట్టు వుండే ముసలాళ్ళవరకూ ఏదో ఒక కారణం చూపుతూ ఒకరి మీద ఒకరికి చాడీల రూపంతో కొట్లాట వరకూ తీసుకు వెళ్ళే ఆకాశరామన్న వుత్తరాలను రాస్తాడు.వాళ్ళు గొడవలు పడుతుంటే చూసి ఆనందిస్తాడు.ఇంకా చెప్పాలంటే కొత్త జంటల్ను సైతం విడదీసి విడాకుల కోసం కోర్టు మెట్లను ఎక్కేలా చేస్తాడు.యాభై ఏళ్ళు పైబడ్డ అంకులేసును చూస్తే ప్రతి వ్యక్తి భయంతో వొణికిపోతూ రెండు మూడు మాటలతో జారుకొంటుంటే తను హాయిగా నవ్వుకుంటాడు.
మొత్తంలో తన వుత్తరాల ద్వారా వూరినే గందరగోళపరచే శక్తి సామర్థ్యాలు కలిగిన ఏకైక వ్యక్తి అంకులేసు. వూరి జనం అంకులేసుపై ప్రెసిడెంటుగారికి ఎన్నోసార్లు పిర్యాధులు చేశారు.అందుకు ప్రెసిడెంటు "నేనేమీ చేయలేను.ఆ దేవుడే మనపై జాలి చూపి అంకులేసుకు తగిన శిక్ష వెయ్యాలి. నిజం చెప్పాలంటే ఒకవేళ అతనిలో ఏదేని తప్పును కనిపెట్టి చర్య తీసుకుంటే మరుసటి రోజే నాకూ నా భార్యకు తగాదా పెట్టి రచ్చరచ్చ అయ్యేలా చేసి ఆ గొడవలతో మేమే కొర్టుకెళ్ళి విడాకులు ఇప్పించుకునేలా చేస్తాడు.తనేమో తనకేమీ తెలియనట్టు వుంటాడు.
కనుక సందర్భం కోసం వేచి చూద్దాం"అని తప్పుకునేవాడు ప్రెసిడెంటు. అయితే వూరి జనంలో కొందరు ఎటూ యాభై ఏళ్ళు నిండి పెళ్ళాం కూడా లేని ఒంటరి అంకులేసు బ్రతకటంకన్నా చనిపోతే మేలని,అలా చనిపోతే అతని చావును వల్లకాటికి తీసుకువెళ్ళే నాధుడు కూడా లేకుండా,కుక్కలు,నక్కలు పాలు కావాలని శాపనార్థాలు పెడుతుంటారు.కాని అందరనుకొంటున్నట్టు అంకులేసు ఒంటరి కాదు. అతనికి కొడుకు న్నాడు.
తను భార్యా పిల్లలతో పొరుగూరిలో వుంటున్నాడు. ఆ కొడుకు తండ్రి అంకులేసు అవసరానికి రమ్మంటే వస్తాడు. లేకుంటే అంకులేసే కొడుకు వద్దకు వెళుతుంటాడు. అలా రోజులు సాగిపోతున్న సమయంలో ఓరోజు అంకులేసు కొడుకు ఓ వుత్తరాన్ని పట్టుకొని వూరి జనాల చెవులకు ఇంపైన శుభవార్తను మోసుకొని రచ్చబండ వద్ద పంచాయితీలో బిజీగా వున్న ప్రెసిడెంటుగారివద్దకొచ్చాడు.
వచ్చీ..."అయ్యా!ప్రసిడెంటయ్యా...వూరి జనాలకు తగాదాలు పెట్టే ఆకాశరామన్న వుత్తరాలు రాయటంలో అందవేసిన చేయని మీరందరూ అనుకొంటున్న మా నాన్న అంకులేసు చివరిగా మీ పేరా రాసిన ఈ వుత్తరాన్ని జేబులో వుంచుకొని పైకెళ్ళి పోయాడయ్యా.బహుశా తన తప్పు తెలుసుకొని పశ్చాత్తాపంతో ఈ వుత్తరాన్ని మీకు రాశాడేమోనన్నది నా సందేహం.చూడండి.మీకీ వుత్తరం అందజేయాలని మృతదేహాన్ని అక్కడుంచి వచ్చాను"అంటూ బాగా సాగి పోతున్న పంచాయితిని డిస్ట్రబ్ చేసి ప్రెసిడెంటు చేతిలో వుత్తరాన్ని పెట్టి అలజడి సృష్ఠించాడు. ప్రెసిడెంటు తాపీగా " ఓఁ...నువ్వు అంకులేసు కొడుకువా!"
అంటూ వుత్తరాన్ని చించి కళ్ళతోనే చదివి అంకులేసు కొడుకు కళ్ళలోకి చూసి పాపమనుకొన్నాడు. "అవునయ్యా.అంకులేసు కొడుకునే. భార్య పిల్లలతో పొరుగూరిలో వుంటున్నాను. బాగా జబ్బు చేసిన మా నాన్న నా వద్దకొచ్చి...నా వద్దకొచ్చి..."పెద్దగా ఏడ్వసాగాడు. అప్పుడు రచ్చబండకొచ్చిన ఆడామగ,పిల్లా జల్లా , ముసలి ముతక అంకులేసు గుటుక్కుమన్నాడన్న సంగతి వింటూనే వాళ్ళలో పొంగిన ఆనందంతో పెదాలు గట్టిగా బిగబట్టుకొని లోలోన నవ్వుకున్నారు "
ఈ రోజుతో మనల్ని పట్టి పీడిస్తున్న పీడా విరగడైయ్యిందిరా సామీ"అని అనుకొన్నారందరూ. ప్రెసిడెంటుకూ లోలోన సంతోషమే!అయినా పెద్ద మనిషిగా ఓ పేద్ద నిట్టూర్పుతో "వూరి ప్రజలారా!మనలో కొందరికి ఇది శుభవార్త. ఏమిటంటే ఇన్నాళ్ళు తన ఆకాశరామన్న వుత్తరాలు ద్వారా కొందరిని వేధిస్తూ కొన్ని కుటుంబాల్లో కలతలు సృష్ఠించి రాక్షసానందం పొందిన అంకులేసు ఇక లేడు. పైకెళ్ళి పోయాడు.అయితే ఈ వుత్తరం ద్వారా ఆయన చివరి కోరికను తీర్చి పెట్టాల్సిన బాధ్యతను మనపై మోపాడు.అదేమిటంటే...ఇన్నాళ్ళు తన వుత్తరాలతో అందరిని వేధించి బాధపెట్టినందుకు పశ్చాత్తాపపడుతూ, ప్రాయశ్చిత్తంగా తన పార్దీవ దేహాన్ని పాడెలో పెట్టి నలుగురితో మోసుకెళ్ళకుండా రోడ్డు మీద ఈడ్చుకు వెళ్ళమని ఈ ఉత్తరంలో కోరాడు.
కనుక జరుగుతున్న ఈ పంచాయితీని వచ్చే ఆదివారానికి వాయిదా వేస్తున్నాను.ఇక అందరూ పొరుగూరికి కదలండి.అంకులేసు కోరిక మేరా అంత్య క్రియలు జరిపించి అతని ఆత్మను శాంతింప జేద్దాం"అంటూలేచి అంకులేసు కొడుకు వెంట మౌనంగా నడక సాగించాడు ప్రెసిడెంటు.ఆయన్ను వెండించారు జనం. అంకులేసు కొడుకు ఇంటికి వెళ్ళిన జనం పోనీలే పాపమనిఅంకులేసు పార్థీవ దేహానికి దణ్ణం పెట్టు కున్నారు. జరగవలసిన పనులన్నీ చక చక జరిగిపోయాయి.అంకులేసును పాడెమీద పడుకోబెట్టారు.అందరూ ఒక్కసారిగా 'గోవిందా... గోవిందా' అని పెద్దగా అంటుండగా తాళ్ళతో కట్టి వుంచిన అంకులేసు భౌతిక కాయాన్నిడప్పుల శబ్దాల నడుమ ప్రెసిడెంటు, సెక్రటరీ బరబరా ఈడ్చుకొంటూ రోడ్డెక్కారు.
అంతలో ఓ మామూలు కానిస్టేబులు, ఓ హెడ్డు కానిస్టేబులు 'రయ్' మని సైకిళ్ళ మీదొచ్చి "ఆపండి...ఆపండి"అంటూ సైకిళ్ళు దిగి."ఏమిటీ!పాడెను లాక్కెళుతున్నారు. నలుగురు మోసుకు వెళ్ళరా ప్రెసిడెంటుగారూ?" అని ప్రశ్నించారు. అందుకు ప్రసిడెంటు సగర్వంగా మీసాన్ని దువ్వుకొని"కుదరదండి!అంకులేసే తన చివరి కోరికగా తన పార్దీవ దేహాన్ని నలుగురితో మోయించకుండా ఈడ్చుకు వెళ్ళాలని ఈ వుత్తరం లో రాసి జేబులో పెట్టుకొని పైకెళ్ళి పోయాడు.అందుకనీ..."అంటూ వుత్తరాన్ని చేతికిచ్చాడు. పకపక నవ్వారు పోలీసులు.
” అయ్యా ప్రెసిడెంటుగారూ!ఇదిగో ఇలాంటి వుత్తరమే నెలక్రితం తనే స్వయాన పోలీసు స్టేషనుకొచ్చి రాసిచ్చాడు.దీని ప్రకారం మిమ్మల్నిందరిని ఇప్పుడే అరెస్టు చెయ్యాలి"అంటూ అంకులేసు రాసిన వుత్తరాన్ని ప్రెసిడెంటు చేతికి ఇచ్చారు.దాన్ని చదివిన ప్రెసిడెంటుగారు షాక్కుగురైవొణికిపోయాడు.అందరూ అలాగే కళ్ళప్పగించి చూస్తూ "అయ్యా ! ఇంతకు అందులో అంకులేసు ఏం రాశాడో కాస్త చదివి వినిపించరూ"అని ప్రాధేయపడుతూ అడిగారు. "అయితే చదువుతాను వినండి. 'అయ్యా!నాకు మా వూరి జనం మధ్య పేద్ద చెడ్డ పేరు వుంది.
మా వూరి జనాలు అంటే ముఖ్యంగా అన్యోన్యంగా వుండే భార్యభర్తల మధ్య చిచ్చు రేపి సిగపట్లు జరిగి విడాకుల వరకు వెళ్ళే విధంగా బోలెడు ఆకాశరామన్న వుత్తరాల ను రాశాను. అందువల్ల వూరి జనం మొత్తం నన్ను విరోధ భావంతో చూస్తూ సందర్భం కలిసొస్తే చంపాలనుకొంటున్నారు. అలా ఒకవేళ నేను చనిపోతే నా శవాన్ని తాళ్ళతో కట్టి స్మశానానికి ఈడ్చు కెళ్ళాలనుకొంటున్న జనాలపై తగు జాగ్రత్తలు తీసుకొని కట్టడి చేయాలి. అలా చేయకపోతే అందుకు బాధ్యులు మీరే అవుతారు.కనుక ముందస్తు చర్యల్లో భాగంగా ఈ వూరి జనాన్ని అరెస్టు చేసి కొట్టి,నానా హింసలు పెట్టి జైలు పాలు చేయాలని కోరుకొంటు న్నాను 'అని వుందని ముగించాడు.
అంతే వూరి జనం మొత్తం నోటి మీద వేలు వేసుకొని 'అంకులేసు సామాన్యుడు కాదు భయ్యా!. చచ్చీ సాధించే రకం.మనం పోలీసుల కళ్ళు కప్పి ఇప్పుడే తప్పించుకోవడం మంచిది.పదండి. ఎస్కేప్...!'అనుకొంటూ అదృష్యమై పోయారు అందరూ. ©©©©© అయ్యా!ఈ కథ నా స్వం రచన.ఇది అనువాదం కాని,అనుకరణ కాని కాదని తెలుపుకొంటున్నాను.