“గంటకి వెయ్యి రూపాయలు ఇస్తాడుట.అసలు అది నోరా తాటిపట్టా?ఒకపక్క కాటికి కాళ్ళు చాపుకుని కూచున్నాడు .ఏ క్షణాన చస్తాడో అతనికే తెలియదు . కానీ చావు తెలివితేటలకు మాత్రం తక్కువ లేదు. ఈ వయస్సులో ,ఈ పరిస్థితులలో అమ్మాయిలు కావాల్సి వచ్చారా ? అదీ పడుచు అమ్మాయిలు . అందరినీ డబ్బు అవసరం ఉన్న వాళ్ళని ఎంచుకుంటాడు .తన శారీరక వాంఛలు తీర్చుకుంటాడు .ఛీ!! ఛీ!! మనిషిని చూస్తేనే ...అసలు తలుచుకుంటేనే కంపరం పుడుతోంది .”అంది అశ్వని.
“ఏమిటి అశ్వనీ !?ఎవరి గురించి నువ్వు మాట్లాడుతున్నది !?”అని అడిగింది స్రవంతి .
“ఇంకా ఎవరో అయితే నీ దగ్గర ఎందుకు అంటాను ? నువ్వు అస్తమాను “మా బాబయ్య ..మా బాబయ్య” అంటూ ఉంటావే ఆ మీ బాబయ్య గురించే నేను మాట్లాడేది .”అంది అశ్వని .
“ఎవరు అశ్విని!?...మా బాబయ్య గురించా ?మా మూర్తి బాబయ్య గురించా !? చిన్నప్పుడు మేం వాళ్ళ ఇంటి పక్కన ఉండేవాళ్ళం.నేను అస్తమానం బాబయ్యా..బాబయ్యా అంటూ వాళ్ళ ఇంటిలోకి వెళ్ళేదాన్ని నాకు బాగా దగ్గర అయ్యాడు మా మూర్తి బాబయ్య . అతనిని గురించా నువ్వు అంత అన్యాయంగా మాట్లాడేది!? ” అంటూ అశ్వని మాట్లాడేది ఏమిటో అసలు అర్థం కానట్టు మొహం పెట్టింది స్రవంతి .
“అవును తల్లీ .ఆ మహానుభావుడి గురించే నేను మాట్లాడేది .అతను నీ దృష్టిలో ఏమీ తెలియని అమాయకుడు కావచ్చు .కానీ వారం రోజుల క్రితం నా కళ్ళ ఎదుటే ,ఇదే పార్కులో, మీ బాబయ్య ,పాపం ఒక అమ్మాయితో అసహ్యంగా మాట్లాడుతుంటే విన్నాను .నాకు తెలియక అడుగుతాను స్రవంతీ మీ పిన్ని పోయి ఎన్నాళ్ళు అయింది ?” అంది అశ్వని .
“సంవత్సరం అయి ఉంటుంది అశ్విని ....అన్నయ్యలు ఇద్దరూ అమెరికాలో ఉంటున్నారు.పిన్ని పోయినప్పుడు వచ్చిన వాళ్ళు ,అన్నికార్యక్రమాలు అయిపోయిన తరువాత , బాబయ్యని తనతో రమ్మన్నారుట.పాపం ఈ వయస్సులో, పిన్ని పోయిన దుఃఖంలో ఉన్న బాబయ్య ,ఒంటరిగా ఉండలేక వాళ్ళతో వెడదామనుకున్నాడు.కాని వదినల మాటలలో, వాళ్ళ మనోభావాలు గ్రహించిన, బాబయ్య రానని, పిన్ని జ్ఞాపకాలతో స్వంత ఇంట్లోనే కాలక్షేపం చేస్తానని చెప్పాడట.ఇక చేసేదిలేక,బాబయ్యని జాగర్తగా చూసుకోమని మా అందరికీ చెప్పి అమెరికా వెళ్ళిపోయారు వాళ్ళ పిల్లలు ” అంది స్రవంతి.
“భార్య లేదు .అడిగే కొడుకులు లేరు .బహుశా అప్పడినుంచి మీ బాబయ్య విచ్చలవిడితనం మొదలు అయ్యినట్లుంది “ అంది అశ్విని అసహ్యంగా మొహం పెట్టి .
"అశ్వని అంత అన్యాయంగా మాట్లాడకు .మా బాబయ్య దేవుడు.” అంది స్రవంతి .
“మీకు దేవుడు అయి ఉండవచ్చు .కాని పేద అమ్మాయిల పాలిట దెయ్యం “ అంది అశ్వని కటువుగా .
“అశ్వనీ .నీకు బాబయ్య గురించి ఏమీ తెలియకుండా మాట్లాడుతున్నావు.మా బాబయ్య గురించి వింటే నువ్వు నీ అభిప్రాయం తప్పక మార్చుకుంటావు ”
“నాన్సెన్స్ ...నాకు ఈ గోముఖవ్యాఘ్రాలు అంటే ఏ మాత్రం గౌరవం లేదు .నిజం చెప్పాలంటే పైకి రౌడిలలా కనిపిస్తూ ఉండే గుండాల కంటే, పైకి ఎంతో అమాయకంగా నటిస్తూ,తడి గుడ్డలతో గొంతు కోసే, మీ బాబయ్య లాంటి వాళ్ళ వల్ల ఈ సమాజానికి నష్టం “అంది అశ్విని . “అశ్వినీ “అని గట్టిగా అరిచింది స్రవంతి .
“నువ్వు గనుక బాబయ్య గురించి అంత మాటలన్నా భరించాను......అదే ఇంకో ఎవరన్నా అని ఉంటే ఈ పాటికి వాళ్ళ రెండు చెంపలు వాయించేసే దాన్ని “అంది స్రవంతి కళ్ళల్లో నిప్పులుగక్కుతూ.
“అశ్వినీ ...దయచేసి నేను చెప్పేది పూర్తిగా విని...అప్పుడు కూడా నీ అభిప్రాయం మార్చుకోలేకపోతే నీ ఇష్టం” అంటూ తన మూర్తిబాబయ్య గురించి చెప్పడం మొదలు పెట్టింది స్రవంతి
..............................
అదొక కుగ్రామం .పేరు రామాపురం .అక్కడ రామనాధం బడిపంతులుగా బతుకుతున్నాడు .రామనాధం తన తండ్రికి ఒక్కడే కొడుకు .తండ్రి నుంచి ఆస్తులు ఏవీ రాలేదు ఆయనికి .పైపెచ్చు తండ్రి చేసిన అప్పులు వారసత్వంగా పొందాడు.రామనాధానికి జీతం తక్కువ. నీతికి ,నిజాయితీకి మారుపేరు అయిన ఆయన పిల్లలకి ప్రైవేట్లు చెప్పడం తప్పని ,ఆ చెప్పేదేదో స్కూల్లో సరిగ్గా చెప్పాలని తోటి ఉపాధ్యాయులకి చెపుతుండేవాడు . అయన మాటలని వాళ్ళు చాదస్తంగా కొట్టి పడేసే వారు . సహజంగా రామనాధం ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటూ ఉండేది .ఆయన భార్య సీత సహనానికి మారుపేరు .వాళ్ళకి ఇద్దరు కొడుకులు .పెద్దవాడు భాను ,చిన్నవాడు రమణమూర్తి .తన భర్తకి వచ్చే జీతం డబ్బులతో గుట్టుగా సంసారం నెట్టుకొస్తూ ఉండేది సీత.
భాను,రమణమూర్తి మంచి తెలివిగల వాళ్ళు.అయితే ఈ ప్రపంచంలో తెలివిగలవాళ్ళు అందరూ జీవితంలో పైకి వస్తారని, తెలివి తక్కువవాళ్ళు అందరూ విఫలం అవుతారని ఎక్కడా లేదుకదా !?రామనాధం తనకి శక్తికి మించినదే అయినా భాను ఏం చదువుకుంటానంటే అది చదివించాడు . భాను మంచి చదువులు చదువుకుని ,పెద్ద ఉద్యోగం సంపాదించాడు.అలాగే ఆ ఊరికి దూరంగా ఉన్న సిటీకి వెళ్ళిపోయాడు. తండ్రి ఆర్థిక పరిస్థితి , ఆరోగ్య పరిస్థితి సరిగ్గా లేకపోవడంతో రమణమూర్తి తన తెలివితేటలకి తగ్గ చదువు చదవలేకపోయాడు . డిగ్రీ అయ్యింది అనిపించి ఆ ఊరికి దగ్గరలోనే ఒక ప్రైవేటు ఉద్యోగం సంపాదించాడు .
భాను, కనీసం తల్లిదండ్రులకు చెప్పకుండా,తనకి నచ్చిన అమ్మాయిని పెళ్ళిచేసుకున్నాడు .పెళ్ళి అయిన తరువాత ఆరు నెలలకు తన భార్యతో సహా రామాపురం వచ్చాడు భాను.
రామనాధం చాలా బాధ పడ్డాడు . “తలిదండ్రులు బతికి ఉన్నారు . కనీసం ఒక మాటన్నా వాళ్ళకి చెప్పొద్దా? “అని కొడుకుని అడిగితే “అసమర్దులైన తల్లిదండ్రులు ఉన్నా ఒకటే .లేకపోయినా ఒకటే “ అని అర్థంలేని మాట మాట్లాడి తల్లిదండ్రులను, భార్య ముందు ,చులకన చేసాడు భాను .సీతకి భాను చేసిన పనికి, తన భార్య ముందే, అగౌరవంగా మాట్లాడిన తీరుకి చాలా బాధ కలిగింది .ముందు చెప్పకపోతే పోనీ కనీసం పెళ్ళి అయిన వెంటనే కోడలిని ఇంటికి తీసుకు రాలేదు ఏమిటని అడిగింది .
“కోడలు ఒక రోజు కట్టే డ్రెస్ అంత ఖరీదు చేయని జీతం సంపాదించే తండ్రి ఇంటికి ఎందుకు తీసుకు రావాలి?” అడిగిన కొడుకుని, ఎప్పుడూ శాంతంగా ఉండే సీత ,కోపంగా , ఆ క్షణమే ఇంట్లోంచి పొమ్మంది.రోగి, వైద్యుడు పాలే కోరినట్లు అనిపించింది,వచ్చినప్పటినుంచి అంత వరకు ముళ్ళ మీద కూచున్నట్లు ఉన్న భానుకి , అతని భార్యకి.సీత మాటలు ఇంకా నోటినుంచి పూర్తిగా బయటకు రాకుండానే ఇద్దరూ ఇంట్లోంచి బయలుదేరారు .
వెళ్ళిపోతున్న వాళ్ళని చూస్తూ ఏడవసాగింది సీత.ఎంతన్నా కన్నపేగు బంధం .అంతవరకు నిర్వికారంగా కూచున్న రామనాధం భార్యని ఓదార్చాడు .
“ మనం బిడ్డలను కనగలంగాని వాళ్ళ తలరాతలని కనలేం కదా సీతా “అన్నాడు రామనాధం .
“వాడు చూడండి నాకు బతికి ఉండగానే చితికి నిప్పు పెట్టివెళ్ళిపోయాడు”” అంది సీత బాధ పడుతూనే .
“పిచ్చిదానా అటువంటి కొడుకు కొరివి పెడితే మనం పున్నామ నరకం నుంచి తప్పించుకోలేం .తిన్నగా నరకంలోకి పోతాం .అలాంటి వాడు కొరివి పెట్టకపోతేనే మనకి ఉత్తమ గతులు లభిస్తాయి.బాధపడకు .వాడు ఇక మనకి లేడనే అనుకో “అన్నాడు రామనాధం తనకి కూడా కడుపులోంచి తన్నుకొస్తున్న బాధని, దుఃఖాన్నీ అణుచుకుంటూ .
భార్యాభర్తలు, ఒకరిని ఒకరు ఓదార్చుకుంటూ, చాలాసేపు అలాగే కూచుండిపోయారు .
రమణమూర్తి అక్కడే ఉన్నా వాళ్ళని ఓదార్చే ప్రయత్నం చెయ్యలేదు .ఎందుకంటే వాళ్ళ హృదయభారం తగ్గకపోతే ప్రమాదం అనిపించింది అతనికి .
రోజులు గడుస్తున్నాయి .చిన్నకొడుకు రమణమూర్తికి పెళ్ళి చేసి ,కొడుకుని, కోడలని దగ్గర పెట్టుకోవాలనే ఆలోచన వచ్చింది సీతకి .ఆ విషయమే తన భర్తతో అంది .
“ మా తమ్ముడి కూతురు రజనిని చేసుకుంటే బావుంటుంది .చుట్టరికం కలుస్తుంది.అలాగే కావాల్సిన పిల్ల కనుక వాడిని ,మనలనీ కూడా ప్రేమగా చూస్తుంది .ఏమంటారు ? “అంది సీత .
“ నీ ఆలోచన బాగానే ఉంది.కానీ సీతా ఇవి పాతరోజులు కావు.మన వాడికి ఇష్టం ఉందో లేదో ?అలాగే అమ్మాయిని కూడా ఒకసారి అడగాలి కదా ? “ అన్నాడు రామనాధం .
“అబ్బ అమ్మాయి సంగతి నాకు వదిలెయ్యండి .దానికి రమణ అంటే ఇష్టమని చూచాయగా తెలిసింది. కనుకనే నేను ఈ సంగతి ప్రస్తావించాను “అంది సీత. అక్కడే ఉన్న రమణమూర్తి అది విన్నాడు .
“అమ్మా .మామయ్య గారి అమ్మాయిని చేసుకోవడం నాకు ఇష్టమే .”అన్నాడు .
“సంతోషంరా రమణా .ఇప్పుడే మీ మామయ్య చేత నాన్నగారికి ఫోన్ చేయిస్తాను.ఎంత మనకి ఇష్టమైనా అది పద్ధతి .మనం ఎదురు అడగకూడదు ”అంది సీత సంతోషంగా .
కళ్యాణం వచ్చినా ,కక్కు వచ్చినా ఆగదు అంటారు పెద్దలు . మూర్తి బాబయ్యకి ,రజిని పిన్నికి పెళ్లి అయ్యింది.
బాబయ్యకి చూస్తుండగా ఇద్దరూ అబ్బాయిలు పుట్టుకు వచ్చారు.
రామనాధం గుండెపోటుతో కన్నుమూసాడు .సీత ఏడిచినది ఏడిచినట్టే ఉంది .ఆమెని ఓదార్చడం ఎవ్వరి తరం కాలేదు .తను ఒకపక్క బాధ పడుతూనే ,తల్లిని ఓదార్చే ప్రయత్నం చేసాడు రమణమూర్తి .
పెళ్లి తరువాత తల్లిదండ్రులతోనూ , తమ్ముడితోనూ ,అన్ని సంబంధ బాంధవ్యాలు వదులుకున్న భాను ఫోన్ నెంబర్, అతి కష్టం మీద సంపాదించి, అన్నగారికి ఫోన్ చేసి విషయం చెప్పాడు రమణమూర్తి.
“నేను వచ్చి చేసేది ఏముంది ?నువ్వే కానిచ్చేయి “అంటూ,రమణమూర్తి కి , ఇంకో మాట మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా ,ఫోన్ పెట్టేసాడు భాను.
రమణమూర్తి తండ్రికి అన్ని కార్యక్రమాలు యధావిధిగా చేసాడు .
సీతకి ఏం తొందర వచ్చిందో రామనాధం పోయిన ఆరునెలలు తిరక్కుండా భర్తని వెతుక్కుంటూ వెళ్ళిపోయింది.రమణమూర్తి చిన్న పిల్లాడిలా ఏడ్చాడు .నిజం చెప్పాలంటే రమణమూర్తి ఇద్దరూ పిల్లలు తండ్రి అయినా కూడా ఇంకా పసి మనస్తత్వం .తల్లిదండ్రులంటే అవాజ్యమైన ప్రేమ కలవాడు . రమణమూర్తిని భార్య, కొడుకులు ఓదార్చారు . కాలం వేగంగా పరిగెడుతూ ఉంది .
రమణమూర్తి పిల్లలు ఇద్దరూ పెద్దవాళ్ళు అవ్వడం ,ఉద్యోగాలు రావడం ,పెళ్ళిళ్ళు అవడం జరిగి పోయింది.
కొడుకులు ఇద్దరూ అమెరికాలో స్థిర పడ్డారు . తల్లిని,తండ్రిని తమతో రమ్మన్నారు . కానీ చిన్నప్పడినుంచి పుట్టి పెరిగిన ఇంటిని,ఊరిని వదిలి రాలేనని బాబయ్య అంటే,బాబయ్యని వదిలి వచ్చే ప్రశ్నే లేదని పిన్ని చెప్పింది .
........................................
“అశ్వనీ ఇంతవరకు నీకు చెప్పిన కధ మా బాబయ్య నాకు ఒకసారి ఏదో సందర్భంలో చెప్పినది.ఇక ముందు చెప్పబోయేది నేను చూసినది ,విన్నది “ అంది స్రవంతి .
“ఓరినీ !! నీ కధకి ఇంటర్వెల్ కూడా ఉందన్నమాట !!??కానీ సెకండ్ పార్ట్ “ అంది అశ్వని నవ్వుతూ.
స్రవంతి మళ్ళీ చెప్పసాగింది
..........................................................................................
బాబయ్య రిటైర్ అయిపోయాడు .బాబయ్య, పిన్ని ఇద్దరూ సరదాగా కాలం గడుపుతూ ఉన్నారు.
బాబయ్య జీతం , ఆదాయం తక్కువ అయినా, అతని కొడుకులు అమెరికాలో రెండు చేతులా సంపాదిస్తున్నారు . మూర్తి బాబయ్య కొడుకులు,తమ తల్లిదండ్రులు,తమ చిన్నప్పడినుంచి,ఆర్ధికంగా ఎన్నో ఇబ్బందులని ఎదుర్కోవడం చూసారు. కనుక కనీసం అప్పుడు , తల్లిదండ్రులు ,ఆర్థికంగా ఇబ్బంది పడకూడదని, తండ్రికి పుష్కలంగా డబ్బు పంపించడం ప్రారంభించారు .
“మాకు ఎందుకురా అంత డబ్బు పంపిస్తున్నారు ? “ అని బాబయ్య వద్దన్నా వినలేదు .
“హయిగా ఖర్చు పెట్టుకోండి “అంటూ అన్నదమ్ములిద్దరూ పోటీ పడి పంపించసాగారు.
బాబయ్యకి అంత డబ్బు ఏం చేసుకోవాలో తెలియలేదు. పుణ్య తీర్థాలు తిరుగుదామని పిన్ని సలహా ఇచ్చింది . బాబయ్య ఒప్పుకున్నాడు . ఇద్దరూ కలిసి నెలరోజులపాటు పుణ్యతీర్థాలు తిరిగారు . అన్ని చోట్ల ఎన్నో రకాల దానధర్మాలు చేసారు .
బాబయ్యకి ,తను బాల్యంలో పడ్డ కష్టాలు పడకుండా, కనీసం కొంతమందినన్నా కాపాడుదామనే ఆలోచన వచ్చింది .అనేక స్కూళ్ళలో విద్యార్ధులకు తల్లిదండ్రుల పేరిట స్కాలర్షిప్ ఏర్పాటు చేసాడు .అలాగే కొంతమందికి పిల్లలకి ఉచిత భోజనాలు ఏర్పాటు చేసాడు . పేద పిల్లలకి స్కూల్ ,కాలేజీ ఫీజు ,హాస్టల్ ఫీజు, మెస్ చార్జెస్ లాంటివి చెల్లించడం మొదలు పెట్టాడు. పిన్ని ఒక రోజు నిద్రలోనే చనిపోయింది.కొడుకులిద్దరు అమెరికా నుంచి ఆఘమేఘాల మీద వచ్చారు .జరగవలిసినవన్నీ జరిగాయి . నేను ఇందాక చెప్పాను కదా? కొడుకులు బాబయ్యిని అమెరికా రమ్మన్నారు .బాబయ్య వెళ్ళలేదు . వంటరి వాడయిపోయాడు. బోలెడు డబ్బు మూలుగుతోంది . కానీ ఇంట్లో మాట్లాడే దిక్కు లేకపోయింది. అనుక్షణం పిన్ని గుర్తుకు వస్తుండేది .”రజని ...రజని “ అని పిన్నిని కలవరించేవాడు .పిన్ని పోయిన కొత్తలో నేను రెండు, మూడు సార్లు వెళ్ళాను.వెళ్ళినప్పుడల్లా కొన్ని రోజులు ఉండేదానిని .కానీ మన సంసారాలు వదలుకుని ఉండలేం కదా? క్రమంగా వంటరితనంతో బాబయ్య దాదాపు పిచ్చివాడయిపోయాడు.
ఏ దేవుడో చెప్పినట్లు బాబయ్యకి ఒక వింత ఉపాయం తోచింది .తనతో ఎవరైనా మాట్లాడితే డబ్బు ఇస్తానని ఆశ చూపించడం ప్రారంభించాడు . అయితే కేవలం పేదవాళ్ళని,నిజంగా డబ్బు అవసరం ఉన్న వాళ్ళని ఎంచుకునేవాడు. మొదటిలో జనం ఎవరూ అతని మాటలు నమ్మలేదు. పిచ్చివాడు అనుకునే వారు.అతని దగ్గరకు వెళ్ళడానికి భయపడేవారు కూడా .తరువాత మెల్లిగా జనం డబ్బుకోసం బాబయ్యతో మాట్లాడడం మొదలు పెట్టారు!! వింతగా అనిపించినా అది నిజం అశ్వినీ . బాబయ్యకి కాలక్షేపం అయ్యేది .అలాగే డబ్బు కావాల్సిన వాళ్ళకి ఆ రూపంలో డబ్బు సాయం చేసే వాడు.అతను సహాయం చేసే వాళ్ళలో అడా,మగా, చిన్నా ,పెద్దా అందరూ ఉండేవారు
...................................
మళ్ళీ వర్తమానం లోకి వచ్చింది స్రవంతి.
“ అయన గుండెపోటుతో చనిపోయి నాలుగు రోజులు అయ్యింది ” అంది స్రవంతి కళ్ళమ్మట నీళ్ళు తిరుగుతుండగా .
“ అయ్యో!! నిజమా !? నన్ను క్షమించు స్రవంతి .ఉత్తమజాతి వజ్రాన్ని చూసి బొగ్గు ముక్క అనుకున్న మూర్ఖురాలిని. జనం ఇప్పుడు మోసాలు చెయ్యడానికి కొత్త పద్ధతులు నేర్చుకుంటున్నారు .కానీ సహాయం చెయ్యడానికి కూడా నూతన విధానాలు ఎంచుకునే మీ మూర్తి బాబయ్య లాంటి వాళ్ళు ఉంటారని ఊహించలేకపోయాను”అంటూ తలదించుకుంది అశ్వని