ఆ పసికళ్ళు వర్షిస్తున్నాయి. రంగుల రెక్కలతో ఎగిరే సీతాకోకచిలుక వయసు బాధ్యతల కాడికి బలిపశువయింది. విరిసీ విరియని వయసు మండుటెండకు పత్తిలా ముడుచుకుపోతున్నది. తనలాంటి ఎన్నో జీవితాలు బతుకులో పచ్చదనం చూడకుండానే కంటతడి పంటలను మోసుకు తిరుగుతున్నాయి. వైరస్ లను మించిన మహమ్మారి వారి పేదరికపు రక్తంలోకి విషాన్ని నింపుతూనే ఉంది. పదునాలుగు సంవత్సరాలు నిండిన పద్మ జీవనపయనం కూడా అందుకు మినహాయింపు కాలేకపోయింది.
పసితనం నుంచి తల్లి కళ్ళలో నీరు తప్ప నవ్వు చూడని ఆ చిన్నారికి గత నలభై రోజుల కాలం తిమిరం లేని కమ్మని వెలుగును చూపింది. అదే శాశ్వతమవాలని కలలు కన్న ఆ పేద గుండెలకు నిన్నటి సంఘటన నిరాశకు గురిచేసింది. అవును మేము మారము, మారలేము, కాదు మారనివ్వరు. ఇంతే మా కథలింతే. తలచుకునే కొద్ది ఆ పసి హృదయం వశం తప్పి విలవిలలాడుతున్నది.
*******
" నాయనా. మా పరీక్షలు జూలై నెలలో జరుగుతాయట. అబ్బ విసుగు పుడుతోంది చదవలేక" వచ్చి తండ్రి భుజం మీద తలవాల్చి చెప్పింది పద్మ. " పోనీలే తల్లీ సిన్నంగా సదువుకుందూలే శానా టైముంది గదా. నా బంగారుతల్లికి ఈ పాలి మంచి మార్కులొత్తాయి. బాగా సదివి ఇంజనీరయితది" పద్మ నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు నారయ్య, పద్మ తండ్రి. " నెల నించి సూత్తన్నా కూతురంటే తెగ పేమ పెరిగిపోయిందయ్యా నీకు. ఇన్నాల్లూ ఏడబోయింది ఇదంతా. అది సదువుకోను కూసుంటే సాలు,
అడ్డమైన పనులు సెప్పటం, సదివింది సాలు పనికి తోలుకు పొమ్మని రంకెలేయడం. దాంతోనే సరిపోయె. ఈ పేమేదో సిన్పప్పుటాల నుంచి ఉంటే బిడ్డ ఇంకా బాగా సదువుకునేది" మొగుణ్ణి దెప్పింది నారమ్మ. " అబ్బ ఊరకే సతాయించమాకే. ఏదో యెదవ మందు లోన కెలితే సాలు. వల్లంతా అదోలా అయిపోయి నోరు జొల్లు కూతలు కూస్తది. అయిందేదో అయిపోయింది లేవే. ఇదిగో ఈ మాయదారి పురుగు పున్నెమాని మందు బందు అయిపోనాది. పనిపోతే పోయింది గాని మందు ఊసే మరిసిపోయా" " ఇప్పటికైనా బుద్ది తెచ్చుకో మావా. అది పుట్టినాక ఇంత సంతోసంగా దాన్ని ఎపుడూ సూడలేదు. మనకుంది ఒక్కగానొక్క నలుసు. నువ్వంటే దానికి పానం అది ఎరికజేసుకో. పెబుత్వం మన బిడ్డ సదువులకు పైసలిస్తదట. అది బుద్దిగ సదువుకొని సిన్న ఉద్దోగం దెచ్చుకుంటే సాలు మన కట్టాలన్నీ గట్టెక్కిపోతాయి.
ఇకనువ్వు ఆ పాడు విసం జోలికి పోనని ఒట్టు యెట్టుకో. ఎల్లి రైతు బజార్లో మన తెల్లకార్డుకు బియ్యం, కందిపప్పు ఊరకే ఇత్తున్నారంట గవర్నమెంటోల్లు ఎత్తకరాపో" పని పురమాయించింది నారమ్మ. " ఇక దేనికి తాగతానే పిచ్చిదానా. ఇన్నాల్లూ బిడ్డను పేమగా సూత్తే ఎంత సంతోసమో ఎధవ మనసుకు తెలవలా. నా బిడ్డ నన్ను 'నాయనా..నాయనా' అంటూ ఎనకాలే తిరగతా, నాకేది గావాలంటే అది తెచ్చి యిత్తా మా యమ్మలా నను కాసుకుని తిరగతంటే, ఇన్నాల్లూ ఎంత తప్పు సెశానా, ఎంత పేమను పోగొట్టుకున్నానా అని బాధేసిందే. సచ్చినా తాగనింక. నా బిడ్డను యువరాణిలా సూసుకుంటానే... నా తల్లి ఎంత సదివితే అంత సదివిత్తా.
రెక్కలు ముక్కలు సేసుకునైనా దాని బతుకుకు దారి సూపిత్తా. ఇది బంగారమే నాకు" అంటూ పద్మ తలను గుండెకు హత్తుకున్నాడు. 'నాన్నకు నేనంటే ఎంత ప్రేమ. అనవసరంగా ఇన్నాళ్ళూ నాన్నను తప్పుగా అర్థం చేసుకున్నాను. మా నాన్న నిజంగా దేవుడు. తప్పంతా నాన్న తాగే మందుది. మాయదారి మందు. మాలాటి పేద కుటుంబాలను ఛిన్నాభిన్నం చేస్తున్నది' మనసులో అనుకుంది పద్మ. " నారీ, అట్టాగే సుబ్బయ్య మామ దాకా పోయొత్తా. వచ్చే వారం నుంచి మిరప గోడౌన్లు తెరుత్తారంట. పాత సరుకంతా లారీలకెత్తాలన్నాడు. పని దొరకద్దేమో అడిగొత్తా" అంటూ బయలుదేరాడు నారమ్మ ఇచ్చిన సంచీ తీసుకుని.
" నాన్నా ఉండు" అంటూ లోపలికి పరిగెత్తి గుడ్డ మాస్కు తెచ్చి తండ్రికిచ్చింది పద్మ. " మరిసే పోయాను తల్లీ. ఇది లేకుంటే ఆ దిక్కుమాలిన పురుగు అంటుకున్నా అంటుకుంటది" మాస్కు మూతికి కట్టుకుని సైకిలెక్కి బయలుదేరాడు నారయ్య. " అమ్మా. నాన్న చాలా మంచివాడు కదూ" అమ్మ చేయి పట్టుకుని లోపలకు నడుస్తూ అన్నది పద్మ. " మడిసి దేవుడేనమ్మా. ఆ మందు పడితే సాలు రాచ్చసుడై పోతాడు. అప్పుడేంచేత్తాడో ఆడికే తెలవదు" ఎక్కడో బాధ నారమ్మ మనసులో.
'అవును. మా తెలుగు సార్ చెప్పేవారు. పేదవాళ్ళను ఎదగనీయకుండా చేసేది మందేనని. దాని మీద వచ్చే ఆదాయంతోనే పేదలకు సంక్షేమ పథకాలన్నీ ప్రభుత్వం ఇస్తున్నదని. అంటే కుడి చేత్తో ఇచ్చి ఎడమ చేతితో లాక్కుంటున్నదని. ఏదో ఈ లాక్ డౌన్ వల్ల బెల్టు షాపులన్నీ మూసేశారు. తాగడానికి చుక్క కూడ ఎవరికీ దొరకడం లేదు. అందుకే మా నాన్న ఇన్నాళ్ళకి మా అందరికీ దేవుడులా కనిపిస్తున్నాడు. ఇది ఇలాగే ఉంటే బాగుండు దేవుడా. మా నాన్న నన్ను ఇంత ప్రేమగా ఎప్పుడూ చూడాలి' అనుకుంది పద్మ మనసులో.
పద్మ తెలుగును ఇంత స్వచ్ఛంగా మాట్లాడడానికి కారణం వాళ్ళ తెలుగు మాస్టారే. ఆయనన్నా, ఆయన మాటన్నా పద్మకు వేదం. అతనిలో తన తండ్రిని చూసుకుని సంబరపడేది పిచ్చి పిల్ల.
******
వారం రోజులు గడిచిపోయాయి. నారమ్మను పనిలోకి రమ్మన్నారు, ఆమె పని చేసే ఇళ్ళవాళ్ళు. పోయిన నెల జీతం కూడా పూర్తిగా ఇచ్చేశారు. నారయ్యను కూడా పనిలోకి రమ్మంటే వెళ్ళాడు. లాక్ డౌన్ పెంచినా చాలా వరకు సడలింపులు ఇవ్వడంతో ప్రజా జీవనం కొంత వరకు గాడిలో పడింది. సందులో సందుగా మందు షాపులకు పచ్చజెండా ఊపింది రాష్ట్రం, భౌతికదూరం పాటించాలనే కొన్ని నియమాలతో. మందు బాబులకు పండగరోజులొచ్చేశాయి. కానీ ధరలు అమాంతంగా పెంచడంతో దిగులు పడిపోయారు చాలామంది.
పద్మ చదువుకుంటున్నదే గాని, మనసు నిలవడం లేదు. నాన్న మరల తాగి వస్తాడేమోననే భయం పీకుతున్నది మెదడులో. చదవాలనిపించలేదు. పుస్తకం మూసివేసి తల్లి రాక కోసం చూస్తున్నది. ఇంతలో నారమ్మ వచ్చింది. " అమ్మా. నాన్న ఎన్నింటికి వస్తాడు" " ఆరుకల్లా మిల్లు మూత్తారు. ఏడదిరిగినా ఏడుకల్లా వత్తాడులే" " అమ్మా, మందు షాపులు తీశారటగా" " అవునటే. నేను పనిసేసే కాడ సెప్పారు. ఇయాలి నుంచి మీ ఆయనకు పండగేనని ఎటకారం కూడ సేశారు." " నువ్వు ఊరుకున్నావా. నాన్న తాగడం మానేశాడని చెప్పకూడదా" " ఇంతకు మునుపు నీలాగే ఉడుక్కునే దాన్ని. కానీ ఏంసేసేదే నీఅయ్యకు మాట మీద నిలబడే మనసు లేదు" " నాన్న తాగడమ్మా. నాకు చేతిలో చెయ్యేసి చెప్పాడు" నారమ్మ నవ్వుకుంది తనలో, తన పెళ్ళైన కొత్తల్లో ఎన్ని సార్లు ప్రమాణం చేసి తప్పాడో గుర్తుకువచ్చి. కానీ పైకి మాత్రం ఏమీ అనలేదు, పిల్ల మనసు నొప్పించలేక. ఇద్దరూ అన్నం తిని పడుకున్నారు.
సాయంత్రం నారయ్య పెందలాడే వచ్చాడు. వస్తూ వస్తూ పద్మకు దారిలో చిన్న బడ్డీకొట్టు తెరిచివుంటే చాక్లెట్లు కొని తెచ్చాడు. పద్మకు పట్టలేని ఆనందం కలిగింది. తన తండ్రి మారాడని సంతోషంతో మనసు గాలిపటంలా ఎగరసాగింది. ***** పరీక్షలింక పది రోజుల్లోకి వచ్చాయి. ఆలోచనలన్నీ మానుకుని చదువుకుంటున్నది పద్మ. నారమ్మ వంట చేసుకుంటూ నారయ్య కోసం ఎదురుచూస్తున్నది, ఇంకా రాలేదేమా అని. ఇంతలో గుడిసె బయట అలికిడయితే వచ్చి చూసింది. నారయ్య ఒక మూల గువ్వలా కూర్చుని ఉన్నాడు దగ్గరకొచ్చింది. టవల్ నోటికి అడ్డం పెట్టుకున్నాడు. అర్థమయింది నారమ్మకు. " మల్లీ తాగి తగలడ్డావా" " స్. అరవమాక. సాంబడు బలవంతం సేత్తే..." " పిల్లకు మాటిచ్చినావుగదయ్యా. సిగ్గనిపించలేదా" నారమ్మ కళ్ళు చెమర్చాయి. " ఇక తాగనే, నీ మీదొట్టు. బిడ్డకు సెప్పమాక" మనసులో ఏదో ఒక మూల తప్పు చేశాననే బాధ. చూడనే చూసింది పద్మ. మాట్లాడకుండా లోనికి వెళ్ళిపోయింది.
******
అలా మూడు రోజులు వరుసగా. నారయ్య మారలేదు. అంతకు ముందు ఇంట్లో ఇచ్చే వందో, రెండొందలో కూడ ఇవ్వడం మానేశాడు, మందు రేటు పెరిగిందని. నారమ్మకు విషయం అర్థమయింది. పరీక్షల్లో పిల్ల ఇక్కడుంటే కష్టమని. తీసుకెళ్ళివాళ్ళ అన్న గారింటిలో వదలి వచ్చింది, పరీక్షలయినదాకా ఉంచుకోమని. పద్మ ఒక బొమ్మలాగ మారిపోయింది. తనకు అర్థమయింది, ఇక నాన్న మారడని. ఎలాగోలా పరీక్ష పాసవాలని పట్టుదల పట్టింది, అమ్మ ఓదార్పుతో. మనసు చిక్కబట్టుకుని పరీక్షలు పూర్తి చేసి ఇంటికి వచ్చింది పద్మ. చీకటి పడింది. నారయ్య బాగా తాగి వచ్చాడు. " ఏయ్ నారి. పిల్ల వచ్చిందంటే ఇంటికి. దాన్ని సూసి శాన్నాలయింది.
ఏడే నా బిడ్డ" పడుతూ లేస్తూ మంచం మీద కూలబడ్డాడు" " ఇక్కడే ఉన్నా నాన్నా. ఇంకా చచ్చిపోలేదు" " రాయే నా సదువుల తల్లీ. నీకు బెమ్మాండమయిన పని సూసినాడు నీ మామ సాంబడు. ఆడి కల్లాల కాడ నువ్వు మిరపకాయలు ఆరబెట్టించి, తూకాలేయించి, బండ్ల కెత్తించాల. అంతే. రోజుకు మూడొందలు ఇత్తాడు. ఆ తరువాత నిన్నట్టకెల్లి మిల్లులో ఎడతాడు. ఆడకూడ లెక్కలపనేనంటలే" సంబరంగా చెబుతున్నాడు. " అది పనికెల్లదు. సదువుకుంటాది" కలిపించుకుంది నారమ్మ.
" ఏందే నోరు పెగలతాంది. ఏటది సదివేది వంకాయ్. మూసుకుని పనికెల్లమను. ఇది సదివితే కలకేటరవుతదా. శానా మంది సదువుకొని ఇంటికూటికి, బంతికూటికి గాక సెడి బజార్లెంట తిరగతన్నారు. బుద్దిగా పనికి పొమ్మని సెప్పు. లేకపోతే..." అని విసురుగా లేవబోయి కిందబడ్డాడు. లేచి వెళ్ళి పైకి లేపి పడుకోబెట్టారు తల్లీ కూతుళ్ళు. అలాగే నిద్రలోకి జారుకున్నాడు నారయ్య.
******
జరిగినదంతా గుర్తుకువచ్చింది పద్మకు. నారమ్మ వచ్చి ఆలోచనలతో దిగులుగావున్న పద్మను దగ్గరకు తీసుకుంది. " నిన్ను నేను సదివిత్తాగా. ఏడవమాకు" ఓదార్చింది. " వద్దమ్మా. నేను పనికే వెళతాను. నాన్న చెప్పాడని కాదు. మన కోసం. నువ్వు మాత్రం ఎంతకాలం కష్టపడతావమ్మా ఒంటి చేత్తో. మన తలరాతలింతే. మరీ వేలిముద్ర కాకుండా, ఎంతో కొంత చదివించావు. చాలమ్మా. నన్ను పనికి వెళ్ళనీ" పద్మ మాటలలో నిర్లిప్తత. " వద్దు తల్లీ. బాగా సదువుకునే పిల్లవి. సదువు ఆపొద్దు" బ్రతిమలాడింది నారమ్మ
" లేదులేమ్మా. అంతగా చదువుకునే అదృష్టమే నాకుంటే ప్రైవేటుగా చదువుకుంటాను. మా తెలుగు సార్ నాకు ఆ మాత్రం సహాయం చేస్తారు. అమ్మా నాకొక మాట ఇస్తావా.." తల్లి చేతిని చేతిలోకి తీసుకుంది పద్మ. " ఏటి తల్లీ సెప్పు" " నాకు పెళ్ళి చెయ్యొద్దమ్మా. ఇంకో తాగుబోతును నా మెడకు కట్టొద్దు. నన్నిలాగే బతకనీ. మీ ఇంట్లోనే వుండి మిమ్మల్ని కడతేర్చి చివరకు ఎటో వెళ్ళిపోయి ప్రశాంతంగా బ్రతుకుతాను" తల్లిని పట్టుకుని భోరున ఏడ్చింది.
తగిలిన దెబ్బలకు, వయసుకు మించిన మాటలు వచ్చాయేమో దీనికి అనుకుంది నారమ్మ, పద్మను గుండెలకు హత్తుకుని ఓదారుస్తూ. టెలివిజన్ లో చెబుతున్నారు " మద్యపానం నుంచి ప్రజలను దూరం చేయాలనే సదుద్దేశంతోనే, ధరలను విపరీతంగా పెంచాము. ఇక తాగే వారు తగ్గిపోతారు. ప్రభుత్వం నష్టపోయినా ఫర్వాలేదు కానీ పేదలు బాగుపడాలి. వాళ్ళ బిడ్డలు బాగా చదివి విదేశాలకు వెళ్ళాలి. అదే మా ధ్యేయం" 'అంత బాధలోనూ వెర్రినవ్వు నవ్వింది పద్మ. పాపం పిచ్చివాళ్ళు. పేదలకు మంచి జీవితాలనివ్వాలని వారి తాపత్రయం.
మంచి ఆశయాలే వారివి, కానీ వాస్తవాలు చూడలేకపోతున్నారంతే. వాళ్ళకేమి తెలుసు, మా బ్రతుకులు కుక్క తోకలని. మా కథలు ఎన్ని తరాలు మారినా ఇంతేనని' నిర్లిప్తంగా అనుకుంటూ తల్లి వొడిలోకి జారింది పద్మ, రేపటి కొత్త అధ్యాయాన్ని తలచుకుంటూ.