కామిని - ఎం.వి.ఎస్.ఎస్.ప్రసాద్

kaamini

“ఏమ్రో గింత పొద్దుగాల్నే వచ్చినవు .నిన్ను పోద్దుమూకి రమ్మన్నగదా.”అన్నాడు నర్సింగ్ యాదయ్యతో.

“మా సార్ తోలించిండు దొరా “అన్నాడు యాదయ్య సవినయంగా .

“ఎవడురా మీ సార్ !?నేనుండగా ఇంక వేరే సార్ ఎవడురా ?ఏ అవలాగాడుని సార్ అంటున్నావురా?.....వాడిని నా ముంగడే సార్ అంటావురా? “ అంటూ కళ్ళు ఎర్రజేసాడు నర్సింగ్.

“నీ కాల్ మొక్త...బాంచన్ దొర.సార్ అంటే మా పోరోల్లకి సదుం చెప్పే పంతులు దొరా. నీ కాల్ మొక్త...బాంచన్ దొర “ అన్నాడు యాదయ్య నర్సింగ్ కాళ్ళ మీద పడుతూ .

“అట్టాగా..సరే గింత జల్ది ఎందుకొచ్చినవురా ?” అన్నాడు నర్సింగ్ తన కోరమీసం మీద చేయి వేస్తూ .

“దొరా పోరగాల్ల ఇస్కూల్ల ఆటల పోటి పెట్టినరంట .ఆ దానికి నిన్ను తోల్క రమ్మన్నాడు సార్ “ అన్నాడు యాదయ్య .

అ మాట వినేసరికి మళ్ళీ అగ్గి మీద గుగ్గిలం అయ్యాడు నర్సింగ్.

“ ఏరా నీ పంతులికి నేను మరీ అంత బేవకుఫ్ గాడిలా కొడుతున్నానా ?నా అసువంటి వాడికి మందితో వచ్చి మన్ననగా చెప్పాలగాని నీలాంటోడితో చెపుతాడు!?నేను ఈ మండలానికే దొరనురా .నీ పంతులు ఒక బేకార్ ఇస్కూల్లో కొలువు చేస్తున్నడు .” అన్నాడు నర్సింగ్ కోపంగా .

“బాంచన్ దొరా ....సార్ కి బాగా జోరమొచ్చింది .ఇస్కూల్ కి ఇంకా రాలే ....సార్ మనందరికీ పెద్ద సార్ కి చెప్పిరా. నాకు పాణం బాగా లేదు.కొంచం మంచిగైతే ఆటలకి ఇస్కూల్ కి వస్తా అని చెప్పిండు దొరా “ అన్నాడు యాదయ్య వినయంగా .

“ ఫోన్ లో చెపితే ఆడి ముల్లె పోతాదా?”అన్నాడు నర్సింగ్ .

“అంత పెద్ద సార్ కి ఫోన్ చెయ్య అన్నాడు దొరా.అందుకే పోదుగాలే నన్ను తోలిచ్చినాడు దొరా ...నువ్వు చెప్ప ...అదేదో అన్నాడు దొరా ..యాదికొస్తల్లేదు”అంటూ బుర్ర గోక్కున్నాడు యాదయ్య .

“చీఫ్ గెస్ట్ రా “అన్నాడు నర్సింగ్ గర్వంగా .

“ఆ అదే దొరా “అన్నాడు యాదయ్య .

“నీ సార్ రాలే ..ఫోన్ చెయ్యలే ...అయినా మందికి లీడర్ ని కదా .నాకు తప్పుద్దా ? వస్తాలే.ఎన్ని గంటలకి?” అని అడిగాడు నర్సింగ్ .

“దొరా నువ్వు వచ్చినకే సురూ అని సార్ చెప్పిండు “అన్నాడు యాదయ్య .

“అంతేగా ...అంతేగా “అంటూ మీసం మేలేసాడు నర్సింగ్.

నర్సింగ్ మోతుబరి రైతు .అనువంశికంగా కొంత ఆస్తి వస్తే, బినామీగా చాలా సంపాదించాడు.ఇప్పుడు ఇరవయి తరాలు కుర్చుని తిన్నా తరగని ఆస్తిపరుడు.మర్డర్ లకు,మానభంగాలకు పెట్టింది పేరు నర్సింగ్.చాలా కేసుల్లో ముద్దాయి. అయితే అన్ని కేసుల్లోను సామ,దాన,బేధ ,దండోపాయాలు ప్రయోగించి సులువుగా బయటకు వచ్చేస్తూ ఉంటాడు . ఆ మండలంలో పెద్ద రాజకీయ నాయకుడు .అతనికి ఏ పదవి లేకపోయినా అన్నీ తనే అన్నట్టు వ్యవహరిస్తూ ఉంటాడు. అసలు అతని విలనీ సినిమాలో విలన్లని తల దించుకునేలా చేస్తుంది.

యాదయ్య అతనికి కుడి భుజం కాకపోయినా అస్మదీయుల్లో ఒకడు .పేకాటలో జోకర్లా నర్సింగ్ కి ఉపయోగిస్తూ ఉంటాడు . నర్సింగ్ కి అధికారులతో సమావేశాలు ఏర్పాటు చేయడం దగ్గరనుంచి అమ్మాయలని తార్చడం వరకు అన్ని పనులు ఎంతో విధేయతతో చేస్తాడు. దానికి ప్రతిఫలంగా డబ్బుతో సహా అనేక ఉపకారాలు పొందుతూ ఉంటాడు .

***

నర్సింగ్ స్కూల్ కి చేరేసరికి మధ్యాహ్నం మూడు అయ్యింది .ఉదయం పదకొండు గంటలనుంచి నర్సింగ్ కోసం అందరూ ఎదురు చూస్తున్నారు .నర్సింగ్ అంతకంటే ముందు వెళ్ళలేక కాదు .వెళ్ళకూడదని వెళ్ళలేదు. తనకోసం అందరు ఎదురు చూడాలని అహంకారం ,పైశాచికత్వం!? నర్సింగ్ ఆలస్యంగా రావడం వలన అన్నింటినీ కుదించి ,

నర్సింగ్ చేతుల మీదుగా పోటీలు నిర్వహించారు. బహుమతి ప్రధానోత్సవం జరిపించారు.

“ పంతులు మంచిగా చదువుకున్నడిలా ఉన్నావు.మరి గీ పోరాగాల్లతో ఏం లొల్లి పడతావ్ .మంచిగా సర్కారు కొలువు చూసుకోనేడిది ఉంది .పేరు? “ అన్నాడు నర్సింగ్.

“గణేష్..నాకు ఈ పోరాగాల్ని చదిమించి పెద్దోల్లను చెయ్యాలని దిల్ ఉంది “అన్నాడు గణేష్.

“మరి గీ పల్లెలో ఏమ్దింటావు ,ఏమి తాగతావ్.లగ్గం కూడా అయినట్టు లేదు ?” అని అడిగాడు నర్సింగ్ .

“లే సార్ .”అన్నాడు గణేష్ .

“ఏం మంచిగా పైసలున్న పోరి కొరకు దేవులడుతున్నావా పంతులు ?అసుంటోల్లకి పోరోడు జమీన్ ,బంగ్లాలు ఉన్నటోడు గావాలె.బడా సర్కారు నౌకరు అయి ఉండాలే .లేకుంటే మస్తుగా సంపాదించే డాక్టరో ,యాక్టరో గావాలే.అసువంటి పోరికి నువ్వు ఏం ఆంతావు పంతులు .ఏదో గంతకు తగ్గ బొంత అంటారు సూడు.గటువంటి పోరిని సూస్కో. మంచి పోరోడిలా ఉన్నావు .గీ తిండి తిని తబియత్ ఖరాబ్ చేసుకోకు. జల్ది లగ్గం చేస్కో“అన్నాడు నర్సింగ్ సలహా ఇస్తున్న ధోరణిలో.నర్సింగ్ దగ్గర శలవ తీసుకున్నాడు గణేష్ .

“అరె యాది.గాడ ఒక పోరి కూసుంది సుసినావారా?”అన్నాడు నర్సింగ్ అక్కడ స్కూల్లో కూచున్న ఒక యువతిని చూపిస్తూ .ఆమెకి షుమారు ఇరవై సంవత్సరాలు ఉంటాయి .బంగారు ఛాయ .గులాబీ రంగు చుడిదార్ ,పైజమా వేసుకుంది .ఎంతో అందంగా,ఆకర్షణీయంగా ఉంది .

“అవు దొరా .చూసినా .”అన్నాడు యాదయ్య .

“మంచి రంజుగుంది “ అన్నాడు నర్సింగ్ మీసం మెలి వేస్తూ .

“అవు .ఇస్కూల్ లో పంతులమ్మ కావచ్చు దొరా”అన్నాడు యాదయ్య సాలోచనగా .

“ఎవరైతే ఏమ్రా....ఒక రౌండ్ ఏసేదానికి “ అన్నాడు నర్సింగ్ ఆ యువతీ వైపు ఆకలిగా చూస్తూ ,చొంగ కార్చుకుంటూ .

“ ఒరే యాది జరంత వివరాలు గుంజుకురారా ...ఒల్లు తిమురుగా ఉంది . కాదు ఆ పోరిని అర్జంట్ గా తోల్కరా “

అన్నాడు నర్సింగ్ ఒళ్ళు విరుచుకుంటూ. యాదయ్య ఆ యువతి నిలబడిన వైపు వెళ్ళాడు .ఆమె యాదయ్యతో నర్సింగ్ దగ్గరకి వచ్చింది.

“ దొరా ఆ పోరి గీ ఊరికి కొత్తగా వచ్చింది .కొలువుకి దేవులాడుతోందట దొరా “ అన్నాడు యాదయ్య .

“అయితే కొలువు , నీడ ,పడక అన్ని మన దగ్గరే “ అన్నాడు నర్సింగ్ విషపు నవ్వు నవ్వుతూ .

“సార్ మన మండలానికి ...మండలానికేంది జిల్లాకే పెద్ద సార్...నీకు కొలువు,నీడ,ఇంకేది గావాలన్నా మా సార్ సూస్తడు.”అన్నాడు యాదయ్య అర్థవంతంగా ,వెకిలిగా నవ్వుతూ .

“ అవు.నువ్వు బయంపట్టక్.నేనుండగా నీకు బేఫికర్ .నాతో దోస్తీ జేసిన్వనుకో నీ లైఫ్ బిందాస్.నీ పేరేంది పోరీ? “

అన్నాడు నర్సింగ్ యువతికి దగ్గరగా జరుగుతూ . యువతి కంగారుగా దూరం జరిగి నుంచుంది.

“ నా పేరు రజిత.చిన్నతనాన తల్లిదండ్రులు ఆక్సిడెంట్ లో పోయారు సార్. కామర్స్ లో పీ.జీ. చేశాను.ఇక్కడ మా మామ ఉన్నాడు .వాళ్ళింటికి వచ్చాను .ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నాను “ అంది ఆ యువతి.

రజిత మాట తీరులో ,వేష బాషలలో ,మనిషిలో హుందాతనం ఉట్టి పడుతున్నాయి .

“రజిత మంచి పేరు.నీకు గీ పల్లెలో ఏం కొలువు దొరుకుతుందనుకున్నావు? అయితే ఈ నర్సింగ్ తలుసుకుంటే కొలువే గాదు ,ఉండడానికి పెద్ద బంగ్లా బీ నీదవుతది”అన్నాడు నర్సింగ్ మీసం మెలేస్తూ,రజిత వైపు కోరికగా చూస్తూ .

“స్కూల్లో టీచర్ ఉద్యోగం ఒకటి ఉంది అన్నారు సార్.అందుకు వచ్చాను “అంది రజిత .

“అంత సదు చదివి పంతులమ్మ అవుతావ్ ?నీకు దొరసానిలాంటి కొలువు సూపిస్త.మా బంగ్లాకి రా “అంటూ చనువుగా రజిత చెయ్యి అందుకోబోయాడు నర్సింగ్. రజిత వేటగాడిని చూసిన లేడిలా పరిగెత్తింది .

“ఏందిరో పోరి అలా దౌడాయించింది?”అన్నాడు నర్సింగ్ .

“ పోరి ఎక్కడకు పోతది దొరా ?నీ కౌగిలకి తోల్కొస్తా .గిక్కడే ఉంటది గందా .ఆ మామ ఎవడో ఏందో నేను చూస్త.సారూ నువ్వేం పరేసాను గాకు .పోరి నీదే .నువ్వేం పరేషాన్ గాకు.”అంటూ నర్సింగ్ కి ఆశ కల్పించాడు యాదయ్య.

రోజులు వేగంగా నడుస్తున్నాయి .యాదయ్య రజిత గురించి వాకబు చేయసాగాడు . రజిత ,నర్సింగ్ చూసిన ఊళ్ళో స్కూల్లో, టీచర్ గా చేరిందని,ఆమె ఇల్లు అద్దెకు తీసుకుని వంటరిగా ఉంటోందని తెలిసింది .అలాగే అక్కడే ఉపాధ్యాయిడిగా పని చేస్తున్న గణేష్ తో పరిచయం పెంచుకుంది . రజిత,గణేష్ ల మధ్య ప్రేమ చిగురించింది . పెద్దల అనుమతితో, పెళ్ళి చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చారు. విషయాలు నర్సింగ్ కి చేరవేసాడు యాదయ్య .

“ఏంది ఆ గణేష్ గాడు పోరిని పట్టిండా!? “నర్సింగ్ మాటలలో ఏదో నిరాశ ధ్వనించింది .ఇక ఆలస్యం చేయకూడదు అనుకున్నాడు. రజిత ఇంటికి వెళ్ళి, ఎవ్వరూ లేని సమయంలో, రజితని బలాత్కారం చేయడానికి ప్రయత్నం చేసాడు.

రజిత చాలా భయపడింది .విషయం తెలుసుకున్న గణేష్ రజితకి ధైర్యం చెప్పాడు . నర్సింగ్ లాంటి మృగాలు ప్రపంచం అంతా ఉంటాయని, తెలివిగా , ధైర్యంగా వాటినుంచి తప్పించుకోవాలని జెప్పాడు.

ఆ తరువాత కొన్నాళ్ళకి రజితకి దెయ్యం పట్టిందని, తరుచూ శ్మశానంలో తిరుగుతోందని ఊరి జనం చెప్పుకోసాగారు. విషయం యాదయ్య రంజిత్ కి చేరవేసాడు .

“దెయ్యం పట్టిందా !?యాది ఈ రోజుల్లో కూడా దెయ్యాలు ఉన్నాయంటావురా!?” అన్నాడు నర్సింగ్ గొంతులో భయం ధ్వనిస్తుండగా .

“ఉన్నాయి దొరా ....అసలు రజిత శ్మశానంలో కంటపడ్డప్పుడు నెత్తిన మంటలు గోల్గా తిరుగుతాయట సారూ. అమవాస్స దినం రజిత శ్మశానంలో తప్పక కండ్ల పడుతుండట “అన్నాడు యాదయ్య భయంగా .

“నేను నమ్మనురా ....ఇసువంటివన్నీ పుకార్లు .ఎవరో అవులగాల్లు అంటే మంది నమ్ముతారు .మందికి దేముడి కంటే దెయ్యం అంటేనే బయం ఎక్కువ .” అన్నాడు నర్సింగ్ ధైర్యం తెచ్చుకుంటూ .

“మనకు అసువంటి పోరి వద్దు దొరా . అన్నాడు యాదయ్య .

“ యాది...ఆ పోరి నాకు కావాలి .దాన్ని పొందాలిరా..ఉండు నన్ను సోచాయించనీ”అన్నాడు నర్సింగ్ సాలోచనగా .

* * *

ఆ రోజు ఆదివారం .అమావాస్య .నర్సింగ్ ఇంట్లో , నర్సింగ్ చేత , పూజలు చేయించే పంతులు ఏవేవో వింత,విచిత్రమైన పూజలు చేయించాడు .“ఇక పోరి నీదే దొరా.”అన్నాడు పంతులు . ఆ రోజు శ్మశానానికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు నర్సింగ్ .

రాత్రి నర్సింగ్ , పూజలు చేయించే పంతులు,యాదయ్య శ్మశానంలో ఒక చెట్టు చాటున నక్కి , ఊపిరి బిగపట్టి కూర్చున్నారు. అక్కడ కీచురాళ్ళు చేసే ధ్వని దెయ్యాలు ఊళలు వేస్తున్నట్టుగా భీతి గొల్పుతోంది . నిమషాలు గడుస్తున్నాయి .కాని ఎక్కడా ఎటువంటి అలికిడి లేదు . ముగ్గురూ ఆశగా ఎదురు చూస్తున్నారు .

హఠాత్తుగా దగ్గరలో అడుగుల సవ్వడి వినిపించసాగింది . చూస్తుండగానే తెల్లని చీర కట్టుకుని ,

జుట్టు విరబోసుకుని, రజిత వాళ్ళకు దగ్గరగా వచ్చి నుంచుంది . ముగ్గురికీ తమ గుండె చప్పుడు తమకే స్పష్టంగా వినిపిస్తోంది .ఒంటినిండా రోమాలు నిక్కపోడుచుకున్నాయి. భయంగా రజిత వైపు చూడసాగారు .అంతలో రజిత జుట్టు వింత వెలుగులతో, మెరుస్తూ ,ఎగర సాగింది . చిత్రంగా అక్కడ ఏ గాలీ లేదు.కనీసం ఆకు కూడా కదలడం లేదు .క్షణ క్షణానికి రజిత జుట్టు రంగులు మారసాగింది.తుఫాను గాలికి ఎగిరినట్టుగా జుట్టు ఎగిరి పడుతోంది . హఠాత్తుగా రజిత నోటి నుంచి ఒక వెర్రి కేక వినిపించింది .అంత గట్టిగా అరవడం మనవ మాత్రులకు సాధ్యం కాదు !!??భయంతో బిగుసుకుపోయి సృహ కోల్పోయారు ఆమెని చూస్తున్న ముగ్గురూ .వాళ్ళు కళ్ళు తెరిచి చూసేసరికి బాగా తెల్లవారింది. చుట్టూ జనం మూగి ఉన్నారు .

‘జిన్దగితోనే ఉన్నార్.దావఖానలో సేరిక చేయండి ‘అన్నారెవరో .కొంతసేపటికి ఆసుపత్రిలో పడుకున్నారు నర్సింగ్, పంతులు ,యాదయ్య.వాళ్ళు మామూలు మనుషులు కావడానికి నెలలు పట్టింది. ఆ తరువాత నర్సింగ్ పరాయి స్త్రీలను కాదు కదా కట్టుకున్న భార్యను కూడా కన్నెత్తి చూసే సాహసం చేయలేకపోయాడు !!?

‘అందని ద్రాక్ష పుల్లన అంటారు .కానీ ఇప్పుడు అందని పోరి దెయ్యం అన్నమాట ‘అని జీవితాంతం బాధ పడుతూ,భయపడుతూనే ఉన్నాడు నర్సింగ్ .

జరిగినది ,ఆ ఊరిలో ఉన్న కొంత మంది గుంటనక్కల ,నర్సింగ్ లాంటి మానవ మృగాల,మనిషి రూపంలో ఉన్న కామ పిశాచాల, బారినుంచి రజితని రక్షించడానికి,తన కంప్యూటర్,రజిత మెడ మీద ఉంచిన చిన్న పరికరం సాయంతో, గణేష్ చేసిన సూపర్ ట్రిక్ అనీ, రజిత కంప్యూటర్ కామిని అనీ ఎవరికీ ఎప్పడికీ తెలిసే అవకాశం లేదు.

మరిన్ని కథలు

Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaalani kaagitam
కాలని కాగితం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు