నాంచారమ్మ వంట నక్షత్ర దర్శనం - ఎం బిందుమాధవి

Nancharamma Cooking Star Darshan

చిట్టెమ్మకి ఆ రోజు త్వరగా మెలకువ వచ్చింది. కాఫీ కప్పు చేత్తో పుచ్చుకుని, "ఇంకా ఆరే అయింది...ఇంటి పనిప్రారంభించటానికి ఇంకా బోలెడు టైముంది, కాఫీ తాగటం పూర్తయ్యేలోపు... రెండు నిముషాల్లో పై పైన విహంగవీక్షణంగా వాట్సాప్ మెసేజిల్లో ఫ్రెండ్స్ ని పలకరించి, ముఖ పుస్తకాన్ని ఓ సారి దర్శించేసి, ఇంటి పనిలో పడచ్చు" అనిగట్టిగా సంకల్పించుకుని సెల్ ఫోన్ అందుకుంది.

"లాక్ డౌన్ సమయంలో ఇల్లు చిమ్మటం, అంట్లు తోమటం అలవాటైన ఓ అధికారి ఆఫీస్ కి వెళ్ళి తన పనేమిటోమర్చిపోయి మూలనున్న చీపురు చేత పట్టటం"

"ఇంటికొచ్చిన వారికి కాఫీకి బదులు కషాయాలివ్వటం"

"కార్ డ్రైవింగ్ మరచిపోయి కీ పెట్టకుండా కార్ స్టార్టవ్వట్లేదు అని మెకానిక్ ని పిలవటం"

"పట్టు చీరలు కట్టుకెళ్ళే సందర్భాలు లేక..ఇంట్లో నైటీలే వేసుకునే అలవాటున్న పంకజాక్షులు ఇంటికెవరో వస్తే గబ గబాలోనికెళ్ళి నైటీ మీద పట్టు చీర కట్టుకు రావటం". ఇత్యాది విషయాల మీద పుంఖానుపుంఖాలుగా చెలామణి అవుతున్నజోకులు చదువుతూ మంచుకొండలా కరిగిపోతున్న టైం ని గమనించలేదు.

చేసే పనేం లేక రాత్రి రెండింటి దాకా ప్రైంటైం లో సినిమా చూసి పడుకున్న నరసింహ మూర్తి ఎనిమిదింటికి లేచి సెల్ ఫోన్లోతలదూర్చేసి తనలో తను నవ్వుకుంటున్న చిట్టెమ్మని కాఫీ అడిగాడు.

హఠాత్తుగా ఇహ లోకంలోకొచ్చిన చిట్టెమ్మ, "అప్పుడే లేచారేం? రాత్రి పడుకునేసరికి ఆలశ్యమైనట్టుందిగా" అంటూ తలెత్తిచూసేసరికి... ఎనిమిది గంటలయిందన్నట్టు "అజంత" గడియారం సంగీతం పాడింది.

భర్తకి కాఫీ ఇచ్చి, "అయ్యో ఆలశ్యమయిపోయింది! ఇవ్వాళ్ళ మంగళవారం! జూం లో సుందర కాండ పారాయణంమొదలుపెడదామని తమ మిత్ర బృందం అంతా తీర్మానించుకున్న విషయం గుర్తొచ్చి" గబ గబా స్నానం చేసొచ్చి పూజకికూర్చుంది.

ముందుగా దీపారాధన చేసి ప్రత్యక్షనారాయణుడికి అంజలి ఘటించి "ఆదిత్య హృదయం"తో ప్రారంభించి, ఆంజనేయదండకం, రామరక్షా స్తోత్రం, అమ్మవారికి లలితా పంచకం చదివుకుంటూ....పారాయణ మొదటి రోజు కదా అని అప్పాలుచేసే పనిలో పడింది. పనమ్మాయి ఫోన్ చేసి "అమ్మగారూ..ఇయ్యాళ రేపు రాను" అని చావు కబురు చల్లగా చెప్పింది.

"ఈ మధ్య పని వాళ్ళకి నీటు-గోటు ఎక్కువగా ఉంటోంది. నిన్నే చెప్పి ఏడవచ్చుగా! ఇప్పుడు తొమ్మిదవుతోంది! స్నానం చేసిస్తోత్రాలు చదువుకుంటున్న దాన్ని వాకిలి తుడిచి ముగ్గేసి, అంటగిన్నెలు తోమి, అవి ముట్టుకున్నందుకు మళ్ళీ స్నానం చేసికానీ మిగిలిన పూజ పూర్తి చేసుకోలేను" అని చిరాకుగా తనలో తను గొణుక్కుంటూ అప్పాలు చేసే పని పూర్తి చేసి, పనమ్మాయి అవతారమెత్తింది.

@ @ @ @ @

గిన్నెలు తోముతుండగా, బెల్ మోగింది. నరసింహ మూర్తి తలుపు తీసి రిజిస్టర్ పోస్ట్ తీసుకుని తలుపేస్తుంటే, చిట్టెమ్మసుడిగాలి లాగా ముందు గదిలోకొచ్చి "ఏమయ్యా నిన్నెవరిదో లెటర్ తెచ్చి నా చేత సంతకం పెట్టించుకుని మరీ ఇచ్చివెళ్ళావు. నేను చూడకుండా తీసేసుకున్నాను. ఎన్ని సార్లు చెప్పినా నా పూజ టైంలో వస్తావు. ఈ రోడ్డులో అందరికీ ఇచ్చాకమా ఇంటికి రమ్మంటే, నిజాయితీ నీ ఇంటిపేరయినట్టు ముందు మా ఇంటికే వస్తావు. ఆ లెటర్లో ఏముందో, ఏమో? లెటర్రావటం లేటయిందని రేపు వాళ్ళు వాకబు చేస్తే, రిసీప్ట్ మీద ఉన్న నా సంతకం వల్ల అది నా పీకకు చుట్టుకుంటుంది" అని తన వాక్ప్రవాహంలో అతన్ని ముంచేసి లెటర్ అతని చేతిలో పెట్టింది.

"అబ్బా అంత సీన్ లేదోయ్! అది "PCS" వాళ్ళు వారానికి మూడు సార్లు పంపించే షేర్ల తాలూకు లెటర్" అని నరసింహమూర్తి తలుపేసి పోస్ట్ మ్యాన్ ని పంపించి, "ఇంతకీ వంట ఎంత దాకా వచ్చింది? కడుపులో ఎలుకలుకాదు..పందికొక్కులు పరుగెత్తుతున్నాయ్! నాకు అన్నప్రాశన భాగ్యం ఏమన్నా ఉందా?" అన్నాడు.

"ఇంకా వంటే మొదలు పెట్టలేదు. ఇంతకు ముందే ఫోన్ చేసి పనమ్మాయి రాననే చావు కబురు చల్లగా చెప్పింది. గిన్నెలుతోముతున్నాను. స్నానం చేసి, వంట చేసి దేవుడి నివేదన చేసి చిటికెలో పెట్టేస్తా"అన్నది.

"ఏమిటి 11.30 అయితే, ఇంకా వంటే మొదలుపెట్టలేదా? పొద్దున్నే ఆ దిక్కుమాలిన ఫోనొకటి పెట్టుక్కూర్చుంటావ్! మనయాక్టివ్ టైమంతా పీచు మిఠాయి తిన్నట్టు తినేస్తుందది! ఇప్పుడు నువ్వు చెప్పిన లిస్ట్ అంతా పూర్తయి చిటికెలో నాకుఅన్నం పెడతావా, విడ్డూరం కాకపోతే? ఇది కార్తీక మాసమన్నా కాదు! నక్తం చెయ్యటానికి! కనీసం ఏకాదశన్నా కాదు ఏకభుక్తమున్నందుకు పుణ్యమొస్తుంది అనుకోవటానికి!" అన్నాడు.

తన కోసం జూం లో మిత్రులు వేచి ఉంటారని గుర్తొచ్చి, చిట్టెమ్మ వాళ్ళకి ఫోన్ చేసి "ఈ రోజు నాకు కుదరదు. మీరుపారాయణ చేసుకోండి" అని వారికి అనుమతి ఇచ్చేసింది.

@ @ @ @ @

చిట్టెమ్మ అంటగిన్నెల పని ముగించి, స్నానం చేసొచ్చేసరికి ఆకలికి కళ్ళు బైర్లు కమ్మి "ఏమండీ కాసిని నిమ్మకాయ నీళ్ళుకలిపివ్వండి, శోష వస్తోంది" అని సోఫాలో చతికిలబడింది.

ఈ ఉపచారాలయి, వంట మొదలుపెట్టేసరికి ఒంటిగంటయింది.

లండన్ నించి కూతురు కావేరి ఫోన్ చేసి "నాన్నా భోజనాలయ్యాయా? పడుకున్నారా? బంటిగాడు అమ్ముమ్మతోమాట్లాడతానని గొడవ చేస్తున్నాడు" అన్నది.

"ఆ:( ఇవ్వాళ్ళ ఈ నాంచారమ్మ వంటయ్యేసరికి నక్షత్ర దర్శనం అవ్వాల్సిందే!" అన్నాడు.

"మీదేం పోయింది! చేసే వాళ్ళకి తెలుస్తుంది కష్టం! పైగా నక్షత్ర దర్శనం అని వ్యంగ్యాలొకటి! పోనీ నేనేచెయ్యాలనేముంది..ఇలాంటప్పుడు వంటలో మీరూ ఓ చెయ్యి వెయ్యచ్చుగా!

అహ(: అందుకు ఒళ్ళొంగదు! పైగా కూతురికి నా మీద కంప్లెయింట్ చేస్తున్నారు!" అని పూజ గది వైపు తిరిగి నమస్కారంపెట్టి..నాయనా "హనుమా" .. నీ ప్రసాదం తయారయింది కానీ, అనుకున్న ప్రకారం పారాయణ కాలేదు, ఆగ్రహించక ఈఅల్పురాలి అపరాధానికి క్షమించు స్వామి!" అని జంధ్యాల సినిమాలో శ్రీలక్ష్మల్లే "అపచారం" "అపచారం" అనిలెంపలేసుకుని...భర్తని..రండి భోజనానికి" అని పిలిచింది.

"ఇంకో గంట ఆగితే, ఏకంగా రాత్రి భోజనం చెయ్యచ్చు" అని గొణుక్కుంటూ డైనింగ్ టేబుల్ దగ్గరకి వచ్చాడు, డ్రాయింగ్రూం కే పరిమితమైన సగటు భర్త నరసింహ మూర్తి.

మరిన్ని కథలు

Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaalani kaagitam
కాలని కాగితం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు