" హలో నమస్తే. నేను ప్రభుత్వ ఆసుపత్రి నుంచి చీఫ్ సూపరింటెండెంటును మాట్లాడుతున్నాను. హనీఫ్ గారేనా మాట్లేది" " అవును సర్. నేనే"
" మీరు కరోన వ్యాధి నుంచి కోలుకుని, వారం క్రిందట ఇక్కడి నుంచి వెళ్ళారు కదా. ఎలా ఉన్నది మీకిపుడు?"
" మీ డాక్టర్ల దయవల్ల, ఆ దేవుడి దయవల్ల బాగా తగ్గిపోయింది సర్. మీ డాక్టర్లందరినీ ఆ అల్లా చల్లగా చూడాలి సర్. చెప్పండి ఎందుకు ఫోను చేశారు?"
" ఏం లేదు భయ్యా. ఈ మధ్య కోవిడ్ వ్యాధి వ్యాప్తి ఎక్కువగా ఉండటమే కాకుండా, కొందరిలో దాని తీవ్రత అధికంగా ఉంది. ఏ రకమైన మందులకు లొంగడం లేదు. అటువంటి వారికి కోవిడ్ నుంచి కోలుకున్న వారి రక్తాన్ని స్వీకరించి ప్లాస్మాథెరపి ట్రీట్ మెంట్ ద్వారా ఆ రోగులకు వైద్యం చేస్తే మంచి ఫలితాలు వస్తున్నాయి. మీకు అభ్యంతరం లేకపోతే మీ రక్తం తీసుకుని కొంతమంది ప్రాణాలు కాపాడవచ్చని మా ఆశ. ఆలోచించుకుని నాకు ఈ నెంబరుకు ఫోను చేయండి. మీరు సమ్మతిస్తే కొంతమంది ప్రాణాలు నిలిపిన వారవుతారు. ఉంటానండి" అని ఫోను పెట్టేశాడు
అతను. హనీఫ్ ఆలోచనలో పడ్డాడు. తనకు ఈ వ్యాధి సోకినపుడు ఎందరు ఎన్ని మాటలన్నారు. యాత్రకు పోయి తగిలించుకొచ్చావు. విదేశీయులతో చెట్టాపట్టాలేసుకుని తిరిగి వేలమంది నీలాంటి వాళ్ళు ఈ వైరసును తగిలించుకుని వచ్చి మా అందరికీ తగిలిస్తున్నారు.
మతం పేరుతో ఎన్ని దూషణలు చేశారు. మీ వల్లే భారతదేశం ఇన్ని ఇబ్బందులలో పడిందని అటు మేథావులు, ఇటు మీడియా వారు దుమ్మెత్తిపోశారు. ప్రభుత్వం లాక్ డౌన్ విధించడం వలన అందరికీ అసౌకర్యమేర్పడి, అంతా మా వలననే అని ఎంత చిన్న చూపు చూశారు.
అప్పటిదాకా మతబేధం లేకుండా మాతో స్నేహంగా ఉన్నవారు కూడ మా పొడే పనికిరానట్టుగా ప్రవర్తించారు. పాపం డాక్టర్లు దేవతలలాగ వచ్చి, విసుగు విరామం లేకుండా సేవలు చేసి మమ్మల్ని బ్రతికించారు. ఎవరో ఒకరు, అరా తప్ప అందరమూ ప్రాణాలతో బయటపడ్డాము. తరువాత మా ప్రమేయం లేకుండానే వ్యాధి వ్యాపించి ఇప్పుడు కొరకరాని కొయ్యగా మారింది. మరణాల శాతం ఎక్కువకావడంతో కొత్తగా డాక్టర్లు ఈ ప్లాస్మాథెరపి ద్వారా ప్రాణాలు కాపాడుతున్నారని ఈ మధ్యనే పేపర్లో చూశాడు హనీఫ్.
అంతే కాదు అదొక మాఫియాలా మారిందని, లక్షలు చేతులు మారుతున్నాయని ఏదో ఛానల్ లో చూశాడు కూడ. తను కూడ అలా ఎందుకు చేయకూడదు. తను పడిన మానసిక వేదనకు ప్రతిఫలం రాబట్టినట్టూ ఉంటుంది. వేరేవారి ప్రాణాలు కాపాడిన ఘనత దక్కుతుంది. అలా సాగుతున్నాయి అతని ఆలోచనలు. " ఏం బాబాజన్. ఎక్కడి నుంచి ఫోను. అంతలా ఆలోచిస్తున్నారు" అంటూ వచ్చాడు పాతికేళ్ళ కొడుకు సలామ్. విషయం చెప్పాడు హనీఫ్.
" ఎంత మంచి అవకాశం వచ్చింది బాబా మీకు. ఇది మీకు అల్లా ఇచ్చిన వరం. ఇవ్వండి మీ రక్తాన్ని. మన తోటి వారి ప్రాణాలు కాపాడండి. అంతేకాదు మీలా వైరస్ బారినపడి కొలుకున్న మీ దోస్తులకు కూడ చెప్పి వారిని ఒప్పించండి." ఆనందంగా చెప్తున్నాడు సలామ్.
ఎందుకివ్వాలి బేటా మేము రక్తం. మేము యాత్రకు పోయి జబ్బు తెచ్చామని, మా వలనే దేశంలో వ్యాధి వ్యాపించిందని అన్నారు. వాళ్ళన్న మాటలు మర్చిపోయి మేము రక్తం ఇవ్వాలా?" హనీఫ్ మాటలలో కోపం. " బాబా అంతకోపం వద్దు. అల్లా మన్నించడు. మీరు యాత్రకు ఎందుకు వెళ్ళారు. ఆ దేవుడి దయ మనమీద ఉండాలనే కదా. ఆయన ఎప్పుడైనా ఎవరిమీదైనా ద్వేషం పెంచుకోమనిగాని, పగ తీర్చుకోమనిగాని చెప్పారా. లేదుకదా. సాటి మనుషులందరినీ ప్రేమించమన్నారు.
నాకంటే పెద్దవారు, మీకు తెలియదా బాబా. కులమతాలన్నీ మనం ఏర్పరచుకున్నవేనని. ఒకమాట చెప్పండి బాబా. నేను తప్పుచేస్తే మీరు నన్ను క్షమిస్తారా లేక శిక్షిస్తారా?" సూటిగా అడిగాడు సలామ్. " వాళ్ళకు నీకు పోలికేమిటి. వాళ్ళు నా కుటుంబంలో వాళ్ళా"
" జగమంతా ఒకే కుటుంబం బాబాజీ. మన తల్లి భరతమాత. మనమంతా భారతీయులం. అంతేగాని అలా వేరుగా చూడకూడదు. మీ ప్రాణాలు కాపాడారని మీరు వైద్యులను దేవుళ్ళు అని అంటున్నారు. మరి మీ రక్తదానంతో మరికొందరు ప్రాణాలు నిలుపుకుంటే, మీరు వాళ్ళ పాలిట దేవుళ్ళు కారా బాబాజీ. ఒక్కసారి ఆలోచించండి. దేవుడు ఎక్కడో ఉండడు, సహాయం చేసే ప్రతి మనిషీ దేవుడే. అదేకదా ప్రతి మతగ్రంథము చెప్పేది.
నా తండ్రి చలువ వల్ల పదిమందికి ప్రాణం నిలిచింది అంటే, అది నాకెంత గర్వం బాబాజీ. మీకు చెప్పతగిన వాడను కాదు, నా అభిప్రాయం మాత్రం ఇదే" చెప్పీ చెప్పనట్లుగా తన మనసులో మాట చెప్పాడు సలామ్. ఆలోచనలో పడ్డాడు హనీఫ్. సరిగ్గా పది సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన గుర్తుకు వచ్చింది. దర్గానుంచి వస్తుంటే బండి డివైడరును కొట్టుకుని పెద్ద ప్రమాదం జరిగి, చాలా రక్తం పోయింది. వెంటనే రక్తం ఎక్కించాలంటే, అప్పుడు తన కొలీగ్ మూర్తి రెండు సీసాల రక్తం ఇచ్చాడు.
ఆ రోజు మా మధ్య స్నేహమేగాని మతాల దోబూచులాట లేదు. ఈ మధ్య కాలంలో ఈ పిచ్చి ఎక్కువయింది. అది తప్పని తెలిసినా, ఎవరికి వారు ఆ బలహీనతకు లొంగిపోతున్నారు. " బాబాజీ. నేను ఎక్కువ తక్కువలు ఏమైనా మాట్లాడానా" తండ్రి నొచ్చుకున్నాడేమోనని అడిగాడు సలామ్. " లేదు బేటా. నువ్వు చాలా ఉన్నతంగా ఆలోచించావు.
ఇంత చిన్న వయసులో ఇంత సంస్కారం ఎలా వచ్చింది. యాభైలో పడినా నేను నీ అంత విశాలంగా ఆలోచించలేకపోయాను. ఇంత ఔన్నత్యం ఎలావచ్చింది బేటా నీకు?" చెప్పలేని ఆనందం హనీఫ్ కళ్ళల్లో. " అమ్మ చెప్పింది బాబాజి. మనిషి పుట్టింది పరోపకారానికేనని, సహాయం చెయ్యలేకపోయినా ఎవరికీ హాని చేయకూడదని. దేవుడు మనిషిని పుట్టించినది సాటి మనిషి కష్టానికి చేతనయిన సాయంచేసి ఆదుకోవాలని. అమ్మ పెంపకంలోనే ఉంది బాబా ప్రేమ, ఆప్యాయత. పుస్తకాలలో ఉన్న ఎన్నో నీతికథలు చెప్పింది నాకు. శివాజీకి వీరత్వం నూరిపోసింది జిజియాబాయి అయితే, నాకు ప్రేమతత్వం నేర్పింది మా అమ్మ. అమ్మే నా తొలి గురువు బాబాజి. మంచితనాన్ని మించిన దైవత్వం లేదని చెప్పింది.
అందుకే మీకు కష్టం అనిపిస్తుందేమోనని అనుమానం వచ్చినా ధైర్యంగా నా అభిప్రాయం చెప్పాను. తప్పయితే మన్నించండి" తలవంచి తండ్రికి నమస్కరించాడు సలామ్. హనీఫ్ లేచి సలామ్ ను దగ్గరకు తీసుకున్నాడు. " నాకు చాలా గర్వంగా ఉంది బేటా. మీ అమ్మ నాకు ఒక వజ్రాన్ని వరంగా ఇచ్చింది. నువ్వు చెప్పినట్లే చేస్తాను. నేనే కాదు నాలా వ్యాధిన పడి కోలుకున్న నా మిత్రులందరితో మాట్లాడుతాను మేమే నేరుగా ఆసుపత్రికి వెళ్ళి వైద్యులను కలిసి స్వచ్ఛందంగా ప్లాస్మాథెరపికి కావలసిన రక్తాన్ని ఇస్తాము. నాలో చైతన్యం కలిగించి, మనమంతా ఒకే భారతజాతికి చెందినవారమని చెప్పి సమైక్యతను గుండెలో నింపావు. చిన్నవాడివైనా గొప్పవాడివి బేటా. యువతరమంతా నీలా ఆలోచించాలి. మీరంతా ఒక్క త్రాటిపై నడిస్తే ఇలాంటి వైరస్ లనే కాదు బేటా, ప్రపంచయుద్ధాలనైనా అవలీలగా జయించగలం. ప్రతి యువకుడూ ఒక సిపాయిగా మారి భరతమాతను ఈ ఉపద్రవాల నుంచి గట్టెక్కించాలి.
సిపాయి అంటే యుద్ధంలో పాల్గొనేవాడే కాదు, సమాజంలో చెడుతో యుద్ధం చేసేవాడు కూడ సిపాయే. ప్రతి తల్లి ఒక జిజియాబాయాగా మారి బిడ్డల మనసులలో మంచితనాన్ని, వీరత్వాన్ని, దేశభక్తిని నింపాలి. అప్పుడే బేటా మనిషి సమాజంలో స్వేచ్ఛగా తిరగగలుగుతాడు" హనీఫ్ లో ఏదో తెలియని ఉద్వేగం. వెంటనే ఆసుపత్రికి ఫోను చేసి తన నిర్ణయాన్ని సూపరింటెండెంటుకు చెప్పాడు. " అందరూ మీలా నిర్ణయం తీసుకుని మాతో సహకరిస్తే ఈ మాఫియా ముఠాలను కూడ నాశనం చేయవచ్చు. మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు. మీరు వచ్చే ముందు నాకు ఫోను చేస్తే దానికి కావలసిన అన్ని ఏర్పాట్లు చేస్తాను. ఉంటాను హనీఫ్ గారు" అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు
సూపరింటెండెంటు. హనీఫ్ మనసు తేలికపడింది. తన వంతుగా ఈ సమాజానికి ఎంతో కోంత సేవచేయబోతున్నాడు. అదీ తన బిడ్డ వల్ల. సంతోషంతో పొంగిపోతున్నాడు. " పుత్రోత్సాహము తండ్రికి....." అంటూ వేమన శతకం వల్లిస్తున్నాడు, పక్కింటి రామయ్య మనవడు. అది వింటూ సలామ్ ను దగ్గరకు తీసుకున్నాడు హనీ