పాపం... జిమ్మీ! - కందర్ప మూర్తి

paapam jimmy

నగరంలో శ్రీ మంత్రులు నివాసముండే కాలనీ అది. ఖరీదైన భవంతులు ఎత్తైన ప్రహరీగోడలు పెద్ద ఇనుపగేట్లు ఆజానుబాహులైన చురుకైన సెక్యూరిటీ గార్డులు బంగళా లోపలికి వచ్చే పోయే విదేశీ మోటరు వాహనాలకు సెల్యూట్ చేస్తూ సందడిగా ఉంది ఆ ప్రాంతం.

కాలనీ చివర ఒక ఆధునిక బంగ్లా ఎత్తుగా ప్రహరీగోడ పెద్ద ఇనుప గేటు ‌లోపల ఆల్సేషియన్ శునకం ' జిమ్మీ ' ఠీవిగా కూర్చుని రోడ్డు మీద వచ్చే పోయేవారిని చూస్తోంది. గేటు గూర్ఖా సెక్యూరిటీ రూములో ఫోన్లో మాట్లాడు తున్నాడు. ఇంతలో రోడ్డు మీద వీధి కుక్క ' టామీ ' పోతోంది. దాన్ని చూసిన జిమ్మీ " హేయ్, యూ డర్టీఫెలో, వేరాయు గోయింగ్? కమ్ హియర్ !" అని గంభీరంగా మొరిగింది.

టామీకి దాని భాష అర్థం కాకపోయినా తన జాతి జంతువని ఇనప గేటు దగ్గర కొచ్చింది.. " ఏంటీ, ఇంత మురికిగా ఉన్నావ్! స్నానం చెయ్యవా ? సన్నగా బక్కగా కనసడుతున్నావు, నీ యజమాని సరిగ్గా తిండి పెట్టడం లేదా ? ఒంటరిగా తిరుగుతున్నావ్ , సెక్యూరిటీ గార్డు ఎక్కడ ? " ప్రశ్న మీద ప్రశ్న వేస్తోంది జిమ్మీ.

జిమ్మీ మాటలు విన్న టామీ నిర్లిప్తంగా " నేను పిల్లగా ముద్దుగా ఉన్నప్పుడు ఒకాయన చేరదీసి ' టామీ ' పేరు పెట్టి పెంచిన తర్వాత ఎవరో నాకు సుడులు ఉన్నాయని లెక్క ప్రకారం కాలి గోళ్ళు లేవని చెప్పడంతో నాకు తిండి పెట్టక తగిలేసాడు. తిండి కోసం నేను రోడ్డున పడ్డాను.

మా గల్లీలో ఎడ్రస్ లేని నాలాంటి వారెందరో ఉన్నారు. మాకు మేమే యజమానులం.ఎక్కడ తిండి దొరికితే అక్కడే మకాం మాది. మురికి నీటి గుంటలే మాకు స్విమ్మింగు పూల్సు. పొరపాటున మేము కరిస్తే రేబీస్ రోగం వచ్చి పిల్లలు చనిపోతున్నారని మున్సిపాలిటీ వారు వచ్చి పట్టుకుని ఇంజక్షన్లు చేసి సంతాన నిరోధక ఆపరేషన్లు జరిపిస్తున్నారు. మాకు మీలాగ కే.జీ. కొద్దీ మాంసం, చికెన్ ,ఆమ్లెట్లు తినడానికి ఉండవు.

పడుకోడానికి కుషన్ బెడ్లు, స్నానానికి షాంపులు, సుగంధ పరెమళ సబ్బులు, జంతువుల డాక్టర్ల చేత మెడికల్ చెకప్ లు ఉండవు. మీ పెద్దోళ్ల బంగళాల్లో రకరకాల శునకాల్ని పెంచి ఇంగ్లిష్ పేర్లు పెట్టి ముద్దుగా పిలుస్తారట. ఫ్యాషన్ షోల కని హైర్ కటింగులు, స్టైల్ ఫ్యాషన్ దుస్తులు తొడుగుతారట. చెవులకు ఆభరణాలు ,రంగురంగుల చలవ కళ్లద్దాలు పెడతారట. మ్యూజిక్ పెట్టి డ్యాన్సులు చేయిస్తారట.

పోలిసోళ్లు , మిలిటరీ వాళ్లు మీ చేత పెరేడ్ చేయించడం, ట్రైనింగు ఇచ్చి బాంబులు ఆయుధాలు మాదక ద్రవ్యాలు దొంగల్నీ హత్యలు చేసే వాళ్లని పట్టిస్తారట. ప్రతిభ కనబరచిన వారికి మెడల్సు మెడలో వేస్తారట. మీ కోసం శునకాల క్లబ్బులు పార్కులు ఉంటాయటగా.

ఈ కబుర్లన్నీ మా గల్లీలో గుంపులుగా చేరినప్పుడు ముచ్చటించు కుంటాము" అంది టామీ. అంతా విన్న జిమ్మీ వైరాగ్యంగా " ఏమి బతుకులు మావి. బంగారు పంజరం జీవితాలు. బయటి ప్రపంచం ఎలాగుంటుందో తెలవదు. ఈ బంగ్లా నాలుగు గోడల మద్య జైలు జీవితం గడుపుతున్నాను. మీలాగ నలుగురితో కలిసే అవకాశం లేదు. ఒక ముద్దు ముచ్చట ఉండదు. ఏకాంత జీవితం.

ఎప్పుడైనా క్లబ్బులు పార్కుల్లో ఆడ మగ శునకాలు కల్సినా రోమాన్సుకి అవకాశం ఇవ్వరు. తోక పెద్దగా ఉంటే చురుకుతనం ఉండదని నా పొడవైన తోకని కత్తిరించి మొండిగా చేసారు. అదిగో , సెక్యూరిటీ గార్డును చూడు, బెత్తం పట్టుకుని గొలుసుతో ఈ బంగళా నాలుగు గోడల మద్య వాకింగు చేయిస్తాడు.

వాడు చెప్పి నట్టు వినాలి. పెట్టింది తినాలి. బంగళా యజమాని వస్తే తోక లేకపోయినా ఆడిస్తూ ఎదురెళ్లాలి " గోడు వెళ్లబోసుకుంది జిమ్మీ. టామీ నవ్వుతూ " ఎవరి బ్రతుకు వారిది. ఏం చేస్తాం! అవును, మా వాళ్లు అనుకుంటూంటారు ఏంటంటే ' కనకపు సింహా సంబున శునకమును కూర్చుండ బెట్టి .....' అని ,నిన్ను ఎప్పుడైనా కూర్చో బెట్టారా ? "అంది. " ఆ , కూర్చోబెట్టారు ఈ కర్ర కుర్చీ మీద ఇనప గొలుసుతో కట్టి" అంది జిమ్మీ.

ఇంతలో సెక్యూరిటీ గార్డు లాఠీ చేత్తో పట్టుకుని టామీని బెదిరించి తగిలేసాడు. పాపం , ఏకాకిగా కూర్చుంది జిమ్మి.

మరిన్ని కథలు

Bhavaateetam
భావాతీతం
- DODDIPATLA KALYAN KISHORE
Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న
ఓ breaking news
ఓ బ్రేకింగ్ న్యూస్
- బివిడి ప్రసాద రావు