జింక శాపం - సరికొండ శ్రీనివాసరాజు

jinka shapam

మగధ సామ్రాజ్యాన్ని జయంతుడు అనే రాజు పరిపాలించేవాడు. అతడు ప్రజలను కన్నబిడ్డలుగా కాపాడుతూ, వారికి ఏ సమస్యలకూ రాకుండా చూసేవాడు. యుద్ధాలు రాకుండా నిరంతరం ప్రణాళికలు వేసేవాడు. అతని పాలనలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించేవారు. ఇతని పరిపాలనే శాశ్వతంగా ఉండాలని దైవాన్ని నిత్యం పూజించేవారు. రాజు మారువేషాలలో అంతటా కలియతిరుగుతూ ప్రజల సమస్యలను తెలుసుకొని, పరిష్కరించేవాడు.

ఒక రోజు జయంతుడు మారువేషంలో అడివి గుండా ప్రయాణం చేస్తున్నాడు. అతని దృష్టి అందమైన జింకపై పడింది. ఇంతలో ఎక్కడి నుండి వచ్చిందో ఒక బాణం వచ్చి జింకకు గుచ్చుకుంది. జింక జయంతుని వైపు చూస్తూ "అన్యాయంగా నన్ను చంపిన నీవు వంద రోజులలోపు ప్రాణాలను కోల్పోతావు." అని శపించి ప్రాణాలు విడిచింది. రాజు అధైర్య పడలేదు. పైగా ఆశ్చర్యపోయాడు. ఈ జింక ఎక్కడిది? దానికి బాణం ఎవరు వేశారు. అది తనను శపించడమేమిటో అంతు పట్టలేదు. అయినా వెనుదిరగక ముందుకు వెళ్ళి, తాను అనుకున్న పని చేసుకొని రాజ్యానికి తిరిగి వచ్చాడు. తన శాప వృత్తాంతం మహామంత్రి భూపాలునికి చెప్పాడు. అప్పుడు మంత్రి ఇలా అన్నాడు. "మహారాజా! వందరోజుల లోపు అంటే ఇప్పటి నుంచి 100వ రోజు లోపు ఎప్పుడైనా మీ ప్రాణం పోవచ్చు. మీరు వంద రోజులు దాటేవరకు మీ అంతఃపురం దాటి బయటకు రావద్దు. ఆలోపు రాజ్యపాలనా వ్యవహారాలను నేను చూసుకుంటా." అని. "ప్రజా పాలన వదిలిపెట్టి, నా ప్రాణాలను నేను చూసుకుంటే రాజుగా నాకు అర్హత లేదు. నేను ఈ శాపాలను పట్టించుకోను. యథావిధిగా రాజ్యపాలన కొనసాగిస్తాను." అని చెప్పాడు మహారాజు.

ఆ రాత్రి మహారాజు తనలో తాను ఇలా అనుకున్నాడు. 'నేను ఎంతసేపటికీ వర్తమానం గురించే ఆలోచిస్తున్నాను. భవిష్యత్తు గురించి ఆలోచించడం లేదు. నాకు సంతానం లేదు. శాపాలు తగిలినా తగులకున్నా మానవుని ఆయుష్షు ఎప్పుడు పోతుందో తెలియదు. కాబట్టి సత్వరమే ఒక సమర్థుడిని వెతికి యువరాజు పదవి అప్పజెప్పాలి. జింక శాపం నాకు కర్తవ్యాన్ని ఉపదేశింది.' అని. మరునాడే చాటింపు వేయించాడు. చాలామంది యువకులు ముందుకు వచ్చారు. అనేక పరీక్షల తర్వాత పదిమంది మిగిలారు. వారికి త్వరలో కబురు పంపుతానని చెప్పి, వారి చిరునామాలు తీసుకుని ఇంటికి పంపించాడు. గూఢచారులను నియమించి, వారి గుణగణాలను, దినచర్యను గమనింపజేశాడు. తాను మాత్రం యథావిధిగా రాజ్యపాలన కొనసాగిస్తున్నాడు. మరింత శ్రద్ధగా అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నాడు.

ఒక రోజు తాను యథావిధిగా మారువేషంలో తన రాజ్యంలోని శ్రీపురం అనే గ్రామానికి వెళ్ళాడు. అక్కడ ఒకచోట ఒక సమావేశం జరుగుతుంది. ఒక యువకుని దగ్గరకు గ్రామ ప్రజలు వచ్చి, తమ సమస్యలను చెప్పుకుంటున్నారు. ఎంతో నేర్పుగా పారదర్శకంగా సమస్యలను పరిష్కరిస్తున్నాడు. జయంతుడు అక్కడే గంటల తరబడి నిలబడి గమనిస్తున్నాడు. ప్రజలు ఎంత విసిగిస్తున్నా ఎంతో ప్రశాంతంగా, ఓపికగా సమస్యలను పరిష్కరిస్తున్నాడు. అతని గురించి విచారించగా అతడు గొప్ప పేరున్న రైతు కుమారుడిని, అతని పేరు ధర్మసేనుడని, అతడూ వ్యవసాయం చేస్తాడని, అతని వ్యవసాయం ఎప్పుడూ లాభసాటిగా నడుస్తుందని, తన కుటుంబ తిండి ఖర్చులు, చిన్న చిన్న అవసరాలకు పోనూ మిగిలిన సొమ్ము అంతా సేవా కార్యక్రమాలకు, దాన ధర్మాలకు వినియోగిస్తాడని, అందుకే ప్రజలకు అతడంటే మక్కువ ఎక్కువని చెప్పారు. ఎంతటి కఠినమైన సమస్యనైనా చాలా తెలివిగా పరిష్కరిస్తాడని, అతనికి భూదేవికి ఉన్నంత ఓపిక ఉందని చెప్పారు.

జయంతుడు తిరిగి తన ఆస్థానానికి వచ్చాడు. పది రోజులు గడిచాయి. గతంలో యువరాజు పదవికి ఎంపికైన పదిమంది గురించి సవివరంగా తెలిసింది. ఈ పదిమంది కంటే ధర్మసేనుడు ఉత్తముడని గ్రహించాడు రాజు. ‌అతణ్ణి పిలిపించి, యువరాజును చేశాడు. జింక శపించి వందరోజులు దాటింది. జయంతుడు ఒకరోజు అదే అడవిగుండా వెళుతుండగా హఠాత్తుగా అతని ముందు ఇద్దరు దేవతలు ప్రత్యక్షం అయ్యారు. "భళా జయంతా! నీ సేవాగుణం గొప్పది. రాజుగా నీ గుణగణాలను పరీక్షింపదలచే జింక మరియు వేటగాని వేషంలో మేము వచ్చాము. నీ ప్రాణాల కన్నా ప్రజాసేవే మిన్న అనుకున్నావు. నీవు నీ తర్వాత ధర్మసేనుడు సుదీర్ఘ కాలం ఈ రాజ్యాన్ని పరిపాలిస్తారు. మీకు దీర్ఘాయువు లభించుగాక. సర్వే జనా సుఖినోభవంతు." అంటూ మాయమయ్యారు.

మరిన్ని కథలు

Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaalani kaagitam
కాలని కాగితం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు