ఆదర్శ దాంపత్యం - వీణాధరి సూరపరాజు

The ideal marriage

కౌసల్య సుప్రజా రామా! అంటూ మొబైల్ లో అలారం మ్రోగ సాగింది. కమల వెంటనే లేచి అలారం ఆపేసింది.. భర్తకు నిద్రాభంగం అయిందో ఏమో అని ఒకసారి భర్త వైపు చూసి గాఢ నిద్ర లో ఉండటం చూసి తృప్తిగా నిట్టూర్చి , మంగళసూత్రాలు కళ్ళకు అద్దుకొని జుట్టు ముడేసుకుంది. ఈ రోజు శ్రావణ శుక్రవారం ఆమ్మో చాల పని ఉంది సుమా!!!! అనుకుంటూ హడావిడిగా కాలకృత్యాలు తీర్చుకోసాగింది. అపార్ట్మెంట్ బయట గుమ్మం ముందు చిన్న ముగ్గు వేసింది. తలారా స్నానం చేసి పట్టు చీర కట్టుకొని గుమ్మం గడపకు పసుపు కుంకుమ పెట్టి , తులసి కోటకు కూడా పసుపు రాసింది. ఇంతలో పాల ప్యాకెట్స్ వచ్చాయి. అప్పుడు గడియారం టంగున ఆరు గంటలు కొట్టింది. వెంటనే పాల గిన్నె స్టవ్ మీద పెట్టి , పేపర్ వచ్చిందో లేదో అనుకుంటూ బాల్కనీ లోకి వెళ్ళింది. భర్త లేచి కాలకృత్యాలు తీర్చుకొని వచ్చేసరికి ఆయనకు పేపర్ మరియు వేడి కాఫీ బాల్కనీ లో కుర్చీ ముందు సిద్ధంగా ఉండాలి . అలా పెళ్లి అయినప్పటినుంచి జరిగే నిత్య కృత్యం......

కమల రంగారావు గారిది ఆదర్శ దాంపత్యం. వారికీ వివాహమై దాదాపుగా ముప్పై అయిదు సంవత్సరాలు అయింది. ఎప్పుడు చిన్న గొడవ కానీ పొరపొచ్చాలు కానీ వారి మధ్య రాలేదు. బంధు మిత్రులందరిలోను వీరికి ఆదర్శ దంపతులు అని పేరు ప్రతిష్టలు ఉన్నాయి. ఇద్దరు కూతుర్లకు వివాహం అయింది. కొడుక్కి కూడా ఈ మధ్యనే వివాహం చేసి భాద్యతలు అన్ని తీర్చుకున్నారు. ఉద్యోగం చివరి దశలో ఉన్నారు. హైదరాబాద్ లోనే ఒక చిన్న అపార్ట్మెంట్ కొనుక్కొని , అక్కడే నివాసం ఉంటున్నారు. కొడుకు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ , బెంగుళూరు లో ఉంటున్నాడు. కమల భర్త అడుగుజాడలలో నడుచుకుంటూ , ఏనాడూ ఎదురుచెప్పకుండా జీవితాన్ని గడుపుకొచ్చింది. చిన్న గొడవ అయినా పెద్ద గొడవ అయినా తానే సర్దుకుపోతూ ఉండేది. అందుకే ఎప్పుడు వారి మధ్య పొరపొచ్చాలు వచ్చినట్లు కనిపించేది కాదు. అందరు ఆది దంపతులు అని పొగుడుతుంటే కించిత్తు గర్వముగా కూడా ఉండేది కమలకు……..

కమల పాలు కాగే లోపల కోడలికి ఫోన్ చేసింది. కోడలు ఫోన్ ఎత్తగానే ...స్వప్న వాడు నిద్రపోతున్నాడేమో కదా బయటికొచ్చి మాట్లాడు !!! మళ్ళి వాడికి నిద్ర డిస్టర్బెన్సు అంటూ!!! శ్రావణ శుక్రవారం పూజ మరియు నోము గురించి గుర్తుచేసింది. ఇంతలో రంగారావు గారు కమల కాఫీ !!!! అంటూ పిలుస్తుంటే....ఇదిగో మామయ్యగారు లేచారు కాఫీ ఇవ్వాలి !!! శ్రద్దగా చేసుకో పూజ! అంటూ ఫోన్ పెట్టేసింది. తరువాత కమల వంట హడావిడి లో పడిపోయింది. పూజ ముగించి భర్తకు లంచ్ బాక్సు సర్దుతూ ఉంటె కాలింగ్ బెల్ మ్రోగింది. విసుక్కుంటూ ఈ టైం లో ఎవరబ్బా? అని ఒకింత కోపంగా తలుపు తీసింది. జీన్సు , టీ షర్ట్ వేసుకొని షుమారు తన కోడలు వయసు ఉంటుందేమో గుమ్మం ముందు నిల్చుని ఉంది. కమల ప్రశ్నార్థకంగా చూస్తూ ఉంటె …. నమస్తే ఆంటీ ! నా పేరు పల్లవి. మీ ఎదురు ఫ్లాట్ లోకి ఈ రోజే అద్దెకు వచ్చాము. కొంచెం మంచి నీళ్లు ఉంటే ఇస్తారా అన్నది. కమల వెంటనే మంచినీళ్లు తీసుకువచ్చింది... పల్లవి థాంక్స్ చెప్పి, అటుగా ఒక సూటుకేసు తీసికొని వస్తున్న రవి తో…. రవి! అని పిలిచి అంటీ మా హస్బెండ్ అని పరిచయం చేసింది. మేము ఇద్దరం సాఫ్ట్ వేర్ కంపెనీ లో పనిచేస్తున్నాము అని చెప్పింది. రవి కూడా నమస్తే చెప్పి ఇంట్లోకి వెళ్ళిపోయాడు. పల్లవి కూడా వెళ్ళిపోయాక భర్తను ఆఫీస్ కి పంపి ఎదురు ఫ్లాట్ గురించి సావకాశంగా ఆలోచిస్తూ కొంత నిరాశకు గురి అయింది. నాకు కాస్త కాలక్షేపం గ ఉండేవాళ్ళు వస్తారనుకుంటే ఏంటో వీళ్ళు వచ్చారు అద్దెకు అనుకుంటూ నిట్టూర్చింది కమల. రోజు గుమ్మం ముందు కమల ముగ్గు వేసే సమయానికి రవి, పల్లవి వాకింగ్ కి బయలుదేరేవారు.

రోజు గుడ్ మార్నింగ్ ఆంటీ !అంటూ నవ్వుతు పలకరించేవారు. వాకింగ్ నుంచి వచ్చి బాల్కనీ లో పల్లవి పేపర్ చదువుతుంటే రవి కాఫీ తెచ్చేవాడు. ఇద్దరు కాసేపు కబుర్లు చెప్పుకొని తరువాత ఆఫీస్ కి వెళ్ళిపోయేవారు.

ఇలా కొంతకాలం గడిచింది. మొదట్లో పల్లవి వాళ్ళు అంటే కమలకు బొత్తిగా నచ్చేది కాదు. వాళ్ళ వేషధారణ మరియు రవి అన్ని ఇంటి పనులు చేయటం లాంటివి కమలకు ఇష్టం ఉండేది కాదు. భార్యకు సేవలు చేస్తాడేమిటి ఇంత చదువు చదివింది ఇందుకేనా ! అనుకునేది మనసులో. అయితే ఎర్రని గులాబీలు విరబూసి ఉన్న బాల్కనీ ని చూస్తూ మనసులో మెచ్చుకుంటూ ఉండేది వాళ్ళని. మొక్కలని మాత్రం శ్రద్దగా పెంచుతారు అనుకునేది…. అప్పుడప్పుడు పల్లవి , రవి ఇంటికి బంధువులు వస్తూ పోతూ ఉండేవారు. పల్లవి మధ్య మధ్యలో చాల అలసిపోయాను ఆంటీ , ఈ ఇల్లు ఆఫీస్ పనులు చేసుకోలేకపోతున్నా అంటూ ఉండేది. కమల మనసులో ఈ కాలం పిల్లలు చాలా నాజూకు .. ముగ్గురికి వండిపెట్టటానికి కూడా అలసిపోతారు అనుకుంటూ ఉండేది. అయినా రవి సహాయం చేస్తూనే ఉన్నాడుగా! ఇంకా ఎందుకుట అలసట !!!! అని మనసులో ఒకింత విసుక్కుంటూ ఉండేది. ఒకరోజు హఠాత్తుగా రవి కి తీవ్రమైన జ్వరం వచ్చింది. పల్లవి రవిని పట్టుకొని మెల్లగా హాస్పిటల్ కి వెళ్ళటానికి బయటకు వస్తూ ఉంది. విపరీతమైన వాంతులు కూడా అవుతున్నాయి.

కమల “ఏమైందమ్మా పల్లవి” అని ఆందోళనగా అడుగుతుంటే ..

పల్లవి కొంచెం చిన్నగా "ఏం లేదండి , రవి కి జ్వరం వచ్చింది హాస్పిటల్ కి తీసుకోని వెళ్తున్నాను అన్నది" ………..

కమల ఆందోళనగా “అంకుల్ ని రమ్మంటావా” అని అడిగితే ..

" వద్దు ఆంటీ ఏమైనా అవసరం ఉంటె ఫోన్ చేస్తాను " అన్నది పల్లవి…….

మూడు రోజులు హాస్పిటల్ లో నే ఉంటూ రవికి సేవలు చేసింది పల్లవి. తరువాత కూడా ఆఫీస్ కి వెళ్తూ ఇంట్లో అన్ని పనులు చేసుకునేది. కమల పల్లవి గురించి “నాజూకు అనుకున్నా కానీ గట్టి పిల్లే అనుకుంది!” మనసులో.

అలా పల్లవి రవికి , రవి పల్లవికి చేదోడు వాదోడు గ ఉంటూ ఉండేవారు. పల్లవి ఇంటి పనులు చేస్తుంటే రవి పల్లవి ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసేవాడు. అప్పుడప్పుడు రవి వంట చేస్తుంటే కమల అడిగేది. పల్లవి లేదా అని .... పల్లవికి ఒంట్లో బాలేదు ఆంటీ .. అందుకే పడుకుంది అనేవాడు రవి . మరి కొన్ని సమయాలలో బాల్కనీ లో రవి లాప్టాప్ పట్టుకొని గంటల తరబడి కూర్చుని ఉంటె పల్లవి కాఫీ , టిఫిన్లు అన్ని బాల్కనీ లో కి అందిస్తూ ఉండేది. ఎప్పుడు బాల్కనీ లో కూర్చుని ఆఫీస్ గురించి , పని గురించి చర్చించుకుంటూ ఉండేవారు.….ఇంతలో కోడలు పుట్టింటికి వెళ్లిందని , వంటకు ఇబ్బందిగా ఉందని కొడుకు సుధాకర్ దగ్గరినుంచి ఫోన్ వచ్చింది. కమల ,రంగారావు దంపతులు కొడుకు దగ్గరకు బయలుదేరి వెళ్లారు. అక్కడ పది రోజులు ఉండి హైదరాబాద్ తిరిగి వచ్చారు. హైదరాబాద్ వచ్చినప్పటినుంచి కమల ఆరోగ్యం బాలేదు . బాగా నీరసం గా అయిపొయింది కమల. రంగారావు గారు బ్లడ్ టెస్ట్ చేయిస్తే టైఫాయిడ్ అని తేలింది. డాక్టర్ గారు కనీసం ఒక 15 రోజులన్న బెడ్ రెస్ట్ ఉండాలి అని చెప్పారు. ఆయనకు ఎం చేయాలో పాలుపోలేదు. కోడలు నిన్ననే పుట్టింటినుంచి వచ్చింది. అందులోను గర్భవతి , ఆరోగ్యం అంత బాగా లేదు . మరి ఈ పదిహేను రోజులు ఎవరిని పిలుద్దాము అని సందిగ్దావస్థ లో ఉండగా హైదరాబాద్ లో మతకలహాలు చెలరేగి కర్ఫ్యూ పెట్టారు. అందరి రాకపోకలు ఆగిపోయాయి. రంగారావు గారి అవస్థ చెప్పనక్కరలేదు, అయన ఏనాడూ గరిట పట్టలేదు. ఆ అవసరం రాలేదు. కమల కూడా ఎప్పుడు ఏ లోటు రాకుండా అన్ని అమర్చి పెట్టేది. అత్యవసర పరిస్థితులలో ఇబ్బంది వచ్చినప్పుడు కమల తల్లో, చెల్లెలో వచ్చి ఇంట్లో వండి పెట్టేవారు. ఇప్పుడు మరి ఎవరు రాలేని పరిస్థితి…అందులోను హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చినప్పటినుంచి కమలకు చాల నీరసంగా ఉంది. నీరసంతో నిద్ర పోయింది. కమల నిద్ర లేచే సమయానికి రంగారావు గారు వంట గది లో కుస్తీలు పడుతున్నారు. అది చూసి కమల తట్టుకోలేకపోయింది. తనకు జ్వరం అన్న విషయం కూడా మర్చి పోయి లేచి గబా గబా వంటిట్లోకి వెళ్ళబొయింది. కళ్ళు తిరిగి తూలి క్రింద పడిపోయింది. పెద్ద శబ్దం రాగానే రంగారావు గారు పరిగెత్తుకుంటూ వెళ్లి

" నువ్వు ఎందుకు లేచావు కమల , డాక్టర్ గారు బెడ్ రెస్ట్ తీసికోమంటే" అని మందలించారు.

ఇంతలో అటువైపు నుంచి పల్లవి ,రవి పెద్ద శబ్దం విని హడావిడిగా వచ్చారు ఏమైందా అని. పల్లవి వెళ్లి ఆంటీ ని లేపి సోఫా పైన కూర్చోబెట్టింది . రవి కనుసైగ చేయగానే పల్లవి “పదండి ఆంటీ! పడుకుందురు కానీ” అన్నది.

కమల నీరసంగా అంకుల్ భోజనం అని అంటుంటే ...

అది చూసి పల్లవి "రవి చూసుకుంటాడులే రండి ఆంటీ మనం కొంచెం రిలాక్స్ అవుదాము" అని బెడ్ రూమ్ లోకి తీసికొని వెళ్లి పడుకోబెట్టింది. అక్కడ రవి రంగారావు గారికి కబుర్లు చెప్తూ అయన చేత కొంత పని చేయిస్తూ ఒక అన్నం, కూర మరియు కొంచెం జావ తయారుచేసాడు. రంగారావు గారు అన్నీ పరిశీలనగా చూడసాగారు. మనసులో రవిని మెచ్చుకోలేకుండా ఉండలేకపోయారు. అంతలో రవి పదండి అంకుల్ ఆంటీ కి జావ ఇద్దాము, మందులు వేసుకోవాలి కదా అంటూ ......పల్లవి!!! అంటూ పల్లవి ని పిలిచి ఆంటీ కి జావ ఇవ్వు !!!అంటూ ఒక గిన్నె చేతిలో పెట్టాడు. పల్లవి స్పూన్ తో జావ పెడ్తుంటే రంగారావు గారు, రవి అక్కడే కూర్చున్నారు. రవి ఏవేవో జోకులు వేసి నవ్విస్తూ ఉన్నాడు. కాలం యిట్టె గడిచిపోయింది. వెంటనే పల్లవి అంకుల్ మీరు కూడా భోజనం చేయండి అన్నది. అంకుల్ భోజనం చేసేదాకా ఇద్దరు అక్కడే ఉండి గుడ్ నైట్ చెప్పి వెళ్లిపోయారు. కమలకు కంట్లో నీళ్లు తిరిగాయి. దంపతులు ఇద్దరు ఆ యువజంటకి మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకున్నారు. …. అప్పటినుంచి పల్లవి రోజు ఉదయాన్నే కాఫీ పంపేది. రవి వెళ్లి రంగారావు గారికి సహాయం చేసి వచ్చేవాడు వంటలో. ఆలా రంగారావు గారు జావ తయారు చేయటం , కొంత వంట చేయటం నేర్చుకున్నారు. వేళకు మందులు అవి కమలకు ఇవ్వటం అలవాటు చేసుకున్నారు. దాంతో కమల ఒక పది రోజులలో కోలుకుంది. కమల కోలుకున్న తరువాత కాఫీ పెడ్తుంటే రంగారావు గారు వచ్చి కమల నువ్వు ఇక్కడ కూర్చో ఈ రోజు నా చేతి కాఫీ రుచి చూడవోయి!!అని అంటుంటే కమల కళ్ళల్లో ఆనంద భాష్పాలు వచ్చాయి. అప్పుడు రంగారావు గారు “అవును కమల రవి ని చూసి చాల నేర్చుకోవాలి, ఎంత ఓపికగా ఉంటాడో” అని పొగుడుతూ ఈ పదిరోజులలో వంట గదిలో ఎలా సహాయం చేసాడో చెప్తుంటే కమల ఆలోచనలోకి వెళ్ళిపోయింది.... ఈ ఇద్దరు పిల్లలు ఆదర్శ దాంపత్య జీవితానికి ఎంత చక్కటి ఉదాహరణ.. ఒకరికి ఒకరు చేదోడు వాదోడు గా ఉంటూ, ఒకరిని ఒకరు గౌరవించుకుంటూ. ఇద్దరు ఎదుగుతూ ....ఎంతో నేర్చుకోవాలి వాళ్ళ దగ్గర అనుకుంది కమల. కమల ఎప్పుడు భర్తే లోకంగా ...భర్త ఎదుగుదలే తన ఎదుగుదల గా భావించేది. భర్తకు ఏది ఇష్టమో తనకు అదే ఇష్టం... తన ఇష్టాన్ని ఏనాడో మర్చిపోయింది. ఎప్పుడు వంట ఇంట్లో ఉంటూ పిల్లల్లకు భర్తకు ఇష్టమైనవి చేసిపెడుతూ అందులోనే ఆనందం పొందేది. ఆదివారం క్రికెట్ మ్యాచ్ లు చూస్తూ భర్త “కమల వేడి వేడి పకోడీలు , అల్లం వేసి టీ చేసిపెట్టవోయి” అని అంటుంటే ఆతృతగా వండి పెట్టేది. అదే తన కూతుర్లకు కూడా నేర్పింది. కోడలు కూడా ఇలాగె తన కొడుకును కూర్చోబెట్టి చేయాలి అనుకుంది. తనకు ఒంట్లో బాగా లేకపోతే ఒక పదిరోజులు తన భర్త ఎలా అల్లకల్లోలం అయ్యాడో ఇప్పుడు ప్రత్యక్షంగా చూసింది. ఇన్నాళ్లు ఇదే ఆదర్శ దాంపత్యం అనుకుంది. ఎప్పుడు పాతతరం అంతా మంచి వాళ్ళు , ఈ తరం చెడిపోయింది అని అనుకుంటూ ఎంత పొరపాటు చేసింది తను! ఈ కాలం పిల్లలనుంచి కూడా నేర్చుకోవాలి. వీళ్లది కదా ఆదర్శ దాంపత్యం అంటే!!!! అని అనుకుంటూ కొడుక్కి ఫోన్ కలిపింది. కొడుకు సుధాకర్ ఫోన్ ఎత్తగానే కమల

“సుధా బాగున్నావా నాన్న ! కోడలు నీళ్లోసుకుంది కదా ఎలావుందీ ఆరోగ్యం ఇప్పుడు? ఒక్కతే పని చేసుకోలేదు.. సహాయం చేస్తూ ఉండు రా! బరువులు అవి ఎత్తించకు. ...అని చెప్తూ కోడలికి ఒకసారి ఫోన్ ఇవ్వు అన్నది.

కోడలు ఫోన్ తీసికోగానే .. “స్వప్న డెలివరీ అయ్యాక కొన్నాళ్ళు పోయాక ఏదయినా ఉద్యోగం చూసుకోమ్మా .. చదుకొని ఇంట్లో ఏం ఉంటావు” అని అన్నది … కోడలు స్వప్న ఏం సమాధానం చెప్పకపోయేసరికి కమల మళ్ళీ “ఉద్యోగం డబ్బు కోసం కాదమ్మా ! మన కి ఒక గుర్తింపు కోసం తల్లి ! లోకం పోకడ తెలియడం కోసం ….అంటూ చెప్తుంటే ...బాల్కనీ లో నుంచి వింటున్న పల్లవి కళ్ళు ఆనందంతో మెరిసాయి.......

తెల్లవారి పల్లవి , రవి వాకింగ్ కి వెళ్తుంటే ... వెనకనుంచి ఆంటీ అంకుల్ గుడ్ మార్నింగ్ అని చెప్తుంటే ....ఆశ్చర్యంగా చూడటం పల్లవి , రవి వంతు అయింది ………...

మరిన్ని కథలు

Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaalani kaagitam
కాలని కాగితం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు