వ్యాపార రహస్యం - దార్ల బుజ్జిబాబు

business secrete

చాలా ఏళ్ల క్రితం రాజయ్య రంగయ్య అనే ఇద్దరు చిల్లర కొట్టు వ్యాపారులు ఉండేవారు. వారిద్దరూ మోసం చేయకుండా చక్కగానే వ్యాపారం చేస్తున్నారు. ఇద్దరూ మాటకారులే. కానీ రాజయ్య వద్దకు జనం ఎక్కువగా వచ్చేవారు. రంగయ్య వద్దకు కొద్ది మంది మాత్రం వస్తుండేవారు. దీనితో రంగయ్య కాస్తా నిరాశ చెందినప్పటికి వదలకుండా వ్యాపారం కొనసాగిస్తున్నాడు. వచ్చిన వారే తనవారనుకుంటూ, వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా, వారిని ఆకట్టుకుంటూ వ్యాపారం చేయసాగాడు. అయినా రోజురోజుకూ వచ్చేవారి సంఖ్య తగ్గుముఖం పట్టింది.

ఇదేవిషం వారితో వీరితో చెప్పటమే కాకుండా, సాధువులు, సన్యాసులు, వాస్తు సిద్ధాంతులను కలవసాగాడు. వారు అదిదోషం, ఇది దోషం అంటూ దుకాణం రూపురేఖలు మార్చేశారు. చాలా ఖర్చుపెట్టించారు. అయినా ఏమాత్రం ప్రయోజనంలేదు. కొనుగోలుదారుల సంఖ్య పెరగలేదు. వ్యాపారం అభివృద్ధి చెందలేదు.

రంగయ్యకు ఓ కుమారుడు ఉండేవాడు. వాడు హైస్కూలులో పదో తరగతి చదువుతున్నాడు. వాడు బడిలో చురుకుగా ఉండేవాడు. సైన్స్ ప్రయోగాలు చేసి జనవిజ్ఞాన వేదిక వారి వద్ద బహుమతులు కూడా తీసుకున్నాడు. వాడికి వాస్తులుగీస్తులు అంటే నమ్మకం లేదు. ముఢనమ్మకాలమీద విశ్వాసం లేదు. వాళ్ళ నాన్న చేసే పనులు నచ్చలేదు. వ్యాపారం అభివృద్ధి చెందాలంటే తెలివితేటలు వుండాలిగానీ, వాస్తు దోషాలు అడ్డంకి కాదు. అని వాడికున్న తక్కువ జ్ఞానం తోనే గ్రహించాడు.

వాళ్ళ నాన్నవ్యాపారం ఎందుకు సాగటంలేదో గమనించసాగాడు. వాళ్ళ నాన్న బేరంలో ఎలాంటి లోపంలేదు. వచ్చినవారిని చిరునవ్వుతో పలకరించటం, తూకం మొగ్గుగా ఇవ్వటం, నీదానంగా అన్నీ సర్ది ఇవ్వటం, లెక్కలు సరిగ్గా చేసి పైసలతో సహా తిరుగు డబ్బులు ఇవ్వటం అన్నీ బాగానే ఉన్నాయి. మరి ఎందుకు మనుషులు రావటం లేదు? ఇందులో ఏదో మతలబు ఉంది. అదేదో తెలుసుకోవాలి అనుకున్నాడు. రాజయ్య షాపు ను పరిశీలించ దలచాడు. రాజయ్యకు తెలియకుండా అతడి వ్యాపార రహస్యాలు చూడసాగాడు. తన తండ్రి చేసినట్టుగానే అన్నీ శ్రద్ధగా చేస్తున్నాడు. తూకంలో సరిగానేవున్నట్టనిపించినా, కొద్దిగా తగ్గుతున్నట్టుగా గమనించాడు. తన తండ్రి నిదానంగా తూచి కొంచం ఎక్కువగానే ఇచ్చేవాడు. అయినా తన తండ్రిని నమ్మకుండా రాజయ్యనే నమ్మటంలోని ఆంతర్యం ఏమిటో అర్థం కాలేదు. అయితే ఒక విషయం గమనించాడు వాడు. తన తండ్రి తూసేటప్పుడు ఎక్కువ మోతాదులో వేసి అందులోనుంచి కొసరికొసరి తీసి ఇవ్వవలసిన దానికన్నా కొంచం మొగ్గు ఇస్తాడు. రాజయ్య అలా కాదు. ఇవ్వవలసిన దానికన్నా తక్కువ తూసి అందులో కొసరి కొసరి వేసేవాడు. ఇదే తేడా. మనిషి అంతరంగాన్ని బాగా చదివిన రాజయ్య ఈ విధానం చేపట్టాడు. మనిషి ఎప్పుడూ తనకు లాభం రావాలని కోరుకుంటాడు. రాజయ్య కొసరి కొసరి వేసి ఎక్కువ ఇస్తున్నట్టుగా నటిస్తున్నాడు. ఇలా వేగంగా వేయడం వల్ల కాటా బాగా మొగ్గుతుంది. తరువాత పైకి లేస్తుంది. అలా పైకి లేచేవరకు ఉంచకుండా సరుకు తీసు ఇస్తాడు. దీనివల్ల అందరూ తమకు ఎక్కువగా ఇస్తున్నారని భ్రమించి అక్కడికే వెళ్ళటానికి అలవాటుపడ్డారు. రంగయ్య అలాకాక మాటిమాటికి కొసరి కొసరితీస్తుండటం వల్ల తమ సరుకును తీస్తున్నట్టు భావిస్తూ, తమకేదో నష్టం వస్తున్నట్టు భ్రమించి ఆయన దగ్గరకు రావటం మానేస్తున్నారు. ఈ సూత్రం గ్రహించిన రంగయ్య కొడుకు ఈ వ్యాపార రహస్యం తండ్రికి చెప్పాడు. తండ్రి సంతోషించి కొడుకు సూచనను పాటించాడు త్వరలోనే ఖాతాదారులు పెరిగారు. వ్యాపారం అభివృద్ధి చెందింది.

మరిన్ని కథలు

Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaalani kaagitam
కాలని కాగితం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు