దేహాలయం - అన్నపూర్ణ . జొన్నలగడ్డ

Temple

దేహాలయం అనగనగా ఒక గురుకులం. అందులో కొంతమంది విద్యార్థులు. నిత్యం గురు శుశ్రూష చేస్తూ చక్కగా విద్యను అభ్యసించేవారు. రాజశేఖరం అలాగే భీమరాజు అనే పిల్లలు కూడా ఆ విద్యార్థుల బృందంలో ఉన్నారు. రోజు అడవికి వెళ్లి కట్టెపుల్లలు ఏరుకురావటం, అలాగే కొత్త కొత్త మొక్కలు, వృక్షాలను గురించిన వివరాలు కనుక్కోవడం గురువుగారి దగ్గర వాటి గురించి ప్రస్తావించి అన్ని విషయాలు తెలుసుకోవటం చేసేవారు. భీమరాజు రైతుబిడ్డ కావటం చేత మొక్కలు అలాగే వృక్షాల వివరాలు మరింత లోతుగా ఆలోచన చేసి తనకు స్ఫురించిన ఆలోచనల్ని గురువుగారితో చెప్పి అందులో ఉన్న తప్పుఒప్పులు తెలుసుకునేవాడు.

రాజశేఖరం వ్యాపారిబిడ్డ కావటం చేత క్రయ విక్రయోపేతంగా ఆలోచనలు చేసి గురువుగారితో చెప్తూ ఉండేవాడు. కొన్నాళ్ళకి వారి చదువు పూర్తికావచ్చింది. గురువుగారి దగ్గర ఆశీర్వాదం తీసుకుని ఇంక ఇంటికి చేరారు. అలా చేరిన యువకులు తమ తల్లి తండ్రులకు తోడుగా తమ జీవనాధారాలు అయిన వారి వారి ఇంటి వృత్తిలో స్థిరపడ్డారు. కాలం గడిచింది. గృహస్థులై చక్కగా జీవనాన్ని సాగిస్తున్నారు. భీమరాజు తన ప్రాంతంలో కాలానుగుణంగా పంటలు వేయటం వాటితో మంచి ఫలితాలు పొందటం అన్న సూక్ష్మ బుద్ధి కలిగిన వాడిగా మంచి పేరుపొందాడు. సన్నకారు రైతులకు మంచి సలహాదారుగా వ్యవహరిస్తూ మంచి పేరు తెచ్చుకున్నాడు. పక్కనే ఉన్న చిన్నపాటి పట్నంలో మంచి సాగు విత్తనాలు దొరుకుతున్నాయి అని దండోరా విని తెచ్చుకోవడానికి బయల్దేరుతాడు.

దారిలో తన చిన్ననాటి మిత్రుడు అయిన రాజశేఖరం గుర్తుకువచ్చి ఇదే పట్నంలో ఉంటాడుకదా అని వ్యాపారస్తులు కూడలికి వెళ్లి వారి దుకాణం కోసం వాకబు చేసి చేరుకుంటాడు. అక్కడ గల్లా పెట్టె వద్ద ఉన్న యజమాని దగ్గరకు వెళ్లి అయ్యా! నా పేరు భీమరాజు, ఇక్కడ రాజశేఖరం అని నా మిత్రుడు ఉండాలి అని అడుగుతుండగానే లావుగా కుడుమట్టంగా ఉన్న వ్యక్తి లేచి, రావయ్య మిత్రమా నన్ను గుర్తుపట్టలేదా నేనె రాజశేఖరాన్ని అని అంటూ బైటకు వచ్చాడు.

నువ్వా నేను గుర్తుపట్టలేకపోయాను క్షమించు చాలా కాలం అయ్యింది కదా అని భీమరాజు చాలా సంతోషం వ్యక్తం చేశాడు. అలా ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ ఒకరి గురించి ఒకరు తెలుసుకున్నారు. ఇంతలో భోజనాల వేళ అవ్వటంతో ఇద్దరూ భోజనాలు చేశారు. రాజశేఖరం భార్య ఎంతో మర్యాద చేసి వారికి అన్ని సదుపాయాలు సమకూర్చింది. కానీ భీమరాజు తన మిత్రుడు సరిగ్గా భోజనం చెయ్యకపోవటం గమనించాడు.

సరదాగా రాజశేఖరాన్ని వెటకారం చేస్తూ ఎమోయ్ మిత్రమా మా చెల్లాయి చేతి వంట అమృతం, నువ్వేమో బొత్తిగా పైపైన రుచులతో భోజనము కానిచ్చేసావ్ అవునులే రోజు తింటూ ఉంటే అమృతం కూడా చేదుగానే ఉంటుంది అన్నాడు. అప్పుడు అసలు విషయం చెప్తూ రాజశేఖరం ఇలా అన్నాడు, లేదు మిత్రమా! నాకు ఈ మధ్య ఆకలి చాలా తగ్గింది. బొత్తిగా తిండిమీద ధ్యాస లేదు. పని హుషారుగా చెయ్యలేకపోతున్నాను. స్తబ్దుగా ఉండటం వల్ల నీరసంగా తోస్తోంది అని తన అవస్థను వర్ణించాడు.

అంతా విన్న భీమరాజు తన మిత్రుడికి వెంటనే ఉత్సాహం కలిగించడం కోసం సర్లే ఇదంతా వదిలేయ్! నేను ఒక వారం తరువాత మళ్ళీ వస్తాను అప్పుడు మన ఇద్దరం కలిసి గురువుగారి ఆశ్రమానికి వెళ్దాం అక్కడ నీకోసం మంచి చికిత్స దొరకవచ్చు అంటాడు. అలాగే వెళ్దాం అని రాజశేఖరం కూడా అంటాడు. వారం తర్వాత భీమరాజు మళ్ళీ రాజశేఖరాన్ని కలిసి ఇద్దరూ గురువుగారి ఆశ్రమానికి బయల్దేరుతారు.

బండి సిద్ధం చేసుకుని అందులో వెళ్దాం అని ప్రయాణం అవుతారు. అలా సాయంకాలానికి ఇద్దరు ఆశ్రమము చేరి గురువుగారిని కలిసి కష్ట సుఖాలు చెప్పుకుని రాత్రికి విశ్రాంతి తీస్కున్నారు. మరునాటి నుండి చిన్నతనాన్ని గుర్తుచేసుకుంటు ఆశ్రమానికి చుట్టూరా ఉన్న ప్రాంతం అంతా కలియతిరిగారు. అలా తిరిగి కాస్త శరీరానికి మంచి కసరత్తు చేసినట్లు అవ్వటం వల్ల రాజశేఖరానికి అలసట కలిగి సాయంత్రానికి మంచి ఆకలి వేసింది. చక్కగా భోజనం చేసాడు. మంచి నిద్ర పట్టింది. తరువాతిరోజు భీమరాజు నీకు కావలసిన ఔషధపు మొక్క ఈ పక్క అడవిలో దొరుకుతుందని గురువుగారు చెప్పారు రా వెళ్లి తెచ్చుకుందాం అని భీమరాజు తన మిత్రుడిని వెంట తీస్కుని వెళ్లి అడవిలో కొంత ప్రాంతం తిరిగి ఒక మొక్క తెచ్చుకున్నారు.

అలా మూడు రోజులు గడిచాయి. ఇంక గురువుగారి దగ్గర సెలవు తీస్కుని ఇల్లు చేరారు. భీమరాజు అంతటితో వదలకుండా తన మిత్రుడి చేత ఇంటి వెనక పెరడులో చిన్న మడి చేయించి ఆ మొక్కను పాతించి దానితో పాటు ఇంకొన్ని కూరగాయల మొక్కలు వేయించి వాటి సంరక్షణ బాధ్యత స్వయంగా రాజశేఖరమే చూసుకోవాలని నౌకరుకు అప్పచెప్పకూడదు అని, తాను ఒక మూడు నెలలు తరువాత వస్తానని చెప్పి వెళ్తాడు. రాజశేఖరం తన మిత్రుని మాట ప్రకారం ఎదురుచూస్తూ అలాగే ఆ మొక్కల సంరక్షణ చేస్తూ పొద్దున్న సాయంత్రం పెరట్లో కాలం గడుపుతూ మిగిలిన చెట్ల గురించి కూడా బాగా జాగర్త తీస్కునేవాడు.

మూడు నెలలు ఎంతసేపు గడుస్తాయి. భీమరాజు రానే వచ్చాడు. వస్తూనే రాజశేఖరాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. చిక్కి సగమై మంచి దేహాకృతి కలిగి ఉత్సాహంతో ఉన్న తన మిత్రుడిని చూసి ఎంతో ఆనందం వ్యక్తం చేశాడు. ఇప్పుడు కదా మిత్రమా నీకు సరైన ఆరోగ్యం చేకూరింది. అన్ని సంపదలలోకెళ్ల ఆరోగ్యం గొప్ప సంపద. అదే మనపాలిట లక్ష్మీదేవి. మన శరీరాన్ని తగిన వ్యాయామముతో ఎప్పుడు హుషారుగా ఉంచుకోవాలి.

మనకు దేవుడు ఇచ్చిన ఆలయం మన దేహం. అందులో ఉన్న ఆత్మారాముణ్ణి మనం కోరి రోగాలు తెచ్చుకుని మనము బాధపడి ఆయన్ని బాధపెట్టకూడదు. అందుకే మన పెద్దలు మన జీవన విధానము, పద్ధతులు చాలా ఆలోచించి పెట్టినవి. మన ఆరోగ్యం కోసమే అవి. వాటిని వదిలేసి మనల్ని మనమే పాడుచేసుకుంటున్నాం. ఇకపై నువ్వు ఇదే విధంగావుంటే నిన్ను చూసి నీ తరువాతి తరాలు కూడా నేర్చుకుంటాయ్. అర్ధమైనదా మిత్రమా అని బోధ చేస్తున్న భీమరాజు వంక చూస్తూ తప్పకుండా ఇలాగే ఉంటాను అని రాజశేఖరం కూడా అంటాడు.

అందుకే మనపెద్దలు చెప్పిన జీవన విధానాన్ని పూర్తిగా కాకపోయినా వీలైనంత వరకు పాటించి తగిన వ్యాయామం చేస్తూ ఆరోగ్యంగా ఉందాం.

మరిన్ని కథలు

Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaalani kaagitam
కాలని కాగితం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు