“నేను చెప్తానే ఉండా! ఈ పాడు ముండలు మన బతుకులను నడిరోడ్డుకు ఈడుస్తాయని. ఇప్పుడు సూడు నీ ఇద్దరి కూతుళ్ళు మనల్ని బజార్లో నిలబెట్టారు. ఊళ్లోకి పోవాలంటే భయమేస్తాంది!”
ముఖంపై కాదు లంగాలు ఎత్తి ఉమ్ముతారు. “ఒరేయ్ వలి..! బయటికి పోయి ఇంత ఎల్ ట్రీన్ తీసుకురాపో! అందరం తలా కాస్త నోట్లో పోసుకొని అల్లా కాడికి పోదాము.”
పెద్దదేమో ఎరికిలోనితో లేచిపోయింది. వానితో పిల్లోన్ని కని మనముందే తిరుగుతాంది. వాలిద్దరికి పుట్టినోడు యాడ నన్ను నాని (అవ్వ) అంటాడేమోనని ఆ ఈధిలోకి పోడమే మానేస్తి. వాడ్ని నరికేయరా అంటే ఇనకపోతివి అల్లా సూసుకుంటాడులే అంటివి. ఇప్పడు ఈ చిన్నది కూడా ఇట్టా సేసింది.
ఇంగెట్టాబతుకుదామురా వలీ…, ఈ వయసులో నాకెందుకురా ఈ తిప్పలు.? నిన్ను కన్న పాపానికి నేను అనుభవిస్తాండ. ఎట్టాంటి దొంగముండలను కన్నావురా! “వద్దురా వద్దురా గారాబం సేయద్దురా అంటే యినకపోతివి. ఇప్పుడు సూడు మానం మొత్తం పాయెనని వలి వాలమ్మ మాయిబ్బి గొనుగుతూనే ఉంది.”
మాయిబ్బి కేకలతో ఊళ్ళో తెలియనోళ్లోకి కూడా ఇషయం మొత్తం స్పష్టంగా తెలిసిపోయింది.
మాయిబ్బి తత్వమే అంత. ఎడమ కన్నుకు కొడుకు ఆపరేషన్ సేయించలేదు, తనకు ఎదురుతిరిగే మనవరాళ్లంటే కోపం. ఆమె రెండు కారణాలు ఇవే. అందుకే సందు దొరికితే చాలు కొడుకని కూడా సూడకుండా వలి సంసారాన్ని బజారులో పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది.
***
రెహాన యాడుందో తెలిసిందా! ఆ ఎరికలోడే మాయమాటలు సెప్పి తీసుకుపోయుంటాడు. మన పెద్దదానిలాగ కాదండి పాపం అమాయకురాలు వాడేమైనా మందు కలిపి ఉంటాడు. పోలీసోల్లు ఏమైనా సెప్పారా? మన పాపను వాడు చంపుతాడో ఏమో! తొందరగా కనుక్కోండని భార్య రంజాన్ దీనంగా వలిని అడిగింది.
“ఇంక్యాడ పాపే మనం యా జన్మలోనే పాపం సేసుకున్నాము. అందుకే ఈ జన్మలో ఇలాంటి పిల్లోల్లు పుట్టారు.” మగపిల్లోడు కావాలని వరసగా నలుగురిని ఆడపిల్లోలను కంటిమి. అల్లా కూడా నాపై దయతలచలేదు. సరే ఆడపిల్లోలైనా సదువుకొని బాగుపడతారంటే పెద్దదేమో ఎరికిలోన్ని సేసుకొని మనముందే టింగురంగా అని తిరుగుతోంది.
“ఊర్లో జనాలంతా రెండోది మాదిగోనితో పోయిందంట కదా! ఏమైనా భలే పెంచావురా పిల్లోలను పెద్దది ఎరికిలోన్ని, చిన్నది మాదిగోన్ని మిగిలినోల్లు యానాది, బుడబుక్కలోల్లను సేసుకుంటారేమోనని ముఖంపైనే ఉమ్ముతాండారు.”
అయినోళ్ల కాడ మొఖం ఎత్తే పరిస్థితి లేదు. పెద్ద పిల్లలిద్దరు నాకు చేదోడు వాదోడుగా ఉంటారనుకుంటి. ఇట్టా సేసి నన్ను సంపుతారు అనుకోలే. ఇప్పుడు మిగిలిన పిల్లోలిద్దరిని ఎవరు సేసుకుంటారు. వీల్లకి పెళ్ళిళ్ళు ఎలా సేయాలి.? కడుపులో పెట్టుకోవాల్సిన మాయమ్మే ఊరు ఊరంతా తిరిగి నా బతుకును రోడ్డుపాలు సేస్తాంది.
“నీ రెండో కూతురు కూడా మాదిగోనితో వేల్లిపోయిందే రంజాన్.” పోలీసోల్లు ఆ పిల్లగాని నెంబర్ కి నా ముందే ఫోన్ చేశారు. మన రెహాన మాట్లాడింది. మేమిద్దరం ఇష్టపడే వచ్చేసామని సెప్పింది. వాళ్ళు మాదిగోళ్ళు గనుక మనమేమి సేయలేమంట. ఆ పిల్లగాడు ముందుగానే మనపై కేసు కూడా పెట్టినాడు. మనమేదైనా అంటే మనల్ని కూడా జైల్లో ఏస్తారంటా అని జరిగిన విషయమంత భార్య రంజాన్ తో చెప్పుకొచ్చాడు.
మాయిబ్బి చిక్కిందే ఛాన్సు అని నేను చెప్తానే ఉన్నానా! మన పనికిమాలిన ముండే మాదిగోనితో పోయింటుందని. ఆడపిల్లోలను ఎలా పెంచాలో ఎంతలో పెట్టాలో చెప్తానే ఉండా. సమర్థ అయితానే ఘోష పెట్టురా అని మొత్తుకుంటి నా మాట వినికపోతివి. ఇప్పుడు చూడు నలుగురిలో ఇద్దరు ఇలా సేసినారు మిగిలినోళ్ళనైన జాగ్రత్తగా పెంచవే రంజాన్ అని తన సహజ ధోరణిలో వదురుతూనే ఉంది.
***
ఇద్దరు ఆడపిల్లలు అలా చేయడంతో వలి బయట తిరగడమే మానేశాడు. నమాజుకు పోవాలన్న కుదరడం లేదు. పెద్దపాప ఎరికిలోనితో లేచిపోయినప్పుడు వలి వెనుక చెవులు కొరుక్కున్న వాళ్ళు ఇప్పుడు వలి ముందే కూతుల్లిదరి గురించి అసహ్యంగా మాట్లాడుతుంటే తట్టుకోలేకపోతున్నాడు.
మొన్న బజారులో వలి చిన్ననాటి దోస్తు జాఫర్ కనపడి “ఏరా వలి నీ కూతుళ్ళకి సున్నత్ మొగోళ్ళు అంటే ఇష్టం లేదా హరామి గాళ్ళను సేసుకున్నారు.” తలెత్తుకొని ఎలా బతుకుతున్నవురా? మిగిలిన ఇద్దరిని పెంచడం నీ చేత కాదు గాని నా మాట ఇని వాళ్ళని మదరసాలో ఇడ్సిపెట్టుపో వాళ్ళైతే మన తరీఖ సెప్పి పెంచుతారని ఒక ఉచిత సలహా ఇచ్చాడు. ఇలా అయినోళ్ళు కానోళ్ళు ఇంట్లో ఉన్న ఇద్దరి ఆడపిల్లల గురించి చెప్తుంటే వలికి ఏం సేయాలో అర్థంకాడంలే.
నెలరోజులు అలోచించి ఇంట్లో ఉన్న ఆడపిల్లలిద్దరిని వేంపల్లి మదరసలో వదిలొచ్చాడు. రెండు నెలలుగా అంగడి తెరిసే పరస్థితి లేక ఇంట్లోనే ఉన్న వలి మళ్ళీ తన సైకిల్ రిపేర్ చేసే అంగట్లో పనిచేసుకుంటున్నాడు. జరిగిన విషయం గురించి పెద్దగా ఎవరూ మాట్లాడటం లేదు. మనుషుల్లో ఎంత మార్పు నెల కిందట నన్ను అదోలా చూసినోళ్ళు ఇప్పుడు ఏమీ తెలియకుండా ప్రవర్తిస్తున్నారు. మనుషుల స్వభావం ఇంతేనేమో అని మనసులో అనుకున్నాడు.
ఇంతలో వలి ఇంట్లో ఊహించని సంఘటన జరిగింది. అదే మాయిబ్బి మరణం. జాలాట్లో కాలు జారి కిందపడటంతో దవాఖానకు తీసుకుపోయేలోపే ప్రాణం ఇడిసింది. వలికి తల్లంటే ప్రాణం. తల్లి పాదాల కింద స్వర్గం ఉంటుందని నమ్మే వలి తల్లి మరణాన్ని తట్టుకోలేకపోయాడు.
***
తల్లి చచ్చిపోయి ఆరు నెలలు అయిపొయింది. ఇంట్లో వలి, రంజాన్ మాత్రమే ఉంటున్నారు. ఒకరి ముఖాలు ఒకరు సూసుకుంటూ కాలం వెళ్ళబుచ్చుతున్నారు. వలి పొద్దునే అంగడికి వెళ్ళిపోతే సాయంత్రానికి కాని తిరిగిరాడు. ఇంట్లో రంజాన్ ఒక్కటే ఉండలేకపోయింది.
ఏమండి! ఇల్లంతా బోసిపోయినట్టు ఉంది. అత్తగారు ఉన్నప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉండేవారు అట్టే పొద్దు పోయేది. బతుకున్నప్పుడు చూపు కనపడలేదని మొత్తుకునేది. ఇప్పుడు మనకు కానరాకుండా ఎల్లిపాయే. మదరసాకు పోయి పిల్లోలను తీసుకురాండి. కొన్నిరోజులు ఇంట్లో ఉండి పోతారని తన అభిప్రాయాన్ని సెప్పింది.
భార్య మాటలతో ఏకీభవించి మరుసటి రోజే వేంపల్లికి పోయి కూతుల్లిద్దరిని తీసుకువచ్చాడు. ఇల్లు మళ్ళీ కాస్త సందడిగా ఉందనుకుంటున్న సమయంలో రెండవ కూతురు మాయిబ్బి ఇంటికి వచ్చింది.
అబ్బాజాన్ మీరు తాత కాబోతున్నారు. నాకిప్పుడు ఏడో నెల ఆయన బాగా సూసుకుంటున్నారు. ఐదుపూటల కాకపోయిన రోజుకొకసారి నమాజు చేస్తున్నాడు. అప్పుడప్పుడు నేను కూడా చర్చికి పోయి ప్రార్థన చేస్తాండ. మీకు చెప్పేటంతటి దాన్ని కాదుకాని వాళ్ళ ప్రార్థన, మన ప్రార్థన రెండు ఒక్కటే నాన్న. మనం కట్టుకున్న గోడలే ఈ కులాలు మతాలు. ఇప్పటికీ నేనేమి తప్పు చేయలేదని నమ్ముతున్న. మీరు సమాజం గురించి కాకుండా మీ కూతురి గురించి ఆలోచించండి. తప్పేమైన మాట్లాడుంటే క్షమించండి. ఒకటి మాత్రం చెప్పగలను ఇంట్లో నుండి అలా వెళ్ళిపోవడం నాతప్పే కాని…, నాకు వేరే మార్గం లేకపాయే. అబ్బాజాన్ దయచేసి నన్ను అర్థం సేసుకొని మీరు నా గోద్ భరాకి వచ్చి ఆశీర్వదించండని తల్లితండ్రుల కాళ్ళపై పడింది.
చానా రోజుల తర్వాత బిడ్డను చూసిన ఆనందంలో రెహానాను రంజాన్ దగ్గరకు తీసుకొని తన క్షేమ సమాచారం అడిగి తెలుసుకొని జాగ్రత్తలు చెప్పింది.
చెల్లెల్లిద్దరు అక్కను హత్తుకొని ఎందుకు ఇలా చేశావే? అబ్బాజాన్ ఊళ్ళో వాళ్ళ ముందు తల ఎత్తుకోలేకపోతున్నాడని మందలించారు. రంజాన్ కలగజేసుకొని వదిలేయండి అదిప్పుడు కడుపుతో ఉంది. నిమ్మళంగా ఉండాలి. జరిగిందంతా గుర్తుచేసి తన మనసు పాడుసేయకండి అన్నది.
***
పుట్టింటిలో జరగాల్సిన గోద్ భరా (సీమంతం) పండుగ కంటికి రెప్పలా చూసుకునే భర్త, కన్నబిడ్డలా సూసుకునే అత్తమామల మధ్య మెట్టింట్లోనే జరుగుతోంది. చుట్టూ అందరూ ఉన్నప్పటికీ రెహానాకి ఒంటరిగా ఉన్నట్టే అనిపిస్తోంది. తెరలు తెరలుగా రాలుతున్న చీకట్లో గోద్ భరా జరుతున్నట్లు, ఎడారిలో పాదాల కింద జారుతున్న ఇసుకల, గుండెలో ఏదో తెలియని గుబులు. ఎంతమంది ఉన్నా ఈ సమయంలో అమ్మిజాన్ పక్కన లేకపోవడమే కారణం అయ్యుండచ్చు.
అబ్బాజాన్ రాకపోయిన అమ్మిజాన్ వస్తుందేమోనని ఎదురుచూస్తూ..,
పగలడానికి సిద్ధంగా ఉన్న కన్నీటిపొర వెనుక ఎన్నెన్ని దృశ్యాలో...!
“కంట్లో నిశబ్ద సముద్రం. కడుపులో కులమతాలకు అతీతమైన సూర్యుడు ఉదయించడానికి సిద్ధంగా...”
***